సృజనం : చివరి కాన్క | last offerings | Sakshi
Sakshi News home page

సృజనం : చివరి కాన్క

Published Sun, Nov 17 2013 3:35 AM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM

సృజనం : చివరి కాన్క - Sakshi

సృజనం : చివరి కాన్క

 పొగమంచు లాంటి నిశ్శబ్దాన్ని బూడిదలాగా రాలుస్తూ ఫోన్ రింగ్. ‘‘ఓసారి అర్జంట్‌గా స్టేషన్‌కి రండి’’ ఇంకేమీ చెప్పకుండా కాల్ కట్ చేసిన మీనన్ గొంతు అటు నుంచి.
 మీనన్! ఎన్నో ఏళ్ల కిందటి జ్ఞాపకం. రూపం.ఆరేళ్ల కిందట ఎవరో కూడా తెలీని అతణ్ని, వెతికి మరీ ఫోన్ నంబర్ని ఓసారీ, అతడినే తీసుకెళ్లి మరోసారీ... నిత్య ముందుంచిన రెండు చేదు జ్ఞాపకాలు మనసులో మెదిలాయి.
 
 మళ్లీ ఇప్పుడూ అతనే. గతంలో జరిగిన అనుభవాలే మళ్లీ మళ్లీ జీవితం ముందు ప్రశ్నల్లా నిలబడటం అంటే ఇదేనేమో!ఇంటికి లాక్ వేసి స్టేషన్‌కి వెళ్తే- అతడింకా లావయ్యాడు. నన్ను మాత్రం, ‘‘మీరేమీ మారలేదు. ఇంకా సన్నబడ్డారు. కళ్ల కింద ఆ నల్ల గీతలేంటి?’’ పరీక్షగా చూస్తూ అడిగాడు.
 
 ‘‘ఏంటిలా? ఎక్కణ్నుంచి?’’ అని అడిగాను.
 ‘‘మెయిల్‌లో నెల్లూరు వెళ్తూ, ఈ స్టేషన్ చూడగానే అందరూ గుర్తొచ్చి దిగిపోయాను’’ అన్నాడు.
 ఎప్పటికీ కలవని రైలు పట్టాలు. ఎందర్నో కలుపుతాయి. అంతలోనే విడదీస్తుంటాయి!
 ‘‘పదండి. నెక్స్ట్ ట్రైన్‌కి చాలా టైమ్ ఉంది’’ అన్నాక, నా వెనక బయటికి నడిచాడు.
 
 కొన్నేళ్ల కిందటి జ్ఞాపకం. చలిగాలిలో మానని గాయంలాగా రేగింది. కొన్నేళ్ల కిందట ఇతణ్ని ఇలాగే రిసీవ్ చేసుకుని, నిత్య వాళ్లింటికి తీసుకెళ్లడం గుర్తొచ్చింది. మేరీ డిన్నర్ ప్లేట్లు తెస్తే, సర్వింగ్‌లో తల్లికి సహాయపడుతూ నిత్య... ఎప్పుడో పదమూడేళ్ల వయసులో తమ ఫ్యామిలీలో మెంబర్‌గా మసిలి, ఆ తర్వాత తలెత్తిన సమస్యలకి భయపడి, ఎటో వెళ్లిపోయిన మీనన్‌ని తెచ్చి, జీవితం ముందుంచిన నన్ను ప్రేమగా చూసింది.
 
 అయితే, అప్పటి నా గుండెలో ఎన్ని తుపాన్‌లు సుడి తిరిగాయో! అతడి ముందు నా జీవితాన్ని తాకట్టు పెట్టి, వీళ్ల రొటీన్ లైఫ్‌లో ‘ఇగో’ని తృప్తి పరిచే, ఆనందంతో కూడిన జర్క్ ఇవ్వడానికి ఎన్ని కన్నీటి లోయలు దాటాడో ఎవరికి తెలుస్తుంది?
 ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ మీనన్ ఎందుకు వచ్చాడు?
 ‘‘వెళ్దామా’’ అన్నాడు.
 ఆలోచనల దారం తెగి, జ్ఞాపకాలు జలజలా రాలాయి ముత్యపు బిందువుల్లా.
 ‘‘ఏమైనా తిన్నారా?’’ అడిగాను.
 ‘‘లేదు. వెళ్తాం కదా?’’ నా కళ్లలోకి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.
 అతని భావం అర్థమైంది. ఏమీ బదులివ్వకుండా బండి స్టార్ట్ చేసి, అన్ని రోడ్లూ దాటి, మూడు రోడ్ల జంక్షన్‌లో ఆపితే, కుడివైపున రెండతస్తుల మేడ... నిశ్శబ్దంగా చీకట్లో.
 కిందకి దిగబోయిన అతణ్ని వారించాను. ప్రశ్నించే కళ్లతో నన్ను చూసి, తలతిప్పి మేడ పైకి చూశాడు. ఆర్చీలతో విశాలంగా ఉన్న వరండాలో ఎవరూ లేరు.
 బహుశా అతను ఆశపడి ఉంటాడు. ఆరేళ్ల కిందటిలాగా నిత్య, మేరీ అక్కడ ఉంటారని.
 ఒకసారి జరిగినట్లే మళ్లీ మళ్లీ జరగాలని, సుఖం, సంతోషం మళ్లీ అలాగే రావాలని ఆశపడతాం. కానీ, నాలిక కొనకి తగిలే చేదుని ఊహించలేం. అదేగా జీవితమంటే!
 ‘‘ఏమైంది? వాళ్లు లేరా?’’ మీనన్ గొంతు వణికింది.
 
 తల అడ్డంగా ఊపాను. ఆ మేడమీద, నిత్యవాళ్లు లేరు. ఎక్కడున్నారో తెలీదు. మేరీది తప్ప అన్ని ఫోన్లూ స్విచ్ఛాఫ్. మెసేజ్ ఇచ్చినా, కాల్ చేసినా ఆన్సర్ ఇవ్వని మేరీ, నిత్య బర్త్‌డే ముందురోజు ఫోన్ చేసి, ‘ఇంకోసారి కాల్ చేసినా, కాంటాక్ట్ చేసినా జాగ్రత్త’ అని ఇచ్చిన వార్నింగ్.ఇదే చెప్పాను. అతను మౌనంగా ఉండిపోయాడు.
 
 కాసేపటికి తిరిగి స్టేషన్‌కి చేరుకున్నాక, నెల్లూరు వెళ్లే ట్రైన్ అనౌన్స్‌మెంట్. ఇద్దరమూ మౌనంగా, కాందిశీకుల్లా రెండో ప్లాట్‌ఫామ్ మీదకి చేరాం. ఉక్కు రంగు పట్టాల మీద ఎర్ర చారల్లా సిగ్నల్ లైట్లు.
 అప్పుడు పెదవులు విప్పాడు మీనన్.‘‘తప్పంతా నాదే. అప్పట్లో ఏదో గందరగోళం. పోలీసులు, కేసు, కోర్టు... ఇవన్నీ ఫేస్ చేయాలేమో అని భయంతో దూరంగా వెళ్లిపోయాను. నాకు నిత్య అంటేనే ఇష్టం. కానీ మధ్యలో ఏవో ప్రలోభాలు. అంతా అలా ముగిసిపోయింది. మర్చిపోయిన జీవితం మీవల్ల మధ్యలో కొంత గుర్తొచ్చింది. అప్పుడు నిత్య ప్రేమని పొందుతున్న మీమీద ద్వేషభావం. కానీ మీరు కూడా  ఎందుకు విడిపోయారు?’’ మీనన్ అడిగాడు.
 
 ఏమని చెప్పాలి?
 టీనేజ్ మొదట్లోనే పేరెంట్స్ మీద గొడవలకీ వాళ్లు విడిపోవడానికీ కారణమైన మీనన్‌ని ఇష్టపడిన నిత్య... అమ్మ, నాన్న విడిపోయాక, అమ్మ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పెరుగుతూ, సమాజంలోని మృగాల నుంచి తప్పించుకుంటూ, టీనేజ్ ముగిసే చివరి రోజుల్లో, అనుకోకుండా జీవితం ముందు కనిపించిన నన్ను లతలా బలంగా అల్లుకుని, గుండెకి సంకెలుగా మారి, గాఢంగా ప్రేమిస్తూ, అంతలోనే ద్వేషిస్తూ, పరీక్షలు పెడుతూ, ప్రేమించకుండా ఉండలేకపోయా. ఎప్పటికీ వదలనని ప్రామిస్‌లు పొందుతూ, విడిపోయా. మళ్లీ కలిసిపోయా. నిత్యకి కొత్త జీవితాన్ని, వెలుగుతో కూడిన స్వేచ్ఛని ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేస్తున్నందుకు నన్ను ద్వేషించి, కక్ష కట్టిన అమ్మ, అక్కల ఒత్తిడికి లొంగి, వాళ్లవల్ల నాకు ఏ కీడూ జరగకూడదని తపిస్తూ... అలా అలా నాకు దూరమైన నిత్యకీ నాకూ మధ్య ఉన్న నాలుగేళ్ల ప్రేమ, అనుబంధం గురించి చెబితే... మీనన్‌కి మిగిలిన జీవితమంతా విషాదమే! ఇలాగే నయం. నేను కూడా విడిపోయానని తృప్తిగా వెళ్తాడు. మౌనం కన్నా మాటలు ఏమంత గొప్పవని?!
 ఇంతలో పెద్దగా శబ్దం చేసుకుంటూ వచ్చింది ట్రైన్.
 
 ఎదురుగా ఆగిన కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కబోతూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు మీనన్.
 ‘‘ఒకవేళ వాళ్ల గురించి తెలిస్తే, ఫోన్ చేయండి. అయామ్ వెరీ సారీ మిస్టర్ ఐజాక్. ఇలా జరుగుతుందనుకోలేదు’’ చెప్పి లోపలికి ఎక్కాడు. నేనేమీ మాట్లాడలేదు.
 ఒక్క కుదుపుతో ట్రైన్ కదిలింది. డోర్‌లో నిలబడి నన్నే చూస్తున్న మీనన్ కళ్లలో ఏదో సంతృప్తి కనిపిస్తోంది.
 
 ఎవరూ లేని ప్లాట్‌ఫామ్ మీద శిలావిగ్రహంలా నిలబడిపోయాను. పాత జ్ఞాపకాలు తెరలుతెరలుగా కడుపునొప్పిలా తిరగబెడుతున్నాయి. ఎప్పుడో ఆరేళ్ల కిందటి నిత్య మాటలు -
 ‘‘మీనన్ ఎక్కడున్నాడు? కనీసం ఫోన్ నెంబరైనా తేవాలి. అలా తేలేకపోతే, నువ్వు సెల్ఫిష్‌వి అంటోంది అమ్మ. నన్ను నిజంగా ప్రేమిస్తే, మీనన్‌ని వెతుకుతావు. నాకోసం కాదు. అమ్మ నమ్మకాన్ని వమ్ము చేసి, నువ్వు సెల్ఫిష్‌వి కాదని రుజువు చేయడం కోసం’’ అంది అప్పుడు నిత్య.
 ఈ మాట కోసం... ఇదే మీనన్‌ని ఆరేళ్ల కిందట నిత్యవాళ్లముందుంచాను. ఆ తర్వాత ఏవో కారణాలు, మరేవో ద్రోహాలు ఆరోపించి, నిత్యని తనకు కాకుండా చేస్తున్నాననే కోపంతో, నన్ను దూరంగా నెట్టేసి, తనని గుప్పెట్లో పెట్టుకుంది మేరీ. నన్ను శత్రువులా ద్వేషించడం మొదలుపెట్టింది.
 
  అసలు నా తప్పేముంది?
 అయితే మాత్రం ఇప్పుడు నేను చేసింది ఏమిటి. వాళ్లు ఎక్కడున్నారో తెలీదని మీనన్‌కి అబద్ధం చెప్పాను. ఇది తప్పు కాదా? సెల్ఫిష్‌నెస్ కాదా?
 వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు. ఆ నిజం చెబితే మీనన్ తప్పకుండా అక్కడికి వెళ్లి కలుస్తాడు. అంతకుముందులాగా మేరీ కూడా మళ్లీ అతన్ని దూరం చేసుకోదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా లేను కాబట్టి, అంటే, మానవ సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. స్వార్థం లేకుండా ఎక్కడా, ఎవరిలోనూ ఏమీ ఉండదా? చివరికి ప్రేమ కూడా ఉండదా?
 చుట్టూ చీకటి. చలి గాలి. సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఏదో ట్రైన్ ఔటర్లో హారన్ కొడుతోంది. రైల్‌పేటలోంచి క్రిస్మస్ కేరల్స్, కేరింతలు, పాటలు...
 ప్చ్!! ఎప్పుడో జీవితంలోంచి తెలీకుండానే మాయమైన ప్యారడైజ్... మళ్లీ తలుపు తట్టి లోపలికి వస్తుందా? లేక ప్యారడైజ్ లాస్ట్?
 షర్ట్ జేబులో నాలుగైదు నోట్లు. సెల్‌ఫోన్. రెండు కార్డులు. ఒకటి - మోహన్ ఫౌండేషన్‌కి ఆర్గాన్స్ డొనేట్ చేస్తూ సంతకం పెట్టింది, రెండోది నాకేమైనా జరిగితే తెలియజేయమంటూ కొన్ని ఫోన్ నంబర్లు రాసినది. దీనిలో మేరీ పేరు, ఫోన్ నంబర్. నిత్య పేరు, స్విచ్ ఆఫ్ అయిన నంబర్లు.
 శాంటాక్లాజ్ లాంటి నిత్య - ఇక ఏ చివరి కాన్కనీ జీవితంలోకి తీసుకురాదని అర్థమయ్యాక, ఇక ఇలా బతకడం కూడా అనవసరమేమో!
 చీకటి వెలుగుల మిశ్రమం లాంటి ఆ ప్లాట్‌ఫామ్ మీద ఒంటరిగా నిలబడిన నాకు, జీవితం శూన్యంగా అనిపించింది. నాకు ఏమన్నా జరిగితే, ఈ లోకంలో ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం లేదనిపించింది. ఫోన్ నంబర్లు రాసిన కార్డుని తీసి, ముక్కలుగా చింపి పట్టాలమీద పడేశాను.
 రైలు పట్టాలు, ఉక్కురంగులో చల్లగా. ఒక్కసారిగా వాటిని చేత్తో తాకితే, ఎన్నోసార్లు ప్రియమైన వ్యక్తుల్ని దూరంగా తీసుకెళ్లి, మళ్లీ దగ్గరగా తెచ్చిన ఈ చలనం లేని పట్టాల్ని... ఒక్కసారి పెదవులానించి ముద్దుపెట్టుకుంటే...
 ఔటర్లో కదిలిన ట్రైన్ దగ్గరకొచ్చేస్తోంది. పెద్దగా మోగుతున్న హారన్. రెప్పల వెనుక నిత్య రూపాన్నే గుర్తుచేసుకుంటూ, కళ్లు మూసుకుంటే వేగంగా ట్రైన్. విసురుగా శబ్దం, గాలి... అయిపోబోతోంది... అయిపోబోతోంది.
 
 ‘‘ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ..’’ శిలువ మీది జీసస్ చివరి మాటలు గుర్తొస్తుంటే, నా జీవితంలో చివరి క్షణాలు... ఒకే ఒక్క అడుగు ముందుకి కదిపితే, గుర్తుపట్టడానికి కూడా వీలులేని శరీరం... ఇంతలో ఉన్నట్టుండి ఎవరో చెయ్యి పట్టుకుని వెనక్కి లాగడం... నేను అమాంతం ప్లాట్‌ఫామ్ మీద వెల్లికిలా పడిపోవడం... అంతా క్షణాల్లోకి.
 
 నా వెనుక బెంచీ చాటు నుంచి స్టేషన్‌లో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకునే కుర్రాడు నన్నే భయంగా చూస్తున్నాడు. వీడా నా చావుని ఆపింది? నా జీవితాన్ని పొడిగించింది?
 ఎప్పుడూ స్టేషన్‌ని అంటిపెట్టుకుని ఉండే ఆ కుర్రాడికి రెండు కిడ్నీలు పాడయ్యాయని నాకు తెలుసు. కనీసం ఒక కిడ్నీ అయినా మార్చడానికి దాత లేడు. రేపో మాపో చావుకి సిద్ధపడిన వీడు... నా చావుకి అడ్డం వచ్చి కాపాడతాడా?
 మరుక్షణం మనసులో ఏదో ఆలోచన. సిమెంట్‌లా గడ్డ కడుతూ బలపడుతోంది.
 చెయ్యెత్తి రమ్మని పిలిస్తే, నీరసంగా నడుచుకుంటూ దగ్గరికొచ్చాడు. ఇలాగే ఉంటే వీడు ఎక్కువ కాలం బతకడు. వీడి జీవితాన్ని పొడిగించే కాన్కని ఏ క్రిస్మస్ తాత తీసుకొస్తాడు?
 ఒకే ఒక్క గుండెతో, బాధల్ని మాత్రమే నింపుకుంటూ ఎన్నాళ్లు ఎదురుచూస్తూ బతకగలమో తెలీదు. కానీ, ఒక్క కిడ్నీతో మాత్రం... జీవితం గడిపేయొచ్చు.
 మేరీ అనుకున్నట్లుగా నేను సెల్ఫిష్‌ని కాదని, అందరి ద్వేషానికీ గురైనా, నా గుండె లోపలి ‘ప్రేమ’ ఇంకా అలాగే ఉందని అర్థమైంది.
 
 ఔటర్లో కదిలిన ట్రైన్ దగ్గరకొచ్చేస్తోంది. పెద్దగా మోగుతున్న హారన్. రెప్పల వెనుక నిత్య రూపాన్నే గుర్తుచేసుకుంటూ, కళ్లు మూసుకుంటే వేగంగా ట్రైన్. విసురుగా శబ్దం, గాలి... అయిపోబోతోంది... అయిపోబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement