అప్పుడెప్పుడో ‘అమృతం’ అని ఓ సీరియల్ వచ్చేది. హోటల్ నడుపుకునే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ. వాళ్ల అమాయకత్వం వాళ్లకెన్ని చిక్కులు తెచ్చిపెడుతుందో చూసి జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవారు. ఇప్పటికీ ఏదో ఒక చానల్‌లో ఆ సీరియల్‌ని రిపీట్ చేస్తూనే ఉంటారు. దాన్ని సినిమాగా కూడా తీయబోతున్నారు. ఆ సీరియల్ అంతగా సక్సెస్ కావడానికి కారణం... హ్యూమర్. అందులోని ప్రతి పాత్రా కడుపుబ్బ నవ్వించేది. వారు చేసే పనులు, వారి హావభావాలు చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండేవాడు కాదు. ఆ హాస్యమే ‘అమృతం’ను సూపర్ హిట్ చేసింది.
ఇప్పుడు అదే కోవకి చెందిన మరో సీరియల్ వచ్చింది. దాని పేరు... ‘గంగతో రాంబాబు’. జీ తెలుగు చానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్‌లో పేరున్న నటులెవరూ లేరు. ఎటువంటి హడావుడీ ఉండదు. భారీ డైలాగులు ఉండవు. భారమైన సన్నివేశాలూ ఉండవు. ఉండేదల్లా... ఆరోగ్యకరమైన హాస్యమే. కామెడీని అద్భుతంగా పండించే వాసు ఇంటూరి దర్శకత్వంలో ఓ ఆరు పాత్రలు చేసే అల్లరి చేష్టలు, చిత్ర విచిత్ర విన్యాసాలు చూసి పడీ పడీ నవ్వుతున్నారు ప్రేక్షకులు. ఏడుపుగొట్టు సీరియళ్లతో భారమైపోయిన మనసులకు ఈ నవ్వుల నజరానా ఓ ఆటవిడుపులా పని చేస్తోంది. ఆహ్లాదాన్ని పంచుతోంది. నవ్వు ఒకప్పుడు నాలుగు విధాల గ్రేటేమో. కానీ ఒత్తిడితో మనిషి అల్లాడిపోతున్న ఈ రోజుల్లో అది నాలుగొందల విధాల గ్రేటు అయ్యింది. అందుకే ఇలాంటి సీరియల్స్ ఇంకా రావాలి. అందరి ఇంటా నవ్వుల పూలు పూయాలి!
ప్రేమికుడు పోలీసయ్యాడు!
హిందీ సీఐడీ సీరియల్ ఎన్నో యేళ్లుగా వస్తోంది. దాన్ని చూసినప్పుడల్లా మన భాషలో ఎందుకు రావు ఇలాంటి సీరియల్స్ అని బుల్లితెర అభిమానులు ఫీలైన సందర్భాలు లేకపోలేదు. వారి ఆశ ఇన్నాళ్లకు నెరవేరింది. తెలుగులో కూడా అలాంటి ఓ సీరియల్ మొదలైంది. అదే... సీఐడీ విశ్వనాథ్. సీరియళ్లు ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ చానెళ్లలోనే వస్తాయి. కానీ తొలిసారిగా ఓ వార్తాచానెల్ (టీవీ 5) దీనిని ప్రసారం చేస్తుండడం విశేషం!
చక్రవాకం, మొగలి రేకులు వంటి సీరియల్స్ ద్వారా మంచి ప్రేమికుడిగా పరిచయమై, అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ఇంద్రనీల్... తొలిసారి ఓ పూర్తిస్థాయి యాక్షన్ రోల్ చేస్తున్నాడీ సీరియల్‌లో. సీఐడీ ఆఫీసర్‌గా సీరియస్ నటనను ప్రదర్శిస్తున్నాడు. క్రైమ్ ఆధారిత సీరియల్‌గా కాకుండా... మాంచి సస్పెన్స్‌తో, చక్కని కథనంతో సాగిపోతోన్న ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. అందులోనూ ఇంద్రనీల్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి... సీఐడీ విశ్వనాథ్ బ్రేకులు లేకుండా సాగి పోవడం ఖాయం!
ఈసారి ‘లక్కు’తో వచ్చాడు!
ఓంకార్... బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. డ్యాన్స్ షోలతో హడావుడి చేసే ఈయన, ఈసారి ‘100% లక్’ (మాటీవీ) అనే షోతో వచ్చాడు. ఈ మధ్య తెలుగు చాలెళ్లలో గేమ్‌షోలు ఎక్కువయ్యాయి. లక్కు కిక్కు, నీ కొంగు బంగారం కానూ, చాంగురే బంగారు రాణి అంటూ రకరకాల షోలు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఇదీ ఆ కోవకు చెందినదే. సెలెబ్రిటీల ఆటపాటలతో యమా సందడిగా ఉంది ప్రోగామ్. ఇక ఓంకార్ షో అంటే ఏమాత్రం రభస ఉంటుందో చెప్పక్కరేదు కదా! అయితే ప్రస్తుతానికి సక్సెస్‌ఫుల్‌గానే సాగుతోంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం!
టీవీక్షణం: ప్రతి ఇంటా... నవ్వుల పంట!
Published Sun, Sep 15 2013 2:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement