పగటికళ నిజమాయెగా! | ralla palli venkata narasimharao play a drama in Qader alibeg Theatre Festival | Sakshi
Sakshi News home page

పగటికళ నిజమాయెగా!

Published Mon, Nov 10 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

పగటికళ నిజమాయెగా!

పగటికళ నిజమాయెగా!

రాళ్లపల్లి వేంకట నరసింహారావు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు రాళ్లపల్లిగా సుపరిచితుడు..

రాళ్లపల్లి వేంకట నరసింహారావు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు రాళ్లపల్లిగా సుపరిచితుడు.. నాటకాలంటే అభిరుచి ఉన్న చాలామందికి ఆయన బహుముఖ ప్రజ్ఞ పరిచయం! మారని సంసారం.. జీవన్మృతుడు.. ముగింపులేని కథ.. ఆ ప్రజ్ఞకు నిదర్శనాలు! ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫెస్టివల్‌లో రాళ్లపల్లి ‘సుందరి.. సుందరుడు’ నాటకమూ వేదికను అలంకరించింది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని సంగతులు..
 
నాటకాలకు నాకు ఇన్సిపిరేషన్ పగటి వేషగాళ్లే. మా ఊళ్లో (తూర్పుగోదావరి జిల్లా రాచపల్లి) స్కూల్ ఎగ్గొట్టి మరీ పగటి వేషగాళ్ల వెంట తిరిగేవాడిని. వాళ్లు పూటకో వేషం కడుతుంటే చూసి ఎంజాయ్ చేసేవాడిని. నేనూ అలా వేషం కట్టి ఇతరులను ఆనందింపజేయగలనా? అనిపించేది.
 
హైదరాబాద్.. నాటకాలు..
నాకు నాటకాన్ని పరిచయం చేసింది హైదరాబాదే! నేను వేషం వేసిన, చూసిన మొదటి నాటకం ‘కన్యాశుల్కం’. అందులో నా పాత్ర కరటకశాస్త్రి శిష్యుడు మహేంద్ర. ‘ఎవరీ అబ్బాయి పద్యాలవీ బాగా పాడుతున్నాడు’ అని మంతిరి శ్రీనివాస్‌రావు గారు నన్ను మెచ్చి కన్యాశుల్కంలోని ఆ పాత్రనిచ్చారు. మా నాన్న హెడ్‌మాస్టర్. ఇద్దరన్నయ్యలకు ఇక్కడ ఉద్యోగం రావడంతో నాకు పదిహేనేళ్లప్పుడు వాళ్లతో పాటు నేనూ హైదరాబాద్ వచ్చేశాను. నేను ఏదో డిగ్రీ చేసి ఉద్యోగం చేసుకుంటే చాలనుకున్నారు వాళ్లు. నాకేమో నాటకాల పిచ్చి. అందుకే పేరుకే సైఫాబాద్ సైన్స్ కాలేజ్‌లో బీఎస్సీ! మనసా వాచా కర్మణా నటనే!
 
పరిషత్ కాంపిటీషన్స్‌తో..
అప్పట్లో ఇక్కడ నాటకాలకు అంత ఆదరణ ఉండేది కాదు. ఓ ఐదారు నాటక సంస్థలే ఉండేవి. ఎప్పుడైతే  పరిషత్ పోటీలను నిర్వహించడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి నాటకాలకు ప్రోత్సాహం మొదలైంది. ఎన్నో నాటక సంస్థలు వెలిశాయి. యాక్టింగ్ స్కూళ్లూ పెరిగాయి. పరిషత్ పోటీల్లో బహుమతి రావడం ఆస్కార్ దొరికినంత గొప్పగా భావించేవాళ్లం.
 
స్టెప్పింగ్ స్టోన్..
సినిమా ప్రభావంతో నాటకాలు తెరమరుగవుతున్నాయంటారు. కానీ.. నాటికి..నేటికీ నాటకాన్ని సినిమాకు స్టెప్పింగ్ స్టోన్‌గా మలచుకుంటున్న వాళ్లున్నారు. నాటకానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. టికెట్ కొని సినిమాలెలా చూస్తామో.. అలాంటి డిమాండ్ నాటకానికీ రావాలి. ఇది వరకు పౌరాణిక నాటకాలకు అంతటి డిమాండే ఉండేది. నటనను ఇష్టపడుతున్నవారు మాత్రం ముందు నాటకం ద్వారే తెరకు పరిచయం కావాలనుకుంటున్నారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లూ ఆ ఉద్యోగాలను వదిలి నాటక రంగంలోకి రావడమే ఇందుకు గొప్ప నిదర్శనం.
 
జీవకళ..
నిజానికి సినిమాను సాంకేతికత డామినేట్ చేస్తుంది. కానీ నాటకం జీవకళ. నటీనటుల ఆంగిక వాచికాభినయం.. ప్రత్యక్షంగా కనిపిస్తుంది.. వినిపిస్తుంది. సరిగా చేయలేకపోతే టెక్నికల్ ఎఫెక్ట్స్‌తో మసిపూసి మారేడుకాయ చేసే అవకాశం ఉండదు. సినిమా కన్నా నాటకానికే శ్రమ ఎక్కువ. నాటకం.. సమష్టి శ్రమ.  
 
వినోదం.. సాంకేతికత..
అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నాటకం ప్రభావవంతమైన మాధ్యమంగా మారాలి. కాలానుగుణంగా కథావస్తువులను ఎంచుకోవాలి. మొదటి రోజు సినిమా విడుదలైతే హౌస్‌ఫుల్ కలెక్షన్ ఎలా ఉంటుందో అంతకాకపోయినా పది శాతమైనా నాటకానికి రావాలి. ఈ మార్పు రావాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన వేదికలు కావాలి. జిల్లాకొకటి చొప్పున ఆధునిక ఆడిటోరియాలు నిర్మిస్తే నాటకం నిలబడుతుంది. వినోదం, టెక్నాలజీ సమ్మేళనంగా నాటకాలు రూపుదిద్దుకోవాలి.
 
సుందరి.. సుందరుడు
ఇది 1960ల నాటి నాటకం. దీన్ని అత్తిలి కృష్ణారావు రాశారు. 1966లో న్యూఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో ‘మృశ్చకటికం’ ప్రదర్శించడం గొప్ప అనుభూతి. ఇలాంటి మధురమైన ఎన్నో జ్ఞాపకాలను నాటకరంగం అందించింది. నటనలో జాతీయస్థాయి పురస్కారం అందుకోవాలన్నదే నా లక్ష్యం.
 
..:: సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement