మిథునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. సప్తమంలో శని కేతువుల సంచారం, లగ్నంలో రాహుగ్రహ సంచారం, సప్తమ, అష్టమ స్థానాలలో గురుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితాశయం నెరవేరుతుంది. ప్రజల అభిమానాన్ని చూరగొంటారు. వృత్తి ఉద్యోగాలలో సంయమనం, ఓర్పు చాలా అవసరం. ఆర్థిక స్థాయి పెరుగుతుంది, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొత్త మార్గాలలో ఆర్థిక పురోగతికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. అధికారం వస్తుంది. ప్రత్యర్థుల బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సహోదర సహోదరీవర్గానికి అన్నివిధాలుగా అండగా ఉన్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంటారు. సంతానం మీ అభీష్టం మేరకు నడుచుకోక కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అనుకున్న వాటిని ఏదోరకంగా సాధిస్తారు. మీరు చేసే ఏ పనికీ ఇతరులు ప్రత్యామ్నాయం చెప్పలేని విధంగా ఉంటుంది. అయితే మీ మేధస్సు, ఆలోచనలు, శ్రమ ఎక్కువకాలం దోచుకోబడతాయి లేక వెలుగులోకి రాకపోవడం జరుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కుల, మత వర్గాలకు అతీతంగా మీ ప్రవర్తన ఉంటుంది. స్త్రీల వలన అదృష్టం కలసి వస్తుంది. దాంపత్య జీవితంలో టీకప్పులో తుఫాను వంటి సంఘటనలు ఏర్పడతాయి. చాలామందికి తండ్రివల్ల మేలు జరుగదు. మనస్సులో స్థానం కలిగిన రక్తసంబం«ధీకులొకరు శాశ్వతంగా దూరం కావడం తీవ్ర మనోవేదనకి కారణం అవుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా పిటిషన్లు, ఆకాశరామన్న ఫోన్లు చికాకు కలిగిస్తాయి. ప్రతిసారి మీ నిజాయితీ, సామర్థ్యాలను సాక్ష్యాలతో నిరూపించుకోవాల్సి వస్తుంది. చివరికి మొండి ధైర్యంతో, కోపంతో ఎదురు తిరుగుతారు.
స్త్రీల సహాయ సహకారాలు అందుకుంటారు. సహోదర సహోదరీవర్గంతో సత్సంబంధాలు బలపడతాయి. ఆంతరంగిక కుటుంబ రాజకీయాలు, ఒకరంటే మరొకరికి గిట్టని స్థితి ఇబ్బంది కలిగిస్తుంది. సొంతవాళ్ల వలన మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. జల సంబంధిత, నూనె సంబంధిత, గ్రానైట్స్‌కు సంబంధించిన విషయాలు, లీజులు పొడగింపు వంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వపరంగా స్థాయిని ధ్రువీకరించే విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పన్నుల వసూలు చేసే అధికారులతో వాగ్వివాదాలు, న్యాయస్థానాలను ఆశ్రయించే స్థితి సంభవం. ప్రేమ వివాహాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలలో, ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు, విదేశీ వ్యవహారాలు, సబ్‌కాంట్రాక్టులు, రాజకీయ వ్యూహాలు లాభిస్తాయి. మీరు ఊహించని చోట ఆస్తుల విలువ పెరుగుతుంది. అమ్మకాల ఒప్పందాలు ఖరారు కానందుకు సంతోషిస్తారు. ఆర్థిక వ్యవహారాలపై పట్టుసాధిస్తారు. ఋణాలు తీరుస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన అంశాలు మీ జోక్యం వల్ల పరుగులు పెడతాయి. ధనం నీళ్ళ మాదిరి ఖర్చు అవుతుంది. అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా, వ్యక్తిగత కారణాల వల్ల వాటిని చేజార్చుకుంటారు. వ్యాపారపరంగా భాగస్వాములతో కలిసి ఐకమత్యంగా వ్యాపారం చేస్తారు. మంచి లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలపరంగా కృత్రిమ పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. మీ వల్ల ప్రయోజనం పొందినవారు మీపై కృతజ్ఞతా భావం కలిగి ఉండరు. సొంత మనుషుల ద్వారా ఆశించిన పనులు నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా మరొకరిని ఎదుర్కొనవలసి వస్తుంది. కొన్ని సమస్యలు మానసిక ఆందోళనకు గురిచేస్తాయి. మీ సమస్యలను ఇంట్లోవాళ్ళతో చెప్పరు. బయట స్నేహితులకు చెప్పుకొని ఊరట చెందుతారు. రాజకీయ పదవి లభిస్తుంది.
సంతానం వల్ల సమస్యలు అధికం అవుతాయి. చదువు, ఆరోగ్యం సమస్యలుగా మారుతాయి. ప్రేమ, పెళ్ళి వంటి వ్యవహారాలు చికాకుపరుస్తాయి. అవివాహితులకు వివాహకాలం. సంతానంలేని వారికి సంతానప్రాప్తి. రావలసిన పెండింగ్ బిల్స్ దారికి వస్తాయి. రాజకీయ మార్పులను అనుకూలంగా మలచుకోగులుగుతారు. మీ ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా కొన్ని బలహీనతలు మీకు దొరుకుతాయి. వాటిని ఉపయోగించుకోగులుగుతారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి, ప్రింటింగ్, స్టేషనరీ, అలంకార వస్తు సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వాములతో విభేదాలు ఏర్పడతాయి. కీలక సమయంలో ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి. జీవిత భాగస్వామితోను, ఆత్మీయులతోను కొద్దికాలం చికాకులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ఈఎన్‌టీ సమస్యల వల్ల ఇబ్బందిపడే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న స్త్రీల వల్ల మేలు కలుగుతుంది. దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. స్వల్పకాల పరిచితులే అపరిమిత సహాయం చేస్తారు. బాల్యమిత్రులు, చిరకాల పరిచితుల నిర్ణయాలు, సలహాలు అమలు చేసేముందు నిపుణుల సలహాలను తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్, స్విమ్మింగ్‌లలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు డాక్యుమెంట్స్‌పై చేసిన సంతకాలు వివాదస్పదం అవుతాయి. నూతన విద్యాకోర్సులను అభ్యసించాలనే కోరిక బలపడుతుంది. మీ శక్తిసామర్థ్యాలకు, నిపుణతకు అవార్డులు లభిస్తాయి. నీతినిజాయతీలతో విధి నిర్వహణ చేస్తున్న మీకు కొంతమంది అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రిటైర్ అయినవారికి వేరే చోట మంచి ఉద్యోగం లభిస్తుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. సంవత్సర ప్రారంభంలో ప్రారంభించిన వ్యాపారం బాగా విస్తరిస్తుంది. రొటేషన్లు, లాభాలు బాగుుంటాయి. అధికారులకు శక్తికి మించిన లంచాలు ఇవ్వవలసిన పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. సినీ, బుల్లితెర, కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు మధ్యస్తంగా ఉన్నాయి. ఆత్మీయవర్గం అవసరాలకు మాత్రం ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ధనం సర్దుబాటు చేస్తారు.
స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. విశేషించి సాంకేతికవిద్యలో రాణిస్తారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. సంతాన పురోగతి ఆనందానికి కారణం అవుతుంది. పిల్లల్ని దారిలోకి తెచ్చుకోవడానికి శ్రమించవలసి వస్తుంది. పిల్లల విషయమై జీవితభాగస్వామితో విభేదాలు వస్తాయి. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి, డిజైనింగ్ చేసేవారికి, ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవారికి అనుకూలంగా ఉంది. సీజనల్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసివస్తుంది. మీకు రావలసిన స్థిరచరాస్తులు కోర్టుద్వారా వస్తాయి. బంధువులతో వైరం ఏర్పడుతుంది. బానిసత్వపు సంప్రదాయాలను ప్రక్కనపెట్టి స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. వివాహం కానివారికి వివాహప్రాప్తి, సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. సాంకేతిక, కళారంగాలలో రాణిస్తారు. విదేశాలలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక, మనోహరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారి ఋణం తగినవిధంగా తీర్చుకుంటారు. విడిపోవాలనుకునే వ్యక్తులతో శాశ్వతంగా విడిపోతారు. చేయవలసిన మేలు చేసినా, నోటి దురుసుతనం వల్ల స్నేహితుల అభిమానాన్ని, రావలసిన ప్రయోజనాలని పోగొట్టుకుంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. బ్యూటీపార్లర్స్ నిర్వహణలో లాభాలు బాగుంటాయి. ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగం లభిస్తుంది. యాంకరింగ్ రంగంలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. సమాజంలో పరపతి కలిగినవారితో స్నేహం బలపడుతుంది. కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులు మీ శ్రమను, సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఎలర్జీ ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు సంబంధమైన సమస్యలు, మోకాళ్ళ నొప్పులు బాధించవచ్చు. కోరుకున్న రాజకీయపదవి లభిస్తుంది. స్వయంకృతాపరాధాల వలన నష్టపోయే అవకాశం ఉంది. పెద్దలతో విభేదాలు ఏర్పడతాయి. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి నిపుణులను సంప్రదిస్తారు. ప్రేమవివాహాలు ప్రధాన ప్రస్తావనాంశాలు అవుతాయి. రెండు నెలలు మానసిక అశాంతి ఏర్పడుతుంది. మీ మీద నిందారోపణలు నిజం కాదని నిరూపించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. దూరప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులు, పిల్లలు పంపిన ధనాన్ని అనుకూలమైన రంగాలలో పెట్టుబడిగా పెడతారు. అన్నీ ఉన్నా అనుభవించలేక పోతున్నామనే భావన మిమ్మల్ని కలవరపరుస్తుంది.
వికారినామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు
Published Sun, Mar 31 2019 12:08 AM | Last Updated on Tue, Apr 2 2019 6:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment