సెరెంగేటి... కనులారా గాంచే ఓ మహాద్భుతం!! | A great movement while on travel of Balloon Safaries | Sakshi
Sakshi News home page

సెరెంగేటి... కనులారా గాంచే ఓ మహాద్భుతం!!

Published Sun, Oct 27 2013 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

సెరెంగేటి... కనులారా గాంచే ఓ మహాద్భుతం!!

సెరెంగేటి... కనులారా గాంచే ఓ మహాద్భుతం!!

జంతు ఆవాసాలైన నేషనల్ పార్కుల్లో సఫారీలు సాధారణమే. కానీ, అన్ని లక్షల జంతువులు వలస పోవడాన్ని ఒక వాహనంలో పోతూ చూడటం వల్ల పొందాల్సినంత అనుభూతిని పొందలేకపోవచ్చు. అందుకే కేవలం సెరెంగేటిలో ఒక వినూత్న అవకాశం ఉంది. అవే బెలూన్ సఫారీలు. ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉండే ఈ బెలూన్ సఫారీలు వల్ల ఈ భారీ వలసలను విహంగ వీక్షణంలో చూడొచ్చు. దీనివల్ల ఎన్నటికీ మరిచిపోలేని అనుభూతి సొంతం అవుతుంది. 1989 నుంచే సెరెంగేటిలో బెలూన్ సఫారీలు ఉన్నాయి. వీటిని ఏర్పాటుచేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. వాహన సఫారీల్లో వెళితే ఏనుగులు వంటి భారీ జంతువులతో ప్రమాదం రావచ్చు. ఈ బెలూన్ సఫారీల్లో ఆ ఇబ్బందేమీ ఉండదు. మనం ఎత్తున కొన్ని మీటర్ల పైన విహరిస్తూ ఎటువంటి బెరుకు జంకు లేకుండా ‘ది గ్రేట్ మైగ్రేషన్’ను ఆస్వాదించవచ్చు.
 
 ఈ బెలూన్ సఫారీ ధర ఐదువందల డాలర్లు ఉండటం ఆర్థిక భారంగా పర్యాటకులు భావిస్తున్నా... సఫారీ అయ్యాక మాత్రం ఆ ఖర్చు గురించి మర్చిపోతారు. ఎందుకంటే ఆ అనుభూతి ఎంత వర్ణించినా ఊహకందనిది.
 
 ఎలా వెళ్లాలి?
 సెరెంగేటి ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ కిలిమంజారో(రోబో పాట గుర్తుంది కదా). ఇది ఆరుషా నగరానికి దగ్గర్లో ఉంటుంది. ఆరుషాకు ఆమ్‌స్టర్‌డామ్ నుంచి మాత్రమే డెరైక్ట్ ఫ్లైట్ ఉంది. కెన్యా రాజధాని నైరోబికి ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి విమానాలున్నాయి. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా ఆరుషాకు చేరుకోవచ్చు. ఆరుషా నుంచి సెరెంగేటికి దాదాపు 350 కిలోమీటర్లు. ఇక్కడికి ఫ్లైటే కాదు.. కారులోనూ చేరుకోవచ్చు. పర్వతాలు, సరస్సుల్ని దాటుకుంటూ సాగే కారు ప్రయాణం చక్కటి అనుభూతినిస్తుంది. సెరెంగేటిలో సాధారణ స్థాయి నుంచి లగ్జరీ హోటళ్లు వరకు అన్ని రకాలవి ఉన్నాయి. పది రోజుల నుంచి నెల రోజుల వరకు రకరకాల టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
 
  గైడ్‌ను వెంటబెట్టుకుని కారులో పార్కు అంతటా షికారు చేయవచ్చు. పది రోజులు తిరిగినా మొత్తం పార్కును చూడటం కష్టమే. రాత్రి పూట పార్కు లోపలే టెంట్లు వేసుకుని బస చేసే వీలుంది. కొన్ని హోటళ్లు స్వయంగా లగ్జరీ టెంట్ క్యాంపులు నిర్వహిస్తాయి. ఐతే విహారయాత్రలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదం. గైడ్ లేకుండా వెళ్లడం మంచిది కాదు. సెరెంగేటి జాతీయ పార్కుతో పాటు లగార్జా, మసాక్ సరస్సులు, మోరు కోప్జెస్, లోబో ప్రాంతాలు విహారానికి చక్కటి వేదికలు. సెరెంగేటి ప్రాంతంలో రుచి చూడాల్సిన ఆహార పదార్థాలు కూడా చాలానే ఉన్నాయి.
 
 ముకేశ్ అంబానీ.. భారత దేశంలోనే అత్యంత ధనవంతుడు. ఆయన విహార యాత్రకు వెళ్లాలంటే ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలున్నాయి. కానీ ఏటా ఆయన కుటుంబంతో కలిసి వెళ్లేది ఆఫ్రికా అడవులకు! అంతటి విశేషమేముంది ఆ అడవుల్లో అంటారా..? చెప్పుకోవడానికి, చూడటానికి చాలా విశేషాలే ఉన్నాయక్కడ! కొన్ని లక్షల వన్య ప్రాణులు ఒక్కసారిగా కలిసికట్టుగా వలస వెళ్లే దృశ్యం ప్రపంచంలో ఎక్కడైనా చూడగలమా? టీవీల్లో మాత్రమే కనిపించే.. మృగాల వేటను లైవ్‌లో ఇంకెక్కడైనా కాంచగలమా? వందల సంఖ్యలో సింహాల్ని, అన్ని రకాల జంతువులను ఒకేసారి చూడటం ఇంకెక్కడైనా సాధ్యమా? అందుకే ఆఫ్రికా అడవులకు అంతటి ప్రత్యేకత!  ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికాలోని సెరెంగేటి ప్రాంతానికి వెళ్లామంటే జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతుల్ని మన వెంట తీసుకురావచ్చు.
 
 ముకేశ్ అంబానీ వెళ్తున్నాడు కాబట్టి.. ఆఫ్రికా అడవులకు వెళ్లడానికి మనకూ కోట్లుండక్కర్లేదు. అంతర్జాతీయ పర్యటనకు వెళ్లేంత ఆర్థిక స్థోమత ఉంటే చాలు. అయితే ఆఫ్రికా అడవుల ప్రత్యేకత గురించి ఇప్పుడు కొత్తగా మనం చెప్పుకునేదేంటి అనిపించొచ్చు! కానీ ఉత్తర ఆఫ్రికా రాష్ట్రంలోని టాంజానియా దేశంలో.. సెరెంగేటి ప్రాంతంలో మాత్రం ప్రపంచానికి తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. మసాయ్ తెగకు చెందినవారు  నివసించే ఈ ప్రాంతంలో మనుషుల కంటే జంతువుల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. దట్టమైన ఇక్కడి అడవుల్లోనే కాదు.. విశాలమైన మైదానాల్లోనూ  లక్షలకొద్దీ వన్యప్రాణులు జీవిస్తుంటాయి.
 
 వలస దృశ్యం మహాద్భుతం
 ఇక్కడి సెరెంగేటి జాతీయ పార్కు లోకి అడుగు పెట్టామంటే మళ్లీ బయటికి రావాలంటే మనసొప్పదు. ప్రపంచంలో ఎక్కడా చూడని ఓ వింత ఇక్కడ దర్శనమిస్తుంది. అదే వన్యప్రాణుల వలస. వలసంటే పదో ఇరవయ్యో జంతువులు రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తాయనుకునేరు. దాదాపు 12 లక్షలకు పైగా జంతువులు గుంపులు కట్టి ఒక్కసారిగా ప్రయాణం మొదలుపెడతాయి. ఇందులో అడవి దున్నలను పోలి ఉండే జంతువులే దాదాపు పది లక్షలుంటాయి. ఇంకా జీబ్రాలు, జింకలు, పులులు, సింహాలు, ఏనుగులు... అబ్బబ్బబ్బ... ఒకటేమి అన్ని రకాల జంతువులు ఏదో బహిరంగ సభకు వెళ్తున్న జనాల్లాగా అలా కదిలిపోతుంటాయి. దాదాపు 800 కిలోమీటర్ల దూరం సాగుతుంది వీటి ప్రయాణం.
 
  ఒక అద్భుతం ఏంటంటే... ఈ ప్రయాణం మధ్యలోనే దాదాపు 3 లక్షల చిన్న జంతువులు పుడతాయి. దారి మధ్యలో దాహం వల్ల, ఆహారం దొరక్క, మృగాల వేటకు బలై ప్రాణాలు విడిచే జంతువుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుంది. ఐతే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వీటి ప్రయాణం ఆగదు. ఇంతకీ ఇవి ఇలా వలస ఎందుకు వెళ్తాయన్న సందేహం వస్తోంది కదా! టాంజానియా ఉత్తర పర్వతాల్లో అక్టోబరు, నవంబరు నెలల్లో కరవు వస్తుంది. జంతువులకు ఆహారం దొరకదు. దీంతో అవి దక్షిణ ప్రాంతానికి వలస వెళ్తాయి. ఏప్రిల్, జూన్ నెలల్లో మళ్లీ ఇక్కడ భారీ వర్షాలు కురిసి పచ్చదనం అలుముకుంటుంది. ఆ సమయానికి మళ్లీ దక్షిణ ప్రాంతం నుంచి తిరిగి ప్రయాణం సాగిస్తాయి. ఇది కొన్ని శతాబ్దాలుగా సాగుతోన్న ఎడతెగని ఓ మహాఘట్టం. జీవితంలో చూసి తీరాల్సిన పర్యాటక కనువిందు.
 
 వీక్షణం ఎలా?
 జంతువులు ఉత్తర దిశ నుంచి సెరెంగేటి జాతీయ పార్కు మీదుగానే ప్రయాణం సాగిస్తాయి. అక్టోబరు, నవంబరు నెల్లో ఆ పార్కుకు వచ్చామంటే ఒక్కసారిగా లక్షలాది జంతువుల ప్రయాణాన్ని చూసి అద్భుతమైన అనుభూతుల్ని మూటగట్టుకోవచ్చు. అంతే కాదు.. ఈ జంతువుల్ని అందులోనే భాగమైన క్రూర మృగాలు వేటాడటం కూడా లైవ్‌లో చూడక తప్పదు. ఇక సెరెంగేటి పార్కులో చూడాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా క్రూర మృగాలున్నది ఈ ప్రాంతంలోనే. ఇక్కడ దాదాపు 2500 దాకా సింహాలున్నాయి. మరెన్నో క్రూర, సాధు జంతువుల్ని చూడొచ్చు.
 
 పక్షులు కూడా...
 సెరెంగేటిలోని మరో విశేషం పక్షుల విహారం. సూర్యోదయం, అస్తమయం సమయాల్లో ఇక్కడ 500కు పైగా రకాల పక్షుల కిలకిలారావాల్ని ఆస్వాదించవచ్చు. ఐరోపా, ఆసియా ప్రాంతాల నుంచి ఇక్కడికి పక్షులు వస్తాయి. అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ వలస పక్షుల సందడి ఉంటుంది.
 
 వాతావరణం...
 సెరెంగేటి ప్రాంతంలో సాధారణంగా 27-28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. జంతువుల వలస సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతలేమీ ఉండవు. ఆ సమయంలో చిరు జల్లులు కురుస్తుంటాయి. ఈ సమయమే విహారానికి సరైంది. మార్చి-మే నెలల మధ్య భారీ వర్షాలు కురుస్తాయి. గొరాంగోరా ప్రాంతంలో రాత్రి పూట విడిది చేస్తే బావుంటుంది. ఎత్తుగా ఉండే ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement