Gold పాతధనానికి ఆసరా | Technology Day-to-Day Update | Sakshi
Sakshi News home page

Gold పాతధనానికి ఆసరా

Published Tue, Oct 28 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

Gold   పాతధనానికి ఆసరా

Gold పాతధనానికి ఆసరా

కాలం కాంతికన్నా వేగంగా పరుగెడుతుంటే..
టెక్నాలజీ డే టు డే అప్‌డేట్ అవుతుంటే..
అప్పటిదాకా డామినేట్ చేసినవి కొన్ని
కాలచక్రంలో అడుగున పడ్తాయి..
ఇంకొన్ని కరిగి క లసిపోతాయి..
అలాంటి జ్ఞాపక చక్రంలో పైకొచ్చినప్పుడు..
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపిస్తుంది..
అపురూపమన్న భావన కలిగిస్తుంది..
అలాంటి వస్తువుల సేకరణ కొందరికి అభిరుచి..  ఇంకొందరికి వ్యాపారం.
సయ్యద్ జహంగీర్ మొదటి కోవలోని వ్యక్తి... నిశాత్ అహ్మద్ రెండో తరహా వ్యక్తి!

 
 
పిండిమర కన్నా ముందున్న తిరగలి.. గ్రైండర్ రీప్లేస్ చేసిన రోలు, రోకలి.. డిజిటల్ వాచ్‌ల వెనక కనుమరుగైన పెండలం గడియారాలు.. బ్లూ రేతో వినిపించకుండా.. కనిపించకుండాపోయిన గ్రామ్‌ఫోన్‌లు.. ఎక్కా (చిమ్నీ)లను ఆర్పేసిన చార్జింగ్ లైట్స్.. అప్‌డేట్ అయిన భూతద్దాలు, బైనాక్యులర్స్, టెలిస్కోప్‌లతో మూలనపడ్డ పాత మోడళ్లు.. ఇవన్నీ జ్ఞాపకాల ఊటలో తీపిని పెంచే కారకాలు. తలచుకుంటున్నకొద్దీ టన్నుల ఆనందాలను పంచుతాయి. వాటిని మూటగట్టి కావాలనుకుంటున్న వారికి పంచే పనిలో నిశాత్ ఉంటే.. ఆ మూటను అటక మీద పెట్టి భద్రపరిచే పనిలో జహంగీర్ మునిగిపోయాడు.
 
శాలిబండ.. ముర్గీబజార్

ఇద్దరిదీ ఓల్డ్‌సిటీ. జహంగీర్ శాలిబండ నివాసి.. నిశాత్ ముర్గీచౌక్ వాసి. పాత వస్తువులపై ప్రేమ అనే కామన్ నేచర్ వాళ్ల వాళ్ల తండ్రుల నుంచి వారసత్వంగా అందుకున్నారిద్దరూ. గ్రామ్‌ఫోన్, చిమ్నీ, టెలిస్కోప్, దిక్సూచి, ఫొటోఫ్రేమ్స్, తాళాలు, భూతద్దాలు, హవర్ గ్లాస్ చివరకు పాతకాలం చేతికర్రలను కూడా సేకరించి దాస్తున్నారు. నిశాత్ అయితే అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వాటిని అమ్ముతున్నాడు కూడా.
 
మూడోతరం ప్రతినిధి..

ఆ పాత మధురాల పర్యవేక్షణలో జహంగీర్ వాళ్ల కుటుంబంలో మూడోతరం ప్రతినిధి. ఈ పని జహంగీర్ వాళ్ల తాత సయ్యద్ అహ్మద్ నుంచి మొదలైంది. శాలిబండలో ఇప్పుడు జహంగీర్ నడుపుతున్న మెకానిక్ షాప్ ఆ తాత పెట్టిందే. గ్రామ్‌ఫోన్ రికార్డ్స్ అంటే ఆయనకు ప్రాణమట. ఆ కాలంలో ఆ రికార్డ్ ప్లేయర్ రిపేర్ పనిని ఇష్టంగా నేర్చుకొని అ దుకాణమే పెట్టుకున్నాడు. ఇది 1920నాటి సంగతి. తాత నుంచి జహంగీర్ తండ్రి సయ్యద్ మహమూద్‌కి ఆ షాప్ నిర్వహణతోపాటు ఆ అభిరుచీ వంశపారంపర్యమైంది. అయితే మహమూద్ హాబీ రెండు వస్తువులకు పెరిగింది. గ్రామ్‌ఫోన్‌తో పాటు రేడియోలు, కెమెరాలకూ పాకింది. ఈ ఇష్టానికి పక్కనే ఉన్న ఓ హిందూ ఫ్రెండూ తోడయ్యాడు. ఆయన రేడియోలు రిపేర్ చేస్తుండేవాడు. సయ్యద్ మహమూద్ ఎక్కడెక్కడి నుంచో రేడియోలు తెచ్చిస్తుంటే ఈయన వాటికి రిపేర్ చే సేవాడు. అలా జహంగీర్ తరం వచ్చేసరికి ఇల్లంతా వివిధ రకాల గ్రామ్‌ఫోన్ రికార్డ్ ప్లేయర్స్, రేడియోలు, కెమెరాలు, గోడ గడియారాలు లాంటి వస్తువులతో నిండిపోయింది. అయితే టేప్‌రికార్డ్‌ల మోతకే తట్టుకోలేక పోయినా జహంగీర్ వాళ్ల తాత పెట్టిన ఎలక్ట్రానిక్ అండ్ గ్రామ్‌ఫోన్ సెంటర్ బ్లూరే కాలంలో కేవలం ఎలక్ట్రానిక్ సెంటర్‌గా మాత్రమే మిగిలింది. అసాధారణ మెకానిక్ స్థాయి నుంచి సాధారణ మెకానిక్‌గా ఉండిపోయాడు. తాత, తండ్రులు మిగిల్చిపోయిన ఆ అపూర్వ ఆస్తికి పర్యవేక్షకుడిగా ఉన్నాడు జహంగీర్. నాటకాలు హౌస్‌ఫుల్‌గా ఆడుతున్న సమయంలో గ్రామ్‌ఫోన్ గళాలు కొంచెం గరగరమన్నా  ఈ షాప్ ముందు క్యూ కనిపించేది. ఇప్పుడు ఆ కళలేదు.. అయినా వెలవెల బోవడంలేదు. ఎందుకంటే వెలకట్టలేని గొప్ప సంపదకు మ్యూజియంలా విరాజిల్లుతోంది జహంగీర్ నిలయం. ‘తాత, నాన్నలకు తమ అభిరుచినే వృత్తిగా మలచుకొనే భాగ్యం దొరికింది. కానీ నావరకు వచ్చేసరికి కేవలం అది హాబీగానే మారింది. ఇప్పుడు ఆ వస్తువులు లేవు. వాటిని మెచ్చే ఆసాములూ లేరు కాబట్టి మామూలు మెకానిక్‌గానే కుటుంబం కడుపు నింపే పనిలో పడ్డాను’ అంటాడు కొంచెం నిరాశగా జహంగీర్.
 
రెండోతరం పని..
 
నిషాత్ అహ్మద్‌ది ఇంకో కథ. వాళ్ల నాన్న మఖ్‌బూల్ అహ్మద్‌కి  కనుమరుగైన పాత వస్తువులు ఎక్కడ కనిపించినా డబ్బులిచ్చి మరీ కొనుక్కొని రావడం అలవాటు.. అభిరుచి. చిమ్నీ, టెలీస్కోప్, బైనాక్యులర్స్, హవర్‌గ్లాస్, దిక్సూచీలు, తాళాలు, భూతద్దాలు, గోడగడియారాలు, టేబుల్ క్లాక్‌లు, చేతికర్రలు ఇలా రకరకాలు. వీటిలో కొన్ని సేకరించినవి కూడా ఉన్నాయి. ఆఖరికి ఈ యాంటిక్‌‌ పీసెస్ అన్నిటితో  ఓల్డ్ సిటీలోని ముర్గీచౌక్‌లో గిఫ్ట్ అండ్ నావెల్టీస్ అనే షాప్‌నే తెరిచాడు. తనలాంటి పాత వస్తువుల పిచ్చోళ్లకి వీటిని అమ్ముతాడు. ఆ పనిలోనే తండ్రి వారసత్వాన్ని అందుకున్నాడు నిషాత్. దేశంలో ఏ మూల ఈ యాంటిక్ పీస్ కనిపించినా రెక్కలు కట్టుకొని వాలిపోయి తెచ్చి షాప్‌లో పెట్టుకుంటాడు. అందుకే ఈ షాప్ ముందు అరుదైన కొనుగోలుదారులు కనిపిస్తుంటారు. తమకు కావల్సిన పాత వస్తువు ఆనవాలు చెప్పి వెదికిపెట్టే పనిని అప్పగిస్తుంటారు. ‘ఇలాంటి రేర్ కలెక్షన్‌ను కావాలనుకునే వాళ్లూ రేర్‌గానే ఉంటారు. అలాంటి వాళ్లకోసమే మా షాప్. మా దగ్గర 1904 నాటి కలె క్షన్ కూడా ఉంది. 1915నాటి టెలిస్కోప్, 1950ల నాటి ఫోన్లు వంటివున్నాయి. సామాన్యంగా ఎవరైనా ఆర్డరిచ్చింది కచ్చితంగా తెచ్చిపెడ్తాం. ఒక్కోసారి కొన్ని దొరకవు’ అని చెప్తాడు తన వ్యాపారం గురించి నిషాత్.గతకాలం మేలు వచ్చుకాలం కంటెన్.. అన్నది ఎంత నిజమో.. ఓల్డ్ థింగ్స్ ఇచ్చినవన్నీ గోల్డెన్ మూమెంట్సే అన్నవి కూడా అంతే నిజం!
 
నిశాత్ అహ్మద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement