
ఆ రాత్రి, ఆ పడవలో వాళ్లిద్దరే మెళకువతో ఉన్నారు. సీత పాటపాడింది. శ్రీరామ్ ఆ పాట వింటూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టు సీతను చూస్తున్నాడు. సీత కళ్లతోనే ఏంటన్నట్టు అడిగింది శ్రీరామ్‌ను. శ్రీరామ్ కూర్చున్న చోటు నుంచి కదలకుండా సీత పాదాలకు నమస్కరించాడు. ఆమె చప్పున తన కాళ్లను పక్కకు జరుపుకొని నవ్వింది. ‘‘అంత బాగా పాడావ్ సీతా!’’ అన్నాడు శ్రీరామ్. ‘‘నీకో విషయం చెప్తాను..’’ అంది సీత, సిగ్గుపడుతూ. ఏంటన్నట్టు ఉత్సాహంగా చూశాడు శ్రీరామ్. ‘‘ఇప్పుడు కాదు. రేపు..’’ అని నవ్వుతూ లేచి అక్కణ్నుంచి వెళ్లిపోయింది సీత. ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఆ పడవ గోదావరి నది మీదుగా భద్రాచలం వెళుతోంది. పడవలో అంతా పడుకొనే ఉన్నారు. రాత్రంతా సీత పాట వింటూ కూర్చున్న రామ్ కూడా హాయిగా నిద్రపోతున్నాడు. రాజీ అందరూ పడుకొనే ఉండటం చూసి, ఎవరికీ కనబడకుండా, వినబడకుండా, రామ్‌కు దగ్గరగా వచ్చి అతణ్ని నిద్రలేపింది. రాజీ రామ్‌కు మరదలు. ఆమె పెళ్లి కోసమే అందరూ భద్రాచలం వెళ్తున్నారు. రాజీని రామ్ కూడా ప్రేమించాడు కానీ, ఆమె అతడికి నో చెప్పి వేరొకర్ని పెళ్లి చేసుకుంటోంది.
‘‘బావా! బావా.. లే బావా..’’ అంటూ రామ్‌ను కదిలిస్తూ నిద్రలేపింది రాజీ. \ ‘‘రాజీ.. ఏంటీ? ఏంటి ఇంత పొద్దున్నే..’’ రామ్ చెప్పేది వినిపించుకోకుండానే, ‘‘నీతో మాట్లాడాలి. రా!’’ అని చెయ్యి పట్టుకొని, రామ్‌ను పడవలో ఎవ్వరూ లేని చోటుకు తీసుకెళ్లింది రాజీ. ‘‘ఏంటి రాజీ ఇంత పొద్దున్నే..’’ అడిగాడు రామ్. రాజీ ఏం మాట్లాడలేదు. ‘‘రాజీ! అంతా ఓకేనా?’’ అడిగాడు రామ్. రాజీ మళ్లీ ఏం మాట్లాడలేదు. ‘‘బావా మనం పెళ్లి చేసుకుందాం..’’ అంది రాజీ, అంతసేపున్న మౌనాన్ని బద్దలుకొడుతూ. రామ్ అయోమయంగా చూశాడు. ‘‘నాకలానే అనిపిస్తోంది. నీకు ఓకేనా?’’ అడిగింది రాజీ. ‘‘రాజీ! ఇంకో రోజులో నీ పెళ్లి.. ఇలా ఇక్కడా.. నీకు ఓకేనా అంటే ఎలా? అసలెలా వచ్చింది నీకీ థాట్?’’ అన్నాడు రామ్. ‘‘నాకూ అర్థం కావడం లేదు. ఏదో బాధ. ఇంకా ఒక్కరోజు ఆగితే నీకు పర్మనెంట్‌గా దూరమైపోతానేమో అనిపిస్తోంది. బాగోలేదు. ఆ ఫీలింగ్ అస్సలు బాగోలేదు. ఏదోకటి చెయ్. ప్లీజ్ బావా మనం పెళ్లి చేసుకుందాం’’. రాజీ రామ్‌కు దగ్గరగా జరిగి అతణ్ని హత్తుకుంది. ‘‘రాజీ! అత్తయ్యకు తెలుసా?’’ అడిగాడు రామ్. ‘‘పిచ్చా నీకు? చంపేస్తుంది.’’ ‘‘రవీందర్?’’ రవీందర్‌తోనే రాజీ పెళ్లి జరగబోతోంది. కోపంగా చూసింది రాజీ. రామ్ ‘సారీ’ అన్నాడు. ‘‘సడెన్‌గా ఎలా వచ్చింది ఈ ఐడియా?’’ విసుగు కనబడకుండా అడిగాడు రామ్. ‘‘నాకేం తెలీదు బావా! మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేస్తావో చెయ్యి. ఎవ్వరికీ తెలీకూడదు.’’రామ్ ఆలోచనల్లో పడ్డాడు. ‘‘ఏంటి ఆలోచిస్తున్నావ్?’’ అడిగింది రాజీ. ‘‘ఏం లేదూ.. యూ ష్యూర్?’’ అడిగాడు రామ్. ‘‘లేకపోతే? ఇంత పొద్దున్నే ఇలా నీతో చెప్తానా?’’ ‘‘ఓకే! నన్ను కొంచెం ఆలోచించనీ. ప్లాన్ చెయ్యాలిగా..’’ ‘‘ఏదో ఒకటి చెయ్యి బావా! నిన్నొదులుకోవాలంటే కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది..’’ రాజీ మాట్లాడుతూంటే ఎవరో పిలుస్తున్నారామెను. రామ్‌ని చూస్తూ, ‘‘ప్లీజ్ బావా!’’ అంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయింది రాజీ.
రామ్ ఆ వెంటనే వచ్చిన హాల్ట్‌లో దిగిపోయాడు. రాజీని ఎక్కడ దిగాలో ఒక పిల్లాడికి చెప్తానని చిలకజోస్యం చెప్పుకునే ఓ వ్యక్తికి చెప్పెళ్లిపోయాడు రామ్. ఆ వ్యక్తి ఆ పని చేయలేని పరిస్థితిలో సీతకు విషయం మొత్తం చెప్పేశాడు. సీతకు రామ్‌పై కోపమొచ్చింది. ఆ కొద్దిరోజుల ప్రయాణంలో సీతా, రామ్ ఒకరికొకరు తెలీనంత దగ్గరైపోయారు. రామ్ ఇప్పుడు రాజీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే ఆమెకు ఇంకా కోపంగా ఉంది. కానీ సాయం చెయ్యాలనే అనుకొంది. ఆ తర్వాతొచ్చిన హాల్ట్‌లో ఒక పిల్లాడొచ్చి చిన్న చీటీ ఇచ్చాడు. సీత ఆ చీటీలో ఏముందో చూసే లోపే ఆ పిల్లాడు ఆ చీటీ లాక్కొని మింగేశాడు. రామ్ ఎక్కడ ఆగి ఉంటాడో తెలీదు. సీతకు ఏం చెయ్యాలో తెలీట్లేదు. రాజీ అప్పటికే అక్కడకు వచ్చేసి రామ్ కోసం ఎదురుచూస్తోంది. వాళ్లను చూసుకోకుండానే పడవ వెళ్లిపోయింది. రాజీ వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. చీకటి పడుతున్న కొద్దీ ఆమెకు రామ్‌పై నమ్మకం పోతోంది.
‘‘తప్పు చేశాను సీతా! బావను నమ్మొచ్చి తప్పు చేశాను..’’ రాజీ ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే వాళ్లను వెతుక్కుంటూ పడవ కూడా వెనక్కి వచ్చేసింది. సీత నిజం చెప్పింది. రామ్ రాసి పంపిన చీటీ పోయిందని. ‘‘అయినా! ఇంత కన్ఫ్యూజన్ నావల్ల కాదు..’’ అంటూ వచ్చిన పడవ ఎక్కేయడంతోనే రామ్‌తో పారిపోయి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను పక్కనబడేసింది రాజీ. రామ్ తిరిగొచ్చాడు. ఆ పడవ భద్రాచలం కూడా చేరుకుంది. సీత రామ్‌తో ఇక మాట్లాడొద్దనుకుంది. మాట్లాడలేదు కూడా. భద్రాచలంలో రాజీ, రవీందర్‌ల పెళ్లి అయిపోయింది. సీత తిరుగు ప్రయాణంలో బస్సెక్కి హైద్రాబాద్ వెళ్లిపోయింది. రామ్‌పై సీతకు కోపం రావడానికి కారణం.. రాజీతో అతను పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకోవడమే. అలాగే రామ్ రాజీకి రాసిన చీటీ.. ఉత్త తెల్ల కాగితమన్న విషయం, అతనికి ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం కూడా లేదన్న విషయం అప్పటికి సీతకు తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment