
ఆనందుడు అందరివాడేలే!
ఆదర్శం
పచ్చని చెట్ల మధ్య కొలువైన చిన్న పల్లె కలప్. పల్లె అందాలే... పర్యాటకులను ఆకర్షించాయిగానీ అక్కడి పేదరికం, సౌకర్యాల లేమి... ఎవరి దృష్టికీ ఆనలేదు... ఒక్క ఆనంద్ శంకర్ దృష్టికి తప్ప. కోయంబత్తూరుకు చెందిన ఆనంద్ శంకర్‌కు పర్యటనలు అంటే ఇష్టం. మారుమూల ప్రాంతాలకు వెళ్లడం అంటే మరీ ఇష్టం. కొంత కాలం క్రితం... ఉత్తరాఖండ్‌లోని ఒక మారుమూల పల్లె అయిన కలప్‌కు వెళ్లాడు ఆనంద్. అక్కడి అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆనంద్‌ను ఆకట్టుకుంది.
మళ్లీ అయిదు సంవత్సరాల తరువాత... అదే పల్లెకి మళ్లీ వచ్చాడు. ఈసారి ఆయన్ను అక్కడి అందం ఆకట్టుకోలేదు. అప్పటికీ ఇప్పటికీ మారని పేదరికం ఆనంద్‌ను కదిలించింది. ఆనంద్ మంచి ఫొటోగ్రాఫర్ కూడా. ఈ ఫొటోగ్రాఫర్ కెమెరా... ఫొటోలోని అందాన్ని మాత్రమే కాదు... ఫొటో వెనుక ఉన్న నిశ్శబ్దం, విషాదాన్ని కూడా పట్టుకుంది. డెహ్రాడూన్‌కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో వైద్యం, విద్యకు సంబంధించిన కనీస సదుపాయలు లేవు. ఈ పరిస్థితి ఆనంద్‌ను ఆలోచింపజేసింది. ‘ఈ మూరుమూల ప్రాంతానికి ఏదైనా మంచి చేస్తే, మిగిలిన ప్రాంతాలకు కూడా ఇదో ఆదర్శం అవుతుంది’ అని మనసులో అనుకున్నాడు ఆనంద్ శంకర్.
ఆయన ఆలోచన ఆలోచనగానే మిగిలిపోలేదు. ‘కలప్ స్వచ్ఛంద సంస్థ’గా అవతరించింది. మొదటిసారి కలప్‌కు వచ్చినప్పుడు జ్వరంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలికి సహాయం చేశాడు ఆనంద్ శంకర్. అప్పుడు ఆమె కళ్లలో కనిపించిన వెలుగును ఎప్పటికీ మరవలేదు. ఈ వెలుగు ఆయనను సేవాపథంలో మరింత ముందుకు తీసుకెళ్లింది. గ్రామంలో హెల్త్‌క్యాంప్ నిర్వహించేలా చేసింది. ఈ క్యాంప్ నిర్వహణ తనకు ఎంతో తృప్తిని ఇచ్చింది. హెల్త్‌క్యాంప్ నిర్వహణ ఒక్కటి మాత్రమే కాదు... కలప్ గురించి పట్టించుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకున్నాడు ఆనంద్.
‘అక్కడెక్కడో కోయంబత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేయడం ఏమిటి?’ అని కొందరు ఆనంద్‌ను ఆశ్చర్యంగా అడిగారు. ‘నిజానికి జవాబు నాకు కూడా తెలియదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే మాత్రం... నేను కలప్‌ను చూడలేదు. కలప్ నన్ను చూసింది. మంచిపనికి ప్రేరణ ఇచ్చింది’ అంటాడు. ఆరోగ్యం నుంచి విద్య వరకు రకరకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆనంద్ అతని మిత్రులు రకరకాల స్వచ్ఛందసేవాసంస్థలు, ఫండింగ్ ఏజెన్సీలతో మాట్లాడారు. వారి ప్రయత్నం ఫలించి ‘కలప్ ట్రస్ట్’ సాకారం అయింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచితవైద్యశాల మొదలైంది.
ఈ వైద్యశాలలో డా.నందన ఎంబీబీఎస్ వైద్యాన్ని అందిస్తున్నారు. ఆమెకు ట్రస్ట్ జీతం ఇస్తుంది. గ్రామంలోని ఇద్దరు మహిళలను తన సహాయకురాళ్లుగా నియమించుకొని క్లినిక్ నడుపుతుంది నందన. ఈ హాస్పిటల్ సిబ్బంది వైద్యసేవలు అందించడంతో పాటు శరీర పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి కూడా ప్రచారం చేస్తుంటారు. నందన చుట్టపక్కల గ్రామాలలో నెలకొకసారి హెల్త్‌చెకప్ క్యాంప్‌లు నిర్వహిస్తుంటారు.
ఇక విద్య గురించి...
గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉన్నా... అది నామమాత్రంగా ఉంది. అందుకే... రెగ్యులర్ స్కూల్ టైమ్ పూర్తికాగానే ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్ భాషను నేర్పించడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. బొమ్మలాట, పాటలు, కథలు... మొదలైన కళారూపాల సహాయంతో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలను కూడా బోధిస్తున్నారు.
విశేషమేమిటంటే పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా సాయంత్రం వేళల్లో ఇంగ్లిష్ భాషలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇది పర్యాటక ప్రాంతం కావడంతో... వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారితో సంభాషించడానికి ఈ ఇంగ్లిష్ శిక్షణ ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఊళ్లో కరెంట్ ఉండడం అనేది ఎప్పుడోగానీ జరిగేది కాదు. వాతావరణ పరిస్థితులు, రకరకాల కారణాల వల్ల ఏర్పడిన విద్యుత్ సమస్యను తీర్చడానికి నడుం కట్టింది కలప్ ట్రస్ట్. ‘విలేజ్ ఎలక్ట్రిసిటీ కంపెనీ’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సోలార్ గ్రిడ్‌తో గ్రామంలో విద్యుత్‌కాంతులు ప్రసరించాయి.
కమ్యూనిటీ టూరిజం ప్రోగ్రాం వల్ల స్థానికులకు ఉపాధి దొరికింది. ఒక్కటా రెండా... ఆనంద్ ఆధ్వర్యంలోని ‘కలప్ ట్రస్ట్’ కలప్ ముఖచిత్రాన్ని మార్చడానికి ఎన్నో మంచిపనులు చేస్తుంది. అందుకే కలప్ గ్రామం ఆనంద్ అక్కడెక్కడి వాడో అనుకోవడం లేదు... అందరివాడు అనుకుంటుంది.అక్కున చేర్చుకుంటుంది.