కొంతమందికి జీవితంలో ఒకటే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకొనే వరకూ వారు విశ్రమించరు. ఎన్ని దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నా వారు తమ లక్ష్యసాధన విషయంలో వెనక్కుతగ్గరు. అలా వెనక్కు తగ్గని వ్యక్తే... ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్. అవి 1970ల నాటి రోజులు... వర్షంలో లాస్‌ఏంజెలెస్ నగరం మెరిసిపోతోంది. హాలీవుడ్‌కు వేదిక అయిన ఆ నగరానికి చాలా రోజుల తర్వాత వచ్చాడు ఆ యువకుడు. అతడి పేరు స్టాలోన్. చిన్న చిన్న తుంపర్లు పడుతున్న ఉదయం పూట రోడ్డుపై తన పెంపుడు కుక్కతో కలిసి నడుచుకొంటూ వెళుతున్న తనను పట్టించుకోని జనాలను చూస్తుంటే అతడికి నవ్వు ముంచుకొస్తోంది. తను ఎప్పటికైనా పెద్దస్టార్‌ను అవుతానని, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంటానని అతడికి తెలుసు. ఆ ఆత్మవిశ్వాసంలోంచి వచ్చినది ఆ నవ్వు. ఉన్న ఫలంగా అతడు హాలీవుడ్‌కి రావడానికి కారణం మహ్మద్ అలీ!
అంతకు కొన్ని రోజుల క్రితమే అమెరికన్ బాక్సింగ్ చరిత్రలో కొత్త సూర్యుడిలా ఉదయించాడు మహ్మద్ అలీ. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన వెపనర్‌ను ఓడించాడు అలీ. ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన లక్షలాది మందిలో స్టాలోన్ ఒకడు. అందరూ అలీని చూసి అబ్బురపడుతుంటే, అతడి విజయం స్ఫూర్తిగా ఒక సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు స్టాలోన్. అది ప్రపంచ సినీ చరిత్రపై గొప్ప ప్రభావం చూపగల స్క్రిప్ట్ అని స్టాలోన్‌కు అవగాహన ఉంది. అందుకే ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించాలి, తనే హీరోగా ఉండాలనేది అతడి ఉద్దేశం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. హాలీవుడ్‌లో తన పేరు వ కాబోయే హీరోగారి ఆలోచనలు ఇలా ఉంటే... అతడి స్టోరీ లైన్‌ను విన్న నిర్మాతలు మాత్రం పెదవి విరచసాగారు.
ఒకటి కాదు రెండు కాదు.. అనేక ప్రొడక్షన్ హౌస్‌ల దగ్గరకు వెళ్లి కథను వినిపించిన ఎవ్వరూ మెచ్చలేదు. సినిమాగా రూపొందించడానికి పెట్టుబడి పెడతామని అనలేదు. అనాథలా పెరిగి, సొంత కష్టంతో సంపాదించుకొన్న సొమ్మంతా ఖర్చయిపోయింది. లాస్‌ఏంజెలెస్ వచ్చిన కొన్ని వారాల తర్వాత ఒక లిక్కర్ హౌస్ ముందు వచ్చి నిలబడ్డాడు. లోపలకు వె ళదామంటే డబ్బుల్లేవు. అటుగా వెళుతున్న ఒక సీనియర్ సిటిజన్ చూపు స్టాలోన్ దగ్గరున్న పెంపుడి కుక్కపై పడింది. ‘అమ్ముతావా?’ అని అడిగాడు! 50 డాలర్లు ఇస్తాననాన్నడు. అమెరికన్‌లకు పెట్ అంటే ఎంతో ప్రేమ. స్టాలోన్ కూడా మనస్తత్వం విషయంలో సగటు అమెరికన్. ఆ శునకాన్ని అమ్ముకోవడం అంటే అంతకన్నా పతనస్థితి లేదని భావించాడు. అయితే తను అదే స్థితిలో ఉన్నానని గ్రహించాడు. శునకాన్ని అమ్మేశాడు!
మళ్లీ ప్రొడ క్షన్ హౌస్ చుట్టూ చక్కర్లు. ఈ సారి పరిస్థితి కొంచెం సానుకూలంగా కనిపించింది. మీరు రాసిన స్క్రిప్ట్‌ఇస్తే లక్ష డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశాడు ఒక నిర్మాత! పెట్‌ను 50 డాలర్లకు అమ్ముకొన్న మనిషికి ఒక్కసారిగా లక్ష డాలర్ల ఆఫర్‌వస్తే... హాలీవుడ్‌కి రచయితగా పరిచయం చేస్తాను అని హామీ ఇస్తే... ఒక్కసారిగా ఎగిరి గంతేయాలి. అయితే స్టాలోన్ అలా చేయలేదు. తన స్క్రిప్ట్‌కు తనే హీరో, అది సినిమాగా రూపొందితే స్క్రీన్‌పై తనే కనపడాలి. ఇదే విషయాన్ని ఆ నిర్మాతకు చెప్పాడు! అతడు నవ్వుకొన్నాడు..! స్టాలోన్ కోరికను చూసి అలా వికటాట్ట హాసం చేసిన నిర్మాతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాలుగు లక్షల డాలర్లు ఇస్తాం.. స్క్రిప్ట్‌మాకు అప్పజెప్పు అని కోరిన వాళ్లూ ఉన్నారు. అయినా స్టాలోన్ లొంగలేదు! తన స్క్రిప్ట్‌కు తనే హీరో.
తినడానికి తిండిలేని దశలో కూడా లక్ష్యం విషయంలో అతడి మొండితనానికి మొదట ఆశ్చర్యపోయిన ఒక నిర్మాతకు తర్వాత ముచ్చటేసింది. నిన్నే హీరోగా పెడతాను. మరి ఇచ్చే డబ్బు నాలుగు లక్షల డాలర్లు కాదు పాతికవేల డాలర్లే అన్నాడు. ఆనందంగా ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పి, అడ్వాన్స్ తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. తన శునకాన్ని కొన్న సీనియర్ సిటిజన్ అడ్రస్ అతడి మనసులో ఉంది. స్టాలోన్‌కు ఆ పెట్‌పై ఉన్న ప్రేమను తన అవకాశంగా తీసుకొన్నాడు ఆ సీనియర్ సిటిజన్. ఫలితంగా 50 డాలర్లకు అమ్మిన కుక్కపిల్లను 15,000 డాలర్లు చెల్లించి దాన్ని వెనక్కు తెచ్చుకొన్నాడు స్టాలోన్.
స్టాలోన్, ఆ కుక్కపిల్ల ఇద్దరూ అనందంగా బయటకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా కనిపించారు. ఆ సినిమానే ‘రాఖీ’. బాక్సర్ అలీ స్ఫూర్తితో సిల్వస్టర్ స్టాలోన్ తయారు చేసుకొని, హీరోగా తెరకెక్కించిన స్క్రిప్ట్. అంత వరకూ హాలీవుడ్ చరిత్రలోని ఎన్నో రికార్డులను తుడిచిపెట్టింది ఆ సినిమా. స్టాలోన్‌ను స్టార్‌ను చేసింది. ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డును అందుకొంది. ఎంతకష్టంలోనైనా రాజీ పడక పోరాడితే ఫలితం ఉంటుందనడానికి స్టాలోన్ జీవితానికి మించిన ఉదాహరణ ఉండదేమో!
- జీవన్ రెడ్డి.బి
లక్ష్యం: తన జీవితానికి తనే స్కిప్టు రాసుకున్నాడు
Published Sun, May 11 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement