సెన్సెక్స్ ఆకాశం వైపు..షేర్లు నేల చూపు
2013 సంవత్సరంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు సానుకూలంగా స్పందించాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హైకి చేరుకుని రికార్డు సృష్టించాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందనే సర్వే నివేదికలను ఆధారంగా చేసుకుని స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి.
ఈ సంవత్సరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల కంపెనీ షేర్లు భారీ లాభాలను స్టాక్‌మార్కెట్‌లో నమోదు చేసుకున్నాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు ప్రధాన సూచీలను పరిగెత్తించడంలో కీలక పాత్రను పోషించాయి.
ఐటీ రంగ కంపెనీ షేర్లలో 52 వారాల గరిష్టస్థాయిని ఇన్ఫోసిస్ రూ. 3573 (20 డిసెంబర్), టీసీఎస్ 2258 (15 అక్టోబర్), హెచ్‌సీఎల్ 1261 (27 డిసెంబర్), విప్రో 557(27 డిసెంబర్) గరిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి.
ఫార్మా రంగ కంపెనీ షేర్లలో డాక్టర్ రెడ్డీస్ 2557 (26 డిసెంబర్), లుపిన్ 945, సిప్లా 450 (16 సెప్టెంబర్), రాన్‌బాక్సీ 522(జనవరి 13), సన్‌ఫార్మా 651 (9 అక్టోబర్)లు 52 వారాల గరిష్టస్థాయిని చేరుకున్నాయి.
ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో ఐటీసీ (24 జూలై), హిందూస్థాన్ యూనీలీవర్ 725 (07 మార్చి), డాబర్ 184 (28 అక్టోబర్)లు కూడా గరిష్టస్థాయిని చేరుకుని ప్రధాన సూచీలు ర్యాలీ జరపడంలో కీలక పాత్రను పోషించాయి.
అయితే సూచీలు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసినా.. మిగితా రంగాలు కంపెనీల షేర్లు మాత్రం అంతంత మాత్రంగానే పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. సెన్సెక్స్‌తోపాటు ఇతర ప్రధాన సూచీలు ఆకాశాన్నంటుతున్నా.. కొన్ని రంగాల షేర్లు నేలచూపు చూడటం మార్కెట్ నిపుణులకు అంతుపట్టని విషయంగా మారింది. మ ఇక రానున్నది ఎన్నికల సమయం కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.