కమలహాసన్ దువ్వెన | Funday story of the week | Sakshi
Sakshi News home page

కమలహాసన్ దువ్వెన

Published Sun, Jul 20 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

కమలహాసన్ దువ్వెన

కమలహాసన్ దువ్వెన

కథ: ఆ రోజు ఉదయం ఏడు గంటల సమయంలో ఇంటి ముందు వరండాలో కూర్చుని కాఫీ తాగుతున్నాను. ఇంతలో తెల్ల యూనిఫారమ్‌లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి ఇన్విటేషను కార్డు అందించాడు. అందించడమే కాదు అతని దగ్గర ప్రింటు చేసి ఉన్న లిస్టులో నా పేరున్న సీరియల్ నంబరుకెదురుగా సంతకం పెట్టించుకున్నాడు.
 
 ‘ఎవరు పంపారు’ అన్నాను అర్థంగాక. ‘చూసుకోండి’ అన్నట్లు తలాడించి నాకు సెల్యూట్ చేసి వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు. నేను ఆశ్చర్యంగా కవరులోంచి ఇన్విటేషన్ కార్డు బయటకు తీశాను. అది పక్కరోజు జరగబోయే షష్టి మహోత్సవ ఆహ్వాన పత్రిక. కింద చూశాను ఇట్లు, మీ మిత్రుడు కె.శ్రీనివాసరావు, ఉరఫ్ కమలహాసన్ అని ఉంది. నాకు చాలా ఆనందమనిపించింది. దాదాపు ఎనిమిదేళ్లు అయింది కమలహాసన్‌ని చూసి. కారణం అతను వైజాగ్‌లో ఉద్యోగం చేస్తూ అరవై ఏళ్లు పూర్తి కాగానే వారం క్రితం రిటైరయ్యాడు. అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సొంత ఊరు ఒంగోల్లో తన చిరకాల మిత్రుల మధ్య షష్టిపూర్తి మహోత్సవం చేసుకుంటున్నాడు. ముప్పయ్యేళ్ల క్రితం ఒంగోల్లో నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో శ్రీనివాసరావు పరిచయమైంది. కానీ శ్రీనివాసరావుగా కాదు కమలహాసన్‌లా. అప్పుడే అసలు కమలహాసన్ యువ హీరోగా వెండితెరను ఏలుతున్నాడు. యువకులు, యువతులు వేలం వెర్రిగా అతని అభిమానులుగా మారిన నాలుగు దశాబ్దాల క్రితపు కాలమది.
 
 నెత్తిన ఒత్తయిన జుట్టు, గుబురుగా పెరిగి పొడవుగా భుజాల మీద వేలాడుతున్న వెంట్రుకలు, కిందికి దిగిన లావు మీసాలు, కళ్లకు స్టైలుగా వెడల్పైన అద్దాలు, బొమ్మల చొక్కా, బెల్‌బాటమ్ ప్యాంటు, స్టైలుగా నడవడం, ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడకుండా రిజర్వుడుగా ఉండటం శ్రీనివాసరావు లక్షణాలు. అంతేకాదు, అతని బట్టల నుంచి ఎప్పుడూ సువాసనలు వెదజల్లే సెంటు వాసనలు ఆఫీసంతా చుట్టుముట్టేవి.
 అతను తలకు ఆనాడు సినిమా నటులు వాడే ఖరీదైన ‘బ్రిల్‌క్రీమ్’ పూసేవాడని, అదే విధంగా దుబాయ్ నుంచి దిగుమతి అయ్యే ఖరీదైన అత్తర్లు, ప్యారిస్‌లో తయారయ్యే సరికొత్త సెంట్లు పూసేవాడని ఆఫీసులో గుసగుసలు చెప్పుకొనేవారు.
 
అతను ఆఫీసు ఖాళీ సమయాల్లో ట్రాన్సిస్టర్ చెవి దగ్గర పెట్టుకుని వరండాలో తిరుగుతూ హిందీ పాటలు వినేవాడు. ఎవరైనా స్నేహం చేయాలనిచూసినా, ఆ అవకాశం ఇచ్చేవాడు కాదు. తనకి హాస్యమన్నా హ్యూమరన్నా చాలా ఇష్టం అనేందుకు గుర్తుగా ఖాళీ సమయాల్లో ఎప్పుడూ అతని చేతిలో బాపూ కార్టూన్ల పుస్తకం గాని, ముళ్లపూడి వ్యంగ్య రచన గాని ఉండేది. మేము డైనింగు రూములో లంచ్ చేసి కుళ్లు జోకులతో కాలం గడిపితే, అతను ఆ సమయంలో ఆ పుస్తకాలు చదువుతూ ఎంజాయ్ చేసేవాడు. ఆ సమయంలో పళ్లు ఇకిలించడం గాని, గొంతు సకిలించడం గాని లేకుండా మౌనంగా వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించేవాడు.
 
 అతన్ని పాతికేళ్ల కాలానికి ముందున్న వ్యక్తిగా భావిస్తూ, మేము అతని ముందు బీసీ కాలపు మానవుల్లా మాకు మేము భావించుకునేవాళ్లం. సెక్షన్ హెడ్‌లతో సహా అందరం సైకిళ్ల మీద వస్తే అతను మాత్రం ‘దడ్... దడ్...’మంటూ ‘బుల్లెట్’ అని పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద రాయల్‌గా దిగేవాడు. ఎప్పుడూ సఫారీ డ్రెస్‌లో ఉండేవాడు. అదే రంగు షూస్ ధరించేవాడు. మేము స్నేహితులం లెఖ్క పెట్టుకుని వంతులవారీగా అతిజాగ్రత్తగా కింద టీ కొట్టుకు వెళ్లి టీ తాగేవాళ్లం. కమలహాసన్ ఏనాడూ కిందికి వెళ్లి టీ తాగేవాడు కాదు. తన సీటు దగ్గరకే టైము ప్రకారం టీ తెప్పించుకుని ఒక్కడే తాగేవాడు. టీ తెచ్చినవాడికి రెండు టీల డబ్బు ఇచ్చేవాడు. అంతేకాదు, నెల మొదటి తేదీన వాడికి ఠంచనుగా అయిదు రూపాయల నోటు బక్షీస్‌గా పడేసేవాడు. గ్రాము బంగారం యాభై రూపాయలుండే ఆ రోజుల్లో టీ కుర్రాడి జీతం పది రూపాయలు. అలాంటిది ఆదివారాల్లో కాక రోజుకు రెండుసార్లు టీ తెచ్చినందుకు కమలహాసన్ ఇచ్చిన ఐదు రూపాయలకు వాడి కళ్లు కన్నీటితో చెమర్చేవి.
 
  సంవత్సరానికొకసారి దసరాకు కూడా బక్షీస్‌గా రూపాయి ఇవ్వడానికి వంద సాకులు చెప్పి తప్పించుకునే మేము, కమలహాసన్ లగ్జరీ జీవితానికి ఆశ్చర్యపోయేవాళ్లం. పూర్వీకుల సంపద అతని చేతి నిండా ఉండటమే దానికి కారణం. ఇకపోతే కమలహాసన్ వాడేసిన సెంటు సీసాల కోసం, హేర్ ఆయిల్ బాటిళ్ల కోసం, ఇంపోర్టెడ్ పౌడరు డబ్బాల కోసం అటెండర్లు ముందుగానే రిజర్వు చేసుకునేవాళ్లు. ఏదో కాస్తా, కూస్తో తప్పకుండా మిగిలి ఉంటుందని వాళ్ల నమ్మకం. నిజమే, కమలహాసన్ అంతో ఇంతో అడుగున మిగిల్చేవాడు. అడుగు వరకు నాకినట్లు ఉపయోగించడం అతనికి నామోషీ, చిన్నతనం.
 
 కమలహాసన్ ఫైలు సీటు నుంచి పోయిందంటే దాని వెంట ఓ సుగంధం నిండిన మలయమారుతం వెళ్లినట్లే. ఆ ఫైలు తీసుకుపోవడానికి అటెండరు కూడా చాలా సంతోషంగా గుండెలకు హత్తుకుని మరీ తీసుకువెళ్తాడు. కారణం ఆ రోజంతా అతని చొక్కా సుగంధ పరిమళాన్ని వీస్తూనే ఉంటుంది.
 ఫైళ్లు చూస్తున్న హెడ్ క్లర్కు ‘అరె! కమలహాసన్ ఫైలు వచ్చినట్లుందే. దాన్ని పైన పెట్టు’ అంటాడు అటెండరుతో.
 ఫైలు విప్పి చదువుతూ, ‘‘బాబూ! ఆ కమలహాసన్ని పిలువు. ఫైలు మీద కొంత క్లారిఫికేషను కావాలి’’ అంటాడు.
 కమలహాసన్ వచ్చి సెక్షన్ హెడ్‌కెదురుగా స్టైలుగా కూర్చుంటాడు. అతని వెంట వచ్చిన సుగంధ పరిమళాలు సెక్షన్ హెడ్ రూమును చుట్టుముడుతాయి. ‘‘నిన్ను పిలిపించానని ఏమనుకోవద్దు కమలహాసన్. నీ ఫైళ్లు వివరంగా విషయం అర్థమయ్యేట్లుంటాయి. పిలిపించింది ఫైలు డిస్కషన్‌కి కాదు. నువ్వు వాడే సెంటు ఎక్కడ దొరుకుతుందో, ఎంతవుతుందో తెలుసుకోవడానికే’’ ముక్కు ఎగబీలుస్తూ అంటాడు సెక్షన్ హెడ్ శంకరయ్య.
 కమలహాసన్ చిన్నగా దగ్గి, ‘‘ఈ రోజు వాడింది బెనారస్ నుంచి తెప్పించాను. బాటిలు యాభై రూపాయలు’’ అంటాడు.
 ‘‘అమ్మో. అంతా. ఇంటి అద్దె కొస్తుంది. ఏదో నా సెకండ్ సెటప్‌కి ప్రెజెంట్ చేద్దామనుకున్నా. ఈ జన్మకు జరగని పని’’ నిరాశగా అంటాడు సెక్షన్ హెడ్ శంకరయ్య.
 నున్నగా ఉన్న గ్రౌండు అంచుల్లో పెరిగిన గడ్డిలా, నెత్తిన నున్నని బట్టతల దాని చుట్టూ చెవులపైన పీచు వెంట్రుకలు ఉన్న శంకరయ్య, ఎవరైనా ఆఫీసుకు అత్తరు అమ్మేవాళ్లు వస్తే, తప్పకుండా పిలిచి బేరం చేసి కొంటుంటాడు. అది ఎందుకు కొంటుంటాడో అప్పుడు అర్థమైంది కమలహాసన్‌కి.
 ‘‘డోంట్ వర్రీ. వారం రోజుల్లో నేను తెప్పిస్తాను’’ అంటూ కమలహాసన్ అక్కడ నుంచి లేచాడు.
 శంకరయ్య ముఖం చేటంతయింది. ‘‘చల్లగా ఉండు నాయనా’’ అంటూ అక్కడి నుంచే దీవించాడు. కారణం కమలహాసన్ దాని ఖరీదు తీసుకోడు. అది అతని పాలసీకి వ్యతిరేకం.
 ఆఫీసరు దగ్గర నుంచి అన్ని ఫైళ్లు వచ్చినా, కమలహాసన్ ఫైలు మాత్రం నిద్ర చేయందే రాదు. కారణం ఆఫీసరే చెబుతాడు. ‘‘నా ఆఫీసు రూమ్‌లో ఎన్ని స్ప్రేలు వాడినా ఎలుకల కంపు మాత్రం పోయేది కాదయ్యా. కమలహాసన్ ఫైళ్లు ఒక రాత్రి నిద్ర చేయడం వల్ల ఆ దరిద్రం పోయి రూము సువాసనలు చిందుతుందయ్యా. ఇంకా కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది’’ అంటాడు.
 ఇలా అటెండరు మొదలుకుని, ఆఫీసరు వరకు ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో కమలహాసన్ గురించి మాట్లాడకుండా ఉండలేరు.
 ఇలా ఉండగా, ఒకరోజు కమలహాసన్ తన చేతిగుడ్డ మరిచిపోయాడు. దాన్ని దాచి పక్కరోజు ఇవ్వబోయిన అటెండరుకు దాన్ని అతన్నే ఉంచుకోమన్నాడు. అదే భాగ్యంగా భావించాడా వ్యక్తి. అది చినిగిపోయేవరకు అతను దాన్ని భద్రంగా జేబులో దాచుకున్నాడు. పరిమళం పోతుందని దాన్ని ఆ మధ్యకాలంలో ఉతకను కూడా లేదు.
 ఒకరోజు పోస్ట్‌మ్యాన్ ఒక పార్సిలుతో వచ్చాడు.
 ‘‘ఇక్కడ కె.శ్రీనివాసరావు, ఎల్.డి.క్లర్కు ఎవరండీ?’’ అనడిగాడు.
 ‘‘ఎవరూ లేరండి’’ అని చెప్పారు ఆఫీసు స్టాఫు.
 ‘‘ఆఫీసు అడ్రసు ఇదేనే’’ అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు పోస్టుమ్యాన్. మరుసటిరోజు పార్సిలు తీసుకువచ్చిన అదే పోస్టుమ్యాన్, ‘‘ఇక్కడ కమలహాసన్ ఎవరండీ?’’ అని అడిగాడు.
 ‘‘బి సెక్షనులో ‘ఎ’ క్లర్కు’’ అటెండర్లంతా ఏకకంఠంతో చెప్పారు.
 అక్కడకు వెళ్లిన పోస్టుమ్యాన్, ‘‘సార్, కమలహాసన్ అంటే మీరేనా?’’ అనడిగాడు.
 ‘‘అవును.’’
 ‘‘కె.శ్రీనివాసరావు మీరేనా?’’
 ‘‘అవునవును.’’
 ‘‘అనవసరంగా టెన్షన్ పడ్డాను సార్. ఆ టీ కుర్రాడు చెప్పబట్టి సరిపోయింది. లేకపోతే ఆ పార్సిలు పట్టుకుని రోజూ తిరగాల్సొచ్చేది’’ అంటూ పార్సిలు అందించాడు.
 ‘‘సార్, భుజాల కిందికి వచ్చిన హిప్పీ క్రాఫు, లావు మీసాలు, కింది దాకా వచ్చిన జులపాలు, బెల్‌బాటమ్ ప్యాంటు, బొమ్మల చొక్కా, వెడల్పైన కళ్లద్దాలు. అచ్చం ‘మన్మథ సామ్రాజ్యం’లోని కమలహాసన్‌లానే ఉన్నారు. నేను కూడా మిమ్మల్ని కమలహాసన్ అనే పిలుస్తాను సార్’’ భయం భయంగా అన్నాడు పోస్టుమ్యాన్.
 ‘‘ఓకే. గ్రాంటెడ్. అలాగే పిలువు. అలా పిలిస్తేనే నాకు సంతోషం’’ అన్నాడు కమలహాసన్.
 అలా కమలహాసన్‌తో కలిసి ఐదేళ్లు ఉద్యోగం చేశాం. తరువాత అతనెవరో సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగిని ప్రేమించడం, అటు వాళ్ల తల్లిదండ్రుల్ని, ఇటు వీళ్ల తల్లిదండ్రుల్ని ఒప్పించలేక ఇద్దరూ వీరోచితంగా పెళ్లి చేసుకోవడం, ఇద్దరూ ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని విశాఖపట్నం జిల్లాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం జరిగింది.
 అయినా మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, టెలిఫోను సంభాషణలు జరిగేవి. ఎప్పుడో మూడేళ్లకొకసారి, నాలుగేళ్లకొకసారి ఏదో ఒక సందర్భంలో కలుసుకునేవాళ్లం. కాని ఈసారి ఎనిమిదేళ్లు గ్యాపొచ్చింది. మనిషి ఎలా ఉన్నాడో? ఏమో?
    
 నేను వెళ్లేసరికి కమలహాసన్ ఇల్లు కోలాహలంగా ఉంది. అతని ఈడు వాళ్లందరం రిటైరైనవాళ్లమే. బట్టతలలు, కళ్లకు చత్వారపు అద్దాలు వచ్చేశాయి. పాత మిత్రుల్ని పరామర్శిస్తున్నా కళ్లు మాత్రం ఈ బట్టతలల మధ్య బండెడు జుట్టుతో మునిగి ఉండే కమలహాసన్ కోసం వెతుకుతున్నాయి.
 ‘‘అరె అప్పారావ్! ముందు కమలహాసన్‌ని కలవనివ్వరా?’’ అన్నాను ఎదురొచ్చి షేక్‌హ్యాండిచ్చిన అప్పారావుతో.
 
 ‘‘హాయ్ సుబ్బూ! నేనిక్కడ’’ అంటూ అన్ని బట్టతలల మధ్య ఓ బట్టతల పలుకరించింది.
 ఏ టూ జెడ్ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్నాడు కమలహాసన్. వైటు బెల్ట్‌తో టక్ చేసి ఉన్నాడు. వైటు బూట్లు. హుందాగా, దర్జాగా, హుషారుగా ఉన్నాడు. కాని బాధాకరమైన విషయం కమలహాసన్ తల నున్నగా హాకీ కోర్టులా ఉంది. నెత్తి మధ్యన మూడే మూడు తెల్ల వెంట్రుకలు రెపరెపలాడుతున్నాయి. ‘‘రేయ్! ఈ వైట్ డ్రెస్ సింగపూర్ నుంచి తెప్పించాన్రా. ఈ రోజు నేను వాడిన ఈ సెంటు ఇంపోర్టెడ్, ఆఫ్గనిస్తాన్ నుంచి తెప్పించాను. ఈ బూట్లు ఎక్కడివనుకున్నావు? లండన్ నుంచి తెప్పించాను’’ చెప్పుకుపోతున్నాడు కమలహాసన్.
 
 కళ్లప్పగించి అతని తలవైపు అదే పనిగా చూస్తున్న నా పరిస్థితి అర్థం చేసుకున్నవాడై చిరునవ్వు నవ్వాడు.
 ‘‘నీ ఫీలింగ్స్ నాకర్థమయ్యాయిరా. ఇప్పటివరకూ వీళ్లందరికీ చెప్పాను. కానీ కాస్త ఆలస్యంగా వచ్చావు కాబట్టి నీకు తెలియదు. అసలు సంగతేమిటంటే వెంట్రుకలు ఊడటం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైందిరా. కారణం చెబుతాను విను. ఆ రోజు ఒక దినపత్రికలో ఒక ప్రకటన చూశాన్రా. మీ జుత్తు క్రోటను మొక్కలా మొదలై, అంటుకట్టి పెరగాలంటే మా హెయిర్ ఆయిల్ ‘గ్రో... మోర్ గ్రో’ వాడి మీ జుత్తును అంతకు రెండింతలు పెంచుకోండి అని ఉంది. నీకు తెలుసుగదా. కొత్త హెయిర్ ఆయిల్ కనిపిస్తే నేనొదలనని. వెయ్యి రూపాయలు పెట్టి జలంధర్ నుంచి ఆ హెయిర్ ఆయిల్ తెప్పించి వాడానురా.
 
 అంతే! వెంట్రుకలు రాలడం మొదలైంది. మందు రాయడం ఆపినా, వెంట్రుకలు రాలడం మాత్రం ఆగలేదు. చివరకు సముద్రంలో రెట్టలా మూడే మూడు వెంట్రుకలు మిగిలాయిరా. వాటినే అల్లారుముద్దుగా చూసుకుంటూ గడుపుతున్నాను. చూసి ఆనందించే నువ్వే నా హిప్పీ జుట్టు పోయినందుకు బాధపడితే, వాటి ఓనర్ని, ఇష్టంగా పెంచుకున్న కమలహాసన్ని నేనెంత బాధపడి ఉంటానో ఊహించుకో’’ అంటూ తన బట్టతల వెనుక ఉన్న విషాదకరమైన కథ చెప్పాడు. నా మనసు వికలమైపోయింది. ఆ రోజు కమలహాసన్ షష్టిపూర్తి మహోత్సవం అద్భుతంగా జరిగింది. అతను, అతని శ్రీమతి కూర్చున్న రాజసింహాసనం లాంటి ఫోమ్ కుర్చీల వెనుక తెరమీద నిండు తలతో భుజాల మీద వేలాడుతున్న హిప్పీ క్రాఫుతో ఉన్న కమలహాసన్ ఫొటో ఉంది, అతని ఒకనాటి వైభవానికి గుర్తుగా.
 
 షడ్రసోపేతమైన విందు తరువాత వీడ్కోలు తీసుకుంటుండగా అందరికీ ఖరీదైన బహుమతులిచ్చాడు. నాకు మాత్రం ఒక దంతపు దువ్వెన ఇచ్చాడు. ‘‘ఒరే! సుబ్రావ్. సుబ్బూ. దీన్ని చైనా నుంచి మూడు వేలు పెట్టి తెప్పించాన్రా. జుట్టుమీద మోజు కలిగినవాళ్లు పదే పదే దువ్వినందువల్ల వాటి మొదళ్లు కదిలి క్రమేణా ఊడిపోయి కూడా బట్టతల వస్తుందిరా. ఏ కారణం వల్ల బట్టతల వచ్చినా, బట్టతల ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక దువ్వెన ఉంటుంది. ఇది ఈ కమలహాసన్ తెలుసుకున్న సత్యం’’ అంటూ బట్టతల నిమురుకుంటూ నాకు వీడ్కోలిచ్చాడు. నేను ఉలిక్కిపడి ప్యాంటు జేబులోకి చేయి పోనిచ్చి, ఆల్రెడీ జేబులో ఉన్న దువ్వెనను తడుముకున్నాను. కమలహాసన్ సిద్ధాంతం కరెక్టే. మీరెక్కడైనా, ఎప్పుడైనా బట్టతల ఉన్న వ్యక్తిని దువ్వెన అడగండి. తప్పక అతని దగ్గర దువ్వెనుంటుంది!
 
 ‘‘రేయ్! ఈ వైట్ డ్రెస్ సింగపూర్ నుంచి తెప్పించాన్రా. ఈ రోజు నేను వాడిన ఈ సెంటు ఇంపోర్టెడ్, ఆఫ్గనిస్తాన్ నుంచి తెప్పించాను. ఈ బూట్లు ఎక్కడివనుకున్నావు? లండన్ నుంచి తెప్పించాను’’ చెప్పుకుపోతున్నాడు కమలహాసన్. ఒకరోజు పోస్ట్‌మ్యాన్ ఒక పార్సిలుతో వచ్చాడు.‘‘ఇక్కడ కె.శ్రీనివాసరావు, ఎల్.డి.క్లర్కు ఎవరండీ?’’ అనడిగాడు.‘‘ఎవరూ లేరండి’’ అని చెప్పారు ఆఫీసు స్టాఫు.‘‘ఆఫీసు అడ్రసు ఇదేనే’’ అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు పోస్టుమ్యాన్.
 - పోట్లూరు సుబ్రహ్మణ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement