గౌతమ్ మీనన్ - అనుష్క్
‘అరుంధతి’ వంటి చిత్రంలో అద్భుతంగా నటించిన అనుష్క హర్ట్ అయింది. ఆ చిత్రం తరువాత మంచి మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతే అంకిత భావంతో అనుష్క నటిస్తోంది. ఇప్పుడు వరుసగా బాహుబలి, రుద్రమదేవి వంటి సంచలనాత్మక చిత్రాల్లో నటిస్తోంది. ఈ పాత్రల కోసం ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుర్రపుస్వారీ, యుద్ధ విద్యలను నేర్చుకున్నారు. పాత్రల కోసం శరీరాన్ని కష్టపెడుతున్నారు. ఇటువంటి చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎల్లకాలం ఇవేరకమైన పాత్రలలో నటించడం సాధ్యంకాదు. జనం కూడా ఆ రకమైన పాత్రలనే ఎప్పుడూ చూస్తూ ఉండలేదు. ఆ విషయం అనుష్కకు కూడా తెలుసు. అందుకే ట్రెండ్ మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె హర్ట్ అయ్యే సంఘటన ఒకటి జరిగింది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చారిత్రక, జానపద చిత్రాల తరువాత మళ్లీ మోడరన్ దుస్తులలో నటించాలని ఉబలాటపడుతోంది. అందులో భాగంగానే ఏం మాయచేశావో. ఎటో వెళ్ళిపోయింది మనసు. .. వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించిన గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించింది. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీలను డిఫరెంట్గా తీయడంలో గౌతం మీనన్ దిట్ట. కథనంలో కొత్తదనం చూపించడంలో కూడా ఆయనది అందెవేసి చేయి. అజిత్ హీరోగా నటించే ఈ తమిళ సినిమా తెలుగులో కూడా విడుదలచేయాలన్న ఉద్దేశంతో నిర్మాతలు ఉన్నారు.
ఈ చిత్రంలో అనుష్కను మోడరన్ దుస్తులలో నాజూకుగా చూపించాలని దర్శకుడు మీనన్ అనుకున్నారు. అక్కడే చిక్కు వచ్చిపడింది. చిత్ర కథ చెప్పడం కోసం మీనన్ అనుష్కను పిలిపించారు. అనుష్కను చూసిన మీనన్ ఒక్కసారిగా షాక్ అయ్యారట. అనుష్క ఏంటి ఇంత బొద్దుగా ఉంది అని ఆమె మొఖానే అంటే బాగుండదని, పక్కవారితో అన్నారట. ఆమె మాత్రం స్క్రిప్ట్ పరంగా కొంచెం లావు తగ్గాలని సూచించినట్లు సమాచారం. దాంతో జేజమ్మ హర్ట్ అయింది. తానేమైనా ఆంటీలా ఉన్నానా? అని కోప్పడినట్లు తెలుస్తోంది. కోలీవుడ్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. వాస్తవానికి ఇందులో ఇద్దరి తప్పులేదు. అనుష్క పాత్రలపరంగా కాస్త బొద్దుగా అయి ఉంటారు. మీనన్ తన హీరోయిన్ను సన్నగా, నాజూకుగా చూపాలనుకున్నారు. ఈ పరిస్థితులలో అనుష్క ఆ చిత్రంలో నటిస్తుందో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.