అరణ్యం: ఒంటెకు చెమట పడుతుందా?
ఒంటెలు నీళ్లు తాగకుండా రెండు నెలల వరకూ ఉండగలవు. అయితే నీరు కనుక దొరికితే ఇవి ఒక్కసారి దాదాపు ఏడు లీటర్ల నీటిని తాగేస్తాయి!
ఉష్ణోగ్రత 41 డిగ్రీలు దాటితే తప్ప ఒంటెలకు చెమట పట్టదు.
ఒంటెలు తమ కడుపులో ఉండే సంచిలో నీటిని నిల్వ చేసుకుంటాయని, అందువల్లే కొన్నాళ్ల పాటు నీళ్లు లేకపోయినా ఉండగలుగుతాయని, ఎంతటి వేడిమినైనా తట్టుకుంటాయని అనుకుంటూ ఉంటారు. అది ఎంతమాత్రం నిజం కాదు. ఒంటె మూపురంలో అత్యధిక మోతాదులో కొవ్వు ఉంటుంది. ఇది బయటి వేడిని శరీరంలోకి రాకుండా అడ్డుకుంటుంది!
ఒంటెను వేటాడటం ఏ మృగానికైనా కష్టమే. ఎందుకంటే, ఒంటె కాళ్లు చాలా బలంగా ఉంటాయి. పైగా అది నాలుగు కాళ్లతోనూ తన్నగలదు!
ఇసుక తుఫాన్ల సమయంలో కూడా ఒంటెలు స్పష్టంగా చూడగలుగుతాయి. ఎందుకంటే వాటి కనురెప్పలు రెండు పొరలుగా ఉంటాయి. అవి కళ్లను కాపాడతాయి. ముక్కు రంధ్రాల నిర్మాణం కూడా అవసరాన్ని బట్టి మూసుకోగలిగేట్లుగా ఉంటుంది కాబట్టి వాటికి ఏ ఇబ్బందీ ఉండదు!
శత్రువులు దాడి చేసినప్పుడు ఒంటెలు మొదట చేసే పని... ఉమ్మడం! ఆకుపచ్చ రంగులో ఉండే చిక్కటి ద్రవాన్ని ఊస్తాయివి. ఆ జిగురును వదిలించుకోవడం, ఆ వాసనను భరించడం చాలా కష్టం!
ఈ గుర్రం నిజంగా లేదా?
మిస్టర్ ఎడ్... ఇది ఓ గుర్రం పేరు. నిజానికి ఆ గుర్రం నిజంగా లేదు. వాల్టర్ ఆర్ బ్రూక్స్ కథల్లో మాత్రమే ఉంది. అది మాట్లాడుతుంది. సాహసాలు చేస్తుంది. వాల్టర్ దాని పాత్రని ఎంత బాగా తీర్చిదిద్దాడంటే... చదివినవారంతా ఎడ్ నిజంగానే ఎక్కడో ఉందనుకున్నారు. ఆ కథల ఆధారంగా టీవీ సీరియళ్లు, సినిమాలు కూడా రావడంతో... ఎడ్ పాత్ర కాదు, ప్రాణమున్న జీవి అని అందరూ ఓ వింత నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. తెరమీద కనిపించిన గుర్రం ఎడ్ అని, అది నిజంగానే మాట్లాడుతోందని అనుకున్నారు. కొందరైతే దాన్ని చూడాలని ఆయా ప్రొడక్షన్ ఆఫీసులకు వెళ్లిపోయారట కూడా. ఇప్పటికీ చాలామంది ఎడ్ అనే గుర్రం ఉండేదనే అనుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు... ఆ పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో!
కొరికి చంపేస్తుంది!
చేపలకు ముళ్లుంటాయని తెలుసు కానీ, ఇంతింత పళ్లుంటాయా? ఎందుకుండవూ... పిరానా జాతి చేపలకు ఉంటాయి. దక్షిణ అమెరికాలోని మంచి నీటి చెరువుల్లో ఉంటాయి పిరానాలు. వీటికి ఏ జీవి అయినా దొరికిందా... క్షణాల్లో హాం ఫట్ అయిపోవాల్సిందే! వీటికి ఆకలి చాలా ఎక్కువ. గంటకోసారయినా ఆహారం కావాలి. అందుకే ఏదైనా కనబడితే పళ్లతో కొరికి చంపి తినేస్తాయి. ఇవి కనుక గుంపుగా దాడి చేస్తే, అవి చేసే గాయాలకు ఎంతటి పెద్ద జీవి అయినా విలవిల్లాడాల్సిందే. అందుకే వీటిని అత్యంత ప్రమాదకరమైన చేపగా పేర్కొంటారు జీవ శాస్త్రవేత్తలు. మరో విషయం ఏమిటంటే... రెండు పిరానా చేపల్ని ఓ చోట ఉంచితే అవి రకరకాల శబ్దాల ద్వారా కబుర్లు చెప్పేసుకుంటాయని పరిశోధనలో తేలింది!