
మయాసురుడనే రాక్షసుడు గొప్పశిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంట పడుతుంది. మొదటి చూపులోనే ఆమెను మోహించేస్తాడు. అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అయితే, ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి, ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు కానీ, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడసాగాడు. ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. చేసేదేమీ లేక ఓరిమితో సహిస్తుంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది. రావణుడు సీతను అపహరించుకునిపోయి.. బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయేముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. కాని ఆమె ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి.
యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలచి వేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే, శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తూ విష్ణువు అవతారమని గ్రహించి, స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది. తన పతి Ô¶ రీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. అంతేకాదు, మహా పతివ్రత అయిన మండోదరికి వితంతువు అయే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. భర్త చేసే చెడుని నివారించేందుకు అనుక్షణం పాటుపడాలి.
– డి.వి.ఆర్. భాస్కర్