
వర్ణం: మళ్లీ కావాలి అమ్మ ఒడి!
తల్లిని ప్రేమగా హత్తుకున్న ఈ పిల్ల గొరిల్లాను చూస్తుంటే, జీవుల ఉద్వేగాలన్నీ మనుషులకు మల్లేనే ఉంటాయని అనిపించట్లేదూ!
తల్లి ఒడిలో లభించే భద్రత, తల్లి సామీప్యంలో లభించే నిశ్చింత ఏ పిల్లలకైనా అనుభవమే. అలాంటి అమ్మ ఒడి సౌఖ్యపు క్షణాల్ని పెద్దయ్యేకొద్దీ వదులుకోకా తప్పదు; జీవిత పోరాటంలో తల్లిగానో తండ్రిగానో రూపాంతరం చెందాల్సిన ప్రకృతి ధర్మాన్ని పాటించకా తప్పదు. అయినా అవకాశం వస్తే అందరూ శిశువులుగా మారిపోయే వరం కోరుకుంటారేమో! ఈరోజు మాతృ దినోత్సవం! అమ్మ పంచిన ప్రేమను నెమరువేసుకునే రోజు. బదులుగా అమ్మపట్ల సంతానానికి గల బాధ్యతను గుర్తుచేసుకునే రోజు.
ఈ సందర్భంగా ఏర్చికూర్చిన కొన్ని ఫొటోలివి. గొరిల్లా తల్లీపిల్లలు జర్మనీలోని లైప్‌జిగ్ జంతుప్రదర్శనశాలలోవి. తల్లి పేరు కమిలి. పాపకు ఇంకా నామకరణం జరగాలి. పుట్టి మూడ్రోజులే అయింది. ఇక, మూడు నెలల ఫ్రాంకోయిస్ లంగూర్, వాళ్లమ్మ ఈనా నివాసం ఇంగ్లండ్‌లోని హౌలట్స్ వైల్డ్ యానిమల్ పార్కు. ఇందులో విశేషం ఏమిటంటే, ఈ పార్కులో జన్మించిన తొట్టతొలి ఫ్రాంకోయిస్ లంగూర్ పిల్ల ఇదే. ఇంకో విశేషం, ఈ జాతి చాలా అరుదైనది. ఇంకా ఆడుకుంటున్న ఎలుగుబంట్లేమో డిస్నీ వాళ్లు తీస్తున్న ‘బేర్స్’ సినిమాలోవి. అమ్మ పేరు స్కై. పిల్ల పేరు స్కౌట్. కంగారూ తల్లీపిల్లలు చెక్ రిపబ్లిక్‌లోని జ్లీన్ ప్రాంతంలోని జూలోవి. బేబీ వయసు మూడు నెలలు. జిరాఫీలు కూడా జర్మనీలోవే! కాకపోతే టియర్‌పార్క్
హగెన్‌బెక్ జూలోవి. నాల్రోజుల క్రితమే బుజ్జి జిరాఫీని తల్లి ప్రసవించింది.