
అర్ధనగ్నంగా 'నమో'నమః
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశమంతా చుట్టేస్లూ ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై వ్యంగ్య వాగ్బాణాలు సంధిస్తూ దూసుకుపోతున్నారు. పదుదైన మాటలతో రాజకీయ వాతావరణాన్ని వేడిక్కిస్తున్నారు. మోడీకి మద్దతుగా ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రచారం చేస్తుంటే గుజరాత్కు చెందిన మోడల్ మేఘనా పటేల్ మాత్రం వినూత్న ప్రచారానికి దిగింది. అర్ధనగ్నంగా ఫొటోలకు పోజిచ్చి.. మోడీకి ఓటేయమని అర్థించింది.
పలు సినిమాలతోపాటు సీరియళ్లలో నటించిన మేఘన ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈ ఫొటోలు నెట్‌లో, ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మద్దతు తమకక్కర్లేదని, ప్రచారం కోసమే మేఘన ఇలా అసభ్యకర చర్యలకు దిగిందని మండిపడింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే, తన చర్యలను అసభ్యకరమనడాన్ని మేఘన ఖండించింది. తాను శరీర వర్ణంలో కలిసిపోయేలా ఉన్న దుస్తులు వేసుకున్నానని, మోడీకి తాను మద్దతు తెలిపే విధానం ఇదేనని గడుసుగా సమాధానం ఇచ్చింది.
మోడీకి మద్దతు తెలిపే అందాల భామల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ కూడా కొద్ది రోజుల క్రితం మోడీకి మద్దతు ప్రకటించింది. ‘ద బ్యాచిలరెట్ ఇండియా- మేరే ఖయాలోంకీ మల్లిక’ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్లిక... తన షోలో నరేంద్ర మోడీ పాల్గొంటే ఆయన కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్కడితే ఆగకుండా మోడీని ‘పర్‌ఫెక్ట్ బ్యాచిలర్’గా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మల్లిక అభివర్ణించింది.
తాజాగా మేఘనా పటేల్ తన అభిమాన నాయకుడికి 'అర్ధనగ్న' ప్రదర్శనతో ప్రచారం కల్పించింది. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా నిలబడతానని ప్రకటించి అప్పట్లో పూనమ్ పాండే సంచలనం రేపింది. దాంతో రాత్రికి రాత్రే ఆమె పాపులరయింది. ఇప్పుడు మేఘన కూడా ఇదే దారిలో వెళుతున్నట్టు కనిపిస్తోంది. 'అర్ధనగ్న' ప్రచారాన్ని పాలిటిక్స్లో ప్రవేశపెట్టి ఇప్పటికే వార్తల్లో నిలిచింది మేఘన. మున్ముందు ఆమె ఇంకా ఎన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి.