రోడ్లూడ్చిన రోల్స్‌రాయ్స్ | Rolls royce sweeps street roads in london | Sakshi
Sakshi News home page

రోడ్లూడ్చిన రోల్స్‌రాయ్స్

Published Mon, Aug 11 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

రోడ్లూడ్చిన రోల్స్‌రాయ్స్

రోడ్లూడ్చిన రోల్స్‌రాయ్స్

లండన్‌లోని బాండ్ స్ట్రీట్. ఒకాయన ఆ వీధిలో నడుస్తున్నాడు. మార్గమధ్యంలో రోల్స్‌రాయ్స్ షోరూమ్ కనిపించింది. వెంటనే ఆ షోరూమ్‌లోకి వెళ్లిన ఆయన కార్ల ధరలు, ఇతర ఫీచర్స్ గురించి అడిగాడు. ఇండియా నుంచి వచ్చిన అందరిలాంటి ఓ సాధారణ వ్యక్తి అనుకున్న సేల్స్‌మ్యాన్.. అతడిని అవమానించాడు. బయటికి గెంటేసినంత పని చేశాడు. అలా అవమానం పొందిన వ్యక్తి ఎవరో కాదు హైదరాబాద్ నవాబు ముకర్రమ్ జా.
 
 వెంటనే హోటల్‌రూమ్‌కు వచ్చిన నవాబు తన సేవకులతో షోరూమ్‌కు ఫోన్ చేయించాడు. కార్లు కొనడానికి హైదరాబాద్ నవాబు వస్తున్నాడని చెప్పించాడు. ఈసారి పూర్తిగా నవాబు హోదా, రాజఠీవీతో షోరూమ్‌కు బయలుదేరాడు. ఆయన అక్కడికి చేరేటప్పటికే ఫ్లోర్‌పై రెడ్‌కార్పెట్ పరిచి ఉంది. అక్కడ ఉన్న సేల్స్‌మెన్ వంగి వంగి దండాలు పెట్టారు. నవాబు అప్పుడు షోరూమ్‌లో ఉన్న ఆరు కార్లను డెలివరీ ధరలు కూడా చెల్లించి కొనేశాడు. ఇండియాకు చేరుకున్న నవాబు కార్లు రాగానే... ఆ ఆరు కార్లకు పొరకలు కట్టి హైదరాబాద్ రోడ్లను శుభ్రం చేయించాలని మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్‌రాయ్స్ కార్లు అలా నగరంలో చెత్తను శుభ్రం చేయడానికి  ఉపయోగించారు. ఈ వార్త ఈ పత్రికా, ఆ పత్రికా చేరి చివరకు... ప్రపంచ ప్రఖ్యాత రోల్స్‌రాయ్స్ పరువు మురికి కాలువలో కలిసింది. యూరప్ అమెరికాల్లో ఈ కారును ఉపయోగించిన వారు.. ‘ఏది ఇండియాలో చెత్త మోయడానికి వాడుతున్నారే.. ఆ కారా?’ అని వ్యంగ్యంగా అనేవారట.
 
ఒక్కసారిగా  రోల్స్‌రాయ్స్ ప్రతిష్టతోపాటు రెవెన్యూ కూడా తగ్గిపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా అసలుకే ఎసరొస్తుందనుకున్న రోల్స్‌రాయ్స్ యాజమాన్యం..నవాబుకు క్షమాపణలు చెబుతూ టెలిగ్రాం పంపింది. కార్లతో రోడ్లు క్లీన్‌చేయించడం ఆపేయాలని కోరింది. అంతేకాదు.. తాము చేసిన తప్పుకు బదులుగా ఆరు రోల్స్‌రాయ్స్ కార్లను ఉచితంగా ఇస్తామని కూడా ఆఫర్ చేసింది. 1967లో అతని నాన్నమ్మ మరణానంతరం ముకర్రమ్ జా యువరాజయ్యాడు. ప్రస్తుతం అతని ప్యాలెస్ మ్యూజియంగా మారింది. ఆ రోల్స్‌రాయ్స్ కార్లు కూడా ప్రదర్శనకు ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement