మేషం (ఆదాయం -2, వ్యయం-8, రాజపూజ్యం-1, అవమానం-7) వీరికి ఆగస్టు 11 వరకు గురుడు పంచమ స్థానంలోనూ, తదుపరి షష్ఠమంలోనూ, శని జనవరి 26వరకు అష్టమంలోనూ, తదుపరి భాగ్యస్థానంలోనూ, రాహుకేతువులు ఈ ఏడాదంతా పంచమ, లాభస్థానాలలో సంచారం. కుజుడు జూలై 12 నుంచి సెప్టెంబర్ 18వరకు అష్టమ స్థానమైన వృశ్చికంలో సంచారం.
ఈరీత్యా పరిశీలిస్తే వీరిపై అష్టమ శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఆగస్టు వరకు గురుబలం కొంత తోడ్పడుతుంది. తదుపరి గురుడు కూడా దోషకారి. మొత్తం మీద వీరు చేపట్టిన కార్యక్రమాలు ఆగస్టు వరకు చకచకా సాగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. అయితే ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. ఇతరుల చేత మాటపడాల్సిన సమయం. కుటుంబ సమస్యలు సవాలుగా మారతాయి. ఓర్పు,నేర్పుతో వ్యవహరించడం మంచిది. అలాగే, జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో కుజుని అష్టమస్థితి అంత అనుకూలం కాదు. ప్రథమార్ధంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు, వివాహయత్నాలు ఫలిస్తాయి. వాహన, ఆస్తి లాభ సూచనలు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఆగస్టు నుంచి అన్ని విషయాల్లోనూ అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. జలుబు వంటి రుగ్మతలు బాధించవచ్చు. వ్యాపార వర్గాలకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకోని బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు ఎంతగా కష్టపడ్డా ఫలితం కనిపించనిస్థితి. నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యవసాయదారులకు మొదటి పంట లాభిస్తుంది. విద్యార్థులకు శ్రమానంతరం అనుకూల ఫలితాలు దక్కే అవకాశం. కళాకారులకు ప్రారంభంలో అనూహ్యమైన విజయాలు, తదుపరి నిరాశ తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆశించిన పదవులు కష్టమే.
వీరు శనికి తైలాభిషేకాలు, ఆగస్టు తర్వాత గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. చైత్రం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి. అదృష్టసంఖ్య-9, పగడం ధరించవచ్చు. ఎరుపు, గులాబీ రంగులు అనుకూలం.వృషభం (ఆదాయం -11, వ్యయం-14, రాజపూజ్యం-4, అవమానం-7) వీరికి ఆగస్టు 11వరకు గురుడు అర్ధాష్టమమైన సింహంలోనూ తదుపరి పంచమమైన కన్యారాశిలో సంచారం. శని జనవరి 26వరకు సప్తమమైన వృశ్చికంలోనూ, తదుపరి అష్టమమైన ధనుస్సు రాశిలో సంచారం. ఇక రాహుకేతువులు ఈఏడాదంతా అర్ధాష్టమైన సింహం, దశమమమైన కుంభరాశిలో సంచారం.
వీరికి ఈ ఏడాది ఆగస్టు నుంచి జనవరి వరకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆగస్టు వరకు అర్ధాష్టమంలోని రాహువుతో గురుని చేరిక వల్ల కొన్ని ఇక్కట్లు తప్పకపోవచ్చు. ముఖ్యంగా చేపట్టిన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆప్తులు సైతం మీ మంచితనాన్ని తేలిగ్గా తీసుకుని సమస్యలు సృష్టించవచ్చు.ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలతో బాధపడ వచ్చు. తరచూ ప్రయాణాలు చేయాల్సివస్తుంది. మిత్రులు, జీవిత భాగస్వామితో విభేదాలు నెలకొంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆగస్టు నుంచి గురుసంచారం అనుకూలమైనందున ఆకస్మిక ధనలబ్ధి. గృహ, వాహనయోగాలు ఉండవచ్చు. సంతానరీత్యా మంచి గుర్తింపు పొందుతారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. అయితే ఏడాది చివరిలో ఆకస్మిక బదిలీలు జరిగే అవకాశం. పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు, ప్రభుత్వపరంగా ఆహ్వానాలు కూడా అందుతాయి. రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో పదవీయోగం. వ్యవసాయదారులకు రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటనలతో ఊరట చెందుతారు. కళాకారులు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో శని,కుజులు సప్తమంలో కలయిక అంత అనుకూలం కాదు. దీని కారణంగా భార్యాభర్తల మధ్య కలహాలు, ఉష్ణసంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.
చైత్రం, వైశాఖం, శ్రావణం, పుష్యం, మాఘమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. రాహువు, శనికి పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, జూలై, సెప్టెంబర్ మధ్యకాలంలో సుబ్రహ్మణాష్టక పఠనంతో పాటు, మంగళవార ం నియమం పాటించడం మంచిది. అదృష్టసంఖ్య-6, వజ్రం ధరించాలి. ఆకుపచ్చ, బంగారు రంగులు అనుకూలం.మిథునం (ఆదాయం -14, వ్యయం-11, రాజపూజ్యం-4, అవమానం-7) ఈ రాశి వారికి గురుడు ఆగస్టు 11వరకు తృతీయమైన సింహం, తదుపరి చతుర్థమైన కన్యారాశిలో సంచారం. అలాగే, శని జనవరి 26వరకు షష్ఠమమైన వృశ్చికంలోనూ తదుపరి సప్తమైన ధనుస్సు రాశిలో సంచారం. రాహుకేతువులు ఈ ఏడాదంతా తృతీయమైన సింహం, భాగ్యస్థానమైన కుంభరాశిలో సంచారం.
ఈరాశి వారికి గతం కంటే మెరుగైన కాలమమనే చెప్పవచ్చు. ఆదాయానికి లోటు ఉండదు. శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. ఇతరులకు సహాయం అందించడం ద్వారా దాతృత్వాన్ని చాటుకుంటారు. ఆగస్టు నుంచి గురుని అనుకూల సంచారంతో అదనపు రాబడి పొందుతారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వాహన, గృహయోగాలు సంభవం. స్థిరాస్తి వివాదాలు, కొన్నికోర్టు కేసుల నుంచి బయటపడే అవకాశం. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలున్నాయి. ఆగస్టు వరకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. నరాలు, ఉదర, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో షష్ఠమస్థానంలో కుజ, శనుల కలయిక కొంత దోషకారకం. ఈకాలంలో వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ప్రత్యర్థుల పట్ల మెలకువగా ఉండండి. వ్యాపారస్తులు ద్వితీయార్ధంలో లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపుతో పాటు, పదవులు దక్కే అవకాశం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగార్థుల కృషి ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి. కళాకారుల ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. ద్వితీయార్ధంలో అవార్డులు పొందవచ్చు.
చైత్రం, వైశాఖం, భాద్రపదం, ఆశ్వయుజం, ఫాల్గుణమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. వీరు జూలై-సెప్టెంబర్ నెలల్లో కుజ,శనులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.అదృష్టసంఖ్య 5, పచ్చరాయి ధరించాలి. లేత ఎరుపు, పసుపు రంగులు అనుకూలం.
కర్కాటకం (ఆదాయం -8, వ్యయం-11, రాజపూజ్యం-3, అవమానం-3) వీరికి గురుడు ఆగస్టు 11వరకు ద్వితీయమైన సింహంలోనూ, తదుపరి తృతీయమైన కన్యారాశిలో, శని జనవరి 26వరకు అర్థాష్టమైన వృశ్చికంలో, తదుపరి పంచమమైన ధనుస్సు రాశిలో సంచారం. ఇక రాహుకేతువులు ఈ ఏడాదంతా ద్వితీయమైన సింహం, అష్టమమైన కుంభరాశిలో సంచారం.