
కొండాకోనల లోయల్లో ప్రవహిస్తూ అనేక ఆకుపచ్చని వర్ణాలని, పూలసౌగంధాన్ని కమ్ముకొస్తున్న భగీరథి గాలి గోల్డెన్ లిల్లీ పువ్వుల్లోని లోలోపలి రేకుల వొల్తైన పరిమళాన్ని వాగ్దానం చేస్తున్నంత నమ్మకంగా తన చూపులని పదేపదే డిస్టర్బ్ చేస్తుంటే ‘యెవరితను... యెక్కడో చూసినట్టు అనిపిస్తుంది... చిరపరిచిత ముఖం...’ అని తన టైంలైన్ మెమరీని మనసులోనే సెర్చ్ చేస్తుండగా అతను ‘‘యెక్కడ తెలుసా అని ఆలోచిస్తున్నట్టున్నారు? మనం ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌మి’’ నవ్వుతూ అన్నాడు.‘‘రోహన్’’ అంది తుళ్ళింత చిరునవ్వుతో.‘‘రైట్... మిహిక’’ నవ్వుతూ అన్నాడతను. ‘‘భలే కలిసాం యీ భగీరథి తీరాన’’ అందామె. ‘‘అవును మీరెప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తూనే వుంటారు. మీ పరిచయమే గమ్మత్తు. ఆ రోజు వుదయం పిక్చర్స్‌ని నా పేజ్‌లో క్యాప్షన్ లేకుండానే పోస్ట్ చేసేశాను. కొన్ని పిక్స్ మేగజైన్‌కి పంపాలి. సరైన క్యాప్షన్ రావటం లేదు. యింతలో మీరు నా పేజ్‌లో ఆ పిక్స్‌కి కామెంట్ పోస్ట్ చేసారు. భలే నచ్చింది. అదే మొదటిసారి మిమ్మల్ని గమనించటం’’ అన్నాడు రోహన్.
‘‘ఆ రోజు తెల్లార్నే తెలివొచ్చి, యెప్పటిలానే ఫేస్‌బుక్ వోపెన్ చేసా. సరస్వతీ కుండ్ ట్రెక్కింగ్ వివరాలు అడిగిన తన ఫ్రెండ్‌కి మీ పేజ్‌ని రిఫర్ చేసిన నా ఫ్రెండ్ కామెంట్ కనిపించింది. నేషనల్ జియోగ్రాఫ్ఫీ మేగజైన్‌లో ప్రింట్ అయిన మీ ఫోటో వొకటి నాలో స్ట్రాంగ్‌గా ముద్రించుకుపోయింది. వెంటనే మీ పేజ్ చూసా’’ అందామె. ‘‘యేది’’ ఆసక్తిగా అడిగాడు.‘‘పర్వతాల మధ్యనున్న వో నది పారుతూ చిన్నిచిన్ని అలలుగా యెగుస్తున్నప్పుడే అవి ఫ్రీజ్ అయిన ఫొటో. అప్పటివరకు మీకు ఫేస్‌బుక్‌లో పేజ్ వుందని తెలీదు. చూస్తే అందులో అదే పిక్చర్‌ని మీరు పెయింట్ చేసి మీ పేజ్‌లో పోస్ట్ చేసారు. అప్పుడే మీ పేజ్‌ని లైక్ చేసా. అప్పట్నుంచి మీ పేజ్‌ని తరచూ చూస్తుంటాను’’ ‘‘మీకెందుకు అంతలా నచ్చింది?’’‘‘నిజంగానే గొప్ప క్లిక్. అదీకాకుండా అప్పుడు నేనున్న మెంటల్ కండీషన్ వల్ల కూడా కావొచ్చేమో’’ అందామె.అప్పుడు మీ మెంటల్ కండీషన్ యేంటని అతను అడగకపోవటంతో లైన్ క్రాస్ చెయ్యకూడదనే విషయం అతనికి తెలుసని ఆమె గుర్తించింది. ‘‘పదేపదే మీరెలా యిలా ప్రకృతి వెంట వెళతారు’’ అడిగింది మిహిక. ‘‘బిట్ అఫ్ లక్ అండ్ బిట్ అఫ్ లైట్’’ చిరునవ్వుతో అన్నాడు. ‘యిదిగో యిలా అందంగా చెప్పటం వల్లే యితని పేజ్ తనని యెట్రాక్ట్ చేసింది’ అనుకుంది మిహిక.‘‘మీరు సౌత్ వారా... భాష’’ అడిగాడు.
‘‘తెలుగు’’‘‘నైస్. మాదీ తెలుగే. కానీ పుట్టి పెరిగిందంతా ఢిల్లీ. ఫొటోగ్రఫీ యిష్టం. అదే వృత్తి కూడా. భలే కలిసాం’’ అన్నాడు.‘‘నీలాంగ్ చూడాలని రెండేళ్ళుగా అనుకొంటున్నా. పరీక్షల వెంట పరీక్షలు. అవి రాయకుండా యెప్పుడూ కొండలు యెక్కుతానంటే యింట్లో వొప్పుకోరు. చదువు విషయంలోఅమ్మానాన్నగారు చెప్పినవి కాదనలేను. అదిగో అదే వెహికిల్ అనుకొంటా. వెళుతున్నాను. తిరిగొచ్చాక కలుస్తాను’’ ‘‘యిద్దరం కలిసే చూడబోతున్నాం’’ నవ్వుతూ అన్నాడు.‘‘వావ్... మీతో కలిసి నీలాంగ్‌ని చూడటం భలే లక్కీ’’ అంది సంబరంగా.యిద్దరూ వెహికిల్లో కూర్చున్నారు. వూరిని దాటి కొద్దిగా ముందుకు వెళ్ళీ వెళ్ళగానే అప్పటివరకు ప్రయాణించిన దారి మొత్తం మారిపోయింది. వెనక్కి చూస్తూ ‘‘అరే... మనమొచ్చిన వూరు ఆ దారి యేమయింది’’ మిహిక ఆశ్చర్యపోతూ అడిగింది.‘‘వొక వూరిని దగ్గరగా ఆనుకొని వున్న యీ ప్రాంతంలో వొక్కసారే యింత మార్పు యెలా సాధ్యమయిందని మొదటిసారొచ్చినప్పుడు నేనూ మీలానే ఆశ్చర్యపోయా. ప్రకృతి యిచ్చేటన్ని అందమైన ఆశ్చర్యాలు యింకెవరికీ సాధ్యం కాదేమో’’ అన్నాడు రోహన్. వో వైపంతా యెత్తుపల్లాల కొండా. మరో వైపు కిందగా ప్రవహిస్తున్న భాగీరథిని చూస్తూ ‘‘నదీ ప్రవాహాన్ని యిలా బండిలో కూర్చుని చూడటం... ప్చ్... నదిని తాకాలి కదా’’ అందామె.ఆమె వైపు నుంచి లోయలోకి కిటికీలోంచి రోహన్ తదేకంగా చూస్తున్నాడు. యింతకు ముందెప్పుడూ చూడని ఆ దారిని బండిలోని వారంతా దిగ్భ్రాంతితో ఆనందంగా చూస్తున్నారు.అతను లేచి డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. బండి వేగం మెల్లగా తగ్గి ఆగింది. రోహన్ ఆమెని దిగమన్నాడు. అయోమయంగా చూస్తోన్న ఆమెని దిగమని తొందర చేసాడు. ఆమె దిగింది అంతే అయోమయంతో. బండి ముందుకి వెళ్ళింది.
లోయలోకి దిగుతోన్న అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ‘‘యిటెక్కడికి’’ అని అడిగింది. జవాబు చెప్పకుండా నవ్వుతూ వెళ్ళుతోన్న అతన్ని వెంబడించింది. లోయలో నడవటానికి ఆమెకి అతను మధ్యమధ్యలో అవసరమైన చోట చెయ్యి అందించి సహాయపడుతున్నాడు. వాలులో వో చిన్ని మలుపు. మలుపు తిరిగీ తిరగ్గాన్నే భగీరథి.అతని వైపు నిశ్శబ్దంగా చూసిందామె. ‘యెవరితను... తనన్న మాటని సీరియస్‌గా తీసుకొని అతనికున్న అనుభవంతో తనని యీ లోయలోంచి జాగ్రత్తగా నదీ ప్రవాహం దగ్గరకి తీసుకొచ్చాడు. యిలా అర్థం చేసుకొనే వొక తోడు తనతో నిరంతరం వుంటే... కానీ అది అత్యాశ. స్నేహంలో యెంతో అర్థవంతంగా వుండే అబ్బాయిలు తమ జీవితాన్ని పంచుకోడానికి వచ్చే అమ్మాయిని మాత్రం మళ్ళీ అదే పూర్వపు మూస బాటలోనే వుండాలని కోరుకుంటారు. అబ్బాయిల విషయంలో అమ్మాయిలు అలా కోరుకోరుగా... వాళ్ళ యిష్టాలు, ఆకాంక్షలు, వృత్తి, ప్రవృత్తి యేదీ మార్చుకోమని చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను అడగరు. వాళ్ళని వాళ్ళగానే వుండనిస్తారు’. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అతను చూడకూడదనుకొంటూ అలల వైపు వెళ్ళింది. ఆ సజల నయనాల చెమ్మపొర అతన్ని తాకింది కొత్త చిగురు రహస్య పరిమళంలా.
‘‘వాక్ కి వస్తారా’’ తెల్లార్నే రోహన్ నుంచి మెసేజ్. మిహిక ‘యెస్’ అని మెసేజ్ చేసింది.శరత్కాలపు ప్రారంభపు లేతచలి కొత్త ప్రేమలా తనువుల్ని స్పర్శిస్తుంటే నిలువెత్తు కొండల సమూహం నుంచి వారిద్దరు నడుస్తున్నారు. కర్పూర పరిమళం అంతటా ఆవరించేట్టు అతని శ్వాస ఆమెని కమ్ముకొంటుంటే ‘‘మీకే రంగు యిష్టం’’ అని మిహిక అడిగింది.‘‘ఆర్టిస్ట్‌ని అడగాల్సిన ప్రశ్నేనా? వున్న మూడు వర్ణాలన్నేయిష్టపడతాను. నా ప్రపంచాన్ని ఆ బేసిక్ రంగులోంచే చూస్తాను’’ కొంటెగా అన్నాడు రోహన్. ‘‘యీ వూరొచ్చిన ప్రతిసారి యీ రోడ్‌లో వీలైనప్పుడంతా వాక్‌కి వస్తా. యిక్కడికి వచ్చిన వాళ్ళు పరిచయం అవుతారుగా. వాళ్ళల్లో కాస్త యింట్రస్టింగ్‌గా వున్నవాళ్ళని వాక్‌కి రమ్మంటాను. యీ దారి చూపించొచ్చని’’ అన్నాడు. ‘‘వో... అయితే యింట్రస్టింగ్‌గా వున్నానా?’’ కుతూహలంగా అడిగింది.‘‘అస్సలు లేరు’’ చిలిపి అల్లరి అతని స్వరంలో.
‘‘లేనా?’’ అలిగిన చూపులతో, ‘‘మరెందుకు రమ్మన్నారు’’ అంది. ‘‘నాకు లేళ్ళలంటే భయం. తోడుంటారని’’ సీరియస్‌గా అన్నాడు.ఆమె చప్పున నవ్వేస్తూ ‘‘నాకూ భయమే... సో రాంగ్ ఛాయిస్’’ అంది.‘‘నో నెవ్వర్... మారథాన్ ప్రేమికుడిని కదా. అపరిచిత దారుల్లో యెదురైన వాళ్ళని అంచనా వెయ్యటంలో యెప్పుడో కానీ పొరపాటు చెయ్యను’’ అన్నాడు. ఆమె నవ్వి ‘‘సో కాన్ఫిడెంట్’’ అంది.తరువాత నిశ్శబ్దం. మౌనంగా నడుస్తున్నారు. ఆ నడక వుల్లాసంగా, శాంతిగా అనిపించటం, వొకరి సమక్షం మరొకరికి నచ్చటం వల్లేనని యిద్దరికీ తట్టింది. నడుస్తూనే వున్నారు.
సాయంకాలం కాబోతోన్న వేళ రోహన్ని వెతుక్కుంటూ హోటల్ ముందున్న గార్డెన్ రెస్టారెంట్‌లోకి వచ్చింది మిహిక. గుండ్రని టేబుల్ మీద లాప్‌టాప్. పక్కనే కాఫీ కప్. పని చేసుకొంటున్నాడు. అతని యెదురుగా నిలబడిన ఆమె వైపు తలెత్తి చూడకుండానే ‘టీ’ అడిగాడు.‘‘మీరేదో పనిలో వున్నట్టున్నారు’’ అంది.‘‘నిన్నటి పిక్చర్స్ మేగజైన్‌కి పంపిస్తున్నా... విత్ రైట్ అప్’’ అన్నాడు.‘‘మీ పని అయ్యాక వుదయం నడిచిన దారిలో నడుద్దాం. వస్తారా’’ అడిగింది.‘‘మళ్ళీ నడుస్తారా... మళ్ళీ అదే దారిలో యెందుకు నడవాలనిపిస్తుంది?’’‘‘న్యూ సూపర్ మూన్ కోసం’’అతను తలెత్తి ఆమె వైపు చూసేలోగ ‘‘యే మిహిక... వాట్ యే ప్లెసెంట్ సర్‌ప్రైజ్’’ çసంతోషంతో దాదాపు అరుస్తున్నట్టే మిహికని పలరించింది కోమలి. రోహన్ని కోమలికి మిహిక పరిచయం చేసింది. వాళ్ళిద్దరినీ అడిగి వాళ్ళకోసం గ్రీన్ టీని రోహన్ ఆర్డర్ చేశాడు. యీ మధ్య చేసిన ప్రయాణాలు, యిప్పుడు నీలాంగ్ చూడటానికి వచ్చిన విషయం చెపుతూ ‘‘మా యిద్దరం యూత్ హాస్టల్ వాళ్ళు యేర్పాటు చేసిన ట్రెక్కింగ్‌లో రెండుసార్లు కలిసాం. ఆ తరువాత మళ్ళీ యిప్పుడే కలవటం. ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌మే కానీ యిప్పటివరకు వొక్కసారి కూడా చాట్ చెయ్యలేదు. గత కొన్నాళ్ళుగా నా చాట్ టైం అంతా నా బ్రేకప్స్ గురించి మాటాడుకోడానికే అయిపోతోంది’’ చిన్న నిట్టూర్పుతో అంది కోమలి.
మిహిక చిన్నగా నవ్వింది. ‘‘అవును... అప్పుడెప్పుడో యెంగేజ్‌మెంట్ పిక్స్ అభయ్ పోస్ట్ చేసాడు కదా... పెళ్లి యెప్పుడు’’ కోమలి ఆ పిక్స్‌ను గుర్తుచేసుకొంటూ మిహికాని అడిగింది.‘‘బ్రేకప్’’‘‘వో సారి...’’ నొచ్చుకొంటూ అంది కోమలి.‘‘యెందుకు?’’‘‘పెయిన్‌ఫుల్ కదా’’‘‘పర్సనల్ విషయాలు పోస్ట్ చెయ్యటం నాకలవాటు లేదు. కానీ అభయ్‌కి అలాంటి పట్టింపులేదు. ఆ పిక్స్‌ని అభయ్ పబ్లిక్ పోస్ట్ చేస్తూ నాకు ట్యాగ్ చేసారు. నా టైంలైన్‌లోకి నే అలో చెయ్యలేదు. అభయ్ వొక్కరే కాదు, ఆ యీవెంట్ మేనేజ్‌మెంట్ వాళ్ళు, చుట్టాలు, స్నేహితులు వొక్కరని కాదు అంతా పిక్స్ పోస్ట్ చేసారు. కొద్ది మంది మధ్యే వుండాల్సిన పర్సనల్ విషయాలు అలా ప్రపంచమంతా తిరిగాయి. అంతా బాగుంటే అన్నీ బానే వుంటాయి. కానీ యేదైనా తేడా వస్తే అందరికీ సమాధానం చెప్పుకోవాలి. అభయ్ నీ ఫేస్‌బుక్ ఫ్రెండ్ కదా?’’ అడిగింది మిహిక.‘‘అవును. అతని స్టేటస్ యిప్పుడేం వుందో నే గమనించ లేదు’’ అంటూ ఫోన్‌లో ఎఫ్‌బీ చూస్తూ ‘‘అసలు బ్రేకప్స్ యెలాయెలా అవుతాయో తెలుసుకోవటం నాకలవాటుగా మారిపోయింది. మూడు బ్రేకప్‌లు నావి. రెండు నే చెప్పా. వొకటి అతను చెప్పాడు. వొక్కోసారి వొక్కో కారణం. అవి చెపితే యిందుకే విడిపోతారా అంటారు యిళ్ళల్లో, చుట్టూ వున్న పెద్దవాళ్ళు. కానీ అది మనకి విడిపోయేంత పెద్ద విషయమే. యింతకీ నీ బ్రేకప్‌కి కారణం?’’ కుతూహలంగా అడిగింది కోమలి.
ఆమె భలే నిర్మొహమాటమైన మనిషి. యే విషయాన్నైనా సూటిగానే అడుగుతుంది. వాళ్ళిద్దరూ పూర్తిగా వ్యక్తిగత సంభాషణలో మునిగిపోవటం చూసి తన పని తను చేసుకొంటూనే రోహన్ కాస్త తటపటాయింపుగా కుర్చీలో కదిలాడు. అక్కడ నుంచి వెళ్ళితే బాగుంటుందని ‘‘యెక్స్ క్యూజ్ మీ’’ అన్నాడు. ‘‘నో యిష్యూస్... కాసేపే... నే వెళ్లిపోవాలి... కూర్చోండి’’ హడావిడిగా అంది కోమలి. ‘రోహన్ ముందు యివి మాటాడటం యెంత వరకు సమంజసం?’ అని ఆలోచిస్తూనే ‘అంత మాటాడకూడని విషయం కూడా కాదు కదా... అయినా తనకి లోపలెక్కడో తన విషయాలు అతనికి చెప్పాలనే కోరికా వున్నట్టే వుంది’ అనుకొంది మిహిక.
‘‘మా అమ్మగారు, అభయ్ అమ్మగారు చిన్నప్పుడు క్లాస్‌మేట్స్. హైస్కూల్‌కి వచ్చాక విడిపోయారు. చాలా సంవత్సరాల తరువాత ఎఫ్‌బిలో కలిసారు. అభయ్ ట్రావెల్ ఛానల్లో దేశదేశాల టూరిస్ట్ ప్లేసెస్‌పై కథనాలు యిస్తారు. అలా వాళ్ళు మా యిద్దరి పెళ్లి మాటలు మాటాడారు. మమ్మల్ని అడిగారు. వొకే అన్నాం. మూడాలని, మంచి ముహూర్తాలని చివరికి యెంగేజ్‌మెంట్ అయిన ఆరు నెలల తరువాత పెళ్లి ముహూర్తం పెట్టారు. నేనో ట్రెక్కింగ్‌కి వెళ్ళే ముందు, ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర వున్నా. వీడియో కాల్ చెయ్యనా’ అని అభయ్ పంపిన మెసేజ్ వచ్చింది. నేను ఫుల్ యెక్సైటెడ్. అలా రియల్ టైంలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసా. మాటల్లో ట్రెక్కింగ్‌కి వెళుతున్నానని చెప్పా. ‘‘లాస్ట్ ట్రెక్కింగ్ కదా. యెంజాయ్’’ అన్నారు అభయ్. అర్థం కాలేదు. కాస్త అయోమయంగా అనిపించింది. అప్పుడు అతను పనిలో వున్నాడు. మాటాడటం వీలుకాలేదు’’ అని ఆగింది మిహిక.కాసేపు నిశ్శబ్దం.
‘‘వూ... తరువాత’’ అడిగింది కోమలి.‘‘వీలుచూసుకొని అభయ్‌తో మాటాడితే నాకు ట్రావెలింగ్ యిష్టం. దానినే వృత్తిగా యెంచుకొన్నా. నీది పేషన్. పెళ్లి అయ్యాక నువ్వు వొకే చోట వుండే వుద్యోగం చేస్తావు కదా. నేను పని మీద వెళ్లి వచ్చే సరికి నువ్వు యింట్లో వుండాలి. అలానే నేను పని మీద బయటకి వెళ్ళినప్పుడూ నువ్వే యిల్లు చూసుకోవాలి కదా. యింక నీకు ట్రెక్కింగ్‌కి వెళ్ళే అవకాశం వుండదని అలా అన్నానన్నారు అభయ్’’‘‘పెళ్లి తరువాత ట్రెక్కింగ్ మానాలని అనుకోలేదు. అదీకాక దానినే కెరీర్‌గా తీసుకోవాలని వుందని చెప్పా. మరి నువ్వు యంబియే చదువుతున్నావ్‌గా అన్నారు అభయ్. మా అమ్మగారికి నేను యంబియే చెయ్యాలనే కోరిక. తనపై ప్రేమతో చదువుతున్నా, ఆ డిగ్రీతో వుద్యోగం చెయ్యాలని మా అమ్మగారు అడిగినా చెయ్యను. నా ఆసక్తి పర్వతాల్ని యెక్కటమే. యెక్కించటమే అని చెప్పాను అతనికి. 24/7 హోం పార్ట్‌నర్ అభయ్‌కి కావాలి. నేనలా వుండలేనని బ్రేకప్’’ అంది మిహిక.‘‘ప్చ్... మనకి పెళ్ళికి ముందు యేవేవి మాటాడుకోవాలో తెలిసే అనుభవం పెద్దగా వుండదు. పెళ్ళి తరువాత వాళ్ళని వాళ్ళలానే వొప్పుకోడానికి మనం, స్టీరియోటైప్‌నే సహజం అనుకోడానికి అలవాటు పడి వుంటారు వాళ్ళు. చాలా విషయాలు వాళ్ళు, మనం కూడా టేకిట్ గ్రాంటెడ్‌గానే చూస్తామనుకుంటా. గ్లాడ్... ముందే తెలిసింది. లేకపోతే మీరిద్దరూ చాలా హింస పడేవాళ్ళు. యిప్పుడు నీ స్టేటస్?’’ అడిగింది కోమలి. ‘‘సింగిల్. ఆ డిస్టర్బెన్స్ భయం కూడా పూర్తిగా పోలేదు’’ అంది మిహిక.‘‘మూవాన్ మిహిక. నే మా గ్రూప్‌తో బయటకి వెళ్ళే ప్రోగ్రాం వుంది. బై’’ అని కోమలి వెళ్ళిపోయింది. తామిద్దరి మధ్యా నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ ‘‘సూపర్ మూన్ చూడాలన్నారు’’ అన్నాడు రోహన్. యిద్దరూ బయలుదేరారు.
అవే చెట్లు. అవే కొండలు. అదే దారి. కానీ వుదయం వున్న వెలుగు లేదు. లేత చీకటి. యిద్దరి శ్వాసకి తమతమ మొహమాటపు సెగ తగుల్తూనే వుంది. ‘కానీ యిదంతా తన భ్రమాస్వప్నమేమో... ఆమెకి స్నేహానికి మించిన ఆసక్తి లేదేమో... మేల్ అండ్ ఫిమేల్ ఫ్రెండ్‌షిప్ తనకి తెలుసు. యిప్పుడు తనే ముందు చొరవ చూపించి కొన్ని విషయాలు మాటాడితే ఆమెని డిస్టబ్ చేసినవాడినవుతానా’ అనే బాధ్యతపు తెరలో వుక్కిరిబిక్కిరవుతున్నాడు రోహన్. ‘యిదంతా మేల్ ఫ్రెండ్‌షిప్ ఫీలింగ్‌లా లేదు. అతని సాహచర్యాన్ని, సాన్నిధ్యాన్ని తను కోరుకుంటుందా... అదెలా సాధ్యం. నిన్న కనిపించిన అతను తనని యెందుకిలా కమ్ము కొంటున్నారు’ ఆలోచనలే ఆలోచనలు మిహికలో.గూళ్ళల్లో సర్దుకొని నిద్రలోకి జారుకున్నాయేమో... పక్షుల స్వర అలికిడి మెల్లగా మాయమయింది.‘యెలాంటి లైఫ్ పార్ట్‌నర్æ కావాలని ఆలోచించినప్పుడు చాలా అనుకున్నా. యిద్దరి ఆకాంక్షలు వొకటయి తనతో పాటు ప్రయాణించే అమ్మాయి కావాలని... యిలా యేవేవో అనుకున్నా. అంతకుమించి పెద్దగా ఆలోచించలేదు. కానీ కోమలి, మిహిక సంభాషణ చాలా విషయాల్లో తనకి కాస్త మెరుగైన స్పష్టత నిచ్చాయి’ ఆలోచిస్తూ నడుస్తోన్న రోహన్ చుట్టూ చూస్తూ తనలోకి తాను తరిచి చూసుకొంటున్నాడు.మౌనంగా నడుస్తోన్న మిహికాకి తను అతన్ని అడగాలనుకొన్న విషయం గుర్తొచ్చి ‘‘యింతకీ మీకు ఫోటోగ్రఫీ యిష్టమా, పెయింటింగ్ యిష్టమా’’ అని చప్పున ఆసక్తిగా అడిగింది.ఆలోచనల నుంచి బయటకి వచ్చి ఆమెని కొత్తగా చూస్తున్నట్టు చూస్తూ ‘‘యెందుకు’’ అని రోహన్ అడిగాడు. ‘‘ఘనీభవించిన చిన్నిచిన్ని మంచు అలలన్ని ఫోటో తీసారు కదా... తిరిగి ఆ ఫొటోనే పెయింట్ చేసారుగా. వొకే విజువల్‌న్ని రెండు ఫామ్స్‌లో క్రియేట్ చేసినప్పుడు మీ మనసుకు యేది దగ్గరగా వుంటుందనే క్యూరియాసిటీ’’ అందామె.
‘‘వొకే విజువల్‌ని తిరిగి క్రియేట్ చెయ్యటం చూసారు కదా... అందులో మీకేది బాగా నచ్చింది’’ అని అడిగాడు. ‘‘చిక్కు ప్రశ్నే. దేని అస్తిత్వం దానిదే. రెండూ నచ్చాయి’’‘‘రీ క్రియేట్ చెయ్యటంలో యేదీ మిస్ కాలేదా?’’‘‘నాకలా అనిపించలేదు. దేనికదే బాగుంది’’ ‘‘జీవితం కూడా దేనికదే బాగుంటుంది. మీరెందుకా విషయాన్ని ఆలోచించరు’’ అని నిదానంగా అడిగాడు.చిలకరించబోయిన రంగులు మాయమైపోయిన ఖాళీ కాన్వాస్‌లా వొక్కసారే ఆమె పెదవులపై నవ్వులు బోసిపోయాయి. అతనికి తెలుసు యిది ఆమె వూహించని ప్రశ్న అని. ఆమె మాటాడటానికి సమయం పడుతుందని.యిదేమిటి యిలా అడిగేసారు... యెందుకడిగుంటారు... అనే ఆలోచనలు ఆమెని ముసురుకొన్నాయి.మెల్లమెల్లగా వికసిస్తున్న పూర్ణబింబం. అతనివైపు చూసింది. వెన్నెల చిమ్ముతోన్న కళ్ళు. మోహపు వెచ్చదనంతో మత్తిల్లిన చూపులని రెప్పల కింద దాచుకొంటూ కనురెప్పలు వాల్చిందామె. రసైక శ్వాస జనించిన మహత్తర క్షణమది. వొకరిలోకొకరు యేకం కావాలనే సౌందర్య జ్వాల చెలరేగకుండా జాగ్రత్త పడుతూ ‘‘నేను నాలానే వుండాలనుకొంటున్నా’’ అందామె. ‘‘నేనూ నాలానే వుండాలనుకొంటున్నా’’ అన్నాడతను.
‘‘మరి మనిద్దరం యెలా కలిసి వుండగలం’’ అడిగిందామె.‘‘యిద్దరం యిద్దరిలానే వుంటూనే వొక్కరిలా కూడా కలిసి వుండొచ్చేమో’’ అన్నాడతను.పక్కపక్కనే నడుస్తున్నారు. ఆమె అప్రయత్నంగా అతని చేతిని అందుకొంది. తమలపాకుల మెత్తదనపు గిలిగింత అతని చేతుల్లో. అతని చేతి చుట్టూ బిగుసుకొంటున్న ఆమె చేతివేళ్ళు. సాన్నిధ్యపు స్పర్శా వెచ్చదనాన్ని ఆమె చేతివేళ్ళకి పరిచయం చేస్తున్నాడతను. స్పర్శ మాత్రమే సత్యం.‘‘యిప్పుడీ పూలశిఖరం పక్కనుండగా ట్రెక్కింగ్ అనే ఆలోచనే నన్ను ప్రతిరోజూ యెవరెస్ట్‌పై వుంచుతుంది. థాంక్ యూ మిహిక’’‘‘నిజంగా నన్ను నన్నులా వుండనిస్తారా... మరోలా అనుకోకండి... కాస్త దెబ్బతిని వున్నా కదా... అప్పుడే మీ మంచు అలల పిక్ చూసింది... నా మానసిక స్థితికి ప్రతి రూపంగా అనిపించిందా పిక్’’ అంది కాస్త ముఖం పైకెత్తి. వసంతతుమ్మెదలా సుకుమారంగా తన పెదవులని ఆమె మల్లెమొగ్గ పెదవులపై ఆన్చబోతూ ‘‘మీకేమైనా అభ్యంతరమా?’’ అడిగాడు రోహన్.‘చాలామంది జ్ఞానవంతులు తాము చెప్పేవి, రాసేవి అనేక విషయాలని తమ మససులోకి, నడవడిలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోరు. అవి తమని మహావ్యక్తులుగా నిలబెట్టటమే వారికి కావాల్సింది. రోజువారి జీవితంలో యింటా బయటా అన్ని రకాల అసూయరాజకీయాలని నిర్మోహమాటంగా ప్రదర్శిస్తూనే వుంటారు’ అనుకుంటూ ఆమె అతనివైపు గౌరవంగా చూస్తూ – ‘ప్రతికూల వాతావరణంలో అనుకూల వాతావరణం వచ్చేవరకు సహనంగా, ధైర్యంగా యెదురు చూడటం ట్రెక్కింగ్ చేసేవారి శ్వాసలో మమేకం అయిపోతుంది. అతనా విషయాన్ని తన అంతరంగ ఆకాంక్షకీ అనువదించుకొన్నాడు. యిటువంటి వ్యక్తిని తను యెందుకు వదులుకోవాలి...’ అనుకుంటూ ఆమె అతనికి మరింత చేరువగా వచ్చి, అతని భుజాల చుట్టూ తన రెండు చేతుల్నీ వేసి, అతని కుడి బుగ్గమీద ముద్దు పెట్టింది.మంచు వెన్నెల తేటగా, ఆ విశాల కొండల మైదానంలో చుక్కలాకాశం కింద వారి పంచేంద్రియాల సప్తవర్ణప్రేమ మోహపూలయేరులై వారివారి హృదయాలలో ప్రవహించాయి మృదుస్థిమితంగా.
- కుప్పిలి పద్మ
Comments
Please login to add a commentAdd a comment