తాగుబోతు... నా పేరుకి ట్యాగ్‌లైన్ మాత్రమే | 'Thagubothu' is a tag line of my name, says Thagubothu ramesh | Sakshi
Sakshi News home page

తాగుబోతు... నా పేరుకి ట్యాగ్‌లైన్ మాత్రమే

Published Wed, Dec 31 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

తాగుబోతు... నా పేరుకి ట్యాగ్‌లైన్ మాత్రమే

తాగుబోతు... నా పేరుకి ట్యాగ్‌లైన్ మాత్రమే

 తాగుబోతు రమేష్.. సినీ నటుడు అనే ట్యాగ్‌లైన్ అవసరంలేని వ్యక్తి. నిజ జీవితంలో మద్యానికి దూరంగా ఉండే రమేష్ తెరపై మాత్రం తాగుబోతుగా నటనను అదరగొట్టేస్తాడు. తాగుబోతునే ఇంటిపేరుగా మార్చుకున్న ఈ కరీంనగర్ కుర్రోడి స్పెషల్ ఇంటర్వ్యూ..
-  సాక్షి, సిటీప్లస్  
 
 మా ఊళ్లో వినాయక చవితి వేడకలకు వేదికలపై నేను చేసిన మిమిక్రీ, నాటకాలను చూసి మా ‘ఘంటసాల సింగర్’ శంకరన్న- ‘రమేష్ నువ్వు చేసే తాగుబోతు యాక్షన్ అచ్చం హిందీ నటుడు కేస్టో ముఖర్జీ చేసినంత సహజంగా ఉంది. నువ్వు సినిమాల్లోకి వెళ్తే ‘కిక్’ అవ్వడం ఖాయం’ అనేవాడు. శంకరన్న అంటే ఘంటసాల పాటలు పాడడంలో ఫేమస్. ఆయన మాటలే నన్నిక్కడి వరకూ నడిపించాయి. లేకపోతే...ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని ఏడవ తరగతి కుర్రాడు ఈరోజు ఇన్ని సినిమాల్లో నటించే అవకాశాన్ని పొందడం చిన్న విషయం కాదు.
 
 నాన్నను చూసి...
 ఇప్పటికీ కనిపించిన ప్రతి ఒక్కరూ ‘మీకు తాగుడు అలవాటు లేదు కదా! మరి అంత సహజంగా ఎలా నటిస్తున్నారు?’ అని అడుగుతారు. ఈ నటనకు మా నాన్నే గురువు. ఆయన బాగా తాగేవాడు. ఆయన స్థానంలో ఉంటే ఎవరైనా ఆ పనే చేస్తారేమో. ఎందుకంటే నాన్న సింగరేణి ఉద్యోగి. ఇప్పుడంతా పెద్దపెద్ద మిషన్లు వచ్చాయి కాబట్టి బొగ్గుబావుల్లో పని కాస్త తేలికైంది. అప్పుడలా కాదు.. 300 మంది తట్టలు పట్టుకుని ఒకేసారి బావిలోకి దిగేవారు. పది కిలోమీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళ్లేవారు. అక్కడి నుంచి తట్టలతో బొగ్గుని మోసుకొచ్చేవారు. చాలా రిస్కీ జాబ్. బొగ్గుబావుల్లో పనిచేసే వారు, బార్డర్‌లో పనిచేసే వారు నా దృష్టిలో ఒకటే. బావిలో దిగేవారు పైకి, బోర్డర్‌లో ఉండేవారు ఇంటికి వచ్చేవరకు డౌటే. బావిలోకి దిగాక నాన్న చేసే పని చాలా కష్టమైంది. ఆ శ్రమను మరిచిపోయేందుకే తాగేవాడు. నాన్న రోజూ తాగొచ్చి ఇంట్లో ప్రవర్తించే తీరుని నేను బాగా గమనించేవాడ్ని. అదే నా నటనకు ట్రైనింగ్ అనుకోండి.
 
 అమ్మను నవ్విస్తూ...
 నాన్న ఇంట్లో లేనపుడు ఆయన తాగినపుడు ప్రవర్తనను ఇమిటేట్ చేసి అమ్మకు, అన్నయ్యలను చూపించేవాడ్ని. అందరూ సూపర్‌గా చేశావంటూ మెచ్చుకునేవారు. అలా సరదాగా చేసిన నటనే ఈ రోజు నాకు నట జీవితాన్నిచ్చింది. మేం నలుగురం అన్నదమ్ములం. ఒక చెల్లి. నేను నాలుగోవాడ్ని. చెల్లి పెళ్లి చేశాక హైదరాబాద్ వచ్చేశాను. వస్తూనే బతకడం కోసం కొన్నాళ్లు సెక్యురిటీగార్డ్‌గా పనిచేశాను. తర్వాత అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందాను. కొన్నాళ్లు స్టిల్ ఫొటోగ్రాఫర్ వెంకీ దగ్గర పనిచేశాను.
 
 మెల్లగా చిన్న చిన్న పరిచయాలతో జగడం సినిమాలో.. ఆపై మహాత్మ చిత్రంలో చాన్స్‌లు దక్కాయి. బాగా గుర్తింపు వచ్చింది మాత్రం ‘అలా మొదలైంది’ సినిమాతో. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాగుబోతు రమేష్ అంటే ఇండస్ట్రీలో, తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారు లేరు. కేవలం ఒక క్యారెక్టర్‌తో ఫేమస్ అయిన నటులు చాలామంది ఉన్నారు కానీ, ఒక్కటే క్యారెక్టర్‌ని నమ్ముకుని బతుకుతున్న యాక్టర్‌ని నేనొక్కడినే!. మొదట్లో నాకు మద్యం అలవాటు లేదంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ నేను ఇంట్లో నాన్నను చూశాక మద్యం జోలికి వెళ్లకూడదనుకున్నాను. అమ్మ కోరికా అదే.
 
 తాగి నడపొద్దు భయ్యా..
 అన్నట్టు- ఈ రోజు ఇయరెండ్ కదా.. రాత్రికి ఫుల్ ఎంజాయ్‌మెంట్.. ఓకే.. ఎంజాయ్ చేయడం తప్పుకాదు. కానీ దానివల్ల మనకు, మనవల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. డ్రింక్ చేసి వాహనాలు అసలు నడపొద్దు. వామ్మో...దొరికితే రెండు నెలలు జైలుశిక్ష. అవసరమా భయ్యా! జైఆలోచించండి. డ్రైవర్‌ని పెట్టుకోండి. లేదంటే...ఇంటి దగ్గరే సెలబ్రేషన్ చేసుకోండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement