చక్రపాణి ఇంద్రలోక యాత్ర | Funday story of the week 21-04-2019 | Sakshi
Sakshi News home page

చక్రపాణి ఇంద్రలోక యాత్ర

Published Sun, Apr 21 2019 12:44 AM | Last Updated on Sun, Apr 21 2019 12:44 AM

Funday story of the week 21-04-2019 - Sakshi

దేవేంద్రుని మందిరం.ఇంద్రుడు కోపంతో బుసలు కొడుతూ అటు ఇటూ పచార్లు చేస్తుంటాడు.రంభ చెంపకు చేయి చేర్చి విచారంగా ఆసనాన్ని  ఆనుకుని నిలబడి ఉంటుంది.‘‘అసలు నిన్ను భూలోకం పంపడం నా బుద్ధితక్కువ...నారదుడి మాట విని ఇంత అనర్థం తెచ్చుకున్నాను...ఎక్కడ దేవేంద్రలోకం! ఎక్కడ నీచ మానవలోకం! ఛీఛీ...చెప్పడానికైనా నీకు సిగ్గు లేదా రంభా! నీవేనా  ఈవిధంగా మారావు! ఎంత అవివేకం! ఎంత అవమానం!’’‘‘ఇందులో అవమానం ఏమున్నది ప్రభూ! మానవులు కూడా ఎంతటి ప్రతిభావంతులో మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు...నిజమైన కళాసేవ చేసి తరించాలంటే మానవలోకంలోనే సాధ్యమవుతుంది. సరస్వతిదేవి అక్కడే స్థిరనివాస మేర్పరచుకున్నది. మానవలోకంలోని సుఖఃదుఃఖాలు మనకు లేవనిపిస్తోంది...అన్నీ ఉంటేనే జీవితం అనీ, మనం అమృతం తాగి ఎప్పుడూ మత్తుగా పడి ఉంటామనీ, మన జీవితాలు ఎందుకూ పనికిరావనీ చక్రపాణిగారు చెప్తుండేవారు’’‘‘బుద్ధిహీనురాలా! అతడి పేరు నా దగ్గిర ఎత్తకు. నా విరోధిని మెచ్చుకుని నన్ను అవమానిస్తావా?’’
‘‘ఇందులో అవమానించడం ఏమున్నది ప్రభూ!...మీ విరోధుల్ని ఎంతమందిని నేను లొంగతీసి మీ పాదాల ముందు పడవేయలేదు! ఎంతమందిని తపోభ్రష్టులను చేయలేదు. కాని చక్రపాణిగారి విషయం అలా కాలేదు’’‘‘అంటే చక్రపాణి మానవాతీతుండటావా!’’‘‘అనుకోవాల్సిందే! ఆయన మనిషి కాడు...అయితే నా ఓటమికి అర్థం లేదుకదా ప్రభూ!’’‘‘మూర్ఖురాలా– ఆ సామాన్య మానవుడికి నీవు దాసోహం అన్నది చాలక నన్ను కూడా ఓటమిని ఒప్పుకోమంటావా!’’

‘‘అది ఓటమిగా నేను భావించడం లేదు ప్రభూ...చక్రపాణిగారి మంచితనం చూసి నా అంతట నేనే ఆయన దగ్గిర ఉండి కళాసేవ చేసి తరిద్దామనుకున్నాను. నిజంగా నాది ఓ జీవితమేనా అనిపించింది. నా మీద నాకు రోత పుట్టింది. ఎప్పుడూ మీ దర్బారులో నాట్యం చేయడం తప్ప నా జీవితానికి ఏ విధమైన అర్థం లేకుండా పోయింది...అక్కడ అనేక విధాలయిన పాత్ర పోషణలో నవరసాలు నటనలూ చిందించే కళాజీవుల్ని గురించి విని నా మనసు ఉప్పొంగిపోయింది. చక్రపాణిగారిని వేషమిప్పించమని నేనే అడిగాను. అందులోనూ మంచి బరువువైన పతివ్రత పాత్ర ఇచ్చారు...నా కోసం రాయించారు పాపం... నేను ఎంత పాపిని! చిత్రం పూర్తి చేయకుండా మధ్యలోనే వచ్చేశాను. ఆయన నా వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో!’’‘‘ఛీ! జ్ఞానహీనురాలా! ఇంకా నీ వా భూలోకం మరచి పోలేకపోతున్నావా! పైగా ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నావా! నీవల్ల నారదాదుల దగ్గిర నాకెంత అవమానం. ఆ నారదుడు ఊరుకోడే! ముల్లోకాలలోనూ నా ఈ అపజయాన్ని చాటుతాడే! నీ వా భూలోకం సంగతి మర్చిపోయి నీ నిత్యవిధులు నిర్వర్తించు...’’‘‘నావల్ల కాదు ప్రభూ! ఇక నేనే మీ దర్బారులో ఆడలేను. నేను భూలోకానికి పోతాను. నా కక్కడ కొత్తజీవితం కనిపించింది. నన్ను క్షమించండి. నన్ను వెళ్లనివ్వండి...’’ రంభ కదుల్తుందిముందుకు...ఇంద్రుడు తటాలున అడ్డు నిలిచి ‘‘రంభా’’ అంటూ పెద్ద రంకె వేస్తాడు.రంభ నిశ్చలంగా నిలబడి, ‘‘మీరు కేకలు వేసి ప్రయోజనం లేదు ప్రభూ! నా నిశ్చయం మారదు. నేను చలనచిత్రాల్లో నటించి తీరాలి. నన్నాకపండి’’ రెండడుగులు వేస్తుంది.ఇంద్రుడు మళ్లీ అడ్డునిలిచి కోపంతోనూ, అవమానంతోనూ కంపించిపొతూ, ‘‘నీ నిశ్చయం మారదా, నీ పట్టు విడవ్వా?’’‘‘విడవలేను. నా ఆశయం నెరవేరాలి. నేను ఒక గొప్ప నటిననిపించుకుని–అటు భూలోకానికి, ఇటు ఇంద్రలోకానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలి. రంభ కేవలం నాట్యకత్తే కాదు అనిపించుకోవాలి.

అలాంటి పాత్రఇచ్చారు ‘‘ఛీ,దౌర్భాగ్యురాలా! ఆ సన్యాసి పేరెత్తుకు నా దగ్గిర’’‘‘నారాయణ’’ అంటూ నారదుడు  ప్రవేశిస్తాడు.‘‘ఏమిటి ఇంద్రా, రంభతో ఘర్షణ పడుతున్నట్లున్నావు. ఏమైంది రంభ?’’ఇంద్రుడు కాస్త చల్లబడి, ‘‘చూడు నారదా! భూలోకం నుండి వచ్చినప్పటి నుంచి నే వెళతాను భూలోకానికి అంటుంది’’‘‘నారాయణ...అందాకా వచ్చిందీ కథ. నేనప్పుడే చెప్పాను గదయ్యా! ఆ మానవులు అసాధ్యులు. అందులోనూ ఆ సినిమాజీవులు అఖండులని...అయితే ఇంతకూ రంభ మళ్లీ ఎందుకు వెళతానంటూందీ!’’‘‘ఎందుకా! నా విరోధి చక్రపాణి తీసే చిత్రంలో నటించడానికట...’’‘‘నిజమే. మరి పాపం సగంలో మనిద్దరం వెళ్లి రంభను తీసుకొచ్చామాయే–అయినా మళ్లీ వెళ్లి లాభం ఏమిటి! రంభకు బదులు ఎవరిచేతనో ఆ పాత్ర వేయించి చిత్రం పూర్తి చేస్తున్నట్టున్నాడే’’‘‘ఆ! నిజంగానా! హతవిధి...నే నెంతగా ఆశపడ్డానే! ఎంతో కష్టపడి నటించానే...మీ వల్ల నా నటనా జీవితం నాందిలోనే ఈవిధంగా అయిందే! ఇక నేను జీవించి ప్రయోజనం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటాను’’ అంటూ రంభ వెక్కివెక్కి ఏడుస్తుంది.ఇంద్రుడు ఖంగారు పడిపోతూ ‘‘నారదా! ఇప్పుడేది దారి! రంభకు పిచ్చి ఎలా వదుల్తుంది?’’‘‘నీవు పిక్చరు తీస్తే వదుల్తుంది...’’ ‘‘పిక్చరా! అంటే?’’‘‘అంటే ఏముంది ఇంద్రా...ఆ మానవులు చలనచిత్రాలు ఎలా తీస్తున్నారో అలాగే ఇంద్రలోకంలో నవ్వూ ఒక చిత్రశాల కట్టించు...’’‘‘చిత్రశాల నేను కట్టించడమా! ఏమిటి నారదా మీరనేది! అది మనకెలా సాధ్యం!’’‘‘ఆ వివరాలన్నీ చక్రపాణిని కనుక్కుంటే సరి...’’‘‘నేనంటే కిట్టనివాడిని రంభ కోసం ‘అన్యధా శరణం నాస్తి’ అంటూ అర్థించమంటావా!’’‘‘ఏంచేస్తాం ఇంద్రా! మనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు’’ఇంద్రుడు బరువుగా నిట్టూర్పు విడిచి,  ‘‘అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు నారదా?’’‘‘ఏంలేదు...తక్షణం ఆ చక్రపాణిని పిలిపించి ఇక్కడే ఒక చిత్రశాల కట్టించే ఏర్పాట్లు చేయి...రంభ కోసం నీవే ఇక్కడ చలనచిత్రాలు తీయవచ్చు. అందుకు కావలసిన పరికరాలూ, ఇతర వివరాలూ చక్రపాణి చెప్తాడు. అతడు ఎలా చెప్తే అలా చేయి...ఏం రంభా!’’‘‘అవును స్వామీ...మీరు చెప్పింది చాలా బాగున్నది. చక్రపాణిగారు మన ఇంద్రలోకానికి రావాలేగాని, వస్తే వారు మన కన్ని వివరాలు చెప్తారు’’ అంటూ సంతోషంగా చెప్తుంది రంభ.కోపం దిగమింగుకుని కొరకొర చూస్తాడు ఇంద్రుడు‘‘నారాయణ!...ఆ ఏర్పాట్లేవో వెంటనే చూడు ఇంద్రా!’’‘‘సరే ప్రారబ్దం మహామహులకే తప్పలేదు. ఇంతకూ ఆ మానవుడిని ఇక్కడికి ఎలా తీసుకురావడం! అతడు ఒట్టి మొండివాడే! పిలిస్తే రాడే!’’‘‘నిజమే! పిలిస్తే  వచ్చేమనిషికాడు–నిద్రపోతూండే సమయంలో మంత్రశక్తితో తీసుకురావలసిందే. నేను వెళ్లొస్తాను...నారాయణ’’భూలోకంచక్రపాణిగారి గది...చక్రపాణిగారు నిద్రపోతుంటారు. నిద్దట్లో కలవరిస్తాడు...‘‘ఏంకదది! ఆడి కద ఈడు కాపీ గొట్టాడు...అసలు కద ఛండాలం...గుండమ్మకద బాగ లేదన్నాడు గదాడు!...’’ అని గొణుగుతూ ఒత్తిగిలి పడుకుంటాడు...మంచం కదుల్తుంది...మరుక్షణం అదృశ్యమౌతుంది.ఇంద్రలోకం
చక్రపాణిగారికి మెలకువ వస్తూనే కండ్లుకూడా తెరవకుండా మంచం పక్క టీపాయి ఉందనుకుని సిగరెట్‌ డబ్బా కోసం చెయ్యి చాస్తడు.

పండ్లూ ఫలహారాలు చేతికి తగుల్తాయి...గొణుక్కుంటూ లేచికూర్చుంటాడు...ఎదురుగా ఒక పెద్ద వెలుగల్లే ఇంద్రుడు కనిపిస్తాడు...అంత వెలుగు చూడలేక ఒక చేయి కండ్ల కడ్డుంచుకుని విసుగ్గా...‘‘ఎవర్నువ్వు!’’ అంటాడు.‘‘నేను ఇంద్రుడిని’’‘‘అట్టనా! అద్సరేగానీనాసిగరెట్‌ డబ్బా చూశావా!’’ఇంద్రుడు వెలవెలబోతాడు.మరుక్షణం రత్నాలపెట్టెలో బంగారుచుట్టలు తెచ్చి చక్రపాణిగారికి అందించబోతాడు సేవకుడు.‘‘అబ్బే! ఇందేంటి ఛండాలం! నాకు స్టేటెక్స్‌ప్రెస్‌ కావాల...’ఇంద్రుడు ‘‘చిత్తం’’ అంటూ అర్థం కాక సేవకుడి వైపు చూస్తాడు...సేవకుడు అదృశ్యమౌతాడు...‘‘అద్సరే. నే నెక్కడున్నా నిప్పుడూ?’’‘‘చిత్తం. ఇంద్రలోకంలో...’’‘‘అట్టనా!...అయినా నన్నెందుకు తెచ్చావ్‌ ఇక్కడికి. అస్సలు నువ్వు ఇంద్రుడివేనా లేక వేషం వేశావా?’’ఇంద్రుడు చిన్నబుచ్చుకొని, ‘‘వేషం కాదు... నేనుదేవేంద్రుణ్ణి...’’‘‘పైన ఆ ‘దేవ’ ఎందుకులే...ఒట్టి ఇంద్రుడంటే చాల్దూ!...అస్సరేగానీ నా సిగరెట్‌ డబ్బా ఏదీ!’’‘‘చిత్తం. ఇదుగో’’ అంటూ సేవకుడు చక్రపాణిగారికి సిగరెట్‌ డబ్బా అందిస్తాడు.‘‘అగ్గిపెట్టేదీ?’’‘‘తమరు ధూమపానం చేయండి. నా శక్తితో దానంతట అదే వెలుగుతుంది’’ అంటాడు ఇంద్రుడు.‘‘దీనికి నీ బోడిశక్తెందుకూ?’’ అగ్గిపుల్లతో పోయేదానికి!అగ్గిపుల్లెలిగించకపోతే సిగరెట్‌ తాగినట్టుండదు...అగ్గిపెట్టొకటి తెప్పిచ్చు...చిత్తం...మరుక్షణం అగ్గిపెట్టె చక్రపాణిగారి చేతి కందిస్తాడు సేవకుడు. చక్రపాణిగారు సిగరెట్‌ వెలిగిస్తూ, ‘‘అవునుగానీ, నా క్కాఫీ కావాల్నే! దొరుకుద్దా!’’‘‘చిత్తం...తెప్పిస్తాను’’ అంటూ ఇంద్రుడు సేవకుని వైపు చూస్తాడు.‘‘అద్సరేగానీ, బాత్‌రూమెక్కడా. అసలుందా బాత్‌రూము!’’‘‘చిత్తం’’ ఇంద్రుడు తిరిగి చూస్తాడు. ఇద్దరు సేవకులు వస్తారు.చక్రపాణిగారు మంచం దిగి కాళ్లు కిందపెడతాడు.

‘‘అరెరె? నా చెప్పులేయి! ఇదేంటి కాళ్లకింద ఇంత మెత్తగుంది!’’‘‘అది పూలరెక్కల రత్నకంబళం’’‘‘కాళ్లకింద పూల్రెక్కల కార్పేట్టేంటి ఛండాలం...గొర్రెబొచ్చుది దొరకదు మీకూ’’ఇంద్రుడు చక్రపాణిగారి వేపు అయోమయంగా చూస్తాడు.‘‘అన్నట్లు రంభేదీ! బాగుందా!’’ అని చక్రపాణిగారు అడుగుతుండగానే రంభ ఒక స్తంభం చాటు నుండి పరుగెత్తుకొచ్చి ఏడుస్తూ చక్రపాణిగారి పాదాల మీద పడుతుంది. ఇంద్రుడు అవమానంతో ముఖం తిప్పుకుంటాడు. చక్రపాణిగారు కాస్త ఇబ్బందిపడుతూ, కాళ్లు వెనక్కి లాక్కుని ‘‘ఇదేంటి సినిమాలో సీనులాగా...లేలే...బాగున్నావా...పతివ్రతేషం కావాలని కోరికోరి ఏసిందానివిసగంలోనే రంభ లేచి నిలబడి ‘‘అందుకే క్షమించమంటున్నాను. నా తప్పులేదు చక్కన్నగారూ. తప్పంతా వారిది’’ అంటూ ఇంద్రుణ్ణి చూపిస్తుంది. ఇంద్రుడు కోపాన్ని దిగమింగి తలవంచుకుంటాడు.‘‘సరేలే, దానికి నువ్వేడవడం ఎందుకూ...ఎనకటికి ఎవతో మొగుణ్ణి గొట్టి ఏడ్చిందట...పిచ్చెరు సగంలో నువ్వొచ్చినందుకు ప్రొడ్యూసరేడవాలిగాని నువ్వేడుస్తావేం! బాతురూమ్‌ కెళ్తొస్తా’’ అంటూ సేవకుల వెంటనడుస్తాడు.పారిజాతవనంఇంద్రుడు, రంభ, చక్రపాణిగారూ ఆసీనులై ఉంటారు. సేవకుడు నవరత్నాలు పొదిగిన పాన పాత్రల్లో అమృతం నింపి తీసుకొచ్చి వారి ముందుంచుతాడు. ఇంద్రుడు ఒక అమృతపాత్ర అందివ్వబోతాడు. అది చూస్తూనే ‘‘ఇదేమిటి ఛండాలం...ఇదెవుడు తాగుతాడు. నాకిదొద్దు. స్కాచ్‌విస్కీ ఉంటే తెప్పిచ్చు’’ అని నసుగుతాడు చక్రపాణిగారు.ఇంద్రుడు వెలవెలబోతాడు.‘‘అవును ప్రభూ! చక్కన్నగారికి అమృతం అంటేనే అసహ్యం’’ అంటుంది రంభ. ఇంద్రుడు  రంభను మింగేట్లుచూస్తాడు. మరుక్షణం ‘స్కాచ్‌విస్కీ బాటిల్‌’ గ్లాసుతో సహా చక్రపాణిగారి పక్కనున్న టేబిల్‌ మీదకనిపిస్తుంది. ఒక చేత్తో సిగరెట్‌ కాలుస్తూ మరొక చేత్తో విస్కీగ్లాస్‌ తీసుకుంటాడు. ఇంద్రుడు అమృతం సేవిస్తూ, రంభను కూడా తీసుకోమంటాడు. చక్రపాణిగారు కొప్పడతారు ఒద్దని సౌంజ్ఞతో చెప్తుంది రంభ...ఇంద్రుడి కండ్లునిప్పుకణాల్లా  ఎర్రబడతాయి.‘‘ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్లు?’‘‘మీతో ఒక గొప్ప పనివుండే తీసుకొచ్చాం చక్కన్నగారూ!’’  అంటుంది రంభ.

‘‘నాతో మీకేం పని! అన్నట్లుగా నాకవతల షూటింగుందే. పదిగంటలకే నే నక్కడుండాల్నే...’’రంభ కంగారు పడిపోతూ ‘‘చక్కన్నగారూ! త్వరగా వెళ్లడానికి వీల్లేదు. మీరు కొంతకాలం ఉండి ఇక్కడ నా కోసం చిత్రం తీసే ఏర్పాట్లు చేయించాలి. ఏది కావాలన్నా...క్షణంలో సమకూర్చగల ఇంద్రలోకం ఇది’’‘‘క్షణంలో మీరేం జేసినా, కథనీ, టెక్నిషియన్లనీ క్షణంలో తయారుజేయలేరే.... మాయం చెయ్యడం, మాయం గావడంలా తేలికపన్లు గావియ్యన్నీ... అయినా మీ కెందుకుకా స్టూడియోల పిక్చెర్లూ...పన్లేనిపనిగాకపోతే’’ఇంద్రుడు తలపట్టుకొని ఒక్క నిట్టూర్పు విడుస్తాడు.రంభ అనునయంగా కాస్త చక్రపాణిగారి దగ్గరకు జరిగి–‘‘నా కోసమే చక్కన్నగారూ! భూలోకం నుంచి వచ్చినప్పటి నుంచి నాకు నటించాలనే కోరిక తీవ్ర రూపం దాల్చింది. మీ చిత్రంలో మీరు చెప్పినట్లు విని ఎంతో  ఉత్సాహంతో నటించాను...ఎన్ని కలలుకన్నాను. కాని ఆ చిత్రం పూర్తి చేసే భాగ్యం లేకుండా పోయింది’’‘‘దానికింత  గొడవెందుకూ! మళ్లీ నువ్వే అక్కడి పో! అక్కడే ఏదో ఒకేషం ఏస్తే పోయేదానికి. నీ ఒక్కదాని కోసం ఇంతదూరంలోవేరేస్టూడియో ఎందుకూ...’’ఫర్వలేదు చక్కన్నగారూ! నా కోసం దేవేంద్రులు ఏంకావాలన్నా సమకూరుస్తారు...ఒక్క స్టూడియో ఏమిటి...’’‘అద్సరేలే...ఇంద్రుడు నీ చేతిలో ఉన్నాడని నువ్వు స్టూడియోలు కట్టించొచ్చు. కాని ఇక్కడికొచ్చి  పిక్చెరు తీసేవాడుండొద్దూ! పైగా ఇక్కడ ఏంగావాలన్నా అక్కణ్ణించి రావాలాయె...ఎందుకొచ్చింది...ఏదోవషం ఇప్పిస్తా’’రంభ సంతోషపడిపోతూ ‘‘మీరెలా చెప్తేఅలాచేస్తాను చక్కన్నగారూ’’ అంటుంది.ఇంద్రుడు గాభరపడిపోతూ...‘‘అదికాదు చక్రపాణిగారూ! రంభ లేకపోతే ఇంద్రలోకంలో ఏముంటుంది’’‘‘లేకపోతే పోద్దీ...కళ కోసం నీ పరువు పోగొట్టుకుంటావానీలాంటోళ్లు పిక్చెర్లనీ, స్టూడియోలని  మొదలెలెడితే అది కాస్తా కంపౌద్ది...గవర్నమెంటోళ్లు  సినిమాలు తీయించినట్టుంది’’ఇంద్రుడు ఏం సమాధానం చెప్పాలో తోచక రంభ వైపు ‘నాకక్కడషూటింగుందే! వాళ్లంతా ఏం కంగారు పడుతున్నారో! ఇదంతా ఒక్కరోజులో జరిగేది కాదే! అయినా ఇప్పుడుడెంటనే పిక్చెరు తీయడానికి ఇక్కడ మీకేం ఉంది? ఎట్ట దీస్తారంట!’’రంభ, ఇంద్రుడు ఒకరిముఖాలు ఒకరు చూసుకుంటారు అర్థం గాక.‘అంటే చిత్రశాల లేదని అంటున్నారా?’’ అని అడుగుతుంది రంభ....‘‘మీరే చెప్పండి చక్కన్నగారూ ఏంకథ బావుంటుందో!’’ అంటూ ఉత్సాహంగా ముందుకువంగి కూర్చుంటుంది రంభ.‘‘బాగానే ఉంది. మాకే మంచి కథల్దొరక్క అవస్తగా ఉంటే నీకేం చెప్పేది...మీరే చెప్పండి’’రంభ ముభావంగా ఇంద్రుడి వైపు చూస్తుంది...ఇంద్రుడు లేని ఉత్సాహం తెచ్చుకుని‘‘మూమూలు కథల కంటే పురాణగా«థలే మేలంటాను చక్రపాణిగారూ...ఎందువల్లంటే వాటివల్ల పుణ్యమూ, పురుషార్థమూ లభిస్తుంది.

దేవదానవ వైరమనేది యుగయుగాల సమస్య. అటువంటి కథా వస్తువు తీసుకొని, రాక్షసులు దేవతలను పెట్టే బాధలతో కథ ఉంటుంది’’‘‘చెత్త చేస్తానంటావ్‌. అంతేగా! అసల్నువ్వు ఎటువంటోడివంట! ఆ తల్లేని రాక్షసులు అరణ్యాలూ, కొండలూ, గుహలు పట్టుకుని బ్రతుకుతుంటే, వాళ్లని చూసి నువ్వు ఇంత దూరాన్నించే ఒణుకుతుంటివి...వాళ్లొచ్చి నిన్నేం అవస్తలు పెడుతున్నారంట! అసలు వాళ్లు తల్చుకుంటే నిన్నిక్కణ్ణుంచి ఎప్పుడో పీకేసేవాళ్లంటా నేను’’ఇంద్రుడు చిన్నబుచ్చుకుని వెనక్కి జరుగుతాడు. రంభ సంభాషణ మార్చడానికి ప్రయత్నిస్తూ...‘‘పోనీ మన బృహస్పతులవారి చేత వ్రాయిద్దామా’’ అంటుంది.‘‘ఏంటి! నీ జాతకమా! సినిమా కథ ఆయనేం  రాస్తాడు! ఆయన్రాస్తే ఆయనలాంటోళ్లు జూడాల్సిందే’’ఇంద్రుడు కాస్త భయపడుతూనే ‘‘చూడండి చక్రపాణిగారూ! భూలోకంలో కత్తియుద్ధాలూ, నాట్యాలు ఉంటే చిత్రాలు రాణిస్తాయని రంభ చెప్పింది...మరి మనకు రంభతో బాటు ఊర్వశీ, మేనక, తిలొత్తమాదినాట్యకత్తె లెందరో ఉన్నారు’’‘‘వాళ్ళాడితే ఎవుడు జూస్తాడు నువుదప్పితే...ఏనాటి మేనక! ఏనాటి తిలోత్తమ! నీ దగ్గిర ‘పెన్షన్‌’ తీసుకుని బతికే ఆ ముసలొళ్ల చేత ఏం ఆడిస్తావులే...ఏదన్నా సెంటిమెంటుండాలో కథలో...లేదంటేగుండమ్మకథలాగానన్నా ఉండాలా...అయ్యన్నీ మీరేం తీస్తారుగానీ,ఏదన్నాగొప్పోడి కథ తీస్తే బాగుంటది’’ఇంద్రుడు కోపంతో, అవమానంతో కంపించిపోతాడు లోలోపలే. రంభ కాస్త గాభరపడుతూ...‘‘అదికాదు చక్కన్నగారూ, గొప్ప గుణాలు రాక్షసుల్లో ఎలా ఉంటాయి! దేవతల్లో ఉంటాయి’’‘‘అని మీరు చెప్పుకోవాల్సిపందే. గొప్పగుణాలుండే రాక్షసుల్లేరూ? చెప్పమంటావా! బలి న్దీసుకో! బలి ఎట్టాంటోడు! ఎంత గొప్పోడు! ఆడి కాలిగోటికి పోల్డే మీ  ఇంద్రుడు! వాడుతన కంటే గొప్పోడవుతున్నాడనంగానే వాన్ని  పాతాళానికి తొక్కించిందాకా నిదురబోలేదే ఇతను. బలిని పాతాళానికి తొక్కినా  అతని కీర్తి ఆకాశానికి ఎగిసింది. ఈరోజు బలి గొప్ప దాతంటారుగాని, ఇంద్రుణ్నెవురుజెప్పుకుంటారు! సోదిలో గూడారాడే!’’రంభ ఇంద్రుడి ముఖం చూస్తుంది. ఇంద్రుడు అగ్నిపర్వతంలా కుములుతుంటాడు లోలోపలే. రంభ చూపులు కిందికి దించుకుని ‘‘మరి బలిచక్రవర్తి కథకు మాటలూ, పాటలూ కావలిగా!...వాళ్లంతా...’’‘‘అక్కణ్ణించి రావాల్సిందే...అంతేగాదు ఇంకా శానమంది రావాలి. టెక్నిషియన్సూ, మ్యూజికోళ్ళూ, కెమెరా, సౌండ్‌ ఎక్విప్‌మెంటూ, లైట్లు, లైట్‌ బాయిసూ, ప్లేబేక్‌ వాళ్లూ్ల, మిగతా ఆర్టిస్టులందరూ అక్కణ్ణించి రావల్సిందే...ఇక్కడోళ్లెవరూ పనికిరారు’’‘‘ఎందకని చక్కన్నగారూ! ఇక్కడ కూడా ఎందరో కళాకారులున్నారే’’ అంటుది రంభ కాస్త రోషంతో...‘‘ఉంచొచ్చుగానీ, మా ‘నేటివిటీ’ రాదుగా! అట్టనుకుంటే మద్రాసులో ఆర్టిస్టులూ, టెక్నిషియన్లూ లేకనా–ఎక్‌స్ట్రా దగ్గర్నుంచి బొంబాయినించే రావాలంటారు–మెడ్రాసులో హిందీ పిక్చర్‌ తీసే బొంబాయోళ్లంతా...ఎవడి భాషవాడికిగొప్ప...రంభ తప్ప మిగతా అంతా మా వోళ్లు రావాల్సిందే’’ అని చక్రపాణిగారు అంటుండగానే అయిదుగురు గంధర్వులు ‘ఆర్క్‌ లైట్లు’లా కండ్లు చెదిరేంత వెలుగుతో అక్కడ ప్రత్యక్షమై ఇంద్రుడిచెవిలో ఏదో చెప్తారు.వెంటనే ఇంద్రుడు రౌద్రాకారంతో చివాల్న లేచి నిలబడి ‘‘ఔరా! నే నెంత మూర్ఖుణ్ణి! మతి లేని రంభ కోసం నా వివేకాన్ని కోల్పోయాను. అజ్ఞానంలో పడి అంతా మర్చిపోయాను. నా ఇంద్రత్వాన్నే కోల్పోయే పరిస్థితికి జారిపోయాను. ఈ అనర్థం అంతా ఈ దౌర్భాగ్యురాలు రంభ వల్ల జరిగింది’’ అని ఇంద్రుడు ఆవేశంతో అంటుంటే చక్రపాణిగారు తాపీగా మిగిలిన విస్కీ చివరిగుటక తాగి గ్లాసు టేబిల్‌ మీద పెడతారు.ఇంద్రుడు శపిస్తాడోనని రంభ గజగజా వణుకుతూ నిలబడుతుంది.‘‘దేవేంద్రా,  మానవులంటే వానరజాతి, ఇంద్రలోకం ధ్వంసం కాకముందే ఇతడిని తక్షణం పంపివెయ్యండి’’ అంటూ గంధ్వర్వులుచెప్తుండగానే....‘‘ఇదుగో ఈ క్షణమే’’ అంటూ ఇంద్రుడి ముందు మత్తుగా కూర్చున్న చక్రపాణిగారి చెయ్యి పట్టుకొని  లాగి కింద పడేస్తాడు.తన గదిలో మంచం మీద నిద్రపోతున్న చక్రపాణిగారు దుబుక్కున మంచం మీద నుంచి కిందపడి గొణుక్కు కూచుంటాడు.

భానుమతీ రామకృష్ణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement