సంక్రాంతి రేసులో 1 'ఎవడు'..!
భారీ బడ్జెట్తో తెరకెక్కించి, భారీ అంచనాలు రేకెత్తించిన సినిమా ఒకటి. విడుదల వాయిదా పడుతూ ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం మరొకటి. రెండూ స్టార్ హీరోల సినిమాలే. రెండూ సంక్రాంతి రేసులో సందడి చేస్తున్నాయి. అవే ' ప్రిన్స్' మహేష్బాబు నటించిన '1' నేనొక్కడినే.. 'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ చిత్రం ఎవడు.
రూ. 70 కోట్లు బడ్జెట్తో తెరకెక్కిన '1' సినిమాను శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 1400 స్ర్కీన్లపై విడుదల చేశారు. ఓ దశలో 'అత్తారింటికి దారేది' సినిమా ప్రారంభ వసూళ్లను అధిగమిస్తుందని అంచనాలు రేకెత్తించినా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు లేవని విశ్లేషకులు అంటున్నారు. ఓపెనింగ్ రోజు రూ. 8.4 కోట్లు కలెక్షన్లు వసూలు సాధించింది. ఇక రామ్ చరణ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎవడు'కు హిట్ టాక్ రావడంతో అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజున 9.03 కోట్లు వసూలు చేసిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. తొలిరోజు కలెక్షన్లను పోల్చితే మహేష్ '1' కంటే రామ్ చరణ్ 'ఎవడు' ముందంజలో నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు.
రామ్ చరణ్ కెరీర్లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఎవడు నిలిచింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంపై నిర్మాత దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఎవడు సక్సెస్ మీట్ లో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మించిన చిత్రాల్లో అతిపెద్ద హిట్ అని చెప్పారు. ఎవడు భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోందని, బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగవచ్చని సినీ పండితులు చెబుతున్నారు. ఇక మహేష్ '1' హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రశంసలు వచ్చాయి. కలెక్షన్లు పుంజుకోవచ్చని ప్రిన్స్ అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తమ్మీద సంక్రాంతి రేసులో ఓవరాల్గా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఏదో నిలుస్తుందో చూడాలి.!