ఐదు నిమిషాల్లో లక్షాధికారి | Five minutes In the Millionaire | Sakshi
Sakshi News home page

ఐదు నిమిషాల్లో లక్షాధికారి

Published Sun, Aug 16 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

ఐదు నిమిషాల్లో లక్షాధికారి

ఐదు నిమిషాల్లో లక్షాధికారి

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  11
రాబిన్సన్ తన మేనల్లుడితో కోపంగా చెప్పాడు. ‘‘థామస్! నీ గురించే నేను మాట్లాడేది. నీ ప్రవర్తన, నీ మిత్రులు, నీ జీవితం విధానం నాకు నచ్చలేదు. మీ నాన్న నీ ఎస్టేట్‌కి నన్ను ధర్మకర్తగా నియమించాడు. విల్లు రాయబోయే ముందు మనం ముగ్గురం ఈ విషయం స్పష్టంగా మాట్లాడుకున్నాం. నీకు ఏడాదికి పదివేల డాలర్లు సరిపోతుంది. నీకు ముప్ఫై ఐదో యేడు వచ్చేదాకా నువ్వు ఆ ఆస్తిని ముట్టుకోలేవు.’’
‘‘సారీ అంకుల్. నేను చాలా మారాను’’ థామస్ తనలోని కోపాన్ని బయటికి కనపడనివ్వకుండా జవాబు చెప్పాడు.

‘‘కాని నీలో నాకామార్పు కనపడడం లేదు. ఇంకో ఏడేళ్లదాకా నీకు ఏటా పదివేల డాలర్లు మించి అదనంగా ఏం ఇవ్వను. నీకు ఏడాదికి పదివేలు చాలలేదంటే, ఖర్చు చేయడానికి నీకు చాలా తీరిక ఉందని అర్థం. కాబట్టి ఉద్యోగంలో చేరు. కొంత ఆదాయం రావడమే కాక, ఖర్చు చేయడానికి సమయం కూడా బాగా తగ్గుతుంది’’ రాబిన్సన్ కోపంగా చెప్పాడు.
     తన అంకుల్‌ని హత్య చేయాలన్న ఆలోచన థామస్‌కి ఆ క్షణంలో కలిగింది. రెండు వారాలపాటు రాబిన్సన్ రొటీన్‌ని పరిశీలిస్తూ ఆయన్ని ఎలా చంపాలా అని ఆలోచించాడు. ఇంట్లో ఆయన ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. పనివాళ్లు ఇద్దరైనా ఆయనతో ఉంటారు. అరవై ఏళ్లొచ్చినా ఇంకా బ్రహ్మచారే కాబట్టి బయటి క్లబ్‌లో, రెస్టారెంట్లో, పార్టీల్లో ప్రతి చోటా ఒకరిద్దరు మిత్రులు తప్పనిసరిగా ఆయన వెంట ఉంటారు.
 
రాత్రి పడకగదిలో ఒంటరిగా ఉంటాడు. కాని తొమ్మిది దాటాక తను ఆ ఇంట్లో ఉండకూడదనే నియమాన్ని విధించాడు. బహుశ తనకి ఇప్పుడు కలిగిన ఈ ఆలోచన ఆయనకి ఎప్పుడో తట్టి, తన జాగ్రత్త కోసం ఆ నియమం విధించాడని థామస్‌కి అనిపించింది.
 రెండు వారాల తర్వాత తన అంకుల్ సహజ మరణం పొందాలి తప్ప చంపడం కష్టం అనుకున్నాడు. ఒకవేళ విజయవంతంగా చంపినా అనుమానం ముందుగా తనమీదకే మళ్లుతుందని కూడా థామస్‌కి తెలుసు. ఆయన మరణం వల్ల లాభం పొందేది ప్రపంచంలో తనొక్కడే అని అందరికీ తెలుసు.
    
ఓ సాయంత్రం అతని సమస్యని థామస్ ప్రియురాలు ఫిలిన్  శ్రద్ధగా విన్నది. ఆమెది ఆకర్షణీయమైన పర్సనాలిటీ. సైకాలజీలో కాలేజీ డిగ్రీ ఉంది. థామస్ చేసిన ప్రతిపాదనకి ఆమె షాక్ అవలేదు. రాబిన్సన్‌ని చంపడం తమ సమస్యకి పరిష్కారం అని అంగీకరించింది.
 ‘‘లేదా నేను ఆఫీసులో గుమస్తాగా ఇంకో ఏడేళ్లు జీవించాలి. చంపటం దారుణం. కాని భావి జీవితం ఆనందకరంగా సాగాలంటే ఒకటి, రెండు తప్పులు చేయక తప్పదు. కాబట్టి నీ సహాయం కావాలి’’ కోరాడు.
 ‘‘అలాగే. తన మిత్రుల శవపేటికలని మోయడం మీ అంకుల్ హాబీ. ఓ తెలివైన అమ్మాయి ఆయన్ని తన శవపేటికలోకి పంపగలదు’’ ఫిలిన్  చెప్పింది.
 ‘‘ఎవరు?’’
 
‘‘నాలాంటిది. నేను మూడు నెలల్లో ఆ పని చేయగలను. ఈ ముసలి బ్రహ్మచారుల గురించి నాకు బాగా తెలుసు. కాని అందువల్ల నాకు అదనపు లాభం ఏమిటి?’’
 ‘‘నువ్వు ధనవంతురాలివైన విధవరాలివి అవుతావు. ఆయన పేరగల ఇన్స్యూరెన్స్ నామినేషన్‌లో నా పేరు కొట్టేసి మీ పెళ్లవగానే నీ పేరుని పెడతాడు అని హామీ.’’
 ‘‘ఏడాదికి ఏభైవేల డాలర్లతో ఎలా జీవించగలను? అది షాంపేన్‌కి మాత్రమే సరిపోతుంది. ఆయన పోతే నీకెంత లాభం వస్తుంది?’’
 
‘‘ఏభై లక్షల డాలర్లు. కాని అది మా నాన్న ఆస్తి తప్ప ఆయనది కాదని నీకు తెలుసు.’’
 ‘‘ఆయన పోయిన ఆరు నెలలకి నువ్వు నన్ను పెళ్లిచేసుకుంటానని మాట ఇస్తావా మరి?’’ ఫిలిన్  కోరింది.
 ‘‘నువ్వు లేకుండా నేను జీవించలేను. జీసస్‌మీద ఒట్టు. నేను ప్రతీ ఆదివారం చర్చికి వెళ్తూంటాను’’ థామస్ అబద్ధం ఆడాడు.
    
ఆ తర్వాతి సంఘటనలు థామస్ ఎదురు చూసిన దానికన్నా వేగంగా జరిగిపోయాయి. ఓ రోజు థామస్  సెంట్రల్ పార్క్‌లో రాబిన్సన్‌కి ఫిలిన్‌ని పరిచయం చేశాడు. కొద్దినిమిషాల తర్వాత సెల్‌ఫోన్ మోగింది. మాట్లాడి అర్జెంట్ పనిమీద వెళ్లాలని చెప్పి థామస్ వెళ్లిపోయాడు. ఫిలిన్  ఆయన్ని తన మాటలతో కూడా ఆకర్షించింది.
 
వారంలో రాబిన్సన్ ఆమెని నాటకశాలకి తీసుకెళ్లాడు. రెండు వారాల తర్వాత ఒంటరిగా నివసించే ఆమె అపార్ట్‌మెంట్‌కి వెళ్లాడు. నెలన్నర తర్వాత వారి పెళ్లి నిశ్చయం అయింది. ఈ నెలన్నర థామస్‌కి ఫోన్ ద్వారా ఫిలిన్  తను సాధించే అభివృద్ధిని వివరిస్తూనే ఉంది.
 పెళ్లయ్యాక నూతన దంపతులు యూరప్‌కి హనీమూన్‌కి వెళ్లివచ్చారు. పెళ్లయిన రాబిన్సన్ నిత్యం షేర్ బ్రోకర్ల ఆఫీసులకి వెళ్లడం, క్లబ్‌కి, రెస్టారెంట్లకి వెళ్లడం ఆగిపోయాయి. మంచి భర్తలా ఆయన తన సమయాన్ని తన భార్యతోనే ఇంట్లో గడుపుతున్నాడు.
    
ఆయన థామస్‌ని తన ఇంటికి పెళ్లయ్యాక మొదటిసారి ఆహ్వానించాడు. అంకుల్‌ని చూసి థామస్ ఆశ్చర్యపోయాడు. ఆయనలో కొత్త శక్తి కనిపించింది. ఇదివరకటి కంటే ఉత్సాహంగా ఉన్నాడు. ఓ పదిహేనేళ్లు వయసు తగ్గినట్లుగా, ఇంకో పాతికేళ్లు జీవించేట్లుగా కూడా కనిపించాడు. కాని ఫిలిన్‌కి పదేళ్లు పెరిగినట్లుగా కనిపించింది. కళ్లకింద వలయాలు. గోళ్లకి రంగు వేసుకోలేదు. ఐనా ఉత్సాహంగానే కనిపించింది. ఏభై లక్షల డాలర్లకి తను వారసుడైతే తన భార్యగా ఆమె పనికిరాదని థామస్ ఆరోజే నిర్ణయించు కున్నాడు. వారిద్దరి మధ్య కొన్ని నిమిషాల ఏకాంతమే దొరికింది.
 
‘‘మనం ఆ పని త్వరగా చేయాలి థామస్. నేను మీ అంకుల్‌ని ఎక్కువ కాలం భరించలేను. లేదా నేను సహజ మరణాన్ని పొందుతాను. నేను వంట నేర్చుకోవాల్సి వచ్చింది. అంట్లు తోమాలి’’ ఆవేదనగా చెప్పింది.  తన పథకాన్ని వివరించింది. కార్ పార్క్‌లో దొంగిలించిన లెసైన్స్ ప్లేట్లని తన కారుకి అమర్చుకుని థామస్ గురువారం రాత్రి పదకొండున్నరకి తన అంకుల్ ఇంటికి కొద్దిదూరంలో కారు ఆపాడు. కారు దిగి వంటగది వెనక తలుపులోంచి లోపలికి వెళ్లాడు. ఫిలిన్  చెప్పినట్లుగానే లోపల గడియ పెట్టలేదు.
 
‘‘లేవండి. కింద చప్పుడైంది’’ ఫిలిన్  భర్తని నిద్రలేపింది.
 ఆయనకీ చప్పుడు వినిపించడంతో డ్రాయర్లోని రివాల్వర్‌ని అందుకుని తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు. ఆయన మొదటి మెట్టుమీద ఉండగా చీకట్లో దాక్కున్న థామస్ వెనక నుంచి ఆయన తలమీద సుత్తితో బలంగా మోదాడు. ఆయన పెద్దగా మూలుగుతూ మెట్లమీంచి కిందికి దొర్లిపోయాడు. మూలుగు సన్నగా వినిపిస్తోంది.
 
తర్వాతి పథకం అంతా థామస్ అనుకున్నట్లుగానే జరిగింది- కొంతదాకా. థామస్ కొంత విలువైన సామానుని తీసుకుని, కిటికీ అద్దం బయటినుంచి పగలగొట్టి పారిపోవాలి. తద్వారా దొంగమీదకి అనుమానం మళ్లుతుంది. ఫిలిన్  వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది. కాని ఏభై లక్షల వారసుడయ్యాక మళ్లీ ఫిలిన్  మరణిస్తే పోలీసులకి తనమీద అనుమానం కలగచ్చు. దొంగ కేవలం భర్తనే చంపి భార్యని ఎందుకు చంపకుండా వెళ్తాడు? తనామెని పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం తనని బ్లాక్ మెయిల్ చేయచ్చు.
 
అతని పథకం కొంతదాకానే జరిగింది. ఫిలిన్  చేతిలోని తనకి గురిపెట్టబడ్డ రివాల్వర్‌ని చూసి ఆశ్చర్యపోయాడు.
 ‘‘నన్ను చంపి ఏమిటి ప్రయోజనం?’’ అడిగాడు.
 ‘‘ఏభై లక్షల డాలర్లు.’’
 ‘‘కాని మా నాన్న ఆ ట్రస్ట్‌ని నాకు రాశాడు. నీకు కాదు.’’
 ‘‘కావచ్చు. నీ తర్వాత ఎవరికి వెళ్తుంది? నీ అంకులే నీ వారసుడు. ఆయన తర్వాత? ఆయన వారసురాలైన నాకు.’’
 ‘‘నా అంకుల్ ముందు చచ్చాడు. తర్వాత నేను చస్తే, ఇక ఆయన నా ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు?’’
 
‘‘ఆయన కన్నా ముందుగా నువ్వు చస్తావు. తర్వాత ఆయన. పది క్షణాల తర్వాత చచ్చినా సరే, నీ ఆస్తికి నీ అంకుల్ వారసుడై చస్తాడు.’’
 ‘‘మూర్ఖురాలా! కాని అది ఎలా ఋజువు చేయగలవు?’’
 ‘‘మావారి అరుపు విని వస్తే, చేతిలో సుత్తితో చీకట్లో కనపడ్డ వ్యక్తిని రెండుసార్లు కాల్చి చంపాను. తర్వాత మావారి దగ్గరికి వెళ్తే డాక్టర్‌కి ఫోన్ చేయమని చెప్పారు. ఫోన్ చేసి, ఆయన ఇంకా జీవించే ఉన్నారని, వెంటనే రమ్మని చెప్తాను. వారు రావడానికి పది క్షణాల ముందే పోయారని చెప్తాను.’’
 
‘‘ఇదన్యాయం ఫిలిన్.’’ థామస్ దీనంగా అర్థించాడు.
 ‘‘నువ్వు నీ అంకుల్‌కి ఏభై లక్షలకోసం ఏం చేశావో అదే పాఠాన్ని నేను నేర్చుకున్నాను థామస్ గుర్తుందా? ‘చంపటం దారుణం. కాని భావి జీవితం ఆనందకరంగా సాగాలంటే ఒకటి, రెండు తప్పులు చేయక తప్పదు’ అని నువ్వే బోధించావు. గుడ్ బై!’’
 ఫిలిన్  చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలింది. గురి తప్పకుండా రెండూ అతని గుండెని ఛేదించాయి. తర్వాత ఆమె టెలిఫోన్ వైపు నడిచింది.
- (జేమ్స్ క్రాన్  కథకి స్వేచ్ఛానువాదం)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement