దేవీందర్ శర్మ
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు అనుకున్నదాని కంటే ఎక్కువే అంటుండగా ఉపాధి కల్పన ఇంత అల్పంగా ఉండటం విచిత్ర. 2005-09 మధ్య 14 కోట్ల మంది వ్యవసాయాన్ని వదిలేయగా, 5.3 కోట్ల మంది వస్తుతయారీ రంగంలో ఉపాధిని కోల్పోయారు. వారంతా నగరాల్లో లేదా గ్రామాల్లో రోజు కూలీలుగా మారారనే అర్థం. శ్రామికశక్తికి రోజు కూలీ పనుల్లాంటి ఉద్యోగాలనే ఎక్కువగా చూపుతున్నామంటే వృద్ధి ఫలాలు సామాన్యునికి చేరడం లేదు. శ్రామికులకు ఆర్థిక భద్రతను కల్పించే ఆర్థిక నమూనాకై యోచించాల్సిన తరుణమిది.
ఆర్థిక వృద్ధిలో మన ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడ్డ చైనాను అధిగమించి మరీ పరుగులు తీస్తోంది. అయినా ఉపాధి కల్పన విషయంలో మాత్రం చైనాతో సమాన స్థాయిలో నిలవలేకపోతోంది. మన లేబర్ బ్యూరో జరిపిన ఒక సర్వే ప్రకారం 2014-15 మూడో త్రైమాసికంలో మన ఉపాధి రంగ వృద్ధి క్షీణించింది. 2014 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలోని ఎనిమిది కీలక రంగాల్లో 1.17 లక్షల ఉద్యోగావకాశాలను కల్పించగలిగాం. శ్రద్ధగా పరిశీలిస్తే ఆ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో ఉద్యోగావకాశాలు క్షీణిస్తూ వచ్చాయని స్పష్టమౌతుంది. ఏప్రిల్-జూన్ త్రైమా సికంలో 1.82 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పడగా అది జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో 1.58 లక్షలకు పడిపోయింది. ఆ తదుపరి పరిస్థితి మరింతగా దిగజారి, అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో అవి 1.17 లక్షలకు క్షీణించి పోయాయి. అంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు త్రైమాసికాలలో మొత్తం 4.57 లక్షల ఉద్యోగాలను మాత్రమే అదనంగా సృష్టించగలిగాం. జనవరి-మార్చి 2015 నాలుగో త్రైమాసికంలో కూడా ఇదే లెక్కన, అదీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోని గరిష్ట సంఖ్యనే పరిగ ణనలోకి తీసుకుని లెక్కించినా... మొత్తంగా 2014-15 ఆర్థిక సంవత్సరం ఉద్యోగాల వృద్ధి ఇంచుమించుగా 5.40 లక్షలు. ఏటా పని కోసం వెదుకు లాడుకుంటూ ఉపాధి మార్కెట్లలోకి ప్రవేశించే శ్రామికశక్తి అంతటికీ ఉపాధి అవకాశాలను కల్పించా లంటే మన దేశం ఏడాదికి ఇంచుమించు 1.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది.
వృద్ధి ఊర్ధ్వముఖం...ఉపాధి అధోముఖం
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు అనుకున్నదాని కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్న పరిస్థితుల్లో ఉపాధి కల్పన నిరాశాజన కంగా ఇంత అల్పంగా ఉండటం విచిత్ర మనిపిస్తుంది. ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటును 7.4 శాతంగా ప్రస్తుతం నిర్ధారించింది. ఆర్థిక వృద్ధి ఇలా పెరుగుతుండగా ఉపాధి కల్పన రేటు క్షీణిస్తుండటమనే పరిస్థితి... అర్థిక వృద్ధి ఎక్కువగా ఉంటే ఉపాధి కల్పన కూడా అధికంగా ఉంటుందనే ఆర్థిక ప్రమేయానికే విరుద్ధం. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయినప్పటి రోజులను ఓసారి జ్ఞప్తి చేసుకోండి. 2004 నుంచి 2009 మధ్య స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)అబ్బురమనిపించేలా 8 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందింది. గరిష్టంగా అది 9.3 శాతానికి సైతం చేరింది. సాధారణంగా నిరోద్యాగానికి సూచించే ఆర్థిక చికిత్స ప్రకారం ఆ అధిక వృద్ధి రేటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించి ఉండాల్సింది. కానీ అది జరగ లేదు. తద్విరుద్ధంగా జీడీపీ వృద్ధి రేటు గంతులు వేస్తూ ముందుకు పోతుం డగా మన దేశం ఉద్యోగాలు లేని వృద్ధిని చూడాల్సివచ్చింది.
అందరికీ రోజు కూలీ బతుకులే
2005-09 మధ్య 14 కోట్ల మంది ప్రజలు వ్యవసాయ రంగాన్ని వదిలి పెట్టే శారని ప్రణాళికా సంఘం జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఇలా వ్యవ సాయాన్ని వదిలేసే వారంతా వస్తుతయారీ రంగంలోకి ప్రవేశిస్తారని భావిస్తుంటాం. కానీ ఆ వస్తుతయారీ రంగంలోనే 5.3 కోట్ల ఉద్యోగాలు తగి ్గపోయాయి. మరి వ్యవసాయాన్ని వదిలేసిన ఆ 14 కోట్ల మంది, వస్తు తయారీ రంగం నుంచి తరిమేసిన ఈ 5.3 కోట్ల మంది చివరికి ఎక్కడికి పోయినట్టు? వారంతా నగరాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న రోజు కూలీలు గానో లేక గ్రామాల్లోని భూమిలేని వ్యవసాయ కూలీలుగానో మారి ఉండా లనుకోవడమే సమంజసమైన సమాధానమవుతుంది. 2007 నుంచి 3.7 కోట్లకు పైగా భారత రైతులు వ్యవసాయాన్ని వదిలేసి నగరాలకు వలస పోయారని ‘క్రిసిల్’ అనే ప్రపంచస్థాయి విశ్లేషణ సంస్థ జరిపిన తాజా అధ్య యనంలో తేలింది. అయితే ఆర్థిక వృద్ధి మందగించిన గత రెండేళ్లలో (2012- 2014) అలా నగరాలకు వచ్చిన రైతుల్లో 1.5 కోట్ల మంది ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గ్రామాలకు తిరిగిపోయినట్టు ఆ సంస్థ అంచనా కట్టింది. ఈ వాస్తవాలన్నీ రోజురోజుకీ మరింత ఎక్కువ మంది ప్రజలు నగరాల్లోనో లేదా పొలాల్లోనో రోజుకూలీ శ్రామికుల వర్గంలో కలసిపోతున్నారని స్పష్టం చేస్తున్నాయి.
లక్షల్లో ఖాళీలున్నా...
రోజు కూలీ పనుల్లాంటి ఉద్యోగాలనే రోజు రోజుకూ మరింత ఎక్కువగా శ్రామికశక్తికి చూపుతున్నా మంటేనే ఆర్థికవృద్ధి ఫలాలు సామాన్యునికి చేరడం లేదని స్పష్టమవుతోంది. ఆర్థికపరమైన భద్రతను ఇవ్వగల ఉపాధిని కల్పించ గలిగే వాతావరణాన్ని సృష్టించే ఆర్థిక నమూనాను గురించి పునరాలోచించా ల్సిన తరుణమిది. మొత్తంగా పరిస్థితిని చూస్తే, సంఘటిత రంగంలో లక్షలాదిగా ఉద్యోగాలు ఖాళీగా పడి ఉండటమే గాక నెల నెలా ఆ ఖాళీల సంఖ్య పెరుగుతూ ఉండటం సర్వత్రా కనపడటం చూసి గందరగోళపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు మరణావస్థకు చేరాల్సివస్తోంది. అయినా పదవీ విరమణ చేస్తున్న వారి స్థానంలో నియామ కాలను జరపడం లేదు. దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలల్లో 40 నుంచి 50 శాతం ఉద్యోగాలు ఖాళీగా పడి ఉంటున్నాయి. ప్రాథమిక, సెకండరీ స్థాయిల పాఠశాలల్లో ఎంత తక్కువగా చూసినా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అంచనా. ఆసుపత్రులు, పోలీసు, పోస్టల్ సర్వీసులు తదితర ప్రభుత్వ సంస్థలలోని ఖాళీలను కూడా చేర్చితే పదుల లక్షల్లో ఖాళీలున్నాయని తేలుతుంది. ఈ ఖాళీలను భర్తీ చేయ డం జీడీపీని పెంపొందింపజేయడం మాత్రమే కాదు మరణావస్థలోని సంస్థ లను పునరరుజ్జీవింపజేసి, పనిచేసేలా చేస్తాయి. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు ఇలా ఉద్దేశపూర్వకంగా, ఒక క్రమపద్ధతిలో హత్య చేస్తు న్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదిలా కొనసాగడానికి వీల్లేదు. ఉపాధి కల్పనను ప్రైవేటు రంగానికే వదిలేయడానికి వీల్లేదు.
(వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు)
e-mail: hunger55@gmail.com