ఉత్తరం: మీ కోసం... కాస్త టైమ్ ఇచ్చుకోండి! | take some time for beauty skin avoiding spots | Sakshi
Sakshi News home page

ఉత్తరం: మీ కోసం... కాస్త టైమ్ ఇచ్చుకోండి!

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

ఉత్తరం: మీ కోసం... కాస్త టైమ్ ఇచ్చుకోండి!

ఉత్తరం: మీ కోసం... కాస్త టైమ్ ఇచ్చుకోండి!

సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. అలాంటప్పుడు బాదం పప్పును పేస్ట్ చేసి, అందులో కాస్త గ్లూకోజ్ పౌడర్ కలిపి రోజుకోసారి ముఖానికి రాసుకోవాలి. మెల్లగా మచ్చలు పోతాయి.
 
 కాలేజీ రోజుల్లో ధ్యాసంతా అందంగా కనబడటం మీదే ఉంటుంది. కానీ ఒక్కసారి పెళ్లయ్యి, పిల్లలు పుట్టి, ఇంటి బాధ్యతల్లో మునిగిపోయాక అందం మీద శ్రద్ధే ఉండదు. ఇన్ని పనుల్లో ఇంకా అందం కోసం అవీ ఇవీ చేయడం కూడానా అంటూ లైట్‌గా తీసేసుకుంటారు. నిజానికి అందానికి కాస్త మెరుగుపెట్టడానికి గంటలు కేటాయించక్కర్లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే, ఇంట్లో కూర్చునే , చిటికెలో ఆ పని కానివ్వొచ్చు. ఎలా అంటే... ఇలా!
 
     ఇల్లంతా హడావుడిగా తిరుగుతూ పనులు చక్కబెడతారు తప్ప పాదాలను సంరక్షించుకోవాలన్న ఆలోచనే రాదు. అందుకే పాదాల పగుళ్లు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు ఆలివ్ నూనెలో పంచదార పొడిని కలిపి రోజుకొకసారైనా పాదాలకు పట్టించాలి. ఆరిన తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఎందుకంటే పంచదారకు గాయాలను మాన్పడం, ఇన్ఫెక్షన్లను తొలగించడం వంటి లక్షణాలు ఉన్నాయి.
 
     సగం బొప్పాయి పండును తీసుకోండి. దానికి నాలుగు చెంచాల బియ్యప్పిండిని కలపండి. దీన్ని ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేయండి. ఆరిన తర్వాత కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోండి. వారానికోసారి ఇలా చేసి చూడండి. నెల తిరిగేలోపు మీ ముఖంలో కొత్త కాంతి చేరకపోతే అడగండి.
     టొమాటో రసంలో కాసింత నిమ్మరసం వేసి ముఖం, కాళ్లు, చేతులు రుద్దుకోండి. మట్టి వదిలిపోయి చర్మం ఎలా మెరుస్తుందో చూడండి. ద్రాక్షపళ్లు పెట్టి రుద్దినా సేమ్ రిజల్ట్ వస్తుంది.
     బాగా పండిన జామపండు గుజ్జులో తేనె కలిపి ముఖానికి పూస్తే... ఇక ముఖంలో వచ్చే కాంతికి తిరుగుండదు.
     స్టౌ దగ్గర వేడిలో మగ్గిపోవడం వల్ల చర్మమే కాదు, జుట్టు కూడా పొడిబారిపోతుంది. అలాంటప్పుడు కొబ్బరి నూనెలో తేనె కలిపి జుట్టుకు రాసుకోవాలి. కాసేపయ్యాక తలస్నానం చేస్తే సరి!
  చంటిపిల్లలు ఉన్నట్లయితే రాత్రిళ్లు నిద్ర కరువే. దాంతో కళ్ల చుట్టూ నల్లని వలయాలు వచ్చేస్తాయి. వాటిని పోగొట్టడం అంత కష్టమేమీ కాదు. జాజికాయను అరగదీసి, ఆ సారాన్ని కళ్ల చుట్టూ రోజూ రాయండి. పది పదిహేను రోజులకు నలుపు పోతుంది.
 
  చెమట పట్టి తల జిడ్డెక్కినప్పుడు జుట్టు కూడా జిడ్డుగా తయారై చిరాకు పెడుతుంది. అలాంటప్పుడు కాస్త మెంతిపొడి, కొంచెం టీ పొడి, కాసింత పెరుగు, కొద్దిగా నిమ్మరసం తీసుకుని బాగా కలపాలి. ఓ రాత్రంతా దీన్ని నానబెట్టి, ఉదయం తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల జిడ్డు పోవడమే కాదు, కురులు మెరుస్తాయి. రాలడం కూడా ఆగిపోతుంది.
 ఇప్పుడు చెప్పండి... వీటిలో ఏ పదార్థమైనా మీకు దొరకనిది ఉందా? ఇందులో ఏ చిట్కానయినా ఉపయోగించడానికి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుందా? లేదు కదా! అందుకే హ్యాపీగా వీటిని పాటించండి. మీలోనే కాదు... మీ శ్రీవారి కళ్లలో కూడా మెరుపు కనిపిస్తుంది చూడండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement