
నటులకు గీటురాయి... దేవదాసు!
మిలీనియమ్ మొదట్లో వచ్చిన పెద్ద సినిమాలలో సూపర్‌హిట్ సినిమాలు, భారీ అంచనాలు ఉన్న సినిమాలన్నీ దాదాపు తొంభై శాతం పాత కథలే.
మిలీనియమ్ మొదట్లో వచ్చిన పెద్ద సినిమాలలో సూపర్‌హిట్ సినిమాలు, భారీ అంచనాలు ఉన్న సినిమాలన్నీ దాదాపు తొంభై శాతం పాత కథలే. వాటికి కొత్త సాంకేతిక హంగులు, ఈతరంలో టాప్ ఆర్టిస్టులు, విజువల్ గ్రాండియర్ తోడై, మంచి పాటలతో, పంచ్ డైలాగులతో మోడరన్ సినిమా ప్రేక్షకుడికి పాత చింతకాయతో కొత్త పచ్చడి తయారుచేసినట్టయింది. 1900కి ముందు కలకత్తాలో శరత్‌చంద్ర రాసిన నవల మొదట బెంగాలీలో మూకీ సినిమాగా తయారై, హిట్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత...
1935 ప్రాంతాల్లో పి.సి.బారువా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన టాకీ సినిమాగా తయారై, హిట్ అయ్యి, మళ్లీ అదే పి.సి.బారువా తన దర్శకత్వంలో కుందన్‌లాల్ సైగల్ హీరోగా 1950లలో బెంగాలీలో రిలీజై, హిట్ అయ్యి, తెలుగులో వేదాంతం రాఘవయ్యగారి దర్శకత్వంలో డా॥అక్కినేని హీరోగా, సావిత్రి హీరోయిన్‌గా తయారై, సూపర్‌హిట్ అయ్యి, ఆల్‌టైమ్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచి, మళ్లీ హిందీలో దిలీప్‌కుమార్ హీరోగా, మళ్లీ తెలుగులో కృష్ణగారు హీరోగా, విజయనిర్మలగారి దర్శకత్వంలో, మళ్లీ బెంగాలీలో, పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో, మళ్లీ ప్రతి పదేళ్ల తర్వాత బెంగాలీలో ఒకసారి కొత్త సినిమాగా తయారై, ఆ వరుసలో 2002లో షారుక్ ఖాన్, ఐశ్వర్వారాయ్, మాధురీ దీక్షిత్‌ల భారీ తారాగణంలో, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో కలర్‌ఫుల్ ప్రేమ కావ్యం అయింది - ‘దేవదాస్’.
గంగావతరణం పుట్టుకని, ప్రవాహాన్ని, గంగానది ప్రయాణాన్ని తలపిస్తోంది కదూ ఈ దేవదాసు చరిత్ర.
పదిహేడేళ్ల వయసులో శరత్‌చంద్ర రచించిన ఒక భగ్న ప్రేమికుడి విషాద గాథ దేవదాసు. ఈరోజు వరకూ ఎన్ని ప్రేమకథలు వచ్చినా, వాటిలో ‘దేవదాసు’ ప్రస్తావన గానీ, పార్వతి ప్రస్తావన గానీ, వాళ్లలాంటి సీను గాని, షాట్ గాని, డైలాగ్ గానీ పాటలో గానీ లేకుండా భారతీయ సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.
‘ప్రేమ’ రెండక్షరాల్లాగే, దాని పర్యవసానం కూడా రెండే. ఒకటి సుఖాంతం, ఇంకోటి దుఃఖాంతం. పెళ్లవగానే సుఖాంతం ఏ కారణం చేతనైనా పెళ్లి చేసుకోలేకపోతే దుఃఖాంతం. కానీ దుఃఖాంతమైన ప్రేమ కథల్లో అంతులేని ఆత్మ, జీవం, ఆవేదన, ఆర్తి, లాంగింగ్‌నెస్ అన్నీ పరిపూర్ణంగా అనుభవించేలా రాసిన కథ దేవదాసు.పోస్టర్ చూడగానే: అక్కినేని, దిలీప్ కుమార్ లాంటి మహానటులు నటించిన పాత్రలో మోడరన్ ప్రేమికుడి పాత్రలకి పేటెంట్ అయిన షారుఖ్ ఏం నటిస్తాడు? ఇతనిలో ఆ పాత్రకి కావల్సిన డెప్త్ ఎక్కడుంది? అనిపించింది.
అలాగే పార్వతి పాత్రకి ఐశ్వర్యారాయ్ చాలా మిస్‌ఫిట్ అని మొదటి ఫీలింగ్. చంద్రముఖి పాత్రకి మాధురీ దీక్షిత్ మాత్రమే కరెక్టని. ఆమె ‘ప్రేమాభిషేకం’లో జయసుధగారిలాగా అవలీలగా ఆ క్యారెక్టర్‌ని ప్లే చేయగలదని నమ్మకం. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమా వల్ల ఏ మూలో సంజయ్‌లీలా భన్సాలీ అంటే నమ్మకం. కథలో డెప్త్‌ని క్యారెక్టర్ల ద్వారా కన్వే చేయగలడని, విజువల్‌గా అద్భుతంగా అనిపించగలడని. పాటలు వినగానే సినిమా కచ్చితంగా చూడాలనిపించింది. కవితా కృష్ణమూర్తి పాడిన ‘మార్‌డాలా...’, శ్రేయాఘోషల్ అనే కొత్త గాయని ఇంట్రడ్యూస్ అయిన ‘మోరే పియా..’, ‘డోలారే డోలారే...’’ రెండు ట్రాక్స్.
దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ జీ సరిగమప కార్యక్రమానికి అతిథిగా వెళ్లినప్పుడు లతా మంగేష్కర్ పాట పాడిన శ్రేయాఘోషల్‌ని చూసి, గుర్తుపెట్టుకుని ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ పాత్ర పార్వతి పాడే పాటలన్నింటికీ ఆమె గొంతే కావాలని ఇస్మాయిల్ దర్బార్ (సంగీత దర్శకుడు)కి చెప్పి పాడించాట్ట. ఆ చిత్రంతోనే శ్రేయాఘోషల్ హిందీ సీమకి గాయనిగా పరిచయం అవ్వడం, ఆ చిత్రంతోనే ఉత్తమ నేపథ్య గాయనిగా నేషనల్ అవార్డ్ తీసుకోవడం జరిగిపోయాయి.
2002లో 50 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయడం పెద్ద సాహసం. అది కూడా 102 ఏళ్ల క్రితం రాసిన నవల, 16 భారతీయ, పక్క దేశాల భాషల్లో వివిధ రకాలుగా తీసేసిన కథని తీయడం మరీ సాహసం. ఆ చిత్రం భారతదేశం తరఫున బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌కి వెళ్లడం, కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమవ్వడం, నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఎన్నింటినో గెలుచుకోవడం... అన్నింటినీ మించి భారతీయ ప్రేక్షకులు ఆ చిత్రంపై నిర్మాత భరత్‌షా పెట్టిన యాభై కోట్లకీ నూట రెండు కోట్లకు పైన రిటర్న్ ఇవ్వడం - ఎన్ని ఘనతలు.
శరత్‌చంద్ర నవలలో దేవదాసు కథ దుఃఖాంతం కానీ, ‘దేవదాసు’ చిత్రంలో ఎంతమంది ఎన్నిసార్లు నటించినా, అంతకుముందు వారి మీదున్న ఇమేజ్‌ని మార్చి, వారిని మహానటీనటులుగా తీర్చిదిద్దిన గొప్పతనం ఆ పాత్రలది. పాత్రధారి ప్రతిభకి ఛాలెంజ్ విసిరే పాత్రల తీరుతెన్నులు ‘దేవదాసు’ సొంతం. దానివల్ల ఆ నటీనటుల జీవితాలు నటలోకంలో స్థిరపడి సుఖాంతం అయ్యాయి.
‘దేవదాసు’ చిత్రాలని నిర్మించిన నిర్మాతలందరికీ లాభం రావడం, ప్రేక్షకులు ఆయా కాలాల్లో ఆ చిత్రాలని ఆదరించడం, తద్వారా పనిచేసినవారికి జీతం, గుర్తింపు రావడం - ఇదీ సుఖాంతమే.
సరోజ్ ఖాన్ నృత్య రీతులు, మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్ నటన, కలిసి చేసిన నృత్యం, నితిన్ చక్రవర్తి ఆర్ట్ డెరైక్షన్, సంజయ్‌లీలా భన్సాలీ ఫ్రేమింగ్, గ్రాండియర్ టేకింగ్, కిరణ్ ఖేర్, జాకీష్రాఫ్, మిలింద్ గుణాజీ లాంటి సహ నటీనట వర్గం అపూర్వ నటనతో పాటు షారుఖ్, మాధురీ, ఐశ్వర్యల తారాస్థాయి నటన - ఈ 2002 హిందీ ‘దేవదాసు’కి క్లాసిక్ అప్పీలునిచ్చాయి.
‘దేవదాసు’ కథ అందరికీ తెలిసిందే అని నేను మళ్లీ రాయడం లేదు. తెలీకపోతే, ఎవరైనా అర్జెంటుగా ఆ చిత్రాన్ని రెండుసార్లు చూడండి - బ్లాక్ అండ్ వైట్‌లో అక్కినేని, సావిత్రి జీవించిన దేవదాసుని, కలర్‌లో సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన దేవదాసుని - హిందీ దేవదాసులో ఒకే మార్పు మాతృకలలో లేనిది ఏమిటంటే, పార్వతి చంద్రముఖిని తిట్టి, వచ్చేయకుండా, ఆమె కూడా దేవదాసుని ప్రేమింస్తోందని నమ్మి తనింటికి ఒక ఫంక్షన్‌కి ఆహ్వానించడం - ఆమె వేశ్య అన్న సంగతిని దాచి అతిథిగా చూడటం - తన భర్త తమ్ముడు చంద్రముఖి అస్తిత్వాన్ని బైటపెట్టి, అవమానించబోతే, చంద్రముఖి ఇచ్చే జవాబు - ఇది తెరమీద చూసి తీరాల్సిన ఎపిసోడ్.
అలాగే 1900 ప్రాంతంలోనే నవలలో పార్వతి మొదట నిర్భయంగా దేవదాసుని ప్రేమించినట్టు చెప్పగలుగుతుంది. కానీ, దేవదాసు చెప్పలేక కలకత్తా వెళ్లిపోతాడు. అక్కణ్నుంచి ఆమెకి ఉత్తరం రాస్తారు - మనిద్దరం స్నేహితులమే అని.
ఆ సంకోచం, ఆ బిడియం, ఆ పిరికితనం, ఆ ఈగో, ఇవాళ్టికీ మగవాళ్లలో ఉంది. ఆ కచ్చితత్వం, క్లారిటీ, మనసిచ్చిన వాడి దగ్గర మాత్రం చొరవ, తెగువ చూపించగల ధైర్యం, ఆ విషయంలో ఈగో లేకపోవడం ఆనాటి నుంచి ఈవాళ్టికీ ఆడపిల్లల్లో ఉంది అని నా అభిప్రాయం.
దీన్ని గమనించి, గుర్తించి రాసినందుకే దేవదాసు ఏ రోజుకైనా సమకాలీన సినిమా అవుతూ ఉండచ్చు. కాలంలో సమాంతరంగా పరిగెత్తే కాసుల మిషన్ అయి ఉండచ్చు. ఒక విపత్తు మధ్య నలిగిన ప్రేమికుల కథ ‘టైటానిక్’ గొప్ప ప్రేమకథా చిత్రం - ప్రేమికుల మధ్య ఉత్పన్నమైన భావోద్వేగాల విపత్తు నుంచి పుట్టిన విషాదగాథ ‘దేవదాసు’ అంతకంటే గొప్ప చిత్రం. హ్యాట్సాఫ్ శరత్‌చంద్ర - హ్యాట్సాఫ్ సంజయ్‌లీలా భన్సాలీ - హ్యాట్సాఫ్ షారుక్ - త్రీ ఛీర్స్..!
మగవాళ్లలో 1900 నాటి ఆ సంకోచం, ఆ బిడియం, ఆ పిరికితనం, ఆ ఈగో ఇవాళ్టికీ ఉంది. ఆడపిల్లల్లో ఆ కచ్చితత్వం, క్లారిటీ, మనసిచ్చిన వాడి దగ్గర మాత్రం చొరవ, తెగువ చూపించగల ధైర్యం... ఆ విషయంలో ఈగో లేకపోవడం ఆనాటి నుంచి ఈవాళ్టికీ ఉంది. దీన్ని గమనించి, గుర్తించి రాసినందుకే దేవదాసు ఏ రోజుకైనా సమకాలీన సినిమా అవుతూ ఉండి ఉండవచ్చు.