
వీడియో గేమ్స్ ఎంత సేపు?
మిగతావారితో పోలిస్తే వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో వేలి కదలికల నైపుణ్యం... ఎదురుగా కనిపించే అంశాలపట్ల స్పందించే వేగం పెరుగుతాయి. ఫలితంగా మార్కులు కూడా మెరుగుపడతాయి. అయితే వీడియో గేమ్స్‌కు ఆరోగ్యకరమైన పరిమితి ఎంత అనే అంశాలపై పరిశోధన నిర్వహిస్తున్నారు బార్సెలోనా లోని ‘హాస్పిటల్ డెల్‌మార్’కు చెందిన వైద్యనిపుణుల్లో ఒకరైన డాక్టర్ జీసస్ పూజోల్. ‘‘వీడియోగేమ్స్ వల్ల పిల్లల్లో మోటార్ స్కిల్స్, రియాక్షన్ స్పీడ్ మెరుగుపడతాయి. అయితే దీనికి తప్పక పరిమితి ఉండాల్సిందే’’ అంటారాయన.
బార్సిలోనాకు చెందిన 2,400 మంది పిల్లలపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం వీడియో గేమ్స్ ఆడాల్సిన వ్యవధి వారానికి తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఉండవచ్చంటున్నారు. అయితే ఈ వ్యవధి వారానికి పదకొండు గంటలకు మించితే మళ్లీ ప్రమాదమని పేర్కొంటున్నారు. ఇలా వారానికి పదకొండు గంటల కంటే ఎక్కువగా వీడియోగేమ్స్‌లో నిమగ్నమయ్యే పిల్లలకు మళ్లీ కొన్ని సమస్యలు వస్తాయంటున్నారు. ‘‘ఈ ఆరోగ్యకరమైన పరిమితికి మించి ఆడే పిల్లల్లో ఒంటరిగా ఉండిపోవడం, హింసాప్రవృత్తి పెరగడం వంటి అవాంఛితమై అంశాలు చోటు చేసుకుంటాయి’’ అంటున్నారు ఆ నిపుణుడు.