పనికిరాని చెత్త తొలగించాలంతే!
పద్యానవనం
కల్మషంబుడుగక కాన్పింపదందున్న రూపమెవ్వరికైన రూడితోడ తామసంబు లణగ తగవెల్గు జ్ఞానంబు విశ్వదాభిరామ వినుర వేమ!
లో చూపు గురించి చాలా మంది తత్వవేత్తలు అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా వేమన. పైపై అవగాహన, మిడిమిడి జ్ఞానం కాకుండా ప్రతి విషయంలోనూ అంతర్లీనంగా ఉండే మర్మాన్నెరగాలంటారు. ఎరుక గొప్పది. అంటే, ఏదైనా ఎరుక కలిగి, కాస్త లోతుగా తెలుసుకొని సదా ప్రజ్ఞతో ఉండమని అర్థం. ఆ ఎరుక సాధించడానికి జ్ఞానం అవసరం. మనం కష్టపడనవసరం లేకుండానే ప్రాపంచికమైన అనేక విషయాలను దృవపడిన ప్రాకృతిక సత్యాలతో సాపేక్షంగా చెప్పాడాయన. పిరికివాని బింకమిదీ అని మేడిపండును ఒలిచినా, తింటూ ఉంటే వేపాకూ తియ్యన అని సాధన మర్మమెరిగించినా, ఉప్పు-కప్పురం లాంటి పురుషుల్లోని వ్యత్యాసాల్ని విడమర్చినా, దేవుడైనా తెలివి ఉంటేనే లెఖ్క అని లాజిక్ చెప్పినా.... వేమనకు వేమనే సాటి!
అలతి అలతి పదాల ఆటవెలది అస్త్రాలతో సామాజిక రుగ్మతల మీద ఆయన యుద్దమే ప్రకటించాడు. గడచిన వెయ్యేళ్ల కాలంలో, జన సాహిత్యాన్ని ఉపకరణంగా వాడిన వేమనంతటి సాధాసీదా సంఘ సంస్కర్త మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో! ఈ చిన్న పద్యంలోనే చూడండి... జ్ఞానం ఎలా లభిస్తుందో చాలా సులభంగా చెప్పాడు. తమస్సు అంటే చీకటి, అజ్ఞానపు చీకటి తొలగాలట. అప్పుడే జ్ఞానమనే వెలుగు ప్రస్పుటమౌతుంది. పద ప్రయోగం కూడా... జ్ఞానం ‘తగవెల్గు' అంటాడు. అంటే, ఎంత అవసరమో అంత అని. జ్ఞానం ఎక్కువయితే కూడా ప్రమాదమే! మేధోశక్తి పరిమితి మించి అతి(పర్వర్షన్)గా వ్యవహరించే ఎంత మంది అతిగాళ్లని మనం చూడట్లేదు! ‘అతి సర్వర్త్ర వర్జయేత్’ అన్నది ఆర్యోక్తి. అవసరాలకు సరిపడా జ్ఞానం అందరికీ కావాల్సిందే. అందుకే, అజ్ఞానాంధకారం తొలగాలన్న ఆశతోనే మనం, ఓ దేవా! నన్ను చీకటి నుంచి వెలుగువైపు నడిపించు, ‘తమసోమా జ్యోతిర్గమయా!’ అని వేడుకుంటాము. అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించుకోవడమూ సాధ్యపడదనే భావనతోనే కావచ్చు, ‘అణగాలి' అనే పద ప్రయోగం చేశారు వేమన. తామసంబులు అన్న బహువచన భావనని మరో అర్థంలోనూ ప్రయోగించి ఉంటాడు. మానవుల గుణాలన్ని మూడు రకాలుగా విభజిస్తారు లాక్షణికులు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం.
వాటి వాటి పాళ్లు, హెచ్చు తగ్గుల స్థాయిని బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాల నిర్మాణం జరుగుతుందనీ చెబుతారు. రజోగుణం రాజసానికి, గర్వానికి, సాహస-పౌరుషాలకి ప్రతీక అయితే, తమో గుణం రాక్షసత్వానికి, దౌర్జన్యానికి, అతిశయ-అహంకారాలకు ప్రతినిధి అంటారు. ఇక సత్వ గుణం.... వినయం, వివేచన, ఓపిక-సద్యోచన వంటి సకల విధ సాత్వికతకు ప్రతీక. ఈ మూడు, ‘స'త్వ, ‘త'మో, ‘ర'జో గుణాల (అదే క్రమం) మేలు కలయిక ‘స్త్రీ' అని పెద్దలెవరో చెప్పిన మాట అక్షర సత్యమనిపిస్తుంది. స్త్రీ అన్న ఏకాక్షర పదంలో స, త, ర కారాలకు ఎంతెంత వాటా ఉందో, సగటు మహిళలో కూడా దాదాపు అదే పాళ్లలో ఆయా గుణాలుంటాయేమో అనిపిస్తుంది. చుట్టూ ఉండే చెత్తా చెదారం తొలగిపోతే కాని, అందులో దాగి ఉండే రూపం స్పష్టత ఏర్పడదు అని ఒక ప్రకృతి పరమైన సత్యాన్ని సాపేక్షంగా చెబుతూ జ్ఞానమెలా ఆవిష్కృతమౌతుందో వేమన పోల్చి చూపాడు. నిజమే, లోన రూపుదిద్దుకొని ఉన్న ఆకృతిని చూడాలంటే చుట్టూ ఉన్న చెత్తను తొలగించాలి. జ్ఞానాజ్ఞానాలు కూడ అలాంటివే! అయిదారు వందల సంవత్సరాల కింద గొప్ప శిల్పిగా, చిత్రకారుడిగా, కవిగా జగత్ప్రసిద్ధి పొందిన మైఖలాంజిలో చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తొస్తుంది. ఎదిగిన కొద్దీ ఒదిగే గుణం మహనీయులకే సాధ్యమన్నట్టు, తన ప్రతిభకన్నా ప్రకృతికే పెద్ద పీట వేస్తూ ఆయన చెప్పిన మాట వినయానికి పరాకాష్ట వంటిది. ఆయన శిల్పనైపుణ్యానికి అబ్బురపోయిన ఓ పెద్ద మనిషి ‘అబ్బ ఎంత గొప్పగా చెక్కారు!’ అని ప్రశంసిస్తుంటే, మైఖలాంజిలో చాలా వినయంగా స్పందించారట. ‘అబ్బే! అందులో నే చేసిన గొప్ప పనేం లేదు. ఆ శిల్పం అప్పటికే ఆ రాయిలో ఉన్నట్టుంది. అనవసరమైన చెత్తంతా నే తొలగిస్తే, అదుగో... ఆ శిల్పం అలా మిగిలింది!’
- దిలీప్‌రెడ్డి