డాడీ | Funday horror story of the week 05-05-2019 | Sakshi
Sakshi News home page

డాడీ

Published Sun, May 5 2019 12:24 AM | Last Updated on Sun, May 5 2019 12:24 AM

Funday horror story of the week 05-05-2019 - Sakshi

‘‘ఇంక నావల్ల కాదు.. భరించలేను’’అంటూ పొత్తి కడుపు పట్టుకొని లుంగలు చుట్టుకుపోతోంది చందన.‘‘ఓర్చుకో చందూ.. ప్లీజ్‌.. చూడు ఈ మంత్‌  తప్పకుండా పీరియడ్స్‌ మిస్‌ అవుతావ్‌’’ ఆమె పక్కన కూర్చోని తల నిమురుతూ అన్నాడు అనిరుద్‌.ఆ మాటకు అతని కళ్లల్లోకి చూసింది చందన. ‘‘నిజం.. ఈసారి కన్సీవ్‌ అవడం ఖాయం...’’భరోసా ఇస్తున్నట్టుగా ఆమె చేయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. 
తన చేయి విడిపించుకుంటూ దిండు ఆసరాగా గోడకు ఒరిగి కూర్చుంది చందన. కిటికీలోంచి గార్డెన్‌లోకి చూస్తూ.. ‘‘ఈ ట్రీట్‌మెంట్‌... ఈ పెయిన్‌ నా వల్ల కాదు అనిర్‌.. ఎవరినైనా అడాప్ట్‌ చేసుకుందాం...’’అంది. ఆ మాట అతనికి కొత్త కాదు కాని.. ఆ స్వరం కొత్తగా వినిపించింది. స్థిరమైన అభిప్రాయం మోస్తున్నట్టు. ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగి చందన తలను తన వైపు తిప్పుకుంటూ ‘‘ఒక్క చాన్స్‌ చూ..ద్‌...’’ అని అతను మాట పూర్తి చేసేలోపలే.. ‘‘నీడ్‌ టు టేక్‌ రెస్ట్‌’’ అంటూ అటువైపు తిరిగింది చందన. ఇంకో మాట మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు అనిరు«ద్‌. 

పెళ్లయి ఆరేళ్లవుతున్నా పిల్లల్లేరు. ఆస్తి, అంతస్తు.. మంచి ఉద్యోగం.. పెద్ద ఇల్లు.. అన్నీ ఉన్నాయి. ఆ ఇంటికి కళ తెచ్చే పిల్లలే లేరు. ఇద్దరూ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. అనిరు«ద్‌ లోపం సరిచేయరానిది. ఆ విషయం తెలిసినా.. చందన మీదే ప్రెషర్‌. నరకం అనుభవిస్తోంది ఆమె. అర్థమైనా కృత్రిమ గర్భధారణ కోసం పదేపదే ప్రయత్నిస్తున్నాడు అనిరు«ద్‌. రక్తం పంచుకుపుట్టిన బిడ్డ కావాలని. ఆ చాదస్తం చందన ప్రాణం తీస్తోంది. దిండులో తల దూర్చి పొగిలి పొగిలి ఏడుస్తోంది ఆమె. గది బయటకు వచ్చేసిన అనిరు«ద్‌కూ తెలుసు చందన ఏడుస్తోందని. నిట్టూరుస్తూ.. ‘‘ఏమైనా ఇంకో చాన్స్‌ చూడాల్సిందే’’ అనుకున్నాడు. ఆఫీస్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుంటే ఫోన్‌.. బీప్‌.. మెస్సేజ్‌ను ఇండికేట్‌ చేస్తూ!చూసుకున్నాడు.. ‘‘డాడీ.. వాంట్‌  రిమోట్‌ కంట్రోల్‌ కార్‌’’ అని ఉంది. రెడిక్యులస్‌.. చిరాగ్గా అనుకుంటూ మెస్సేజ్‌ డిలీట్‌ చేశాడు. ఆఫీస్‌కు కార్‌ డ్రైవ్‌ చేశాడు. 

గుయ్‌.. గుయ్‌.. ..... ..... .... .... గుయ్‌.. గుయ్‌‘‘అబ్బా.. ఆ ఫోన్‌ చూడు అనిర్‌..’’ మధ్య రాత్రి ఫోన్‌ వైబ్రేషన్‌ సౌండ్‌కి ఇరిటేట్‌ అవుతూ చందన. ‘‘ఊ.. పోనిద్దూ.. పడుకో’’ అంటూ అటు తిరిగి ముసుగేసుకున్నాడు అనిరు«ద్‌.గుయ్‌.. గుయ్‌... ..... .... .... గుయ్‌.. గుయ్‌ ‘‘అబ్బా...’’ అని విసుక్కుంటూ అనిరు«ద్‌ ఫోన్‌ తీసింది. కళ్లునులుముకుంటూ చూసింది..  మెస్సేజెస్‌.. స్క్రీన్‌ మీద నోటిఫికేషన్స్‌లో.. ‘‘డాడీ...’’ అని కనిపించింది. ‘‘అనిర్‌.. ఏవో మెస్సేజెస్‌ ..’’ భర్తను తట్టి లేపుతూ.‘‘పొద్దున చూసుకుంటాలే.. ’’ నిద్ర మత్తుతోనే అనిరు«ద్‌. పక్కన పెట్టబోతుంటే మళ్లీ ఓ మెస్సేజ్‌ వచ్చింది. చూసింది. ‘‘డాడీ...’’ అని ఒక మెస్సేజ్‌... ‘‘డాడీ... వై డింట్‌ యు గివ్‌ రిప్లయ్‌?’’ అని ఒకటి.. ‘‘డాడీ.. రిమోట్‌ కంట్రోల్‌ కార్‌ తేలేదూ?’’ అని ఓ మెస్సేజ్, ‘‘డాడీ.. గిమ్మీ రిప్లయ్‌.. ’’, ‘‘డాడీ.. ప్లీజ్‌.. ప్లీజ్‌..’’ అంటూ ఓ అయిదారు మెస్సేజ్‌లున్నాయి. అన్నీ చదివింది. నిద్ర ఎగిరిపోయింది ఆమెకు. వెంటనే అనిరు«ద్‌ను లేపి.. ఏంటిది? అని అడిగాలన్నంత ఆవేశం వచ్చింది. కాని ఆలోచనలో పడింది. అనిరు«ద్‌కు పిల్లలా? మరి మెడికల్‌ రిపోర్ట్‌? అతనిలో కౌంట్‌ తక్కువనే కదా చెప్పారు డాక్టర్‌! అబద్ధమా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఇంకో...   ఛ.. ఇలా ఆలోచిస్తుందేంటి తను? మరో అమ్మాయి, ఆమెతో పిల్లలు ఉంటే తననెందుకు ఇబ్బంది పెడ్తాడు ట్రీట్‌మెంట్స్‌తో? ఏమో.. తనకు అనిరు«ద్‌ పట్ల అలాంటి థాట్‌ రాకుంటా ఉండడానికి ట్రీట్‌మెంట్‌ అంటూ హాస్పిటల్స్‌ చుట్టూ తిప్పుతున్నాడేమో? ఆ డాక్టర్‌ అనిరుద్‌ ఫ్రెండే కదా.. ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారా? ఆ చాన్స్‌ ఉందా? అందుకే అడాప్షన్‌ వద్దంటున్నాడా?  లాంటి ఆలోచనలతో.. అనుమానాలతో తెలీకుండానే  నిద్రలోకి జారుకుంది చందన. 

‘‘డాడీ.... డాడీ...’’ అయిదేళ్ల  అమ్మాయి గుసగుసగా పిలుస్తున్నట్టు.ఒకేసారి ఇద్దరికీ మెలకువ వచ్చింది. ‘‘డాడీ... డాడీ..’’ మళ్లీ పిలుపు. గాబరాగా అనిరు«ద్‌ లైట్‌ వేయబోయాడు. వెలగలేదు. అప్పటిదాకా వెలిగిన బెడ్‌లైట్‌ కూడా ఆరిపోయింది. పక్కనే ఉన్న సెల్‌ఫోన్‌ తీసుకొని టార్చ్‌ ఆన్‌చేసింది చందన. అనిరు«ద్‌ వంక చూసింది. మొహం నిండా చెమటలతో వణుకుతున్నాడు. ఉన్నట్టుండి  గాలి.. వెర్రెత్తినట్టు బెడ్‌రూమ్‌ కిటికీలను.. కర్టెన్లూ ఊపేస్తోంది.. కిటికీ తలుపులు ఊడిపడిపోతాయేమోనన్నంతగా! ‘‘పిల్లలు కావాలా డాడీ?’’ మళ్లీ ఆ పిల్ల గొంతే! ‘‘ఏయ్‌.. ఎవరు నువ్వు?’’కంపిస్తున్న స్వరంతో అనిరు«ద్‌. ‘‘నీ కూతురిని డాడీ.. పొద్దున ... మధ్యాహ్నం మెస్సేజెస్‌ పెట్టా కదా.. చూసుకొనీ డిలీట్‌ చేశావ్‌. ఇందాక కూడా పెట్టా. నువ్వు పట్టించుకోలేదు.. అందుకే వచ్చా డాడీ..’’ పలుకుతోంది పిల్ల గొంతు. ‘‘ఏయ్‌.. ఏంటా ముదురు మాటలు? డాడీ ఎవరు ? డాడీ అట డాడీ?’’ భయం ప్లేస్‌లో చిరాకు, కోపం వచ్చాయి అనిరు«ద్‌కి. మళ్లీ గాలి విసురుగా.. ఒక్కసారి ఆ ఇంటినే ఊపేసింది. ‘‘అనిర్‌...’’ భయంతో గట్టిగా అరిచింది చందన. ‘‘చందూ..’’ అంటూ ఆమెను పొదివి పట్టుకున్నాడు అతను. ‘‘అనిర్‌.. ఏంటిదంతా? ఎవరా పాపా? కనిపించదేంటి?’’  అంత భయంలోనూ భర్త మీదఅనుమానంతో ఆమె. ‘‘తెలీదు.. నాకూ కన్‌ఫ్యూజన్‌గానే ఉంది’’చెమటలు తుడుచుకుంటూ అతను. ‘‘అబద్ధం..’’ అరిచింది ఆ పిల్ల గొంతు. ఒక్కసారిగా వణికారు ఇద్దరూ. ‘‘డాడీ.. అబద్ధం చెప్పకు డాడీ.. ’’ అంతలోకే మార్దవంగా ఆ పిల్ల. మెల్లగా బెడ్‌ దిగి.. ‘‘ఏయ్‌ ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావ్‌?’’ ‘‘అదేంటి డాడీ.. నన్ను మర్చిపోయావా?’’  అని వినిపించగానే ఒక్కసారిగా గదిలో లైట్‌ వెలిగింది. గదంతా చూశారిద్దరూ .. ఎవరూ లేరు.చందనకు కోపం వస్తోంది. అనిరు«ద్‌ తనను మోసం చేశాడని.

ఆ ఆగ్రహంతోనే భర్త టీషర్ట్‌ కాలర్‌ పట్టుకుంది.. ‘‘అనిర్‌.. నన్నెందుకు చీట్‌ చేస్తున్నావ్‌? ఆ పాపఎవరు?’’అంటూ!‘‘వ్వాట్‌..?’’ఖంగుతిన్నఅనిరు«ద్‌ షర్ట్‌ కాలర్‌ విడిపించుకుంటూ ‘‘గాన్‌ మ్యాడ్‌?’’ అరిచాడు. బిత్తరపోయింది చందన. ‘‘ఏం జరుగుతుందో చూసే ఆ మాట అంటున్నావా చందూ?’’ బాధగాఅతను.‘‘రాత్రి నీ సెల్‌కు వచ్చిన మెస్సేజెస్‌ చూశా.. ఈ అమ్మాయే కాబోలు’’ అంటూ సెల్‌ ఫోన్‌ తీసి అతని చేతికి ఇచ్చింది. చదవబోతూంటే బయట కార్‌ హార్న్‌ మోగింది గట్టిగా.. ఉలిక్కిపడ్డారిద్దరూ.మోగుతూనే ఉంది.. గబగబా పోర్టికోలోకి పరిగెత్తారు. హెడ్‌లైట్లు వెలుగుతూ... ఆరుతూ.. ఆరుతూ వెలుగుతూ.....!కార్‌ దగ్గరకు వెళ్లారు.. విండో గ్లాసెస్‌ మీద ‘‘డాడీ.. నన్ను ఇంటికి తెచ్చుకోండి... ప్లీజ్‌’’అని రాసుంది. అది చూసి ఆవేశంతో తుడిచేయబోయాడు అనిరు«ద్‌.. మళ్లీ హార్న్‌ మోగింది! అనిరు«ద్‌ చేయి పట్టి ఆపింది చందన.. తుడిచేయొద్దు అన్నట్టుగా! మళ్లీ మాటలు వినిపించాయి.. ‘‘డాడీ.. ప్లీజ్‌ మమ్మీ మాట వినండి.. అనా«థను దత్తత తీసుకోండి.. నాలా చెత్తకుప్పలో చనిపోనివ్వకండి.. డాడీ.. ప్లీజ్‌.. మమ్మీని అలా హాస్పిటల్‌కి తిప్పకండి. అడాప్ట్‌ చేసుకోండి.. నన్నూ.. మమ్మీని కాపాడండీ.. ప్లీజ్‌ డాడీ.. ప్లీజ్‌ డాడీ...’’ అంటూ ఆ పాప స్వరం ఏడుస్తోంది.. చందనాకూ దుఃఖం ఆగలేదు!
- సరస్వతి రమ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement