స్వపక్ష సీఎంలతోనే శిరోభారం | Headache with own CMs | Sakshi
Sakshi News home page

స్వపక్ష సీఎంలతోనే శిరోభారం

Published Mon, Apr 20 2015 1:36 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

పెంటపాటి పుల్లారావు - Sakshi

పెంటపాటి పుల్లారావు

 విశ్లేషణ

 బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లడం ద్వారా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే తప్పిదం చేస్తున్నారు. తన జనరంజక నాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే ఆయన ఉద్దేశం. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతి తప్పిదం మోదీ మెడకే చుట్టుకుంటోంది. ‘మంచి ప్రధాని కసాయివాడిగా ఉండాల’ని బ్రిటిష్ పూర్వ ప్రధాని మెక్‌మిలన్ చెప్పేవారు. అసమర్థ మంత్రులను తొలగించాలని దీని అర్థం. ప్రధాని మోదీ ఇప్పుడు ఈ పని ప్రారంభించకపోతే స్వపక్ష సీఎంలు, మంత్రులే ఆయన్ని వచ్చే ఎన్నికల్లో కిందికి లాగటం తప్పదు.
 
 ప్రపంచంలో ఓటమి అన్నదే ఎరుగని బలశాలి అచిల్లెస్ గురించి ప్రాచీన గ్రీకు గాథలు మనకు తెలియబర్చాయి. కానీ ఇంత బలాఢ్యుడికీ ఒక బలహీ నత ఉండేది. అతడి పాదమే ఆ బలహీనత. చరిత్రలో ఇది అచిల్లెస్ పాదంగా పేరొందింది. ఆ పాదంలోకి బాణం సంధించడం ద్వారా శత్రువులు అతడిని ఎట్టకేలకు చంపేశారు. మన దేశం విషయానికి వస్తే, నరేంద్రమోదీ, బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే పథక రచనలో మునిగి తేలుతుం డగా బీజేపీ పాలిత రాష్ట్రాలు వారి అచిల్లెస్ పాదంగా తయారవుతున్నాయి. ఇంతవరకు ఉనికిలేని రాష్ట్రాల్లో అధికారం గెల్చుకోవడం ప్రస్తుతం బీజేపీ వ్యూహం. ఇదొక అద్భుత వ్యూహమే. కేరళ నుంచి తమిళనాడు వరకు అటునుంచి అస్సాం వరకు కూడా బీజేపీ ఈ విషయమై బాగానే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, 2014 ఎన్నికల్లో అద్భుత విజ యాలు సాధించిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని, మద్దతును కూడా నిలుపు కోవాలి. అసాధారణ విజయాలను అందించిన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాదరణను కోల్పోతుండటం గమనార్హం.

 వీలైనన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పర్చాలన్నది బీజేపీ అభిమతం. కానీ రాష్ట్రాలను గెల్చుకోవడమనేది రెండంచుల కత్తిలాంటిది. ఒక రాష్ట్రాన్ని బీజేపీ గెల్చుకుందనుకోండి. తర్వాత ఆ రాష్ట్ర సీఎం పాలన అసమర్థంగా తయా రవుతుంది. సీఎం అప్రతిష్ట మోదీ ప్రజాదరణను దెబ్బతీస్తుంది. మోదీ ప్రజా దరణ మాత్రమే కాదు.. బీజేపీ సీఎంల ప్రాచుర్యం కూడా కీలకమే. బీజేపీ సీఎంలు అస్తవ్యస్త పాలన చేస్తే, మోదీ ఆ రాష్ట్రాలలో గెలుపు సాధించలేరు.

 గర్వాతిశయానికి మూల్యం తప్పదు
 ఒక రాజకీయ పార్టీ పార్లమెంట్ స్థానాలను గెల్చుకోవాలనుకుంటే, రాష్ట్రాల్లో తన బలంపైనే ఆధారపడుతుంది. పార్లమెంటుకు, అసెంబ్లీకి ప్రజలు వేర్వేరుగా ఓటేయరు. ఉదాహరణకు: సీపీఎం ప్రతి సార్వత్రిక ఎన్నికలోనూ  పశ్చిమబెంగాల్‌లోని 42 ఎంపీ స్థానాల్లో కనీసం 28 సీట్లు గెల్చుకునేది. కాని అధికారం కోల్పోగానే సీపీఎంకి కేవలం 2 ఎంపీ స్థానాలే దక్కాయి. 2004లో, 2009లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్‌కు అత్యధిక ఎంపీ స్థానాలను గెలిపించగలిగారు. కర్ణాటకలో యడ్యూరప్ప విషయానికి వద్దాం. తను సీఎం కానంతవరకు బీజేపీకి ఆ రాష్ట్రంలో బలం పెరుగుతూ వచ్చింది. కానీ, యడ్యూరప్ప దుష్పరిపాలన పార్టీని ఘోరంగా దెబ్బతీసింది. 2014లో బీజేపీ కర్ణాటకలో అధికారంలో లేనప్పటికీ మొత్తం 28 ఎంపీ స్థానాల్లో 16 సీట్లను బీజేపీ గెల్చుకోగలిగింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఉండకపోవడమే ఏ పార్టీకయినా మంచిది.
 వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, అసోమ్, హరియాణా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2009లో 208 ఎంపీ స్థానాలు గెల్చుకుంది. అప్పట్లో అది ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, తదితర అనేక రాష్ట్రాల్లో అధికారంలో లేదు. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కలిగి ఉండక పోవడం అనేది జాతీయ పార్టీకి అనేక సార్లు అనుకూల పరిణామాలను తీసుకొచ్చేది. మోదీకి, బీజేపీకి ప్రధాన సమస్య ఏమిటంటే, మోదీ ఢిల్లీలో ఏం చేస్తారనే విషయం కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నదే. బహుశా కేంద్రంలో మోదీ బాగానే పనిచేయవచ్చు. కాని ప్రజాదరణ కోల్పోతున్న బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల దుష్ఫలితాల మూల్యాన్ని మోదీ ఎదుర్కోవలసి ఉంటుంది.

 ఏదేమైనా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ జాగ్రత్తగా పరిశీలిం చవలసి ఉంటుంది. బీజేపీ సీఎంలు, మంత్రులు విఫలమైతే వారిని తొలగించాల్సిన సమస్య కూడా ప్రస్తుతం మోదీ మెడకు చుట్టుకుంటోంది. ఎవరిని తొలగించాలి, ఎవరిని నియమించాలి? అనే అంశాన్ని కూడా ఆయన  తేల్చుకోవాలి. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోనే బీజేపీ ముఖ్యమంత్రులు ఉండేవారు. మిగతా దేశమంతటా ఇతర పార్టీలు అధికారంలో ఉండేవి. కాబట్టే మోదీ అప్పట్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పైనా దాడి చేసేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలను మోదీ కాపాడుకోవాలి. 2014 తర్వాత బీజేపీ మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణాలను గెల్చుకుంది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం పుచ్చుకుంది.

 మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్‌లో వసుంధరా రాజే, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్, గుజరాత్‌లో ఆనందీబెన్ పటేల్ బీజేపీ సీఎంలుగా ఉన్నారు. 2005 నుంచి నేటివరకు ప్రతి ఎన్నికలోనూ బీజేపీని గెలిపిస్తూ వస్తున్న శివరాజ్ సింగ్ బీజేపీ సీఎంలలో ఉత్తమ సీఎంగా పేరొందారు.  తరచుగా శివరాజ్ వివాదాల్లో చిక్కుకుం టున్నప్పటికీ వాటిని అధిగమిస్తు న్నారు. ఆయన నిస్సందేహంగా మోదీకి, బీజేపీకి విలువైన సంపదే మరి. అలాగే 2003 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ఓటమన్నదే ఎరుగని రమణ్‌సింగ్ కూడా బీజేపీకి వరం లాంటివారే. ఇక రాజస్థాన్ సీఎం వసుంధరారాజే మోదీ ఆధారపడదగ్గ నేతగా లేరు. పైగా వచ్చే ఎన్నికల్లో ఆమె పార్టీని ఓటమివైపు నెట్టనున్నారని అంచనా. అనుభవం నుంచి నేర్చుకోని వసుంధరవల్ల రాజస్థాన్‌లో బీజేపీ రక్తమోడ్చవలసిందే.

 ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొత్తవాడే కానీ ఏమాత్రం పాలనానుభవం లేనివాడు. మహారాష్ట్ర రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యం గల రాష్ట్రం.  1999 నుంచి గడచిన 15 ఏళ్లుగా కాంగ్రెస్-ఎన్సీపీ పాలనలో ఆరుగురు సీఎంలు మారారు. ఇక్కడ శరద్‌పవార్ వంటి రాజకీయ దిగ్గజంతో ఫడ్నవీస్ తలపడవలసి ఉంటుంది. బీజేపీ ఇక్కడ శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. ఈ రెండు పార్టీల మధ్య దాంపత్యం గిల్లికజ్జాలతోనే నడుస్తోంది. గొడ్డుమాంసంపై నిషేధం విధించటం మినహా ఫడ్నవీస్ ఇక్కడ చేసిందేమీ లేదు. ఆ ఒక్కటి కూడా వివాదాన్ని రేపింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, ఇలాగే కొనసాగితే బీజేపీ 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 48కి గాను 42 ఎంపీస్థానాలను గెల్చుకోవడం కల్లే. బీజేపీకి పాలనాపరంగా సరిపోని వ్యక్తిగా ఫడ్నవీస్ మిగిలి పోనున్నారు. ఇక జార్ఖండ్‌లో బీజేపీ సీఎం రఘుబర్ దాస్ గత అనుభవం లేని తొలి సీఎం. ఈ చిన్న రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో 13 సీట్లను బీజేపీ గెల్చుకుంది. కాని ఇలాంటి ఫలితాలు భవిష్యత్తులో రాకపోవచ్చు. ఎందుకంటే దాస్ అద్భుతాలు సృష్టించే కార్యకర్త కాదు.

 బహుశా, బీజేపీ పార్టీలో అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి హరియాణా సీఎం జగదీష్ ఖట్టర్. తను కూడా తొలిసారి ఎమ్మెల్యే, సీఎంగా అయ్యారు. ప్రతిరోజూ ఈ రాష్ట్రంలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. హరి యాణా భౌగోళికంగా ఢిల్లీకి దగ్గరగా ఉన్నందున ప్రతి వివాదమూ మీడి యాకు తెలిసిపోతోంది. ఖట్టర్ అత్యంత ప్రాచుర్యం గల ఐఏఎస్ అధికారి ఖెమ్కాను బదిలీ చేయడమే కాకుండా, కశ్మీర్‌లో కన్నుమూసిన సైనికుల కుటుంబ సభ్యులతో మొరటుగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకు న్నారు. చివరకు మంత్రుల గౌరవం కూడా పొందని ఖట్టర్‌ను ఇప్పుడే తొలగించాలా లేక హరియాణాలో బీజేపీని అతడు నిండా ముంచిన తర్వాతే తొలగించాలా అనేది మోదీనే నిర్ణయించుకోవాలి.

 తెలుగు రాష్ట్రాలు : బీజేపీ
 ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీకి ఇద్దరు మంత్రులు ఉన్నా రు. ఇద్దరు మంత్రులతోనే సంతృప్తిపడాలా లేదా మరిన్ని పదవులు కోరాలా? అనే ప్రశ్న ఆ పార్టీ ముందుంది. ఇద్దరు మంత్రులతో బీజేపీ ఏపీలో టీడీపీకి బానిసగానే ఉంది. అధికారంలో ఉన్నవారు ప్రస్తుతానికయితే సౌకర్యంగా నూ, సంతోషంగానూ కనబడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వైదొలిగి బయటనుంచి మద్దతు ఇవ్వడం బీజేపీకి ఉత్తమంగా ఉంటుంది. ఆంధ్రాలో తాను సొంతంగా ఎదగాలా లేదా 1999లో టీడీపీతో జట్టుకట్టి ఆనక అదృశ్య మైనట్లు నిండా మునగాలా అన్నది బీజేపీయే తేల్చుకోవాలి. ఇక తెలంగాణ లో సొంతంగా ఎదగాలంటే బీజేపీ ఇప్పటికైతే పొత్తులకు దూరంగా ఉండాలి. ఎన్నికల నాటికి ఎవరితో జత కట్టాలో నిర్ణయించుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ పంజరంలో మేతలేని పక్షిలాగా ఉండగా, ఆంధ్రాలో కొంత మేత ఉన్న చిలుకలాగా ఉంటోంది. పక్షులు అడవిలో పెరగాలి కాని పంజరాల్లో కాదు.

 పొంచి ఉన్న ప్రమాదం
 హరియాణా, కశ్మీర్, పంజాబ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌గర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. ఇక్కడ బీజేపీ బలహీనపడితే కాంగ్రెస్‌కు అది బలం అవుతుంది. కాంగ్రెస్ మోదీని దెబ్బ తీసే స్థితిలో లేదు. కానీ, మోదీని అనేక రాష్ట్రాల్లో తన పార్టీ వ్యక్తులే దెబ్బతీయగలరు. మోదీ తప్పకుండా అచిల్లెస్‌ను గుర్తు చేసుకుని తన పాదాన్ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ కంటే బీజేపీలోని తన అనుయాయులే మోదీకి అత్యంత ప్రమాదకారులుగా ఉంటున్నారు.

 (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు   
 ఈమెయిల్: Drpullarao1948@gmail.com)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement