హైదరా‘మ్యాటిక్స్!’
హైదరాబాద్‌కూ మ్యాథమేటిక్స్‌కూ చాలా దగ్గరి సంబంధం ఉందేమో అనిపిస్తుంటుంది. హైదరాబాదీయులు లెక్కలనూ, వాటిలో ఉపయోగించే సింబల్స్‌నూ విపరీతంగా గౌరవిస్తారేమో అని నా అనుమానం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే అతి పెద్ద హోటల్ ‘ఆల్ఫా’ హోటల్. సిటీకి వచ్చి సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగాక ‘ఆల్ఫా’ హోటల్‌లో టీ తాగని వాడంటూ ఎవడూ ఉండడు. ఏదో ఒక సందర్భంలోనైనా అక్కడికి వెళ్లాల్సిందే. ఆల్ఫా టీ తాగాల్సిందే. ఒక్క ప్రతిష్ఠాత్మకమైన ఆ చాయ్ హోటల్‌కేమిటీ... నల్లగొండ క్రాస్ రోడ్డు దగ్గర సంతోష్‌నగర్ వైపుకు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మామూలుగా కట్టకుండా అచ్చం అలా ఆల్ఫా ఆకారంలో ఒక మెలిక తిరిగి పైకి వెళ్లేలా సదరు ఫ్లై ఓవర్ నిర్మాణం చేశారు మన హైదరాబాదీ ఇంజనీర్లు. దీన్నిబట్టి మ్యాథమెటికల్ సింబల్స్‌కు మనం ఎంత ప్రాధాన్యం ఇస్తామో తెలియడం లేదూ?
ఇక ఇక్కడి చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ మోనోగ్రామ్‌ను ఎప్పుడైనా గమనించారా? తిన్నగా, పొడుగ్గా ఉండే గీతను చెరిపేశాక ‘బీటా’ గుర్తును తిరగేసినట్టూ లేదా బీటాలోని పెద్ద నిలువు గీతను చెరిపేసి మిగిలిన దాన్ని అద్దంలో చూసినట్టూ ఉంటుంది. (వాస్తవానికి ఉస్మానియా అనే మాట ఉర్దూలోని ‘ఐన్’ అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టే ఆ ఉర్దూ అక్షరాన్ని మోనోగ్రామ్‌గా వాడారు). ఇక రోడ్ల పేర్ల విషయానికి వద్దాం. ఆ రోడ్డనీ, ఈ రోడ్డనీ లేదు... ప్రతి చౌరస్తాకూ క్రాస్‌రోడ్స్ అనే మాటకు బదులుగా ‘ఎక్స్’ రోడ్స్ అనడం ఇక్కడి ఆనవాయితీ. నల్లగొండ ఎక్స్ రోడ్స్, బాలానగర్ ఎక్స్ రోడ్స్... ఇలాంటి ఎక్స్ రోడ్లు ఎన్నో, ఎన్నెన్నో. ఇక కూకట్‌పల్లికి వెళ్తుంటే.. దాని మొదట్లో బాలానగర్‌కు వెళ్లే రోడ్డు మార్గం చీలికను ‘వై’ జంక్షన్ అంటారు. మన ఫేమస్ ‘వై’ జంక్షన్ ఒక పెద్ద ల్యాండ్ మార్క్ కూడా. ఇక మన నగరంలోని ఫ్లై ఓవర్ల రూపానికి వద్దాం. అవన్నీ బోర్లించిన బ్రాకెట్‌లలా ఉంటాయి. ఇక రోడ్లు స్ట్రెయిట్‌గా ఉండకుండా... మీసాల బ్రాకెట్‌లలా ఒంపులు తిరుగుతాయి. వాటికి తగ్గట్టే వాహనాలూన్నూ.
ఇక నగరానికి తలమానికం అయిన చార్మినార్‌ను చూడండి. మీనార్లను మినహాయించి చూస్తే అచ్చం 22/7 విలువ ఉన్న ‘పై’ ఆకృతిలో ఉంటుంది. అలనాటి నవాబులు ఇలా ఎందుకు కట్టించారా అని కాసేపు ఆలోచిస్తే నాకొకటి తోచింది. ‘పై’ను అనగా... ఇరవై రెండూ బై ఏడును భాగిస్తున్న కొద్దీ దాని విలువ ఎప్పటికీ ముగియకుండా అలా ఇన్ఫినిటీలా సాగిపోతూనే ఉంటుంది కదా. అలాగే మన నగరం అభివృద్ధి కూడా ‘పై’ విలువలాగే ఎప్పటికీ ఆగిపోకుండా అలా ప్రవర్ధమానమైపోతూ ఉండాలన్నదే అలనాటి హైదరాబాదీ నిర్మాతల లక్ష్యం కాబోలు. అందుకే ఇది ఎప్పుడూ ‘పై’నే! ‘పై’ విలువలా అనంతమే!! వెరసి ఇది ‘ఓమెగా’ సిటీ... అబ్బే మీరనుకుంటున్నట్లు మ్యాథమెటికల్ సింబల్ కాదు... విడమర్చి చూస్తే.. ‘ఓ... మెగా... సిటీ’ అన్నమాట!
- యాసీన్