తెలుగుల చరిత్రకు  ప్రాణం పోసినవాడు | the life of Telugu history | Sakshi
Sakshi News home page

తెలుగుల చరిత్రకు  ప్రాణం పోసినవాడు

Published Sun, Jan 21 2018 12:23 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

the life of Telugu history - Sakshi

‘చరిత్రకారులు కూడా చరిత్ర నుంచే ఉద్భవిస్తారు’ అంటారు అమెరికన్‌ చరిత్రకారులు పాల్‌ కోన్కిన్, రొనాల్డ్‌ స్ట్రామ్‌బెర్గ్‌. వారి మాట మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అక్షరాలా సరిపోతుంది. ఒక గొప్ప చారిత్రక సందర్భంలో మల్లంపల్లి సోమశేఖరశర్మ (డిసెంబర్‌ 9,1891–జనవరి 7, 1963) తెలుగువారి చరిత్రకు ‘ప్రాణం పోశారు’. భారతదేశ చరిత్ర నిర్మాణానికి జరిగినంత పెద్ద ప్రయత్నం తెలుగు ప్రాంతాల, దక్షిణాది ప్రాంత చరిత్రను సంకలనం చేయడానికి జరగలేదన్నది చేదు వాస్తవం. అలాంటి సమయంలో తెలుగువారి చరిత్రను రచించి గొప్ప లోటును తీర్చిన వారు శర్మగారు. తెలుగు ప్రాంత చరిత్రలో పలు విస్మృత అంశాలను వెలుగులోకి తేవడానికి శర్మగారు జీవితాంతం పనిచేశారు. నిజానికి ఆయన జీవిత ధ్యేయం చరిత్ర రచన కాదు. కాలమే చరిత్ర నిర్మాణ కార్యక్రమం వైపు అడుగులు వేయించింది. చదువు మెట్రిక్యులేషన్‌. కానీ ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ చరిత్రశాఖలో పాఠాలు బోధించారు. ఆయన మార్గదర్శకత్వంలో పీహెచ్‌డీలు తయారయ్యారు. ‘రాగిరేకులలో, రాతి ఫలకాలలో కనుమూసిన తెలుగుల చరిత్రకు ప్రాణం పోసిన మహామనీషి’ అన్న అపురూపమైన ఖ్యాతికి నోచుకున్నారు. డాక్టర్‌ సి. నారాయణరెడ్డి తాను రచించిన చారిత్రక దీర్ఘకావ్యం ‘కర్పూర వసంతరాయలు’ శర్మగారికే అంకితం చేశారు. అది ఆ సందర్భంలో అన్నమాటే. కాశ్మీర రాజుల గాథలు, పురాణ వైర గ్రంథమాల పేరుతో చారిత్రకాంశాల ఆధారంగా అసంఖ్యాకంగా నవలలు రాసిన విశ్వనాథ సత్యనారాయణ కూడా శర్మగారి చారిత్రక దృష్టికీ, పరిశోధనా పటిమకీ ముగ్ధులయ్యారు. తన ‘ఆంధ్రప్రశస్తి’ గ్రంథాన్ని శర్మగారికి అంకితం చేశారు. అందుకే ఆయన లేఖిని నుంచి గొప్ప పద్యం కూడా వచ్చింది. అది:

సీ: డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకు/రాని యీపాడుకాలాన బుట్టి
నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభ పూర/ మూషరక్షేత్ర వర్షోదకమయి
చాడీలకు ముఖప్రశంసల కీర్ష్యకు/స్థానమైనట్టి లోకాన నుండి
నీ యచ్చతర కమనీయ శీతలజ్యోత్స్న/లడవిగాచిన వెన్నెలగుచు చెలగి
అంతెకాని గౌరీశంకరాచ్చతుంగ / శృంగము త్వదీయము మనస్సుపొంగి తెలుగు
నాటి పూర్వ చరిత్ర కాణాచి యెల్ల/త్రవ్వి తలకెత్తులేదె యాంధ్రజనములకును.’

శర్మగారు గోదావరి తీరంలోని నరసాపురం తాలూకా, మినుమించిలిపాడులో పుట్టారు. తల్లి నాగమ్మ, తండ్రి భద్రయ్య. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తయింది. ఉన్నత పాఠశాలలో చేరడానికి రాజమహేంద్రవరం వచ్చారు. నాటి రాజమహేంద్రవరం సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ జాడతో ఉత్తేజంగా ఉండేది. ఒకవైపు కందుకూరి వీరేశలింగంగారి సంఘ సంస్కరణోద్యమం, మరొకవైపు చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి సాహిత్య వైభవం గుబాళిస్తూ ఉండేవి. అప్పుడే (1906) బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమ ప్రచారం కోసం బిపిన్‌చంద్ర పాల్‌ వచ్చారు. ఆ ప్రభావాలన్నీ శర్మగారి మీద ఉన్నాయి. కానీ చదువు మాత్రం మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతో ఆగిపోయింది. పై చదువులకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. రాజమండ్రిలోనే అప్పుడు చిలకమర్తి ‘దేశమాత’ పత్రికను నడిపేవారు. శర్మగారి అభిరుచిని గమనించిన చిలకమర్తి తన సహాయకునిగా ఉద్యోగం ఇచ్చారు. అలా కథలు, నాటికలు, సాహిత్య వ్యాసాలు రాశారు. అందుకే పటిష్టమైన సాహిత్య కృషికి పునాది కూడా పడింది. సోమశేఖరశర్మ పిన్న వయసులో ఉండగానే  కవిత్వం, నాటకం, ఇతర ప్రక్రియలను ప్రారంభించారు. పాదుకా పట్టాభిషేకం నాటకం రాశారు. రోహిణీ చంద్రగుప్తం, అరణ్యరోదనం, వివేకముగల మంత్రి వంటి నవలలు రాశారు. ప్రాకృత సంస్కృతాల నుంచి చిన్న కథలను తెలుగులోకి అనువదించారు. 

సోమశేఖరశర్మ రాజమహేంద్రవరంలో ఉన్నప్పుడే చిలుకూరి వీరభద్రరావుగారితో పరిచయం ఏర్పడింది. మన తొలినాటి చరిత్రకారులలో ఒకరైన వీరభద్రరావుగారు అప్పుడే ‘ఆంధ్రుల చరిత్ర’కు రూపం ఇస్తున్నారు. చారిత్రకాధారాలను సేకరించేపనిలో తనకు సహకరించేందుకు ఆయన శర్మగారినే ఎంచుకున్నారు. అలా అనుకోకుండా చరిత్ర రచనలో ఓనమాలు దిద్దుకున్నారు. చరిత్ర రచన అనేది పరిశోధనతో పాటు సృజనాత్మక ప్రక్రియ కూడా అన్న సిద్ధాంతం శర్మ గారి విషయంలో వాస్తవం కావడం ఇదే దోహదపడింది. ఎక్కడ శిలాశాసనం ఉందని తెలిసినా అక్కడికి వెళ్లేవారు. కరక్కాయ సిరా పూసి, కాగితం మీద ఆ శాసనం నకలును తీసుకుని వచ్చేవారు. అలా ఎన్నో శాసనాలను ఆయన సేకరించారు. ‘శాసనాల శర్మ’ అని పేరు కూడా వచ్చేసింది. రాజమండ్రిలో ఉండగానే చిలుకూరి వీరభద్రరావు, భావరాజు వెంకటకృష్ణారావు, చిలుకూరి నారాయణరావులతో కలసి ‘ఆంధ్రేతిహాస పరిశోధక మండలి’ని స్థాపించారు. ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల పేరుతో పుస్తకాలు ప్రచురించారు. ఆంధ్రవీరులు, ప్రాచీన విద్యాపీఠములు, ప్రాచీనాంధ్ర నౌకాజీవనము వంటి వ్యాసాలతో ఆ పుస్తకాలు వెలువడ్డాయి.  

కేవలం పీహెచ్‌డీ సాధించడమో, చరిత్ర శాఖలో ఉద్యోగం కాబట్టి అనివార్యంగా కొంత చరిత్రను పోగు చేయడమో శర్మగారి ఉద్దేశం కానేకాదు. పరిశోధన అనేది అప్పటిదాకా ఉన్న చరిత్రలో మిగిలి ఉన్న ఖాళీలను పూరించాలి. చరిత్రగా చలామణీ అయిపోతున్న భ్రమలను, ఊహలను పటాపంచలు చేయాలి. ఈ ధోరణే ఆయన చరిత్ర పరిశోధన నిండా ఉంది. ‘ఎ ఫర్గాటెన్‌ చాప్టర్‌ ఆఫ్‌ ఆంధ్రా హిస్టరీ’(ఆంధ్రుల చరిత్రలో విస్మృతాధ్యాయం) ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. స్పష్టత లేకుండా ఉండిపోయిన 1323–1336 మధ్య కాలపు ఆంధ్రుల చరిత్ర మీద శర్మగారు వెలుగును ప్రసరింపచేశారు. విలస తామ్రశాసనం, కలవుచేరు అనితల్లి శాసనం, కాపయనాయకుడి ప్రోలవరం శాసనం ఆధారంగా నాటి చరిత్రలోని నిశ్శబ్దాన్ని ఛేదించారు. బహమనీ సుల్తాన్‌ మహమ్మద్‌ షా యుద్ధాల కాల నిర్ణయం, సుల్తానుల కాలం, ముసునూరి నాయకుల వంశవృక్షం ఈ పరిశోధనతో వెలుగు చూశాయి. విలస శాసనం కాకతీయ రాజ్య పతనం, ఆ తరువాత తుగ్లక్‌ పాలకుల చేతిలో ఓరుగల్లు పడిన కష్టాలను వెల్లడించింది. నిజానికి ఇదంతా విజయనగరం సామ్రాజ్య స్థాపనకు ముందు (1336) ఒక పుష్కర కాలానికి చెందిన చరిత్ర. 

‘హిస్టరీ ఆఫ్‌ రెడ్డి కింగ్‌డమ్స్‌’ (రెడ్డి రాజ్యాల చరిత్ర) ఎనిమిదేళ్లు శ్రమించి వెలువరించిన పరిశోధన. దీనితోనే శర్మగారు పరిశోధకులుగా తిరుగులేని స్థానం సంపాదించుకున్నారు. రాజుల చరిత్ర, వారి వంశాల వర్ణన ఇవి మాత్రమే చరిత్ర కాదన్న సిద్ధాంతం చరిత్ర రచనలో ఊపందుకోని కాలంలోనే శర్మగారు ఆ అంశాలకు గొప్ప ప్రాధాన్యం ఇచ్చారు. రెడ్డి రాజుల కాలంలో జరిగిన వాణిజ్య వ్యాపారాలు, సాహిత్య సేవ, కళలు, ఆహార్యం, సేద్యం, సాంఘిక దృశ్యం ఇవన్నీ కూడా తన పరిశోధనలో భాగం చేశారు. ‘హిందూ దేశచరిత్ర’, ‘ఆంధ్ర దేశ చరిత్ర సంగ్రహము’, ‘ఆంధ్రవీరులు’ ఆయన ఇతర గ్రంథాలు. ‘కార్పస్‌ ఆఫ్‌ తెలంగాణ ఇన్‌స్క్రిప్షన్స్‌ నాలుగో భాగం’ ఆయన శాసన విశ్లేషణా సామర్థ్యానికి గీటురాయిగా నిలుస్తుంది. కర్నూలు జిల్లా ఎర్రగుడిలోని అశోకుని శాసనాల మీద కూడా శర్మగారు పరిశోధన జరిపారు. ఇక తన దృష్టికి వచ్చిన సాహిత్య, సాంస్కృతిక అంశాలను, శాసనాలను, నాణేలను పరిశోధించి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’లకు రాసిన వ్యాసాలకు లెక్కలేదు. చంద్రగుప్త మౌర్యుని జీవిత గాథ ఆధారంగా ‘రోహిణీ చంద్రగుప్తము’, 1920 దశకంలో తెలుగు నాట విలసిల్లిన జాతీయ భావాల ఆధారంగా, ‘దేవీప్రసన్నము’ అనే నవలలను శర్మగారు రాశారు. చరిత్రకు నీడ సాహిత్యమని అంటారు. శర్మగారు రాసిన రేడియో నాటికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అమరావతి, శంకరాచార్య, నందక రాజ్యపతనం, పీష్వా నారాయణరావు, హంపీ క్షేత్రం, విప్లవజ్వాల, తెలంగాణ – ఇవన్నీ చరిత్రలో ఒక కీలక మలుపును ఆవిష్కరించే ఘట్టాలతో ముడిపడి ఉన్నవే. తెలుగు కవుల చరిత్రను ‘ఆంధ్రకవుల చరిత్రము’ పేరుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారు సంకలించారు. దీనికి తరువాతి కాలాలలో శర్మగారు ముందుమాట రాశారు. ప్రాథమిక రచనలు, పరిశోధనలు ఒక అంశానికి ఎంత ముఖ్యమో, వాటితో విషయ వివరణ ఎలా సంపద్వంతమవుతుందో శర్మగారు విశ్లేషించారు. ఇలా: ‘పరిశోధన అనేది ఎంత పాతదో అంత కొత్తది. కొత్త శాసనములు, కొత్త గ్రంథములు బయటపడుట చేత ఇదివరలో చేసిన పాత సిద్ధాంతములు మారిపోవచ్చును. అది వరకు వ్రాసిన దానిలో కొన్ని సవరణలు చేయవలసి అవసరం కలగవచ్చును. అంత మాత్రం చేత ఆధునిక పరిశోధకులు అంతకు పూర్వం పరిశోధకులు వ్రాసినవి తప్పులతడకలనీ, చేసిన సిద్ధాంతములవసిద్ధాంతాములనీ అధిక్షేపణ చేసి తామేమో వారి కంటే అధికులైనట్లు భావించుట అహంభావమనిపించుకొనును గాని, వివేకమనిపించుకొనదు. అది పరిశోధన స్వభావము నెరుగని అజ్ఞాన విలసవము. వెనుకటి వారి పరిశోధనా ఫలితములు తరువాతి వారికి సోపానముల వంటివి.’  సోమశేఖరశర్మగారు తెలుగువారి చరిత్ర రచించారనడం చాలా చిన్నమాట. ఆయన మన చరిత్రను సంపద్వంతం చేశారనడం సబబు. అందుకు ఆయన ఏమీ కోరుకోలేదు. పెద్ద మనసుతో మన ప్రజాస్వామ్య ప్రభువులు ఆయనకు ఏమీ ఇవ్వలేదు కూడా. 1959 ప్రాంతంలో, అంటే శర్మగారు కన్నుమూయడానికి నాలుగేళ్ల ముందు జరిగిన చిన్న సంఘటన గుర్తు చేసుకోవాలి. ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విద్యార్థి. అప్పుడు శాసన విశ్లేషణ, నాణేల అధ్యయనం గురించి శర్మగారు బోధించేవారు. విశ్వనాథ వారే వర్ణించినట్టు ‘ప్రసన్న గంభీర ముఖము కన్నులంటగ’ మరిచిపోవడం సాధ్యం కాదు. అలాంటి శర్మగారు తెల్లని దుస్తులు, భుజం మీద ఒక పండిత శాలువాతో ఒకసారి ఆచార్య రామకృష్ణకు దారిలో దర్శనమిచ్చారు. శిష్యతుల్యుడిని ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వెళ్లిన తరువాత శర్మగారు భుజం మీద శాలువా తీసి పక్కన పెట్టారు. ఆ చొక్కా భుజాలన్నీ చిరుగులే. నిజమే, శర్మగారు తెలుగు చరిత్రను సంపద్వంతం చేశారు. తన లేమిని తనతోనే అట్టేపెట్టుకున్నారు.  ఆంధ్రుల చరిత్ర మీద శర్మగారు వెలుగును ప్రసరింపచేశారు. విలస తామ్రశాసనం, కలవుచేరు అనితల్లి శాసనం, కాపయనాయకుడి ప్రోలవరం శాసనం ఆధారంగా నాటి చరిత్రలోని నిశ్శబ్దాన్ని ఛేదించారు.
∙డా. గోపరాజు నారాయణరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement