
చంద్రబాబుతో సుబ్రమణ్యస్వామి భేటీ వెనుక కథేంటి?
ఇటీవలే జనతా పార్టీని బీజేపీలో విలీనం చేసిన సుబ్రహ్మణ్య స్వామి నిన్న సాయంత్రం మీడియాకు తెలియకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిశారు. వీరిద్దరూ దాదాపు రెండు గంటలసేపు సమావేశమయ్యారు. బిజెపి యువమోర్చా నగర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును కూడా కలిశారు.
ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో మీడియాకు తెలియకుండా సుబ్రహ్మణ్య స్వామి - చంద్రబాబు నాయుడుల కలయికపై అనేక ఊహాగానాలు వినవస్తున్నాయి. వీరిద్దరూ ఏ అంశాలు చర్చించి ఉంటారన్నదానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. రెండు గంటలసేపు సమావేశమయ్యారంటే రాజకీయాలకు సంబంధించి కీలక అంశాలనే చర్చించి ఉంటారని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య బిజెపితో ఎన్నికల పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఇటీవల ఢిల్లీలో చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని త్యాగరాజ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన యువ సమ్మేళనంలో వీరు పాల్గొన్నారు. వీరిద్దరూ ఎనిమిది గంటల పాటు ఒకే వేదిక పైన కూర్చున్నారు. ఈ సందర్భంగా వీరు ఇద్దరు రెండుసార్లు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్తోపాటు దేశ రాజకీయాలు, 2014లో జరిగే లోకసభ ఎన్నికల ప్రస్తావన వారి మాటలలో వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు జరపడం కూడా ఎన్నికల పొత్తు ప్రయత్నాలలో భాగమేనని భావిస్తున్నారు. దీనికి తోడు గుంటూరు జిల్లో చంద్రబాబు, నరేంద్ర మోడీ పేర్లతో పోస్టర్లు వెలిసినట్లు సమాచారం. చంద్ర-మోడీ యూత్ పేరుతో అక్కడ ప్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచిచూడవలసిందే!