మిత్రమా.. కుశలమా?
తోకలేని పిట్టను తొంభై ఆమడలు నడిపించేవారు... వారు. వారొచ్చారంటే.. అయితే సంతోషం, లేదంటే దుఃఖం! వేలు విడిచిన మేనమామ పెద్దల్లుడి బావ మరిది పెళ్లి పత్రికైనా.. గంగా భగీరథీ సమానురాలైన పెదబామ్మ పోయిందన్న విషయమైనా.. వాళ్లొస్తేనే తెలిసేది. క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఇంటివాడయ్యేవారు. దగ్గరి వాళ్లు దూరమైపోతే.. ఓదార్చేవారు. మనియార్డర్ ఇచ్చి ధనయోగం కలిగించేవారు. ఇప్పుడు వారు ప్రాభవం కోల్పోయారు. అనుబంధాలూ కోల్పోతున్నారు. బ్యాంకు నోటిఫికేషన్లు, కోర్టు ఆర్డర్లు తెచ్చివ్వడానికే పరిమితమవుతున్నారు. గతమెంతో ఘనం అని చెప్పుకుని మురిసిపోయే పోస్టుమన్‌లను సిటీప్లస్ తరఫున స్టార్ రిపోర్టర్ తనికెళ్ల భరణి ‘మిత్రమా.. కుశలమా’ అని పలకరించారు. ప్రశ్నోత్తరాలతో కొత్తకోణం ఆవిష్కరించారు.
తనికెళ్ల భరణి: పోస్ట్‌మన్.. బంధుత్వం లేకపోయినా దగ్గరి బంధువు కన్నా ఎక్కువ. మంచి వార్తని నవ్వుతూ.. చెడు వార్తని దిగులుగా చెప్పే బంధువు. ఆ పోస్ట్‌మన్
ఇంకా ఉన్నాడా?
ఓంకార్: మీ ఎదురుగా నిలబడ్డ మేమంతా అలాంటి పోస్ట్‌మన్లమే సార్.
తనికెళ్ల భరణి: మీరున్నారు.. అనుబంధాలు కూడా అలాగే ఉన్నాయా?
కమలాకర్: అనుబంధాలను పెంచే ఉత్తరాలుంటే కదా! అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, బ్యాంకు నోటిఫికేషన్లు, కోర్టు ఆర్డర్లు వంటివే ఎక్కువగా వస్తున్నాయి.
తనికెళ్ల భరణి: అనుబంధాలు.. ప్రేమను, కోపాన్ని.. అన్నింటినీ క్షణాల్లో చేరవేయడానికి చరవాణిలు (మొబైల్ ఫోన్లు ) ఉన్నాయి కదా మరి?
ఇసాముద్దీన్: అయినా.. మాకుండే పని మాకుంది సార్.
తనికెళ్ల భరణి: ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి?
గోపాల్: పూర్వం పదో తరగతి. ఇప్పుడు ఇంటర్మీడియట్.
తనికెళ్ల భరణి: అప్పటి సంగతి వేరు.. ఏడు ఎనిమిది చదివినా పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చేవారు. మా అన్నయ్య దీక్షితులు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో యూసఫ్‌గూడలోనే పనిచేశాడు. తమ్ముడు కూడా జీపీఓలోనే పనిచేశాడు. ఒకప్పుడు పోస్ట్‌మన్ ఎప్పుడు వస్తాడా.. వచ్చినపుడు తన బ్యాగ్‌లో నుంచి ఏ ఉత్తరం తీస్తాడా అని ఎదురు చూసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు కదా?
రామ్మోహన్: ఉత్తరాలున్నాయి సార్. ఎదురుచూసే ఉత్తరాలు కాదు.. వద్దన్నా వచ్చే ఉత్తరాలు.
తనికెళ్ల భరణి: అర్థమైంది.. ‘నువ్వింత కట్టకపోతే నీ ఇల్లు వేలం పెడతాం’ అలాంటివన్నమాట(నవ్వుతూ...)
చంద్రశేఖర్: డబ్బు, ఉద్యోగాలు.. వాటికి సంబంధించిన ఉత్తరాలే ఎక్కువగా ఉంటున్నాయి.
తనికెళ్ల భరణి: రోజుకి ఒక పోస్ట్‌మన్ ఎన్ని ఉత్తరాలు ఇస్తాడు?
రామ్మోహన్: తక్కువలో తక్కువ.. 500 వరకు. మాగ్జిమమ్.. 800 వరకూ చేరవేస్తాం.
తనికెళ్ల భరణి: అమ్మో.. అన్ని ఉత్తరాలు ఎలా ఇస్తారు! బండి మీదా ?
గోపాల్: పోస్ట్‌మన్ బండి ఎక్కడమేమిటి సార్. సైకిల్‌మీదే.
తనికెళ్ల భరణి: ఇంకా సైకిలేనా..?
మాధవరెడ్డి: బ్రిటిష్ జమానా నుంచి ఇప్పటి వరకూ మారని విషయం ఏదైనా ఉందంటే.. పోస్ట్‌మన్ ఇంకా సైకిల్ వాడటం.
చంద్రశేఖర్: అవును.. మరీ విడ్డూరం కాకపోతే.. చిన్న మోటారు సైకిల్‌లాంటిది ఉండాలి కదా! చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. వాళ్లు పోస్ట్‌మెన్‌కి సైకిల్ మాత్రమే సౌకర్యంగా ఉంటుందంటారు.
తనికెళ్ల భరణి: ఓహో.. ఉత్తరాలు వంటివి పెట్టుకోవడానికా! అయినా.. బైక్‌ని కూడా మీకు సౌకర్యంలా ఉండేట్టు మార్చుకోవచ్చు కదా! ఎత్తుగా ఉన్న ప్రదేశాలు ఉన్నాయనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి?
గోపాల్: ఏముంది సార్.. బలమంతా ఉపయోగించి ఆయాసపడుతూ తొక్కుకెళ్లాలి. నాకిప్పుడు 56 ఏళ్లు. అయినా తప్పదు.. ముఖ్యంగా మన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో కొన్ని ఎత్తుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా కష్టమవుతుంది. ఎత్తు పల్లాలు పక్కన పెడితే.. అపార్టుమెంట్లలో ఉండేవారికి ఉత్తరాలొస్తే ఇక నరకమే.
తనికెళ్ల భరణి: అదేంటి.. అపార్ట్‌మెంట్ వల్ల మీకొచ్చిన కష్టమేంటి?
కమలాకర్: మెట్లు ఎక్కాలి దిగాలి కదా సార్.. ఐదారంతస్తులుంటాయి. కొందరు లిఫ్ట్ వాడొద్దంటారు. ఒక్కోసారి కరెంట్ ఉండదు. కష్టమైనా.. చచ్చినట్టు అన్ని మెట్లు ఎక్కి దిగాల్సిందే. రోజుకి కనీసం వెయ్యి మెట్లు ఎక్కుతాం.
తనికెళ్ల భరణి: క్షేమ సమాచారాలకు సంబంధించిన ఉత్తరాలు తక్కువైపోయినా.. ఈ మధ్యనే నేను తీసిన ‘మిథునం’ సినిమా చూసి బాపుగారు నాకు ఉత్తరం రాశారు. దాన్ని నేను నెట్‌లో పెట్టుకున్నాను.
రామ్మోహన్: ఉత్తరం అపురూపమైంది సార్!
తనికెళ్ల భరణి: ఇండియన్ పోస్టల్ సర్వీసుకి, ఫారెన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి తేడా గురించి ఏమైనా చెప్పగలరా?
ఓంకార్: తప్పకుండా సార్. ప్రపంచంలో ఏ పోస్టల్ డిపార్ట్‌మెంట్ అయినా మన దేశం తర్వాతే సార్. పొరుగు దేశాల్లో అడ్రసులో ఒక్క అక్షరం తప్పు ఉన్నా ఉత్తరం వెనక్కి తిరిగొచ్చేస్తుంది. ఇక్కడ అలా కాదు. మనిషి గురించి కనుక్కుని మరీ ఇస్తారు.
తనికెళ్ల భరణి: నిజమే... దీని గురించి ఒక ఉదాహరణ చెబుతాను. హిందీ నటుడు మనోజ్‌కుమార్ తన గొప్పతనం గురించి చెబుతూ...మనోజ్‌కుమార్, బొంబాయి అని రాస్తే చాలు.. నా ఇంటికి ఉత్తరం వచ్చేస్తుంది.. అని అన్నాడట. వెంటనే మహమూద్ అందుకుని .. మహమూద్, ఇండియా అని రాస్తే చాలు నా ఇంటికి ఉత్తరం వచ్చేస్తుంది.. అన్నాడట. అది ఆ నటుల గొప్పతనం కాదు, మన పోస్టల్ డిపార్టుమెంటుదే. అదే పద్ధతిలో నేను సత్యజిత్‌రేకి ఉత్తరం రాశాను. ‘సత్యజిత్‌రే.. ఫేమస్ ఫిలిం డెరైక్టర్, వెస్ట్ బెంగాల్’ అని అడ్రస్ రాశాను. కాకపోతే ఓ వారం రోజుల్లో ఆ లెటర్ తిరిగొచ్చేసింది (నవ్వుతూ...)
మాధవరెడ్డి: ఎందుకు సార్.. అడ్రస్ సరిగ్గా లేకుండా మీ పేరుతో ఉత్తరం వచ్చిందనుకోండి. హైదరాబాద్‌లో మీరెక్కడున్నా ఉత్తరం మీ చేతికి అందుతుంది.
తనికెళ్ల భరణి: ఇప్పుడు మీ అందరికీ అన్ని భాషలూ రావాలని లేదు. హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ.. వంటి భాషల్లో అడ్రస్ ఉంటే మీకెలా అర్థమవుతుంది.
గోపాల్: ఆఫీసులోనే ట్రాన్స్‌లేషన్ చేసి ఇస్తారు.
తనికెళ్ల భరణి: సరే.. మరో ముఖ్యమైన ప్రశ్న. మీది డిలే సర్వీసు అనే మాట ఉంది. చాలాసార్లు.. పెళ్లయిపోయాక ఉత్తరాలు వచ్చిన సందర్భాలూ ఉంటాయి. మరి దానిమాటేమిటి ?
చంద్రశేఖర్: అడ్రసులు సరిగ్గా రాయకపోవడమే కారణం.
తనికెళ్ల భరణి: నాకు మొదటిసారి ఉత్తరం వచ్చింది. ఒక పత్రిక నుంచి ‘నీ కవిత ప్రచురింపబడుతోంది’ అని. జ్ఞానపీఠ్ అవార్డు వచ్చినంత ఆనందపడ్డాను. అదే ఉత్సాహంతో ‘కర్మ కాలిపోయింది’ అని ఒక కథ రాసి పంపించాను. ఓ పది రోజుల తర్వాత ‘నీ కర్మ కాలిపోయింది.. కథ స్వీకరింపబడలేదు’ అని తిరిగి మరో ఉత్తరం వచ్చింది(నవ్వుతూ...). మీ డిపార్డుమెంట్‌పైన హిందీలో ఒక అద్భుతమైన పాటొకటుంది. ‘చిట్టీ ఆయీహై’ అని నామ్ సినిమాలోనిది. కళ్లనీళ్లు పెట్టిస్తుంది. మరో విషయం.. పూర్వం ఉత్తరాలకు శుభవార్తయితే పసుపుతో, అశుభమైతే నలుపు రంగుని ఉత్తరం మూలన అంటించేవారు కదా?
గోపాల్: శుభవార్త అయితే నవ్వుకుంటూ ఇచ్చేవాళ్లం. అశుభమైతే వాళ్లకంటే ముందు మేమే బాధపడుతూ ఇచ్చేవాళ్లం సార్. ఆ రోజుల మళ్లీ తిరిగి రావు. దూరాన ఉన్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినట్టు ఉత్తరమొస్తే.. మా బిడ్డలకు వచ్చినంత ఆనందపడేవాళ్లం. అమ్మకు బాగాలేదని, తండ్రి చనిపోయాడని ఉత్తరాలొస్తే మేం కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ 20 ఏళ్ల కింద ముచ్చట.
తనికెళ్ల భరణి: పల్లెటూళ్లలో చదువు రానివారు పోస్ట్‌మన్‌తోనే ఉత్తరం చదివించుకునేవారు. మీరెప్పుడైనా అలా చేశారా?
రామ్మోహన్: ఎందుకు చేయలేదు సార్.. అవసరమనుకుంటే ఉత్తరాలు తిరిగి రాసిపెట్టిన సందర్భాలున్నాయి. కాకపోతే కొందరి రాత అస్సలు అర్థమయ్యేది కాదు.
తనికెళ్ల భరణి: మీ గురించి పూర్వం మరో బ్యాడ్‌టాక్ ఉండేది. ఎంఓలు నొక్కేస్తారని..?
గోపాల్: కమలాకర్: అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగేవి. కానీ కంప్లయింట్ ఇవ్వగానే వెంటనే వాళ్లపై చర్యలు తీసుకునేవారు.
తనికెళ్ల భరణి: పోస్ట్‌మన్ వచ్చాడు.. అనే మాట ఎప్పుడో గాని వినపడటం లేడు. అసలు ఉన్నారా.. ఉంటే ఎలా ఉన్నారనే ఆత్రుతతో ‘స్టార్ రిపోర్డర్’గా మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేశాను. థ్యాంక్యూ
ఓంకార్: అన్ని వృత్తుల్లో ఒక వృత్తిలా కలసిపోయిన మమ్మల్ని పలకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్యూ వెరీమచ్!
మా ఆవిడ రాసిన ఉత్తరాలు నేను దాచుకున్నాను. మనం రాసినవి చింపి అవతల పడేసినా.. వాళ్లవి మనం భద్రంగానే దాచుకుంటాం కదా! (నవ్వుతూ...). నేను మా ఆవిడకు రాసే ఉత్తరం చాలా వెరైటీగా ఉండేది. నేనిక్కడ క్షేమం.. నవ్వక్కడ క్షేమం.. అంటూ రొటీన్‌గా కాకుండా.. రచయితను కదా సినిమా స్టోరీలా రాసేవాడ్ని. ‘పొద్దునే లేచి టీ పెట్టుకుని తాగుతూ నీకు ఉత్తరం రాస్తున్నాను..’ అని మొదలుపెట్టేవాడ్ని.
- రిపోర్టర్: తనికెళ్ల భరణి