ఆటే మంత్రం
నేడు ప్లే టెన్నిస్ డే
పదేళ్లు కూడా నిండని చిన్నారులు రాకెట్ పట్టుకుని బంతులను బలంగా బాదుతుంటారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు మంచు తెరలు వీడక ముందే మైదానాల్లో ఎడతెరిపి లేకుండా సాధన చేస్తుంటారు. ఫోర్ హ్యాండ్... బ్యాక్ హ్యాండ్... వాలీ... ఆఫ్ వాలీ... ఓవర్‌హెడ్... డ్రాప్ షాట్... అక్కడ వినిపించే మాటలివే. కోచ్‌ల శిక్షణలో మెరికల్లా మారే ప్రయత్నం... సిటీలో కనిపించే దృశ్యం. వీళ్లందరికీ స్ఫూర్తి... భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా.
ఈ హైదరాబాదీని ఆదర్శంగా తీసుకుని ఎందరో టెన్నిస్‌ను తమ టార్గెట్ చేసుకున్నారు. పోటీల్లో అదరగొట్టి నగరానికే వన్నె తెస్తున్నారు. నేడు ‘ప్లే టెన్నిస్ డే’. ఈ సందర్భంగా సిటీలోని టెన్నిస్ అకాడమీలు, స్టేడియాల్లో ఏం జరుగుతుందో ఓసారి చూసొద్దాం...
పొద్దున్నే గంట ఆరు కొట్టక ముందే ఎల్బీ స్టేడియంలో అటెండెన్స్. ఓ అరగంట వార్మప్... ఆపై తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్. అలా మూడు గంటల పరిశ్రమ. తరువాత నాన్నతో కలసి ఇంటికి వెళ్లడం. సాయంత్రం... ఆరు గంటలు. జూబ్లీహిల్స్ జీవీకే టెన్నిస్ అకాడమీలో ప్రత్యక్షం. కోచ్‌ల డెరైక్షన్‌లో... మరో మూడు గంటల కఠోర సాధన... సబ్‌జూనియర్, జూనియర్, ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీల్లో ఆడుతున్న యడ్లవల్లి ప్రాంజల రోజువారీ షెడ్యూల్ ఇది.
మాటలు రావు. కానీ... టెన్నిస్ అంటే పిచ్చి. ‘నువ్వేం ఆడతావే’ అన్న బంధువుల ఎత్తిపొడుపు మాటలకు రాకెట్‌తోనే సమాధానం. ఎల్బీ స్టేడియంలో ఉదయం... సాయంత్రం... రోజుకు ఏడు గంటల పాటు అలుపెరుగని కృషి... ఆటపై అమితమైన మక్కువ, కసితో అండర్-12, 14, 16, ఏఐటీఏ టైటిల్స్ సాధించి పెట్టాయి షేక్ జాఫ్రిన్‌కు. రెండేళ్ల కిందట బధిర జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం దక్కించుకుని మరెందరిలోనో స్ఫూర్తి నింపుతోందీ బాలిక. వీరిద్దరే కాదు... ఇలా ఎందరో తమకు తాము లక్ష్యాలను నిర్దేశించుకుని టెన్నిస్‌ను శ్వాసిస్తూ ముందుకు సాగుతున్నారు. వివిధ పోటీల్లో సత్తా చాటుతున్నారు. సిటీని టెన్నిస్‌కు కేరాఫ్‌గా మారుస్తున్నారు.
పెద్దల్లోనూ క్రేజ్...
క్రికెట్ ఇతర క్రీడల్ని డామినేట్ చేస్తున్న సమయంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో టెన్నిస్‌కు క్రేజ్ తెచ్చింది సానియామిర్జా. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సానియాను చూసిన చాలామంది తల్లిదండ్రుల చూపు ఈ క్రీడపై పడింది. ఫలితంగా తమ పిల్లలను దగ్గరుండి మరీ టెన్నిస్ అకాడమీలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నారు. వారు ప్రాక్టీస్ చేసినంత సేపూ స్టేడియంలోనే ఉండి ప్రోత్సహిస్తున్నారు. బాలబాలికలూ అంతే శ్రద్ధగా ఆటపై పట్టు బిగిస్తున్నారు. ఫలితంగా జాతీయ స్థాయి క్రీడాకారులు నగరం నుంచి పుట్టుకొస్తున్నారు. ఆట వల్ల ఆరోగ్యం, శరీర దారుఢ్యం, ఆలోచనా ధోరణిలో మార్పు, ఉద్యోగ అవకాశాలు... ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయని పిల్లలతో పాటు తల్లిదండ్రులు గ్రహించడం వల్లే నగరంలో టెన్నిస్‌కు క్రేజ్ పెరుగుతుందన్నది నిపుణుల మాట.
ప్రోత్సహించాలనే...
టెన్నిస్ అంటే హైదరాబాద్ గుర్తు రావాలన్న ఆలోచనతోనే చాంపియన్ టెన్నిస్ లీగ్‌లో ‘హైదరాబాద్ ఏసెస్’ జట్టును కొన్నాం. సిటీలోనూ మ్యాచ్‌లు జరిగేలా చూశాం. సానియా మిర్జాలా మరెంతో మంది టెన్నిస్ తారలను వెలుగులోకి తీసుకు రావాలనుకుంటున్నాం. మన సిటీలో టెన్నిస్‌కు మంచి ఆదరణ కనబడుతోంది. అదే స్థాయిలో ప్రతిభ కలిగినవారూ ఉన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలన్నదే మా ఉద్దేశం. భవిష్యత్‌లో సిటీ క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయి... అంటున్నారు హైదరాబాద్ ఏసెస్ జట్టు యజమానులు రాజేశ్ దండు, రామరాజు. తాము పారిశ్రామికవేత్తలమైనా... టెన్నిస్‌పై ఉన్న అభిమానమే సీటీఎల్ వైపు నడిపించిందన్నారు.
- వాంకె శ్రీనివాస్