మేడ | Funday horror story of the week 14-04-2019 | Sakshi
Sakshi News home page

మేడ

Published Sun, Apr 14 2019 4:07 AM | Last Updated on Sun, Apr 14 2019 4:07 AM

Funday horror story of the week 14-04-2019 - Sakshi

‘‘హలో...’’ టార్చ్‌ లైట్‌ వెలుగు సహాయంతో ముందు గదిలోకి వచ్చిన ధీరజ్‌  ఆ ఇంట్లో వారిని ఉద్దేశించి పిలిచాడు. జవాబుగా అవతల నుంచి ఏ పలుకూ లేదు. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్లి.. ‘‘ఎవరండీ ఇంట్లో?’’ అడిగాడు. కిటికీ రెక్కలు  రెండూ ధడేల్‌  ధడేల్‌ మంటూ  కొట్టుకున్న చప్పుడు. వినిపించిన వైపు టార్చ్‌ లైట్‌ ఫోకస్‌ చేశాడు. ఆశ్చర్యపోతూ  దగ్గరికి వెళ్లి పరిశీలనగా చూశాడు. గడియ పడి ఉన్నాయి. ఇందాకే కదా.. అంత గట్టిగా కొట్టుకున్నాయి.. ఆ క్షణంలోనే ఎలా గడియ పడ్డాయి? విస్మయపోతూనే తెరవడానికి ప్రయత్నించాడు. కొన్నేళ్ల నుంచీ తుప్పు పట్టినట్టున్నాయి ఆ బోల్ట్స్‌. ఎంత తెరిచినా రావట్లేదు. ఇంకాస్త గట్టిగా లాగితే కిటికీలే ఊడొచ్చేంత పాతగా ఉన్నాయ్‌.  బహుశా ఆ పెద్ద చప్పుడు తన భ్రమేమో అనుకుని ఇంకాస్త ముందుకు వెళ్లాడు టార్చ్‌ వెలుగులోనే. ఈ సారి ఓ మూల నుంచి కిర్రుమంటూ శబ్దం వినిపించింది . అటు వైపు మళ్లాడు. యుగాల నాటి పెద్ద గుమ్మాన్ని తలపించే ద్వారం. తలుపు ఓరగా తెరిచి ఉంది. దాని దరికి రాగానే ఒక్కసారిగా గబ్బిలాల కంపు.. లోపల్నించి గబ్బిలాల రెక్కల చప్పుడు.. ఎలుకల కిచకిచలు. ఆ గదిలోకి వెళ్దామనుకొనీ వెళ్లక వెనకడుగు వేశాడు.  ఆ వాసనకు, శబ్దాలకు చీదర కలిగి. టార్చ్‌ను ఆ ఫోకస్‌ నుంచి తిప్పబోతూ ఆగిపోయాడు. ఆ గదిలో వెలుతురు పడ్డ మేర చాలా శుభ్రంగా.. మార్బుల్‌ ఫ్లోర్‌ మెరుస్తూ కనిపించింది. రెండడుగులు లోపలికి వేసి.. గదంతా టార్చ్‌ లైట్‌ తిప్పాడు. నీట్‌గా.. సాంబ్రాణి వాసనతో ఆహ్లాదంగా ఉంది. 

షాక్‌ అయ్యాడు ధీరజ్‌. గదిలోంచి వెనక్కి వచ్చాడు. మళ్లీ గబ్బిలాల కంపు.. ఎలుకలు.. కిచకిచలు..ఇంకోసారి పరీక్షిద్దామని లోపలికి వెళ్లబోతుంటే పైన గదిలోంచి శబ్దం... తూగుటుయ్యాల ఊగుతున్నట్టు.. కూయి.... కూయి.. అంటూ!మేడ పైకి  ఎక్కేందుకు  మెట్ల కోసం చూశాడు.. ఎక్కడా కనపడలేదు. గబగబా ఆ ఇంటి వెనక్కి వెళ్లాడు చీకట్లో అదే టార్చ్‌ లైట్‌ సహాయంతో. అక్కడా మెట్లు కనపడలేదు. కుడి వైపు.. ఎడమ వైపు.. ముందు వైపు.. అలా ఇంటికి నాలుగు దిక్కులా వెదికాడు.. ఎక్కడ మెట్ల ఆనవాలు లేదు. మరి మేడ మీద గది ఉన్నట్టు.. ఉయ్యాల ఊగుతున్నట్టూ చప్పుడేంటి... తన భ్రాంతా? అని సణుక్కుంటూ మళ్లీ ఇంట్లోకి వెళ్లాడు. ఇల్లంతా టార్చ్‌ తిప్పాడు. గోడలన్నీ మంటల్లో పొగచూరినట్టుగా నల్లగా ఉన్నాయి. ఒక్కసారిగా హాహాకారాలు.. అరుపులు.. కేకలు.. బిందెల కొద్దీ నీళ్లు కుమ్మరిస్తున్న సౌండ్‌.. గాజుల గలగలలు.. గాబరాగా నడుస్తుంటే  వచ్చే పాదాల పట్టీల చప్పుడు.. దిమ్మ తిరిగింది ధీరజ్‌కి.. మొహమంతా ముచ్చెమటలు... ఆ శబ్దం అంతకంతకూ ఎక్కువవుతూ.. అదంతా తన చుట్టే జరుగుతున్నట్టనిపించి ఒక్కసారిగా ఆ ఇంటి బయటకు పరిగెత్తాడు. వాకిట్లోకి రాగానే .. చెవుల్లోంచి ఎవరో ఆ గోలను తీసి అవతల పారేసినట్టు ప్రశాంతంగా  అనిపించింది ధీరజ్‌కు. ఇందాకటి అలజడీ లేదు. వెనక్కి తిరిగి చూసే సాహసం చేయకుండా గేట్‌ తోసుకుంటూ రోడ్డు మీదకు వచ్చిపడ్డాడు.భయం భయంగానే ఆ ఇంటి వైపు చూశాడు.  లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతోంది కొత్త ఇల్లులా! చుట్టూ మొక్కలు.. చెట్లతో  ముస్తాబై  ఉంది.. ఎప్పటిలా!

ధీరజ్‌కు ముప్పై ఏళ్లుంటాయి. ఇంకా పెళ్లి కాలేదు. సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా. ఆ వీధిలోకి  కొత్తగా చేరాడు. ఆ కాలనీకి వచ్చినప్పుడే ఆ  మేడ మీద ధీరజ్‌ కన్ను పడింది. అందంగా కంటే కూడా దృష్టిని ఆకర్షించే ప్రత్యేకతేదో ఉంది ఈ మేడ మీద అని అనుకునేవాడు దాన్ని చూసినప్పుడల్లా. రోజూ షూటింగ్స్‌ ముగించుకొని ఇంటికొచ్చే సరికి అర్ధరాత్రి అవుతుంది. వీధి మొదట్లోనే క్యాబ్‌ దిగి...వీధి చివర ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ మేడ ముందుకు రాగానే దాన్నే తిరిగి తిరిగి చూస్తూ ముందుకు సాగడం అతనికి ఇష్టం. రాత్రి పన్నెండు దాటినా ఆ ఇల్లంతా లైట్లతో వెలుగుతూంటుంది. అంత రాత్రీ  మనుషుల అలికిడి ఉన్నట్టే కనిపిస్తుంది. తన ఇంటికి రెండిళ్ల ముందు ఉంటుంది ఈ మేడ. తన ఇంట్లో  పనిచేసే అమ్మాయిని అడిగాడు.. ‘‘ఆ ఇల్లు ఎవరిది?’’ అని. 
 ఏమీ అర్థం కానట్టు ‘‘ఏ ఇల్లు సార్‌?’’ అంది ఆమె. ‘‘అదే ఆ మూడో ఇల్లు?’’  చేతితో ఆ డైరెక్షన్‌ను చూపిస్తూ మరీ అడిగాడు. ‘‘మూడో ఇల్లా?’’ అంటూ ముక్కున వేలేసుకొని అతను చూపించిన వైపు చూసింది  ఆమె.నటిస్తోందా? నిజంగానే తెలియదా? సందేహిసూ ్త ఇక ఆ ఇంటి గురించి  రెట్టించలేదు.!ఆ  ఉదయం.. తను పాల పాకెట్‌ తీసుకొని వస్తూంటే  కనిపించింది పనమ్మాయి ఆ ఇంట్లోంచి బయటకు వెళ్తూ. మరి  ఆ రోజు ఎందుకలా నటించింది? తను ఆ ఇంటి గురించి అడిగితే అసలు అక్కడ ఇల్లే లేనట్టు?.. అనే అనుమానం  అతని మెదడులో లిప్తపాటు కదిలి మాయమైపోయింది. 
ఇప్పుడు.. రాత్రి.. షూటింగ్‌ నుంచి వస్తూ వస్తూ.. ‘‘ఎలాగైనా లోపలికి వెళ్లి.. ఆ ఇల్లు ఎలా ఉంటుందో? అంత రాత్రి పూటా లైట్లన్నిటినీ ఎందుకు వెలిగిస్తారో? అందులో   ఎంత పెద్ద కుటుంబం ఉంటోందో? లాంటి జిజ్ఞాస ధీరజ్‌ను లోపలికి లాక్కెళ్లింది. ఆ ఇల్లు లోపల కూడా అంతే అందంగా ఉంటే బాగుంటే షూటింగ్‌కి ఇస్తారేమో కనుక్కోవాలి అనీ నిశ్చయించుకున్నాడు.

తీరా లోపలికెళ్లాక చూస్తే.. భూత్‌ బంగ్లాలా బెదరగొట్టింది.. ఇంటికెలా వచ్చాడో తెలియదు. రాగానే ఫ్రిజ్‌ తెరిచి గటగటా మంచి నీళ్లు తాగాడు. మార్గశిర మంచులో కూడా  గ్రీష్మ తాపం.. చెమటతో ఒళ్లంతా  తడిసి ముద్దయిపోయింది. అలాగే సోఫాలో కూలబడ్డాడు.. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడు.. చీకటి.. ఆ చీకట్లో ఓ మేడ.. ఇంట్లో హాహాకారాలు.. గాజుల గలగలలు.. మువ్వల సవ్వడి.. తూగుటుయ్యాల ఊగుతూ.. కిటికీ రెక్కలు కొట్టుకుంటూ.. తలుపు కిర్రున తెరుచుకుంటూ.. ముక్కు పుటాలు అదిరే గబ్బిలాల కంపు.. ఎలుకల కదలికలు.. సాంబ్రాణి వాసన..ఒక్కసారిగా తల విదిలించి.. కళ్లు తెరిచాడు..
ఎదురుగా.. పనమ్మాయి.. నవ్వుతోంది.. తెరలు తెరలుగా! ‘‘అక్కడ ఇల్లు కనిపించిందా నీకు? అంటే నువ్వు నా వాడివే అన్నమాట.  ఆ రోజు కట్నం చాల్లేదని పెళ్లి పీటల మీద నుంచి నువ్వు  వెళ్లిపోయేసరికి .. అవమానంతో ఒంటికి నిప్పంటించుకున్నా. ఒంటిని కాలుస్తున్న ఆ మంటలను  తట్టుకోలేక ఇల్లంతా పరిగెత్తా .. ప్చ్‌.. నాతో పాటు మా వాళ్లూ కాలి బూడిదైపోయారు తెలుసా?’’ అంటూ బాధగా  గోడకు ఒరిగింది ఆమె...‘‘ఎప్పటికైనా నువ్వొస్తావని తెలుసు. అందుకే ఆ ఇల్లు వదిలిపెట్టలేదెవ్వరం!  ఇన్నేళ్లకు వెదుక్కుంటూ వచ్చావ్‌. రా.. మనింటికి పోదాం...’’ అంటూ  ధీరజ్‌  చేయి పట్టుకుంది. చేతి నిండా గాజులు.. పరీక్షగా చూశాడు ఆమెను.. పెళ్లి కూతురు అలంకరణలో ఉంది.‘‘హేయ్‌ .. ఎవరు నువ్వు? నా చేయి వదులు..’’ అంటూ చేయి విదిలిస్తున్నాడు. గొంతు పెగలట్లేదు.. చేయి కదలట్లేదు.. అరుస్తున్నాడు.. విదిలిస్తున్నాడు..  పట్టు బిగిస్తూ  నవ్వుతోంది ఆమె.. గట్టిగా.. క్రూరంగా!
సరస్వతి రమ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement