సాక్షి, బెంగళూర్: నూతన టెక్నాలజీపై పనిచేస్తున్న టెక్నోక్రాట్లు ప్రస్తుతం ఫ్రీలాన్స్ వర్క్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే సంస్థలో పూర్తికాల ఉద్యోగులుగా పనిచేయడం కంటే వివిధ సంస్థలకు సేవలందిస్తూ ఎక్కువ మొత్తం ఆర్జించేందుకే వారు మొగ్గుచూపుతున్నారని తాజా అథ్యయనం తేల్చింది. ఒకే కుర్చీకి రోజంతా అతుక్కుపోయేందుకు నవతరం టెకీలు ఎంతమాత్రం ఇష్టపడటం లేదని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నూతన టెక్నాలజీల్లో పనిచేసేందుకు నిపుణుల కొరత ఏర్పడటం కూడా టెకీ ఫ్రీలాన్సర్లకు పలు అవకాశాలను ముందుకు తెచ్చింది.
సంఖ్యాపరంగా 1.5 కోట్ల మంది స్వతంత్ర ఉద్యోగులున్నభారత్ అమెరికా (6 కోట్లు) తర్వాతి స్ధానంలో నిలిచింది. ప్రస్తుతం భారత టెకీ ఫ్రీలాన్సర్లు డేటా విజువలైజేషన్, డేటా మైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాల్లో పనిచేస్తున్నారని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ లెర్నింగ్ సీఈవో ఏపీ రామభద్రన్ తెలిపారు. ఇప్పటివరకూ పూర్తిస్దాయి ఉద్యోగులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది ఫ్రీలాన్సర్లుగా మారడంతో ఆయా రంగాల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
ఐటీ కంపెనీలు నూతన నైపుణ్యాలు, టెక్నాలజీలను సంతరించుకునే క్రమంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఫ్రీలాన్సర్లుగా ఆహ్వానిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ వేదిక ఫ్రీలాన్సర్.కామ్‌లో నమోదు చేసుకున్న వారిలో అత్యధికులు భారతీయులే. ఈ వెబ్‌సైట్‌లో నమోదైన వారిలో 20 శాతం మంది భారతీయులున్నారు. టెకీల ఆలోచనాధోరణిలో మార్పులకు ఇది అద్దం పడుతున్నదని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment