
మా టీచరమ్మ దయవల్ల..
అరచేతిని తిరగేయమని వేళ్ల ముడుసులపై చెక్క స్కేలుతో కొడుతుంటే.. టీచరమ్మపై భలే కోపం వచ్చేది. అదే టీచరు మధ్యాహ్నం భోజనం సమయంలో పక్కన కూర్చోబెట్టుకుని ఆమె తెచ్చుకున్న కూరలేసి అన్నం పెట్టినపుడు అమ్మ గుర్తుకొచ్చేది. ఆ టీచర్ పేరు ఆరోగ్యమ్మ. ఓనమాలు నేర్చుకున్నప్పటి నుంచి ఆమె కన్నుమూసేవరకూ ఆమెతో నాకు అనుబంధం కొనసాగింది. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రైమరీ స్కూల్లో నన్ను చేర్చేసరికి ఆ స్కూల్లో ఆరోగ్యమ్మ టీచర్ ఒక్కరే ఉన్నారు. అంటే సింగిల్ టీచర్ స్కూలన్నమాట. మా నాన్నగారు సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు.
ఇన్‌స్పెక్టర్ గారి అబ్బాయినని మిగతావారంతా కాస్త గారంగా చూసేవారు. పైగా ఇంట్లో నేనే పెద్దవాడ్ని. నాకు పన్నెండో ఏటప్పుడు చెల్లి పుట్టింది. అప్పటివరకూ ఇంట్లో, బయటా నేనే హీరోని. మా టీచరమ్మ దగ్గర మాత్రం ఎలాంటి పప్పులు ఉడికేవి కావు. అక్షరం నేర్పే దగ్గర ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఆమె ఒక్కరే అన్ని క్లాసులు చెప్పేవారు. నా జీవితంపై ఆరోగ్యమ్మ టీచర్ ప్రభావం చాలా ఉంది. నిజంగా ఆమె చాలా గొప్ప మనిషండి. ఐదోతరగతి తర్వాత నేరుగా ఎనిమిదో తరగతిలో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఆ పరీక్షకు నన్ను ప్రిపేర్ చేయడానికి చాలా కష్టపడింది.
ఆమె కోరుకున్నట్టే నేను పరీక్ష బాగా రాసి రంగనాయకులపేటలోని హైస్కూల్లో చేరాను. ఆ తర్వాత కూడా ఆమెను కలుస్తుండేవాడ్ని. నేను పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం ట్రాన్స్‌ఫర్ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాను. అక్కడ టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు.
కళలపై ఆయనకున్న అభిమానం నాపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు నేను, నా స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశాం. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. నా స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. నేను మాత్రం చాలా ఫీలయ్యాను. మూడురోజులు బెంగపెట్టుకున్నాను. ఆ బాధ, కసి కారణంగానే నేను నటుణ్ణయ్యాను. ఒకవేళ మా గుండాచారి మాస్టారు నేను చెప్పిన డైలాగులు విని బాగానే ఉన్నాయంటే.. నా యాక్టింగ్ పార్ట్ అక్కడితోనే ముగిసిపోయేదేమో.
టీచరయ్యాక కూడా...
నేను బీఎస్సీ బీఎడ్ పూర్తిచేశాక గుంటూరు మున్సిపల్ హైస్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. పాతికేళ్ల పాటు టీచర్‌గా పనిచేశాను. తర్వాత ఐదేళ్లు హెడ్‌మాస్టర్‌గా చేసి ‘నర్సింహనాయుడు’ సినిమా టైమ్‌లో రిటైర్ అయ్యాను. టీచర్‌గా ఉద్యోగం వచ్చాక కూడా అప్పుడప్పుడు మా ఆరోగ్యమ్మ టీచర్‌ని చూడ్డానికి నెల్లూరు వెళ్లేవాడ్ని. చిన్ననాటి విషయాలు జ్ఞాపకం చేసుకునేవాడ్ని. పదేళ్లక్రితం ఆమె చనిపోయినపుడు వెళ్లాను. ఆ సమయంలో నేను బాధపడింది.. ఓనమాలు నేర్పిన గురువుకి దూరమైనందుకే కాదు.. ఆమె చిన్నప్పుడు పెట్టిన అన్నం ముద్దల అనురాగానికి కూడా!
..:: భువనేశ్వరి