వివేకం: ఈతరం మితం ఏంటో తెలుసుకోవాలి! | Present generation should know their limit | Sakshi
Sakshi News home page

వివేకం: ఈతరం మితం ఏంటో తెలుసుకోవాలి!

Published Sun, Dec 8 2013 3:46 AM | Last Updated on Sat, Sep 15 2018 7:39 PM

వివేకం: ఈతరం మితం ఏంటో తెలుసుకోవాలి! - Sakshi

వివేకం: ఈతరం మితం ఏంటో తెలుసుకోవాలి!

మనం ప్రతిదాన్ని అతిగా చేయడం అలవాటు చేసుకున్నాం. తినడం లాంటి మామూలు ప్రక్రియలను కూడా ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. ఒకటి మంచి చేస్తుందని అనుకుంటే, అదే ఎక్కువగా ఉంటే బాగుంటుందనే మూర్ఖత్వంలోకి వెళతాం. ఆక్సిజన్ కూడా మనలోకి మరీ ఎక్కువగా వెళితే అపాయమేనన్నది సాధారణ శాస్త్రీయ జ్ఞానం.
 
 ఒకసారి ఏం జరిగిందంటే, శంకరన్ పిళ్లై ఒక్కగానొక్క కొడుకు ఐటీ ప్రొఫెషనల్‌గా ఆఫ్రికా వెళ్లాడు. అక్కడ అతను అవీ ఇవీ శోధిస్తూ ఒక భూత వైద్యుణ్ని కలిశాడు. ఈ భూత వైద్యుడు ఎన్నో అద్భుతాలని చేస్తాడని అతని స్నేహితుడు చెప్పాడు. దాంతో ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులకు మంచి జరిగే విధంగా ఈ భూత వైద్యుడి దగ్గరి నుంచి ఏదైనా అతను తీసుకోవాలనుకున్నాడు. తన తండ్రి శంకరన్ పిళ్లై ఎప్పుడూ యవ్వనంతో ఉండాలని కోరుకుంటుంటాడని ఇతనికి తెలుసు.
 
 అందుకే నా తల్లిదండ్రుల వయసు తగ్గించడానికి ఏదైనా ఉందా అని అడిగాడు. భూత వైద్యుడు ఉంది అని, కొన్ని మాత్రలను ఇచ్చి, మీ నాన్నని ఒక మాత్రని తీసుకొమ్మని చెప్పు, దాంతో అతని వయసులో ఎన్నో యేళ్లు తగ్గిపోతాయి అన్నాడు. ఆ మాత్రలని కొడుకు ఇండియాకు పంపాడు. ఆరు నెలల తరువాత ప్రాజెక్ట్ అయిపోవడంతో ఇండియా తిరిగొచ్చాడు.
 
 అతను ఇంటికొచ్చేసరికి, మంచి యవ్వనంలో ఉన్న ఓ యువకుడు చేతుల్లో చిన్నబిడ్డతో అతనికి కనిపించాడు. నా తల్లిదండ్రులు ఎక్కడ అని అతనడిగాడు. యువకునిగా మారిన శంకరన్ పిళ్లై నేనే నీ తండ్రిని, నువ్వు పంపిన మాత్ర ఒకటి తీసుకోగానే నేను యువకునిగా మారాను, ఆ మాత్ర నా వయసు ఎన్నో ఏళ్లు తగ్గించింది అన్నాడు. కానీ అమ్మెక్కడ అని అతనడిగాడు. శంకరన్ పిళ్లై తన చేతుల్లో ఉన్న చంటి బిడ్డను చూపెడుతూ తను మూడు మాత్రలు తీసుకుంది అన్నాడు.
 
 ఇప్పుడు జరుగుతోంది ఇదే. మనం ఏది మొదలుపెట్టినా దానిని వినాశనానికి తీసుకెళుతున్నాం. భౌతిక శాస్త్రం మనకు అందించిన ఎన్నో అద్భుతమైన విషయాలను మానవాళి వినాశనానికి, దుఃఖానికి కారణమయ్యే పరికరాలుగా మార్చుకుంటున్నాం. మానవ కల్యాణం చేకూరుస్తుందన్న నమ్మకంతో మనం భౌతిక శాస్త్రాలని, సాంకేతిక విషయాలని అంతగా శోధించాం. అవి మనకు ఎన్నో సౌకర్యాలను అందించాయి. అయినా, మానవులు బాగున్నారని చెప్పలేం. ఎందుకంటే వారు ఎన్నో యేళ్ల క్రితం జీవించిన వారికన్నా మరింత శాంతి, ఆనందం, ప్రేమలతో లేరు.
 
 బాహ్యమైన శాస్త్ర సాంకేతికతలకు భారీ మూల్యం చెల్లించాలి. తయారుచేసేది గుండుసూదైనా, గొప్పయంత్రమైనా, అది మీరీ భూమి నుండే తవ్వి తీయాలి. ఎక్కడ ఆపాలో మనకు తెలియకపోతే, ఈ శాస్త్ర, సాంకేతికతలు కచ్చితంగా మానవాళికి మహా విపత్తుగా మారబోతున్నాయి. పూర్తిగా మానసిక పరిపక్వత లేని మానవుల చేతికి ఏదిచ్చినా ప్రమాదమే. తాము వాడే పరికరాలు శక్తిమంతంగా, సమర్థంగా అయ్యేకొద్దీ వారు మరింత ప్రమాదకరంగా మారుతారు. శాస్త్రమో లేదా సాంకేతికతో ప్రమాదకరమైనవి కాదు. మానవ మూర్ఖత్వమే భూమి మీద ప్రమాదకరమైనదిగా ఎల్లప్పుడూ ఉంటూ వస్తోంది.
 
 సమస్య - పరిష్కారం
 ప్రశ్న: సంసారిక జీవనంలో ఉన్న నామీద ఎంతో మంది ఆధారపడున్నప్పుడు బంధాల నుండి విముక్తమవడమెలా?
 - కె.జగన్నాథం, ఏలూరు


 సద్గురు: మీ శరీరాన్ని బంధాల నుండి విడిపించలేరేమో కానీ, మీ మనసును మాత్రం కచ్చితంగా విడిపించగలరు. ప్రస్తుతం మీరు సన్యాసాన్ని తీసుకొని, ఒక ఆశ్రమంలో జీవించలేరేమో - మీ భార్య, పిల్లలు మిమ్మల్ని అలా చేయనీయకపోవచ్చు. కానీ మీరు మానసికంగా స్వేచ్ఛగా ఉండేందుకు మిమ్మల్ని ఎవరైనా ఆపగలరా? స్వేచ్ఛగా ఉండటం కోసం మన జీవితాన్నో, మన పరిస్థితులనో పూర్తిగా తలకిందులు చేయాల్సిన అవసరం లేదు.  ఒక పరిస్థితి మరొక పరిస్థితి కంటే మెరుగైనదేం కాదు. అన్నింటిలోనూ లాభ నష్టాలు ఉంటాయి. మీరు మీ అంతరంగంలో ఎలా ఉన్నారనేదే ముఖ్యమైన విషయం.
 
 మీ అంతరంగం, దివ్యత్వానికి నిచ్చెన కాగలదు. అది మిమ్మల్ని పరవశింపజేయగలదు. ఎన్నోసార్లు ఈ మనసు మిమ్మల్ని సంతోషపెట్టింది. మరెన్నోసార్లు ఇది మిమ్మల్ని దుఃఖంతో, భయంతో, ఆందోళనతో లేదా గందరగోళంతో నింపింది. ఈ రెండింటినీ అదే మనసు చేస్తోంది. ప్రస్తుతం ఈ మనసనే చిన్ని పరికరం మీ చేతుల్లో లేదు. మనసు ఏది తోస్తే అది చేస్తోంది. మీ కారు ఎక్కితే, మీరు పక్క ఊరికి చేరుకోవచ్చు లేదా నేరుగా ఒక చెట్టుకి ఢీకొట్టవచ్చు. కాబట్టి కారైనా, మనసైనా, నియంత్రణ మీ చేతిలోనే ఉంటే, మీరు ఎంతో దూరం ప్రయాణించగలుగుతారు.
 - జగ్గీ వాసుదేవ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement