కన్యారాశివారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంది. చతుర్థంలో శని కేతువుల సంచారం, చతుర్థ పంచమంలో గురుగ్రహ సంచారం, దశమంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవిత ప్రారంభంలో ఎదురైన ఘట్టాలకు కృంగిపోకుండా ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. ఇతరుల కుయుక్తులు వీరిపై ప్రభావం చూపవు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో అందెవేసిన చేయి. మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనూ రాజీలేకుండా శ్రమించే మనస్తత్వం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యారంగంలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలిగి ఉంటారు. నూనె, అపరాలు, విత్తనాలు, యంత్ర, వాహన సంబంధమైన వ్యాపారాలలో రాణిస్తారు. జీవితంలో ప్రధానంగా నిందారోపణలు బాధకలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను ప్రక్కనపెట్టి మీ విషయం వచ్చేటప్పటికి అందరూ ఏకం అవుతారు. స్వంతవర్గం బెదిరిపోకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నాలు చేయరు. అత్యున్నతస్థానంలోని వారితో పోరాటం చాలా సందర్భాలలో తప్పకపోవచ్చు.
మేధస్సు, స్వీయవిద్య, సాంకేతికపరిజ్ఞానం అక్కరకు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. స్థిరాస్తులు సంపాదించుకుంటారు. ప్రజాసంబంధమైన విషయాలు, పలుకుబడి అభివృద్ధి చెందుతాయి. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సంతాన పురోగతి ఆశించినంత సంతృప్తి కలిగించదు. అనేక రకాల ఆలోచనలను, మీ అంతర్గత భావాలను, కోపాన్ని అదుపు చేసుకుని మనసులో ఒకవిధంగా, పైకి ఒకవిధంగా ఉంటారు. మనసు విప్పి మాట్లాడటం వల్ల ఇబ్బందులు ఎలా ఎదురవుతాయో మీకు అనుభవం అవుతుంది. ఐకమత్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఇందుకుగాను మీరు చాలా ఓర్పు వహించాల్సి ఉంటుంది. మీ ఎదుగుదలను మీ ఆత్మీయవర్గం కూడా సహించలేరు. మీరు దూరంగా ఉండాలనుకున్న వ్యక్తులతో, మీ కుటుంబ సభ్యులు సన్నిహితంగా మెలగడం మీ మనోవేదనకు కారణం అవుతుంది. దీర్ఘకాలిక కాంట్రాక్టుల పట్ల విముఖత ఏర్పడుతుంది. వివాదస్పద వ్యవహారాలు విసుగు పుట్టిస్తాయి. రాజకీయపరమైన అవకాశాల కోసం వ్యూహం సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్ళతో అభిప్రాయ భేదాలు వచ్చి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తిచేయలేరు. చాలా సందర్భాలలో ఆంతరంగికమైన భేదాభిప్రాయాలు వస్తాయి. కీళ్ళు, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు సంభవం. కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలోని వారికి సాధారణ ఫలితాలు వస్తాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇష్టం లేకపోయినా కొందరు భాగస్వాములతో కలసి వ్యాపారం చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఒత్తిడుల నుండి బయటపడతారు. అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. మీ సహాయ సహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మెడిసిన్ సీటు వస్తుంది. సంవత్సరం ప్రథమార్ధంలో ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్నవారు సహాయం చేస్తారు. ఇంకొకరికి సహాయం చేసే విధంగా మీ స్థాయి పెరుగుుతుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యావంతులు, మేధావులు అరుదైన వ్యక్తిత్వం కలిగిన వారు కాకతాళీయంగా మీకు సన్నిహితులవుతారు. జీవితాన్ని ఇప్పుడు చూస్తున్న కోణంలో కాకుండా మరో కోణంలో చూస్తారు. జనులను ఒప్పించి, మెప్పించి మీరు అనుకున్న స్కీములలో చేర్చగలుగుతారు. లైసెన్సులు, లీజులు పునరుద్ధిరింపబడతాయి.
మీ శ్రేయస్సు కోరేవారు ఎందరో ఉన్నారని గ్రహించి సంతృప్తి చెందుతారు. రాజకీయ పదవి లభిస్తుంది. చాలా విషయాలలో మీ అనుమానాలు కేవలం అనుమానాలు మాత్రమే వాస్తవంలో మీకు జరిగే కీడు ఏమీ ఉండదు. విదేశాలలో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సీడీలు, అధికార ధ్రువీకరణ పత్రాలు, ఋణాలు మీకు అనుకూలిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సంతానం లేనివారికి సంతానప్రాప్తి, వివాహం కాని వారికి వివాహప్రాప్తి, పునర్వివాహా ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన కాలం. నూనె, లోహ వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు అనుకూలమైన కాలం. ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తి అని ముద్రవేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరు అందరి మనిషిలా ఆమోదింపబడతారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టుతీర్పులు మీకు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల బాధ్యతలు మీ సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణా లోపం ఉండదు. ఆస్తి వ్యవహారాలపై మీకు తెలియకుండా రహస్య చర్చలు జరుగుతాయి. నమ్మకద్రోహం గురించి సమాచారం తెలిసిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తనఖాలో ఉంచిన డాక్యుమెంట్స్‌ను, విలువైన వస్తువులను విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి వైద్యుల సలహాను అమలుపరచడం మంచిది. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా మీకు రావలసిన బిల్స్, జీతాలు, ఏరియర్స్ సమయానికి చేతికి అందుతాయి. మీరు చేస్తున్న వ్యక్తిగత కార్యక్రమాలకు ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి.క్రీడారంగంలోని వారికి ప్రఖ్యాతి లభిస్తుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను బయటకి వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్త వహించండి. ఋణాలు ఇవ్వడం, తీసుకోవడం తగ్గించండి. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. రెండువర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు మీకు లాభిస్తాయి. మీకు సంబంధంలేని విషయాలలో ఇతరులకు సహాయం చేయడం కోసం కోర్టులను, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించవలసి వస్తుంది. ఇరుగు పొరుగులతో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వచ్చిన కొత్త అవకాశాన్ని ఉపయోగించుకోవాలా లేదా అన్న సందేహంలో పడతారు. జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. శక్తిసామర్థ్యాలు ఉన్నా సరైన గుర్తింపు రాలేదన్న భావన మనోవేదనకి గురిచేస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు ఉపయోగపడతాయి. విశ్రాంతిని, సౌకర్యాలను పక్కనపెట్టి విశేషంగా కృషి చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక స్థావరాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ముద్రణ, ప్రచురణ వ్యాపారాలు లాభిస్తాయి. విడిపోయిన రెండు కుటుంబాలను కలుపుతారు. బంధువులతో, దాయాదులతో వివాదాలు సంభవిస్తాయి. మీరు చెప్పిన వాస్తవాలను ఎవరూ నమ్మరు. ఇతరులు మీపై మోపిన ఆరోపణలు, నిందలు బహుళ ప్రచారంలో ఉంటాయి. తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాల మీద దృష్టి సారించి లాభాలు గడిస్తారు. మొండి బాకీలు రాబట్టుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. భూమి కొనుగోలు, అమ్మకాల వల్ల లబ్ధి పొందుతారు. ఆదాయపన్నుల అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వైద్య, న్యాయవాద వృత్తులలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. నిర్మాణ సంబంధమైన పనులలో లోపాలు ఏర్పడతాయి. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. విదేశాలలో ఉన్నవారు గృహాన్ని కొనుగోలు చేస్తారు. విదేశాలలో చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీ బంధువర్గంలోని ఒకరితో బంధుత్వం కలుపుకోవడానికి మీరుచేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఓర్పు, సహనం లేని వ్యక్తుల వల్ల, దురుసుగా ప్రవర్తించే మీ అంతరంగిక వర్గం వల్ల చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి. మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించరు. గతంలో వలె మెతకవైఖరి అవలంబించరు. విభేదాలను మనసులో దాచుకుని మీ ఇబ్బందులకు కారణమైన వ్యక్తులకు సరైన గుణపాఠం నేర్పుతారు. చట్టబద్ధంగా అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందుతారు. స్త్రీల సహాయ సహకారాలు లాభిస్తాయి. ఉద్యోగం కోసం రాసే పరీక్షలలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సాఫ్ట్‌వేర్ రంగుంలోని వారికి ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. కార్యాలయంలో మీపై నిష్కారణంగా దుష్ప్రచారం చేసేవారికి బదిలీ ఏర్పడుతుంది.
స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరాధారమైన మాటలు విని వాటి ఆధారంగా మిమ్మల్ని అభిమానించే సన్నిహితులను ఎట్టి పరిస్థితులలోనూ దూరం చేసుకోకండి. విద్య, సాంస్కృతిక విషయాలు బాగుంటాయి. కళారంగంలో గుర్తింపు లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తిని కొన్ని కారణాల వల్ల ఆహ్వానించ లేరు. ప్రేమవివాహాలు విఫలం అవుతాయి. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులకు వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లమ్స్‌ను అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం ఆందోళనకు కారణం అవుతుంది. మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు అధికం అవుతారు. కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. సహోదర సహోదరీ వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలు ప్రారంభంలో విసుగు కలిగించినా మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయం అవుతాయి. వివాహ సంబంధమైన విషయాలలో సర్దుకుపోయే ధోరణి అవలంబిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి, సాహిత్య, కళా రంగాలలో, విద్యారంగంలో ప్రఖ్యాతి సంభవం. బ్యూటీపార్లర్స్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది. చీటీల వల్ల, ఫైనాన్స్ బిజినెస్ వల్ల నష్టపోతారు. మీకు ఇబ్బంది కలిగించేవారి కార్యకలాపాలు ఎక్కువ కాలం కొనసాగవు. చాలా విషయాలలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. మీరు నమ్మిన వాళ్ళు మీ మాట వినరు. మీ పట్టుదల వల్ల అయినవాళ్ళతో బంధుత్వం ఏర్పడుతుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు అధికం కావడం చికాకు తెప్పిస్తుంది. బంధువులలో డాంబికంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మీ అంతరంగిక విషయాలను బంధువులతో పంచుకోరు. చిన్నదానికీ, పెద్దదానికీ అబద్ధాలు చెప్పడం అనివార్యం అవుతుంది. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీకు మాత్రం లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. రాజకీయంలో తలదూర్చవలసిన పరిస్థితులు వస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. ఋణ బాధల నుండి విముక్తి పొందుతారు. ఎంత చెప్పినా మారని వ్యక్తులను మార్చడానికి పట్టువీడని విక్రమార్కుడిలా శ్రమిస్తారు. చిన్నచిన్న వ్యాపారాలు, చేతివృత్తి పనులు లాభిస్తాయి. ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది.
వికారినామ సంవత్సర (కన్యా రాశి) రాశిఫలాలు
Published Sun, Mar 31 2019 12:19 AM | Last Updated on Tue, Apr 2 2019 6:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment