గ్లామర్ పోస్తే గ్రామర్ రాదు!
ఇంటర్వ్యూ
‘జన్నత్’ సినిమాతో బాలీవుడ్‌లో, ‘రెయిన్‌బో’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది సోనాల్ చౌహాన్. వచ్చిన అవకాశాన్నల్లా అంది పుచ్చుకుంటూ సాగిపోతోంది. కదిపితే బోలెడు కబుర్లు చెబుతుంది. ఏం ఇష్టపడుతుందో, ఎలాంటి వాడిని ప్రేమిస్తుందో, ఎవరంటే పడి చస్తుందో కూడా మొహమాటం లేకుండా చెబుతుంది. స్టార్ అవ్వాలంటే టాలెంట్ ఉండాలి, గ్లామర్ ఉన్నంత మాత్రాన నటనలో గ్రామర్ రాదు అంటూ ఆమె చెబుతోన్న సంగతులు చదవండి!
* కెరీర్ ఎలా మొదలైంది?
అనుకోకుండా జరిగిన ఓ చిన్న సంఘటన నన్ను ఇంత దూరం నడిపించింది. పదిహేడేళ్ల వయసులో ఓ కాఫీ షాపుకి వెళ్లాను. అక్కడ ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ నన్ను ఫొటో తీసి ఓ పేపర్లో వేశాడు. దానికి చాలా రెస్పాన్‌స వచ్చింది. దాంతో మలేసియాలో జరిగిన మిస్ వరల్డ్ టూరిజం పోటీల్లో పాల్గొన్నాను. టైటిల్ గెలుచుకున్నాను. ఆ పోటీలో గెలిచిన మొదటి భారతీయురాలిని నేనే. ఆ తర్వాత మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. పాండ్స్, నోకియా, లేస్, పెప్సీ, హీరో హోండా లాంటి ఫేమస్ కంపెనీల యాడ్స్ చేశాను. మెల్లగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
* టాలీవుడ్‌కి ఎలా వచ్చారు?
బాలీవుడ్‌లో ‘జన్నత్’ సినిమా చేశాక దర్శకుడు వీఎన్ ఆదిత్య ఫోన్ చేసి ‘రెయిన్‌బో’ చిత్రంలో ఆఫర్ ఇచ్చారు. తర్వాత లెజెండ్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో చిత్రాలు చేశాను.
* ‘రెయిన్‌బో’కి ‘లెజెండ్’కి మధ్య అంత గ్యాప్ ఎందుకు?
ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగు తుంది. ఏ అవకాశం ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. అది వచ్చేవరకూ ఎదురు చూడాలి, చూశాను. కాబట్టి ఆ గ్యాప్ గురించి పనిగట్టుకుని చర్చించడానికి ఏమీ లేదు.
* నటిగా ఫాలో అయ్యే ఫార్ములా?
ఎప్పుడు ఏ సినిమా చేసినా, అదే నాకు ఫస్ట్ సినిమా అని అనుకుం టాను. మొదటిసారి కెమెరా ముందు నిల బడినట్టు ఫీలవుతాను. దాంతో నాకు నేనే ఒకలాంటి ఫ్రెష్‌నెస్ ఫీలవుతాను. బాగా చేయాలి అన్న పట్టుదల కూడా కలుగుతుంది.
* డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా?
‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ మళ్లీ తీస్తే, కాజోల్ పాత్ర నన్నే వరించాలని కోరుకుంటా. అంత ఇష్టం నాకా రోల్!
* మీ డ్రీమ్ హీరో?
షారుఖ్. ఆయనంటే పిచ్చి. సినిమాల్లో ఆయన ఏడిస్తే నేనూ ఏడ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనతో నటించే చాన్స్‌గానీ వచ్చిందంటే నా జీవితం ధన్యమైనట్టే.
* మరి రియల్ లైఫ్ హీరో?
ఆ విషయంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడప్పుడే ఎవరినీ నా జీవితంలోకి ఆహ్వానించే ఉద్దేశం నాకు లేదు.
* పోనీ ఎలాంటివాడు వస్తే ఓకే చెప్తారు?
మాట మర్యాదగా ఉండాలి. ఆడదాన్ని గౌరవించే సంస్కారం ఉండాలి. ఫుడ్ లవర్ అయివుండాలి. నాలాగా ఫాస్ట్ ఫుడ్ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకూ ఏదైనా లాగించేయాలి.
* గ్లామర్ రోల్స్ చేయడం ఇష్టమేనా?
ప్రతి పాత్రలోనూ గ్లామర్ ఉంటుంది. అంతే తప్ప గ్లామర్ కోసమే పాత్రలుండవు. టాలెంటే ఎవరినైనా స్టార్‌ని చేస్తుంది. గ్లామర్ నటనలో గ్రామర్ నేర్పదు. కాబట్టి అందాలు ఒలకబోసినంత మాత్రాన స్టార్‌డమ్ వచ్చేయదు. వస్తుందనుకుంటే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు.
* మీ ఇష్టాయిష్టాల గురించి చెప్పండి?
పెద్ద పెద్ద కోరికలు, ఇష్టాలూ ఉండవు నాకు. అన్ని రంగుల్నీ ఇష్టపడతాను. సింపుల్‌గా జీన్స్, టీషర్టులు వేసుకుంటాను. నచ్చింది తింటాను. నచ్చినట్టు ఉంటాను. పెద్ద పెద్ద ప్రణాళికలు వేసేసుకోవడం, వాటి గురించి టెన్షన్ పడిపోవడం నాకు నచ్చదు. అందుకే ఓ పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోతాను. వీలైనంత కూల్‌గా ఉంటాను.
* మీ లైఫ్ ఫిలాసఫీ?
జీవితం చాలా అందమైనది. కాకపోతే దాన్ని జీవించడం రావాలి. మనం నవ్వాలి. ఎదుటివారిని నవ్వించాలి. మంచి చేయక పోయినా ఫర్లేదు కానీ, ఎవరికీ చెడు మాత్రం చేయకూడదు.
* ఫ్యూచర్ ప్లాన్స్?
ఇప్పుడిప్పుడే కెరీర్ వేగాన్ని పుంజు కుంటోంది. మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. కాబట్టి కొన్నేళ్ల వరకూ నటన గురించి మాత్రమే ఆలోచిస్తాను. అయితే నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం. యువత రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి నేను ఏదో ఒకరోజు పాలిటిక్స్‌లోకి వెళ్లి తీరతా!