
తపాలా: అయ్యో, పాప!
సఖినేటిపల్లి- కాకినాడ బస్సు మలికిపురం స్టాప్‌లో ఆగింది. ‘‘అమ్మా! జాగ్రత్త’’ నా సతీమణి అంది.
‘‘అత్తగారూ, క్షేమంగా వెళ్లి రండి’’ నేనన్నాను. ‘‘అలాగేనమ్మా, బాబూ వస్తాను’’ అత్తగారు బస్సెక్కుతూ అంది.
బస్సు స్టార్టయింది. కదిలింది. వెళ్లిపోయింది! ఇంతకీ, నా సతీమణి తమ్ముడి రెండేళ్ల కూతురు ఈవిడ చంకలోనే ఉండిపోయింది. దాన్ని అత్తగారూ, మేమూ మర్చిపోయాం. మా ఆవిడా, నేనూ ఇద్దరం అవాక్కయ్యాం. ఈ సంఘటన జరిగి, సుమారు పాతికేళ్లు పైబడింది. అప్పట్లో ఆ ప్రాంతంలో ట్రాన్స్‌పోర్ట్ అంతంత మాత్రమే! రావాలన్నా, వెళ్లాలన్నా కొన్ని గంటలు పట్టేది. మలికిపురం చిన్న ఊరు. ఆ ప్రాంతాలకన్నిటికీ సెంటర్ అవడం చేత, పెద్ద కనెక్టింగ్ జంక్షన్‌గా ఉంటుంది. ఆ ఊళ్లో నేను లెక్చరర్‌ని. ఇంతకీ ఈ సంఘటనలో ఆ ‘పరపతే’ పనికొచ్చింది. ‘‘మాస్టారూ! ఏంటి టెన్షన్‌గా ఉన్నారు? బస్సెక్కుతారా?’’అన్నారు కండక్టర్. ఆ బస్సు సఖినేటిపల్లి నుంచి రాజోలువరకూ వెళ్తుంది. గబగబా జరిగింది చెప్పాను. ఆ కండక్టర్ నా మాజీ స్టూడెంట్!
‘‘పాపనిటివ్వండి సార్. కాకినాడ బస్సు అరగంట రాజోల్లో ఆగుతుంది. మీ అత్తగారికిచ్చేస్తాను’’ అని వివరాలు కనుక్కొని పాపని తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు. పాపనిచ్చింతర్వాత ఊపిరి పీల్చుకున్నాం. ఇంతకీ కొసమెరుపేంటంటే... మా స్టూడెంట్ కండక్టర్ పాపని ఇచ్చేంత వరకూ మా అత్తగారికి పాప చేతుల్లోలేదన్న విషయమే గుర్తులేదంట!
- పాలపర్తి ధన్‌రాజ్
కాకినాడ
నా చెల్లెమ్మ!
మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నేనే పెద్దదాన్ని. మాకు అన్న, తమ్ముడు ఎవరూ లేరు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నాకు ఇద్దరు పిల్లలు. చిన్న బాబుకి ఐదేళ్లు. వాడు కడుపులో ఉన్నప్పుడు నా గొంతు దగ్గర చిన్న కాయలా వచ్చింది. నేను ఎప్పుడూ దాని గురించి అంతగా బాధపడలేదు. కాని ఆ కాయ లోపల బాగా పెరిగిపోయి, దాన్నుండి నాకు ఆయాసం వచ్చేది. పని చేస్తున్నప్పుడు చాలా కష్టమనిపించేది. ఆ విషయం మా చెల్లికి చెప్పాను. నన్ను వాళ్ల ఊరు తణుకులో డాక్టర్‌కి చూపించి, నాకు ఆపరేషన్ చేయించుకోవడానికి ధైర్యాన్ని ఇచ్చింది తనే. అంతేకాదు, నా చెల్లివాళ్ల భర్త కూడా డాక్టరే.
ఆయన నాకు తండ్రిలాగా అంతా దగ్గరుండి టెస్టులకు తీసుకెళ్లేవారు. కానీ రిపోర్ట్స్‌లో ఏముందన్నది నాకు ఎప్పుడూ చెప్పేవారు కాదు. దగ్గరుండి వాళ్లే సర్జరీ చేయించారు. నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాకగానీ నా రిపోర్ట్స్ చూపించలేదు. అది విన్నాక, నేను చాలా షాక్ అయ్యాను. గొంతులో ఆ కాయ ఎంత పెరిగిపోయిందంటే, నా ఎయిర్ పైప్‌నే బెండ్ చేసి బ్రెయిన్‌కి వెళ్లే నరాలకు డ్యామేజ్ అయ్యేదట ఇంకొంచెం ఆలస్యం చేసి ఉండుంటే. అది జరగకుండా వాళ్లు నన్ను దేవుడిలా రక్షించారు.
‘నాకు నా తల్లి జన్మను ప్రసాదిస్తే, నా చెల్లి పునర్జన్మను ప్రసాదించింది’. ఎందుకిలా రాస్తున్నానంటే, ఎవరిది వాళ్లు, ఎవరి జీవితాలు వాళ్లవి అనేటట్లుగా ఉంటున్న కాలంలో నా చెల్లి కుటుంబం నా మీద చూపిన ప్రేమను ఎప్పుడూ మరిచిపోలేను.
- యామిని
రామాంతపూర్, హైదరాబాద్