అబద్ధం... నిజమైంది!
అనుభవం
నేనొక నటుడ్ని. ప్రకాశం జిల్లా రావులపాలెంలో నాటక ప్రదర్శన ముగించుకొని, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి వచ్చేశాం. మా ‘అహంబ్రహ్మ’ నాటక ప్రదర్శన సాయంత్రం ఆరు గంటలకి కదా అని, నేను, మా సాంకేతిక నిపుణుడు ‘సింహా’ సినిమాకి రహస్యంగా వెళ్లాం. సినిమా సగం నడిచింది. ఇంటర్వెల్‌లో ఫోన్ చూస్తే పందొమ్మిది మిస్‌డ్‌కాల్స్. భయపడుతూనే ఫోన్ చేశా. మా సహనటుడు ‘‘రా. ఎక్కడున్నా?’’వని గట్టిగా అడిగాడు. అంతే! ఒక్క ఉదుటున రిహార్సల్స్‌లో ప్రత్యక్షమయ్యా.
మా దర్శకులు ఎక్కడికెళ్లావని ప్రశ్నిస్తే, పర్సు పోయిందని, వెతకడంలో ఆలస్యమయిందని అబద్ధం చెప్పేశా. రిహార్సల్స్, నాటక ప్రదర్శన పూర్తయింది. పాలకొల్లుకి బయల్దేరాం. ట్రైన్‌లో శనగలు అమ్ముతున్న ముసలావిడ కొనమని బతిమాలింది. జేబులోకి చెయ్యి దూర్చా. అంతే! పర్సు లేదు. పర్సు పోయిందని మధ్యాహ్నమే చెప్పాను కదా, నిజంగా పోయినా నోరు మెదపలేకపోతున్నాను. నన్ను నేనే తిట్టుకొని బాధపడ్డాను. నిజాన్ని దాచటం ఎంత కష్టమో అబద్ధాన్ని చెప్పడం అంతే నేరమని అప్పుడే తెలిసింది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకొస్తే, నామీద అసహ్యం కలుగుతుంది.
ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తిరుపతికి మహతీ ఆడిటోరియంలో నాటక ప్రదర్శన కోసం వెళ్లాం. ఒక అమ్మాయి నుంచి ఫోన్. ‘‘మాది బుచ్చిరెడ్డిపాలెం. నా పేరు మంజులాదేవి. నేను షాపింగ్‌కెళ్లి వస్తుంటే దార్లో మీ పర్సు కనబడింది. అందులోని మీ నంబరు చూసి ఫోన్ చేశా. ఇందులో మీ ఐడెంటిటీ కార్డు, మూడు వేలు, ఇతర ప్రూఫ్స్ ఉన్నాయి’’ అని చెప్పింది. బ్యాంకు అకౌంటు నంబరు చెప్తే డిపాజిట్ చేస్తానంది. నా డబ్బులు నాకు అందాయి. అందుకు కృతజ్ఞతలు తెలిపాను. కాని ఆమె మంచితనమే నన్ను మార్చివేసింది.
- బొడ్డుపల్లి హరికృష్ణ