వెలుగులకు తొలి చిరునామా చిరునవ్వేనమ్మా...
పాటతత్వం
‘వెంకీ’ సినిమాలో హీరో ఫ్రెండ్స్‌తో ఆడిపాడే ఓ మాస్ సాంగ్ రాయాలి. ట్యూన్ కూడా రెడీ. సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ పాటలకు మొదటి లైన్లను తనే సూచిస్తాడు. అలానే, ఈ పాటలోని పల్లవి మొదటి లైన్లను చెప్పేశారు. రెండు, మూడు రోజులు పట్టింది. వెంటనే దేవికి పాట పంపించేశాను. కట్ చేస్తే, దేవి చెప్పిన లైన్లను అస్సలు వాడలేదు. ‘సిలకేమో శీకాకుళం...’ లైన్‌తో మొదలయ్యేలా పాట రాశాను. దేవి శ్రీప్రసాద్‌కి తెగ నచ్చేసింది.
ఈ సినిమా కోసం రెండు పాటలు రాయిద్దామనుకున్న దేవిశ్రీ ప్రసాద్-దర్శకుడు శ్రీనువైట్ల మిగతా పాటలన్నీ నాతోనే రాయించేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఓ మంచి పాట రాసే అవకాశం వచ్చింది. హీరోయిన్ తండ్రి చనిపోతాడు. ఒక పక్క విలన్ల నుంచి అపాయం, ఇంకో పక్క తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్... ఈ సమయంలోనే హీరో ఆమెకు తోడుగా ఉంటాడు. ఈ క్రమంలోనే ఆమె పుట్టినరోజు వస్తుంది. అమ్మా, నాన్న తానై పెంచిన తండ్రి లేడు... ఇలా నిరాశలో కూరుకుపోయిన హీరోయిన్ మనసుకు ఊరట కలిగేలా ఓ పాట రాయాలి. అదేదో కష్టమైన పదాలతో కాకుండా చాలా సింపుల్‌గా అందరికీ కనెక్ట్ కావాలి.
అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే/అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సాఫీగా సాగుతున్న జీవితంపై కారు చీకట్లు కమ్ముకుంటాయి. ఆ ఆలోచనలతో నిత్యం మనసొక చితి మంటగా మారుతుంది. అప్పుడే వాటిని తట్టుకుంటూ, వారు మిగిల్చిన జ్ఞాపకాలతో మరింత మానసిక స్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలి. ఓ కథలా జరిగిన విషాదాన్ని మర్చిపోయి, నిన్నటికి సెలవిచ్చేసి, రేపటి కోసం కొత్త ఆలోచనలు... కొత్త మనసులకు చోటివ్వాలి.
లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా/ఓ చిన్నదీపాన్ని వెలిగించుకోలేమా?
ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మా!
పగలు, రాత్రి ఇవన్నీ ప్రకృతిలో ఎంత సహజమో... కన్నీళ్లు, కష్టాలు, సంతోషాలు... ఇవన్నీ జీవితంలో మనకెప్పుడూ ఎదురయ్యేవే. కానీ, బాధ వచ్చినప్పుడు మాత్రం దాన్ని చిరునవ్వుతో తుడిచేయాలి.
బాధలో కన్నులే కందినంత మాత్రాన... పోయిన కాలమూ పొందలేముగా!
రేగిన గాయమే ఆరనంత మాత్రాన... కాలమే సాగక ఆగిపోదుగా!
జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్ని కదిలించేవి, కొన్ని మురిపించేవైతే, ఇంకొన్ని వ్యథగా మిగిలిపోయేవి. వాటిని తలుచుకుంటూ నిన్నటిలోనే ఉండిపోతే, ఇక భవిష్యత్తుకు చోటేది? ఇప్పటికీ చాలా మందిలో జరుగుతున్న మానసిక సంఘర్షణ ఇది. రేగిన గాయాన్నే తలుచుకుంటూంటే, జరిగిన వాటిని సరిదిద్దలేం... వచ్చే కాలాన్ని ఆపలేం.
అరె ఈ నేలా ఆకాశం ఉందే మన కోసం
వందేళ్ల సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం!
ఎవరైనా కష్టాలు అనే అధ్యాయం దగ్గరే ఆగిపోతే... ఇక జీవితంలో రానున్న సంతోషాలను అనుభవించేదెవరు? సంతోషాలకు పునాదులు వేసేవే కన్నీళ్లు... కష్టాలు... అవి లేకపోతే జీవితం విలువ ఎవరికీ తెలీదు.
ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్నా
నా ఎదే నీ జతే కోరుతుందిగా!
ఒంటరి దారిలో నాకు తోడువైనావు
ఎన్నడూ నీడగా వెంట ఉండ వా!
అయినవాళ్లు దూరమైన బాధ నుంచి ఓ మంచి స్నేహితుడు దొరికాడన్న ఆనందం హీరోయిన్‌కి లభిస్తుంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. అప్పటివరకూ ‘నీకు భరోసాగా నేనుంటా’ అని ఓ స్నేహితుడిలా లాలించిన హీరో తర్వాత ఆమె మనసులో ప్రియుడిగా కూడా స్థానం సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో ఒంటరిగా మిగిలిన హీరోయిన్‌కి భరోసా ఇచ్చే పాటలా మొదలై, తర్వాత ఈ ఇద్దరూ పాడుకునే ప్రేమగీతంలా మారడం ఈ పాట ప్రత్యేకత.
హే కలలే నిజమైనాయి... కలలే ఒకటయ్యి
కలిపేస్తూ నీ చెయ్యి..అడుగే చిందెయ్యి
మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కథ కావాలి
మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ ప్రేమికులిద్దరికీ స్నేహితులు కూడా జతకలిసి, వాళ్ల ప్రేమ సక్సెస్ అయినందుకు ఆనందంగా పాడతారు. సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరైనా ఉంటారు. కానీ బాధలను పంచుకునే స్నేహితులు తోడుగా ఉంటే ఎంత కష్టమైనా బలాదూర్. ఈ సినిమాలో హీరోకు కూడా ఇలాంటి స్నేహితులే ఉంటారు. తమ ఫ్రెండ్ లవ్ సక్సెస్ అయితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అదే ఈ లైన్లలో వ్యక్తం చేశాను.
ప్రతి లైన్ ఎండింగ్‌లోనూ స్ఫూర్తి కలిగించేలా ఓ మాట వచ్చేలా జాగ్రత్త తీసుకున్నా. దేవిశ్రీ ప్రసాద్‌ను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒకసారి చూశాను. మళ్లీ సంగీత దర్శకుడు అయ్యాక ‘వెంకీ’ సినిమా కోసం కలిశాను. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్, నేను ఎంతో కష్టపడ్డాం. తెల్లవారుజామున రెండు గంటలకు ఫోన్ చేసి ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని దేవి అడిగేవాడు. ఇలా చివరి నిమిషం వరకు పనిచేసిన మాకు ఈ సినిమా పాటల రిజల్ట్ ఇచ్చిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘వెంకీ’ ముందు వరకూ నా కెరీర్ కాస్త కుదుపుల్లో ఉంటూ వచ్చింది. ‘వెంకీ’ నన్ను తెలుగు సినీ పరిశ్రమకు కొత్తగా పరిచయం చేసి, నాకు మరెన్నో మంచి పాటలు రాసే అవకాశం కల్పించింది.
సేకరణ: శశాంక్.బి