గోవా అంటే బీచ్‌లే గుర్తొస్తాయి. బీచ్ టూరిజం, విదేశీ పర్యాటకులు, పోర్చుగీసు కోట, చర్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ మమ్మీ, మాండవి నది... ఇలాంటివే గుర్తుకు వస్తాయి. వీటన్నింటినీ ఆద్యంతం ఆస్వాదించడానికి వీలుగా రూపొందిన హాలిడే రిసార్టులు కూడా కొల్లలు. అలియా దియా వంటి రిసార్టులు సముద్రతీరంతోపాటు పచ్చని పంట పొలాల నుంచి పిల్లతెమ్మెరలనూ ఆస్వాదింపచేస్తాయి. సముద్రానికి పోటీగా స్విమ్మింగ్ పూల్స్‌తో ఆకర్షిస్తాయి. వీటికంటే ముందు మాండవి నదిలో క్రూయిజ్ విహారాన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. క్రూయిజ్‌లో సన్‌సెట్ జర్నీ, సన్‌డౌన్ జర్నీ, ఫుల్ మూన్ ట్రిప్‌లు ఉంటాయి. సన్‌సెట్, సన్‌డౌన్ ట్రిప్‌లు రోజూ ఉంటాయి, కానీ ఫుల్‌మూన్ ట్రిప్ మాత్రం పౌర్ణమి రోజుల్లోనే ఉంటుంది.
పున్నమి వెన్నెలలో మాండవి నదిలో క్రూయిజ్ విహారాన్ని ఆస్వాదించేటట్లు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. రెండువందల మంది ప్రయాణించే క్రూయిజ్‌లో స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పుట్టినరోజు, పెళ్లి రోజు పార్టీలు చేసుకోవడానికి క్రూయిజ్‌ని గంటల లెక్కన అద్దెకిస్తారు. సన్‌సెట్ క్రూయిజ్ సాయంత్రం ఆరుగంటల నుంచి ఏడు వరకు ఉంటుంది. సన్‌డౌన్ ట్రిప్ సాయంత్రం ఏడుగంటల పదిహేను నిమిషాల నుంచి గంటసేపు ఉంటుంది. ఫుల్‌మూన్ ట్రిప్ మాత్రం రాత్రి ఎనిమిదన్నర నుంచి మొదలైతే రెండు గంటలపాటు సాగుతుంది. మాండవి నదిలో రివర్‌రాఫ్టింగ్ సాహసం చేయవచ్చు. రివర్ రాఫ్టింగ్ ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీ నుంచి మొదలవుతుంది. రాఫ్టింగ్ ట్రిప్‌లు ఉదయం పదిన్నరకు, మధ్యాహ్నం రెండున్నరకు ఉంటాయి. రాఫ్టింగ్‌కి టిక్కెట్లను గోవా చేరడానికి ముందే ఆన్‌లైన్‌లో bookings.goa-tourism.com <http://bookings.goa-tourism.com/cruises1.aspx> వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటారు.
అది సాధ్యంకానప్పుడు గోవాలో జిటిడిసి(గోవా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆఫీసుల్లో బుక్ చేసుకోవచ్చు. మిరామర్, పనాజీ, కాలంగూట్, మపూసా, కోల్వా, ఫార్మాగుడి, వాస్కో, దబోలిమ్ ఎయిర్‌పోర్టు కౌంటర్, మేయమ్ సరస్సు, ఓల్డ్‌గోవా, మార్గావ్‌లలో ఈ ఆఫీసులున్నాయి. రాఫ్టింగ్ ఫీజు సాధారణ రోజుల్లో పద్నాలుగు వందలు, సెలవు దినాల్లో పదిహేడు వందల రూపాయలు. రాఫ్టింగ్ పది కిలోమీటర్ల దూరం సాగుతుంది. 90 నిమిషాల సేపు ఉంటుంది. ఉస్టెమ్ గ్రామం నుంచి సోనాల్ గ్రామం వరకు సాగే ఈ వాటర్‌గేమ్‌కి అవసరమైన రాఫ్ట్‌లు, పెడల్స్, జాకెట్ వంటి సాధనాలతోపాటు శిక్షణ పొందిన గైడ్ కూడా ఉంటారు. ట్రిప్ మధ్యలో సేద దీరడానికి టీ, బిస్కట్ కూడా ఇస్తారు. రాఫ్టింగ్ సమయంలో ఎటువంటి వృథా వస్తువులనూ నదిలో పడేయ కూడదు, పాలిథిన్ కవర్ లేదా ప్లాస్టిక్ వంటి భూమిలో కలవని వస్తువులను పర్యాటకులు తమతోపాటుగా ఉంచుకున్నప్పటికీ బయటకు తీసుకురావాలి తప్ప నదిలో వేయకూడదు. గోవాలో మరో ఆకర్షణీయమైన ప్రదేశం దూద్‌సాగర్ జలపాతం. ఇది పనాజీకి 60 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. రాష్ట్రంలో ఎత్తై జలపాతం ఇది. జలపాతానికి కొద్దిదూరాన కాదంబ రాజులు కట్టిన తామ్‌డి ఆలయం ఉంటుంది.
లెక్కలేనన్ని ఆలయాలు!
గోవా పర్యటనలో తరచూ గుర్తొచ్చే బీచ్‌లను కొద్దిసేపు పక్కన పెట్టి వేరే ఏమున్నాయని ఆరా తీస్తే లెక్కలేనన్ని ఆలయాలను చూపిస్తారు. మార్గోవాకు ఇరవై కిలోమీటర్ల దూరాన ఫాతోర్పాలో శ్రీ శాంతదుర్గ ఆలయం ఉంది. పనాజీకి పాతిక కిలోమీటర్ల దూరాన గోపాల గణపతి ఆలయం ఉంటుంది. రామ్‌నాథిలో రామ్‌నాథాలయం ఉంటుంది. సప్తకోటేశ్వర ఆలయం, రుద్రేశ్వర ఆలయం, మహాదేవ ఆలయం, కామాక్షి ఆలయం, భగవతి ఆలయం, గోపాల కృష్ణ ఆలయం, శ్రీనవదుర్గ ఆలయం, బ్రహ్మ ఆలయం, దీపస్థంబ దత్తవాడి, హనుమాన్ ఆలయం, మాన్‌గుషి ఆలయం, పాండురంగ ఆలయం, దేవకీ కృష్ణ ఆలయం, గోకర్ణ పర్తగలి జీవోత్తమ్ మఠం, బ్రహ్మపుర గోమటేశ్వర దేవస్థాన్, మాదానాంత్ ఆలయం, మల్లికార్జున ఆలయం, సిద్ధి వినాయక మందిర్, కనకేశ్వరి ఆలయం ఉన్నాయి. మ్యాప్‌లో పెన్సిల్ మొన అంత కనిపించే గోవాలో ఇన్ని ఆలయాలున్నాయా అని ఆశ్చర్యం కలిగే మాట నిజమే కానీ వీటితోపాటు చర్చ్‌ల జాబితా కూడా పెద్దదే. పంజింలో మేరీ ఇమాక్యులెట్ చర్చ్ గోవాలో పోర్చుగీసు వాళ్లు స్థావరం ఏర్పరుచుకున్న తొలినాళ్లలో కట్టిన ప్రార్థనామందిరం.
సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఓల్డ్ గోవాలో బాసిలికా ఆఫ్ బామ్ జీసస్,సె కెథడ్రాల్ చర్చ్‌లు నిర్మాణశైలి పరంగా కూడా ప్రత్యేకమైనవి. ఇంకా సెయింట్ అండ్రూ చర్చ్, అవర్ లేడీ ఆఫ్‌రోజీ, సాంతా మోనికా, చర్చ్ ఆఫ్ సెయింట్ అన్నా తలాలిమ్, మాయో డె డీయస్ సాలిగో, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసీస్ ఉన్నాయి. కోటల జాబితాలో ఫోర్ట్ అగుడా, చపోరా ఫోర్ట్, లైట్ హౌస్ ఆఫ్ ఫోర్ట్ అగుడా, కాబో డి రామ్ ఫోర్ట్, శివాజీ ఫోర్ట్, తిరాకోల్ ఫోర్ట్ ఉంటాయి. గోవాలో ఇంకా చూడాల్సినవి హార్‌వాలేమ్ గుహలు, మాండవి బ్రిడ్జి, మ్యూజియం, నేత్రావళి జలపాతం, కళా ఆకాడమీలు.
ఇక బీచ్‌ల వైపు దృష్టి సారిస్తే నార్త్‌గోవాలో కాలంగూట్ బీచ్, బాగా బీచ్, అంజునా బీచ్, వాగేటర్ బీచ్, సింఖోరిమ్ బీచ్, మిరామర్ బీచ్‌లు పర్యాటకులను సేదదీరుస్తుంటాయి. సౌత్‌గోవాకెళ్తే పాలోలెమ్, అగోండా, కోల్వా, వెర్కా... ఇలా లెక్కకు మించిన తీరాలు... పర్యాటకులను మైమరిపిస్తూ కరిగిపోయే కాలాన్ని తెలియనివ్వవు. మద్యం ప్రియులను కూడా అలరిస్తుంది గోవా. ఇక్కడ కొబ్బరితోపాటు జీడిమామిడి కూడా విస్తారంగా పండుతుంది. గోవాకు మాత్రమే పరిమితమైన మద్యం ‘ఫిన్’ తయారయ్యేది కూడా ఈ పంటల ఆధారంగానే. గోవా ప్రకృతి ప్రేమికులతోపాటు పక్షి ప్రేమికులకు కనువిందు చేసే ప్రదేశం అనడానికి నిదర్శనం సలీం అలీ బర్డ్ సాంక్చురీ. ప్రముఖ ఆర్నిథాలజిస్టు సలీం ఆలీ పేరునే దీనికి పెట్టారు.
ఆ పేరు ఎలా వచ్చిందంటే!
గోవా పట్టణానికి ప్రాచీనకాలంలో గోమంత, గోమంచాల, గోపకపట్టం, గోపకాపురి, గోవాపురి, గోవెమ్, గోమంటక్ అనే పేర్లు ఉండేవి. మహాభారత కాలంలో గోపరాష్ట్ర, గోవరాష్ట్ర (గోపాలకుల ప్రదేశం)అనేవారు. సంస్కృత గ్రంథాల్లో గోపకాపురి, గోపకాపట్టణమ్ అనే పదాలను ఉపయోగించారు. హరివంశం, స్కందపురాణాల్లోనూ దీని ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం దీనిని అపరాంత అనేవారని గ్రీకు పర్యాటకుడు టాలమీ రాశాడు. పాశ్చాత్యుల పాలనలో గోవా అయింది.
ఎలా వెళ్లాలి?
విమానంలో... గోవాలోని దాబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. ఇక్కడి నుంచి అలియా దివా రిట్రీట్ రిసార్టుకు 20 నిమిషాల ప్రయాణం. హైదరాబాద్ నుంచి గోవాకు జెట్ ఎయిర్‌వేస్ విమానం ఎకానమీ క్లాస్ టిక్కెట్టు రూ5,800 ఉంటుంది. గంటన్నర ప్రయాణం. ఇండిగోలో వెళ్తే ముంబయిలో విమానం మారాలి. రైల్లో... హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుంచి ‘కాచిగూడ- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్’ ఉంది. 18 గంటల ప్రయాణం.
ఎప్పుడు వెళ్లాలి?
గోవా పర్యటనకు అక్టోబర్ నుంచి మార్చి వరకు పీక్ సీజన్. ఎక్కువమంది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో పర్యటించడానికి ఆసక్తి చూపిస్తారు.
ఎక్కడ ఉండాలి?
కాలంగూట్‌లోని ‘ఆల్ సీజన్స్ బీచ్ క్లాసిక్’ హోటల్‌లో గది అద్దె రోజుకి రూ700. ఆలోర్ హాలిడే రిసార్టులో రూ1,900, అలోర్ గ్రాండే హాలిడే రిసార్టులో రూ 1,400. ఇవన్నీ టూ స్టార్ హోటళ్లు. అలియా దివా గోవా వంటి ఫైవ్‌స్టార్ హోటల్లో సూట్ అద్దె ఒక రోజుకు ఐదువేలు. రోజుకు 18 వేలు చార్జ్ చేసే హోటళ్లు కూడా ఉంటాయి.
భోజనం ఎలా?
‘కేఫ్ చాకొలట్టి’లో నార్త్ ఇండియన్ భోజనం ధర రూ 600. ‘కోర్ట్‌యార్డ్’లో మొఘలాయ్, తందూరి, ఇండియన్ రుచులు ఉంటాయి, ఒక భోజనం రూ 900. అలాగే ఇటాలియన్, మెక్సికన్ భోజనానికి 18 వందలు చార్జ్ చేస్తారు. యూరోపియన్ కాంటినెంటల్ రుచులు ‘ఎ రివెరీ’లో దాదాపుగా మూడువేల రూపాయలకు దొరుకుతాయి.
ఇక్కడ తప్పక రుచి చూడాల్సింది!
బెబింకా గోవా సంప్రదాయ వంటకం. ఇది భోజనం తర్వాత తీసుకునే డెజర్ట్. మైదా, చక్కెర, నెయ్యి, కోడిగుడ్డు సొన, కొబ్బరిపాలతో చేస్తారు. పిండిని 7 నుంచి 16 పొరలుగా చేసి ఒవెన్‌లో ఉడికించి, బాదం పలుకులతో గార్నిష్ చేస్తారు. గోరువెచ్చటి బెబింకాను ఐస్‌క్రీమ్‌తో సర్వ్ చేస్తారు. ఇది పది రోజులు తాజాగా ఉంటుంది. గోవా పర్యటన తీపిని దీనితో స్నేహితులకు పంచుకోవచ్చు.
షాపింగ్!
కాలంగూట్, అంజునా, మాపుసా బీచ్‌లలో జువెలరీ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఫంకీ జువెలరీ ఉంటుంది. బరువైన లోహపు ఆభరణాలు, తేలికపాటి ఆభరణాలు ఉంటాయి. వెదురు, చెక్క, టైట బీడ్స్‌తో చేసిన నెక్లెస్‌లు తెచ్చుకోవచ్చు. లెదర్ గూడ్స్, దుస్తులు కూడా ఉంటాయి. కానీ పర్యాటక ప్రదేశం కావడంతో ధరలు ఎక్కువ. స్థానిక సంప్రదాయ చేనేతలు, హస్తకళల కోసం గోవా స్టేట్ ఎంపోరియమ్‌కెళ్లడం మంచిది.
విహారం: పశ్చిమ తీరాన వెన్నెల విహారం
Published Sun, Sep 15 2013 2:52 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM
Advertisement
Advertisement