హాంకాంగ్లో అక్టోబరు 4న భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజాస్వామ్యవాదులు
ప్రజాస్వామ్య అనుకూల వాదులు, చైనా అనుకూల పోలీసుల ఘర్షణలతో హాంకాంగ్ రణరంగమే అయింది. హాంకాంగ్‌కు 50 ఏళ్ల స్వతంత్ర ప్రతిపత్తి ఒప్పందాలకు చైనా తూట్లు పొడవటమే ఈ పరిస్థితికి కారణమైంది. మరో మూడేళ్లలో తను అనుమతించిన అభ్యర్థులే ఎన్నికల్లో నిలబడాలంటూ చైనా తెచ్చిన కొత్త నిబంధనలతో చిక్కులొచ్చాయి. వీటిని వ్యతిరేకించిన విద్యార్థులపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించడంతో పరిస్థితి వికటించింది.
చైనాకు బాహ్య ప్రపంచానికి ముఖద్వారంగా వున్న హాంకాంగ్ దీవులు మరోసారి ఆందోళనలతో అట్టుడికి పోతున్నాయి.1842లో బ్రిటన్ పరిపాలనలోకి వచ్చిన హాంకాంగ్‌ను 1997లో చైనాకు అప్పగించింది. అయితే 155 ఏళ్ల పాటు అక్కడ ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగిన నేపథ్యంలో మరో 50 ఏళ్లు, అంటే 2047వరకు స్వతంత్ర ప్రతిపత్తిని కొనసాగించేందుకు చైనా అంగీకరించింది. కానీ, అసలే కమ్యూనిస్టు దేశమైన చైనాకు ఈ ఉదారవాదాలు నచ్చలేదు. అందుకే 2004లో హాంకాంగ్ ఎన్నికల చట్టాలకు చైనా మార్పులు చేసినా ఎవరూ పెద్దగా అభ్యంతరాలు పెట్టలేదు. కానీ, 2017లో హాంకాంగ్ సిఇఓ పదవికి ప్రత్యక్ష ఎన్నికల్లో తాము అనుమతించిన అభ్యర్థులే బరిలో వుండాలని చైనా హుకుం జారీ చేసింది.
దాంతో హాంకాంగ్‌లో అశాంతి మొదలైంది. హాంకాంగ్‌లో ఇన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని అనుభవించారు. ఇప్పుడా స్థానంలో కరుడు గట్టిన కమ్యూనిస్టుల పాలనకు చైనా మొగ్గు చూపుతుందనే వాదన హాంకాంగ్ ప్రజల్లో బలపడుతోంది. దాంతో జూన్-జూలై నెలల్లో రాజకీయ సంస్కరణలపై ప్రజాస్వామ్య వాదులు అనధికార ప్రజాభిప్రాయ సేకరణను జరిపారు. ఇది కాస్తా ఆందోళనగా మారింది. హాంకాంగ్ విద్యార్థి సంఘాలు సెప్టెంబర్ 22న వారం రోజుల పాటు తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్‌పై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించడంతో పరిస్థితి చేజారిపోయింది. అసలే పశ్చిమ ప్రావిన్స్ షిన్‌జియంగ్‌లో తిరుగుబాట్లతో తలనెప్పులు పడుతున్న చైనాకు హాంకాంగ్‌లో జనాగ్రహం ఎటు తిరిగి ఎటు మళ్లుతుందో అన్న ఆందోళన రెట్టింపు బాధలను తెచ్చిపెట్టింది.
**