‘చివరి’ పెళ్లికూతురు
వర్ణం
ఫొటోలో ఉన్న ‘నవవధువు’ పేరు ఆర్లెటా సాహితి. ఈమె కొసావో దేశంలోని బోస్నియన్ యువతి. రాజధాని నగరం ప్రిస్టినాలోని ‘ఎత్నలాజికల్ మ్యూజియం’లో జరిగిన ‘సంప్రదాయ వివాహ వేడుక’ ప్రదర్శనలో ఆమెను ఇలా ముస్తాబు చేశారు. వేల ఏళ్లనాటి ఈ తరహా అలంకరణలో ముఖం మీద పొరలు పొరలుగా రకరకాల వర్ణాలు వేస్తారు.
బంగారు వృత్తాలు జీవితచక్రాన్ని సూచిస్తే, గీతలేమో వాటిని చేరుకోవడానికి మనిషి నడవాల్సిన దారులు. ఎరుపు వృత్తం గర్భధారణను సూచిస్తే, నీలి, ఎరుపు చుక్కలు సంతానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అయితే, ఈ రకం చిత్రణ పాతకాలపు ముసలమ్మలు మాత్రమే చేయగలుగుతున్నారు. అందువల్ల ఇది కూడా అంతరించే ప్రమాదంలో పడింది. దాన్ని ప్రతిబింబించేలాగా శీర్షికలో చివరి పెళ్లికూతురు అన్నాం.