మాతృ మయూరి..
మాది మచిలీపట్నం. చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై ఆసక్తి. 1967 నుంచి అమ్మ కొనిచ్చిన యాషిక టీఎల్పీ కెమెరాతో ఫొటోలు తీసేవాడిని. 1968లో మచిలీపట్నంలోని హిందూ కాలేజీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కందుబాయీ కసాంజీ దేశాయి వచ్చారు. ఏడో తరగతి చదువుతున్న నేను అప్పుడా దృశ్యాన్ని కెమెరాలో బంధించా. పల్లె అందాలను నా కెమెరా నేత్రంతో చూసేవాణ్ని. 1974లో జేఎన్టీయూ నుంచి డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ సర్టిఫికెట్ అందుకున్నాను.
ఏటా వనవాసం..
1980 నుంచి నా మనసు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై మళ్లింది. ఏటా రాజస్థాన్‌లోని భరత్‌పుర అడవుల్లోకి వెళ్లేవాణ్ని. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఫొటోగ్రఫీ మీద నాకున్న ఆసక్తి వాటిని అధిగమించేలా చేసింది. రాజస్థాన్‌లోని రన్‌థమ్‌బోర్ అడవులు, కర్ణాటకలోని బండిపూర్ అడవుల్లో కలియ తిరిగాను. రన్‌థమ్‌బోర్ అడవిలో తీసిన చిరుత ఫొటోకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఎర్రగడ్డలోని మెడికల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే ఏడాదిలో కొన్ని రోజులు అడవుల బాట పట్టేవాణ్ని.
మరిచిపోలేని క్లిక్..
1980 అక్టోబర్ లో రాజస్థాన్‌లోని భరత్‌పుర అడవులకు వెళ్లా. ఒకరోజు తోటి మిత్రులతో కలసి మధ్యాహ్నం లంచ్ చేసి ముందుకు కదిలాను. కొంత దూరం వెళ్లాక పిల్ల నెమళ్లతో ఉన్న నెమలి కనిపించింది. ముందుగా నీటి కాలువ. తన పిల్లలు నీటిలో కొట్టుకుపోతాయేమోనని కాలువ దాటకుండా నెమలి బిక్కముఖంతో దిక్కులు చూస్తోంది. ఆ దృశ్యం కంటపడగానే.. నేను బ్యాగ్‌లో నుంచి కెమెరా బయటకు తీశాను. రెప్పపాటు వ్యవధిలో ఆ నెమలిని, పిల్లల కదలికలను నా కెమెరాలో బంధించా. నేను తీసిన ఫొటోల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్స్ అని చెప్తాను.
టెక్నికల్ యాంగిల్...
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే జంతువు హావభావాలే కాదు.. చుట్టూ ఉన్న ప్రకృతి ప్రతిబింబించాలి. ఫొటోగ్రఫీపై పట్టు, వైల్డ్‌లైఫ్ మీద ఆసక్తి ఉన్నప్పుడే ఇందులో రాణించగలం. ఫొటోలు తీసేందుకు నికోన్ ఎఫ్‌ఈ 300 ఎంఎం టెలిఫొటో వాడాను. ఫిక్స్‌డ్ లెన్స్ 300 ఎంఎం, 400 ఎంఎం వాడేది. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పూర్తిగా నేచురల్ లైటింగ్‌పై ఆధారపడి ఉంటుంది.
ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్