నువ్వు బినామీ అయితే... నేను సునామీ!
‘నమస్తే పెద్దిరెడ్డిగారూ...’
ఆహా... పెద్దిరెడ్డి అంటే ఈ భూమారెడ్డికి ఎంత మర్యాదా... ఎంత మర్యాద!
అంతేనా? అదిగో... ఈ భూమారెడ్డి వెళ్లి ఆ పెద్దిరెడ్డి కాళ్ల దగ్గర కూర్చొని ఏమంటున్నాడో చూడండి...
‘నిన్న కురిసిన వానకు నేడు మొలకెత్తిన మొలకలం.
మేము ఎంత గొప్పవాళ్లమైనా... నీ ముందు ఇంతే కదయ్యా’
వినయం సంగతి అటుంచండి... క్లారిటీ సంగతి చూడండి...
హీరో భుజం మీద చెయ్యి వేస్తాడు భూమారెడ్డి... హీరో ఊరుకుంటాడా ఏమిటి?
‘చేయి తీయ్’ అంటాడు. ‘తీయకపోతే?’ అని అడుగుతాడు భూమారెడ్డి. ‘తీస్తాను’ అంటాడు హీరో.
‘ఏ చెయ్యి తీస్తావు? కుడి చెయ్యా? ఎడమ చెయ్యా’ అని క్లారిటీగా అడుగుతాడు భూమారెడ్డి. అలా అని అతని ప్రతి మాటలోనూ క్లారిటీ ఉంటుందని కాదు...
‘లవ్వు సెయ్యెద్దాన్నానుగానీ... పెళ్లి చేసుకోవద్దన్నానా?
పెళ్లి చేసుకోవాలిగానీ... లవ్వొద్దు’ అని క్లారిటీ లేకుండా కూడా మాట్లాడగలడు.
ఆశుతోష్ రాణా విలనిజానికి ఎన్ని షేడ్స్ ఉన్నాయో ‘బంగారం’ సినిమాలో భూమారెడ్డి పాత్ర చెప్పకనే చెబుతుంది.
‘స్టార్’ కావాలని ఎవరికి మాత్రం ఉండదు.
మరి అశుతోష్ అలా అంటాడేమిటి?
ఇంతకీ ఏమిటంటాడు?
‘స్టార్’గా కంటే ‘యాక్టర్’గా ఉండడమే ఎక్కువ ఇష్టం అంటున్నాడు.
ఒక్కసారి ‘స్టార్’ అయిన తరువాత ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయాల్సివస్తుంది... అంటాడు ఆశుతోష్. అందుకేనేమో... ‘భిన్నమైన పాత్రలు’ పోషించే నటుడిగా ఆయనకు ప్రేక్షకుల్లో మంచి పేరొచ్చింది.
‘‘చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తున్నానా? అనే సందేహం వచ్చినప్పుడు... ఎవరో వచ్చి... కొద్దిగా రూట్ మార్చమని సలహా ఇవ్వడం కాదు... మనకు మనమే మార్చుకోవాలి.’’ అంటున్నాడు ఆశుతోష్. ఆయన మాటలు కాస్త జాగ్రత్తగా వింటే హీరో, విలన్ అనే కాన్సెప్ట్‌కు కాలం చెల్లిందా? అనే సందేహం కూడా కలుగుతుంది. ‘నటన ముఖ్యం’ అనే సత్యం మది తెర మీద తళుక్కున మెరుస్తుంది.
ఆశుతోష్ రాణా రామ్‌నారాయణ్ నిఖ్రా మధ్యప్రదేశ్‌లోని గడర్వార నగరంలో జన్మించాడు. ప్రాథమిక విద్య అక్కడే పూర్తయింది. ‘రామ్‌లీల’లో రావణుడిగా ఎక్కువగా నటించేవాడు. విలన్ పాత్రలో ఉండే మజా ఏమిటో అప్పుడే తెలిసిందేమో!
తన ఆధ్యాత్మిక గురువు ప్రభాకర్ శాస్త్రి్త్ర సలహా ప్రకారం ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చేరాడు.
మహేష్‌భట్ డెరైక్ట్ చేసిన 500 ఎపిసోడ్‌ల టీవి సీరియల్ ‘స్వాభిమాన్’లో ‘రోనీ’ పాత్రతో ప్రేక్షకులను పలకరించాడు ఆశుతోష్. ‘రెండవ ఛాన్సు’ కోసం ఎదురుచూడకుండానే అవకాశాలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ సినిమా ‘దుష్మన్’లో ‘కోల్డ్ బ్లడెడ్ మర్డరర్’ ‘సైకోపాత్ కిల్లర్’గా తన విలనిజాన్ని వీరలెవెల్లో ప్రదర్శించాడు ఆశుతోష్.
కెరీర్ ప్రారంభంలోనే తన నటనతో ‘పాత్ర’కు బలాన్ని ఇచ్చాడు.
‘లక్’ అనేదానికి రాణా ఇచ్చిన నిర్వచనం ఇది...
‘కష్టానికి, అవకాశం తోడైతే... అదే లక్’
అందుకే ‘లక్’ ఉంటే పాత్ర క్లిక్ అవుతుంది. ‘లక్’ ఉంటే అవకాశాలు వస్తాయి. ‘లక్’ ఉంటే కెరీర్ ఊపందుకుంటుంది... ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు ఆశుతోష్ రాణా.
అందుకే ‘సాధన’కు ఎప్పుడూ దూరం కాలేదు. దాని ప్రభావం వృథా పోలేదు.
‘ఆశుతోష్ రాణా అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలడు’ అనిపించుకున్నాడు.
‘ఇది నటన’ ‘ఇది మాత్రమే నటన’ అని కొలవడానికి సాధనాలేమీ లేవు అంటున్న రాణా... ప్రతి నటుడిలోని తనదైన వైవిధ్యం ఉంది అంటాడు. ఆ వైవిధ్యం చూపించడమే ‘ప్రతిభ’ అంటాడు.
‘నటనలో దమ్ముంటే... విలన్‌లోనూ హీరోను చూపించవచ్చు’ అని నమ్ముతాడు రాణా.
బాలీవుడ్‌లో ఎన్ని రకాల పాత్రలు చేసినా...
దక్షిణాది చిత్రాల్లో మాత్రం...
ఆశుతోష్= విలన్!
‘వెంకీ’ ‘బంగారం’ ‘ఒక్క మగాడు’ ‘విక్టరీ’ ‘బలుపు’ ‘తడాఖా’ ‘పటాస్’ ‘చుట్టాలబ్బాయి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే మన ‘ఉత్తమ విలన్’ అయ్యాడు.
పోటీలోనే కాదు.
జీవితంలోను గెలవనోడు బతకకూడదు.
(బంగారం సినిమాలో డైలాగ్)