ఏమో... గాడిద పాడవచ్చు! | Funday special to Laughing fun | Sakshi
Sakshi News home page

ఏమో... గాడిద పాడవచ్చు!

Published Sun, Aug 5 2018 1:22 AM | Last Updated on Sun, Aug 5 2018 1:22 AM

Funday  special to Laughing fun  - Sakshi

విక్రమార్కుడి భుజాల మీద తిష్ట వేసిన బేతాళుడు గొంతు సవరించాడు. క్వశ్చన్‌ అడగడానికి రెడీ అయ్యాడు.‘‘ఇప్పుడు నేనొక ప్రశ్న అడుగుతున్నాను...’’ అని బేతాళుడు అనబోయాడో లేడో విక్రమార్కుడు అడ్డుకొని..‘‘ఆగవయ్యా బాబు’’ అంటూ కసురుకున్నాడు.‘‘మీ మూడ్‌ బాలేనట్లుంది. తర్వాత అడుగుతాలే...’’ నసిగాడు బేతాళుడు.‘‘మూడ్‌ బాగుండడం బాలేకపోవడం ఇక్కడ మ్యాటర్‌ కాదు. ఇదిసరే...నువ్వు ఒకే ఒక్కడు సినిమా చూశావా బేతాళా?’’ అడిగాడు విక్రమార్కుడు.‘‘ఒకే ఒక్కడే కాదు రాజమౌళి విక్రమార్కుడు సినిమా కూడా చూశాను’’ బదులిచ్చాడు బేతాళుడు.‘‘గుడ్‌. ఒకేఒక్కడు సినిమాలో అర్జున్‌కు రఘువరన్‌ ఒక సవాలు విసురుతాడు. నా సీట్లో ఇరవైనాలుగు గంటలు కూర్చుంటే తెలుస్తుంది నీకు అని... గుర్తుందా?’’ అన్నాడు విక్రమార్కుడు.‘‘ఎందుకు గుర్తు లేదు...ఆ సీన్‌ ఇప్పుడు నాకెందుకు గుర్తు తెస్తున్నావు?’’ అడిగాడు బేతాళుడు.‘‘ఆ సినిమాలో రఘువరన్‌లా నేను నీకు సవాలు విసురుతున్నాను. నువ్వు కొద్దిసేపు నా పాత్ర పోషించు. ఎప్పుడూ నువ్వు క్వశ్చన్‌ అడుగుతావు... నేను  ఆన్సర్‌ చెబుతాను కదా! ఈసారి అలా కాదు... నేను క్వశ్చన్‌ అడుగుతాను. నువ్వు ఆన్సర్‌ చెప్పాలి. అప్పుడుగానీ అడిగే వాడికి చెప్పేవాడు ఎంత లోకువో తెలియదు’’ అన్నాడు విక్రమార్కుడు. ‘‘దాన్దేముంది రాజా! అడిగేయ్‌.... ఎంత టఫ్‌ క్వశ్చన్‌ అడిగినా జవాబు చెబుతాను’’ ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుండగా అన్నాడు బేతాళుడు.గొంతు విప్పాడు విక్రమార్కుడు...‘‘ఆయన పేరు రంగభూపతినాయుడు. సిటీలో పేరున్న క్రిమినల్‌ లాయర్‌. నువ్వు ఎక్స్‌స్పెక్ట్‌ చేసినట్లుగానే ఆయనకొక ముద్దుల కూతురు. పేరు మృదుల. ఆమె స్వాతిముత్యంకుమార్‌ ప్రేమలో పడింది.తన పేరులాగే ఈ స్వాతిముత్యంకుమార్‌ పరమ సాత్వికుడు. భూపతినాయుడు ఆస్తి అంతస్తులతో పోల్చితే స్వాతిముత్యంకుమార్‌ ఏ మూలకూ సరిపోడు.

స్వాతిముత్యంకుమార్‌ ఓ ఫైన్‌మార్నింగ్‌  భూపతినాయుడు ఇంటికివెళ్లి కాలింగ్‌బెల్‌ నొక్కాడు.అప్పుడే నిద్ర లేచిన నాయుడు తలుపులు తీసి ఆవులిస్తూ....‘‘ఎవరు నువ్వు? ఈ టైమ్‌లో ఎందుకువచ్చావు? నీకు నాతో పనెంటీ... ఒకవేళ ఉన్నా ఈ టైమ్‌లో ఏంటి...’’ ప్రశ్నల పరంపరతో దూసుకుపోయాడు  భూపతినాయుడు.‘‘నమస్కారం సార్‌. నా పేరు స్వాతిముత్యం కుమార్‌. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. మీరు ఆశీర్వదిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’’ అంటూ చెప్పి ఒక కాగితం నాయుడు చేతికి ఇచ్చాడు స్వాతిముత్యంకుమార్‌.‘‘ఏమన్నావ్‌? నన్నెవరనుకుంటున్నావ్‌’’ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు నాయుడు.సరిగ్గా  ఆ టైమ్‌లోనే యోగా గురువు యోగానంద్‌ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది.‘తన కోపమే తన శత్రువు... హెల్త్‌ సర్వనాశనం’వెంటనే కూలై పోయి....‘‘మా అమ్మాయిని పెళ్లాడతానంటావు. అంతేకదా! మరి ఈ కాగితం ఏంటమ్మా?’’ అడిగాడు నాయుడు.‘‘నా కండక్ట్‌ సర్టిఫికెట్‌ సార్‌’’ బదులిచ్చాడు స్వాతిముత్యంకుమార్‌.‘‘మా నాయినే. నీ బ్యాంక్‌ బాలెన్స్‌ ఎంత?’’  వెటకారం ధ్వనించేలా అడిగాడు నాయుడు.‘‘ఖాళీ... నా హృదయం అనే బ్యాంకులో మాత్రం వేల కోట్ల కంటే విలువైన ప్రేమ ఉంది’’ తన్మయంగా అన్నాడు స్వాతిముత్యంకుమార్‌.‘‘నీ కవిత్వానికేంగానీ, చిరంజీవి నటించిన ఛాలెంజ్‌ సినిమా చూశావా? మై డియర్‌ స్వాతిముత్యం?’’‘‘అప్పుడెప్పుడో టీవీలో వచ్చినప్పుడు చూశాను...’’‘‘అయిదేళ్లలో అయిదు లక్షలు సంపాదిస్తే నా కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని రావుగోపాలరావు చిరంజీవితో అంటాడు. ఆ ఛాలెంజిని చిరంజీవి స్వీకరిస్తాడు. మరి నేను కూడా నీకో ఛాలెంజ్‌ విసురుతున్నాను. రెడీనా?’’ ‘‘రెడీ’’‘‘అదిగో ఆ మూలన కట్టేసిన గాడిదను చూశావా. గాడిదపాలు ఆరోగ్యానికి మంచివని  చెబితే మొన్ననే కొన్నాను. ఈ గాడిదను నీకు ముందస్తు పెళ్లికానుకగా ఇస్తున్నాను.నువ్వు చేయాల్సిందేమిటంటే....వారం తిరిగేలోపు ఈ గాడిద ద్వారా లక్ష రూపాయలు సంపాదించాలి. అలా చేస్తే నీకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను.’’ ‘‘మీ ఛాలెంజిని స్వీకరిస్తాను. వారం తిరిగేలోపు మీ చేతిలో లక్ష కాదు... రెండు లక్షలు పెడతాను’’

‘‘ఇప్పుడు చెప్పు బేతాళా! స్వాతిముత్యం రెండు లక్షలు సంపాదించాడా? ఒకవేళ సంపాదిస్తే ఎలా సంపాదించాడు? చెప్పకపోయావో.... ఇక నన్నెప్పుడూ  వెధవ ప్రశ్నలు అడుగొద్దు’’ హెచ్చరించాడు విక్రమార్కుడు.బేతాళుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు:‘‘గాడిద లాటరీ.... పేరుతో రంగంలోకి దిగాడు స్వాతిముత్యం. ఎవరైనా గాడిద కోసం లాటరీ టికెట్‌ కొంటారా? ఎందుకు కొనరు? అది ఆషామాషీ గాడిద కాదు. పాటలు పాడే గాడిద. ‘కేవలం వేయి టికెట్లు మాత్రమే... ఒక్కో టికెట్‌కు వేయి రూపాయలు మాత్రమే!’ అని ప్రచారం ప్రారంభించాడు స్వాతిముత్యం. టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆరోజు లక్కీడ్రా తీశారు. లాట్రీ  ఎంకయ్య పేరు వచ్చింది. నిజానికి ఎంకయ్య ఇంటిపేరు లాట్రీ కాదు... మాటూరి. లాటరీ టికెట్ల పిచ్చి ఉండడంతో అందరూ ఎంకయ్యను లాట్రీ ఎంకయ్య అని పిలుస్తుంటారు. లాటరీ టికెట్‌ తగలడంతో తన జన్మధన్యమైంది అనుకున్నాడు ఎంకయ్య. వెయ్యిరూపాయలతో సొంతం చేసుకున్న గాడిదతో దేశవిదేశాల్లో సంగీతకచేరీలు పెట్టి కోట్లు సంపాదించాలని కలలు కంటూ స్వాతిముత్యం ఇంటికి వెళ్లాడు.పాడుతుంది అనుకున్న గాడిద పాడలేదు సరికదా... నాన్‌స్టాప్‌గా ఓండ్ర పెడుతూనే ఉంది.‘అన్యాయం... మోసం’ అని అరిచాడు వెంకయ్య.‘ఇదిగో నీ వెయ్యి రూపాయలు. దీంతో పాటు అయిదు లక్షలు కూడా ఇస్తున్నాను. విషయం మాత్రం ఎక్కడా బయటపెట్టవద్దు’ అని డబ్బుల సంచి ఎంకయ్య  చేతిలో పెట్టాడు స్వాతిముత్యం.అంతే... అతడి  నోరు మూతపడింది. తన దగ్గర ఉన్న మరో అయిదు లక్షలతో భూపతినాయుడు ఇంటికి వెళ్లాడు స్వాతిముత్యం,‘‘శబ్భాష్‌ బేతాళా! కఠినమైన ప్రశ్నలు అడగడమే కాదు... కఠినమైన ప్రశ్నలకు జవాబు కూడా చెప్పగలవని రుజువు చేశావు’’ అంటూ భుజం మీది బేతాళుడిని తెగ ప్రశంసించాడు విక్రమార్కుడు.
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement